మాతృగణంలో భ్రాహ్మి, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే వాళ్లుంటారు. చాళుక్యులు మాతృగణ పరిపాలితులమని చెప్పుకున్నారు. కాబట్టి వీరి కాలంలో మాతృగణ ఆరాధన బాగా ఉండేది. అందుకే నన్నయ వీరిని పేర్కొనక తప్పలేదు. మాతృగణం తర్వాత సరస్వతిని స్తుతించాడు. సరస్వతి కవులకు ఇష్టదైవం. జ్ఞానప్రతీక. అక్షర స్వరూపం అందుకే ఆమెను స్తుతించారు. సరస్వతి తర్వాత చివరగా గిరిసుతను- పార్వతిని పేర్కొన్నాడు. పార్వతినే ప్రత్యేకంగా చెప్పడంలో కూడా విశేషం ఉంది. పోతన మహాకవి భాగవతాన్ని ‘లలిత స్కంధము కృష్ణమూలము’అంటూ భాగవతానికి లలితాదేవిని మ్రానుగా, శ్రీకృష్ణుణ్ణి వ్రేళ్లుగా చెప్పాడు కాబట్టి భారత పారిజాతానికి కూడా పరమేశ్వరిని స్తుతించాడు నన్నయ. భారతం యుద్ధ సంబంధమైన కథ. పార్వతి రౌద్రరూపంలో యుద్ధ్ధాదేవత. కాబట్టి చివరకు ఆమెను నన్నయ పేర్కొన్నాడని అనుకుంటున్నాను. సామాన్యంగా స్ర్తి దేవతారూపాలన్నిటికీ పార్వతీ మూలం అంటారు.

ఇలా నన్నయ మహాభారత రచనకు ఏ దేవతల్ని స్మరించాడో ఇప్పుడు తెలంగాణలోని ప్రాచీన ఆలయాల్లో శివ, విష్ణువుల తర్వాత గణపతి, కుమారస్వామి, సప్తమాకృకలు, సూర్యుడు- ఈమూర్తులే ఎక్కువ. ఇప్పటి శివలింగాలన్ని బసవేశ్వరుని తర్వాత మల్లికార్జున పండితుని కాలంలో వెలసినవే. అందుకే తెలుగుదేశంలో ఏ శివలింగమైనా ‘మల్లయ్య దేవుడు’అంటుంటారు. మన ప్రాంతంలో నన్నయ కాలం నాటికి బహుదేవతారాధన ఉన్నా సమాజం తిక్కననాటికి క్రమంగా ఏకీశ్వరముఖమైంది. కాని ఆ ఒక్కడు ఎవరు? అని శైవ, వైష్ణవులిద్దరిలో పోటీ ఏర్పడింది. బహుదేవతారాధన గల సమాజానికి శంకరాచార్యులుదయించడం ఒక పెద్ద మలుపు. 

ఆయన ఆనాటి ప్రసిద్ధమైన 76 మతాలను వాదంలో ఓడించాడని చెప్తారు. మతాలన్నీ వడబోసి వాటిలో ఆరు మతాలను మాత్రం అంగీకరించి, వీటిలో కూడా కొన్నింటికి నిబంధనలు ఏర్పరచాడు. కాలక్రమంలో ఆ ఆరు గణాలే కాకతీయుల నాటికి పంచాయతనంగా ‘ఆదిత్యమంబికా విష్ణుం గణనాథంచ మహేశ్వరమ్’అనే పంచదేవతలు రూఢిగా నిలిచారు.

మళ్లీ ఆ పంచాయతనంలో ‘మాయకుర్చీలాట’లాగా శివవిష్ణువులు ఇద్దరూ నిలబడ్డారు. ఇది తిక్కన నాటికి ఏర్పడ్డ పరిస్థితి. కాని శైవవైష్ణవులు పోట్లాడుకొని వీరవైష్ణవం, వీరశైవం- అంటూ యుద్ధాలకు దిగారు. ‘వీరవైష్ణవం పుట్టింది తమిళనాడులో, వీరశైవం పుట్టింది కర్ణాటకలో- తన్నుక చచ్చింది తెలుగు ప్రాంతంలో’అంటారు ఓ పండితుడు.
వీరి వ్యవహారం శ్రుతిమించిన సమయంలో తిక్కన సోమయాజి ‘శ్రీయనగౌరినాబరగు’అని ప్రారంభించి వారికికూడా ఓ ధక్కా ఇచ్చి శివవిష్ణువులిద్దరూ వేరుకాదు అదే పరతత్వం పొమ్మన్నారు. అంటే దేవతా తత్వం మనమతంలో స్ర్తితో ప్రారంభమై తర్వాత ఆ స్ర్తిలను అనుసరించి పురుషప్రవేశం జరిగి అది వివిధ రూపాలుగా వింగడింపబడి మతానికోరూపం స్థిరపడింది. ఆఖరుకు శాస్త్రాలు ప్రవచించిన ఏకమూర్తిస్తయ్రో భాగః బ్రహ్మవిష్ణు మహేశ్వరః’అన్న సత్యం బయల్పడింది.

