‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ ధధతో వక్షోముఖాజ్గేషుయే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్ర్తిపుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తయ స్ర్తీపురుషాస్సంపూజితావస్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్భుజభవ శ్రీకన్ధరాశ్రే్శయసే’

‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయదధతో’- అని ముగ్గురిని సమానంగా స్తుతిస్తూ ప్రారంభించాడు. దైవభక్తి మనకు స్ర్తిపుంసాత్మకంగా రెండు విధాలుగా కన్పిస్తుంది. అందువల్ల ఈరోజు సృష్టికి మూలం స్ర్తిమూర్తే- అని కొందరంటే, పురుషుడే మూలం అని ఇంకొందరంటున్నారు. కాబట్టి నన్నయ ఈ విషయాన్ని గమనించి త్రిమూర్తులు త్రిశక్తులను, హృదయంలో- వాక్కులో- దేహంలో ధరించిన వారని దేవీసహితులుగా నుతించాడు. 

ఆదిశంకరుని తాత్త్విక దృష్టితో చూస్తే ఈ సృష్టి అంతా ఎలా పుట్టిందంటే - పరబ్రహ్మ సాక్షి మాత్రుడే కాబట్టి సృష్టి అతని సమక్షంలో జరిగింది కాని అతని చేత జరగలేదు. అది అంతా మాయాకల్పితం అంటాడు. ఇది కొంచెం విశే్లషిస్తే ‘మాయ’అన్న శబ్దం ప్రకారం అది స్ర్తిలింగం కాబట్టి సృష్టికి స్ర్తి ఆది దైవతమయ్యింది. ఆమె ‘శ్రీ’కావచ్చు, ‘వాణి’కావచ్చు, ‘గిరిజ’కూడా కావచ్చు.

సృష్టికి మూలం- పంచభూతాలకంటే మొదట పుట్టిన ప్రణవమనే ఓంకారమే. దాన్నుండే క్రమంగా ఆకాశాది పంచభూతాలు సృష్టింపబడ్డాయి. కాబట్టి ఓంకారం అన్నపుడు అది శబ్దబ్రహ్మం. ఈ శబ్దబ్రహ్మ స్ర్తిరూపంలో సరస్వతి అవుతుంది. అందువల్ల ఒక విధంగా ప్రణవమే వేదాలకు మూలం కాబట్టి నన్నయ ప్రణవ శబ్దంతోనే ప్రారంభించవలసింది కాని లోకానికి ఆ కవి శ్రీని ఉద్దేశించాడు. శ్రీతో ఆరంభించినాడనాల్సి వస్తుంది. శ్రీ లేకుండా ప్రణవము ఉంటే అలా జరుగకపోయేది అని కూడా అన్పిస్తుంది. ఏ విధంగా ఆలోచించినా ఈ సృష్టికి ప్రథముడు బ్రహ్మనే అనవచ్చు.

అయితే మన దేవతలకు వైదికరూపం, పురాణ రూపం అని రెండు రకాల రూపాలున్నాయి. ఈ పురాణరూపాన్ని మనం లౌకికంగా లోకంకోసం ఏర్పరచుకున్న సాధారణ రూపం అనవచ్చు. నన్నయ తన భారతంలో ఈ రెండు రూపాలను స్తుతించాడు.

మొదట స్తుతించిన ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’అనే స్తుతి ‘తేవేదత్రయ మూర్తయస్ర్తీ పురుషాః’-అని చెప్పబడింది. కాబట్టి మొదట చెప్పబడ్డది వైదిక రూపం, వారు వేదమూర్తులు. ఆ తర్వాత అవతారికను చెప్పి కథారచనకు పూనుకున్నప్పుడు-
‘‘హరిహరాజగజాన నార్కషడాస్యమాతృ సరస్వతీ
గిరిసుతాదిక దేవతాతతికిన్ సమస్కృతి సేసిదు
ర్భరతపోవిభవాదికున్, గురుపద్య విద్యకు నాద్యు, నం
బురుహగర్భనిభుం, బ్రచేతసుపుత్రుభక్తి దలంచుచున్’’
అని మళ్లీ హరిహరఅజ అనే త్రిమూర్తులను మళ్లీ స్తుతించాడు. మొదట వారిని స్మరించి వారు మీకు ‘శుభమిత్తురుగాక’ అని ఆశీర్వదించి, తర్వాత ఆశీస్సులో వాళ్లను ఆయన తలచినట్లే అయ్యింది, మళ్లీ త్రిమూర్తులను ఎందుకు తలచినట్లు?- అంటే మొదటి ఆశీస్సు అది పాఠకులకు చెందింది, తర్వాతది కవిగా తనకు చెందింది అనవచ్చు. అయినప్పటికి ఇది ఒక విధంగా పునరుక్తే అవుతుంది. కాబట్టి ఈపునరుక్తిలో నన్నయ దృష్టిలో మొదట చెప్పినవాళ్లు వేదమూర్తులు- వేదంలో స్తుతించబడ్డవాళ్లు, ఆయన అనువదిస్తున్న ఈ పంచమవేదం ఋషుల కొరకు కాదు సామాన్య జనంకోసం. కాబట్టి ఆ దృష్టితో ఇక్కడ త్రిమూర్తులను పురాణపురుషులుగా మళ్లీ పేర్కొన్నాడనిపిస్తుంది.

మన దేవతలకు వైదిక, పురాణరూపాలు వేర్వేరుగా ఉంటాయని చెప్పుకున్నాం. అందుచేత నన్నయ రెండవసారి లోక సామాన్యమైన పురాణ రూపాలను చెప్పాడనవచ్చు. మళ్లీ హరిహరఅజులతోపాటు మాతృ, సరస్వతి, గిరిసుతులను కూడా స్వతంత్రంగా పేర్