ప్రస్తుతం మనం పూజించేవాళ్లలో ప్రధాన దేవతలతోపాటు ఉప దేవతలు కూడా కొందరున్నారు. వారిని మనం గ్రామదేవతలు అంటున్నాం. ప్రధాన దేవతల ఆలయాలు గ్రామంలో ఉంటే ఉపదేవతల ఆలయాలు ఊరి చివర పొలిమేరల్లో ఉంటాయి. ప్రధాన దేవతలను బ్రాహ్మణ సంప్రదాయంతో పూజిస్తుండగా, ఉపదేవతలను అందరూ పూజిస్తున్నారు. ఉపదేవతలకు కూడా జాతరలు, ఉత్సవాలు జరుపుతారు. వీరేకాకుండా గ్రామాలపై ఆయా కాలంలో వ్యాధులు సృష్టించే దేవతలుకూడా ఉన్నారు. మహామారి అనే ఈ దేవతలు క్షీరసాగర మథన సందర్భంలో విషం తర్వాత పుట్టారట.

వీరు గ్రామాలపైబడి గత్తర-స్పోటకం- బొబ్బ వ్యాధులు కలిగిస్తుంటారట. అప్పుడు మునులు బ్రహ్మదగ్గరకు వెళ్లి చెప్పుకోగా, బ్రహ్మ ఈ క్షుద్ర దేవతలను నియంత్రించేందుకు హనుమంతుడు వస్తాడని, అతనికి వాళ్లను అణచే అధికారం ఉంటుంది కాబట్టి మీరు హనుమత్ప్రతిష్ఠ గ్రామాల్లో నిలుపుకుంటే రక్షగా ఉంటాడని చెప్పాడట.

‘పది కొంపలు లేని పల్లెనైనను రామ
భజన మందిరముండు వరలు గాత
రామనామము భవస్తామ భంజనదివ్య
తారక నామమై దనరు గాత’

అంటాడు పానుగంటి. కాబట్టి గ్రామాల్లో తప్పక రామాలయం అందులో ఆంజనేయుని ప్రతిష్ఠ ఉండే తీరుతుంది. చివరకు రామాలయం లేకున్నా, గ్రామంలో ఏ ఆలయం లేకున్నా హనుమదాలయం తప్పక ఉంటుంది. అంతేగాకుండా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భజనలకు కూడా ఆ ఆలయాలే కేంద్రాలు. పూర్వం కార్తీకమాసంలో నెలరోజులు హనుమంతునికి ఆకుపూజలు జరిగేవి. గ్రామంలోని ప్రతి ఇంటివారు ఆకుపూజతోపాటు ఇంట్లో భజన చేయించేవారు. దీన్ని ‘కార్తీకం’అని పిలిచేవారు. రాత్రి మొత్తం జాగరణ చేయాలంటే భక్తులను ఉల్లాసంగా ఉంచేవి భజనలే. కాబట్టి గ్రామంలోని ప్రతి ఇల్లు, ఒక హనుమదాలయం.
హనుమంతుడు స్వయంగా రామభక్తుడు. రామనామస్మరణ ఎక్కడుంటే ఆయన అందరికన్నాముందు వచ్చి చివర వెళ్లాడంటారు. అలా హనుమంతుడు భక్తుల గుండెల్లో చిరంజీవిగా మిగిలాడు.

అలాగే ప్రతి గ్రామానికి కొందరు గ్రామదేవతలుంటారు. వీరిని పూజించే సంప్రదాయం ఎక్కువగా అమంత్రకమే. చాలామంది తమకు రోగాలు, అంటువ్యాధులు కలిగినపుడు ఈ దేవతలను ఆరాధిస్తారు. రైతులు పంటలు పండినవేళలో మొదటి నైవేద్యం గ్రామదేవతలకు పెడుతుంటారు. ఈ దేవతల మూలస్వరూపం అమ్మవారి తత్త్వంలోనే ఉంటుంది. 

ఉదా॥ ఎల్లమ్మ- ఎల్ల- అంతటా వ్యాపించిన అమ్మ అని అర్థం. బాలమ్మ అనగా బాలాత్రిపురసుందరి అని అర్థం. ఇలా మన సంప్రదాయం దేవీదేవతలను భక్తులకు దగ్గరగాచేసి మాతృ-పితృ స్వరూపాలుగా మార్చి భక్తిని పరిపూర్ణంచేసే విధంగా నిర్మాణం చేయబడింది.

 --ఇంకావుంది...

*****************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐకామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి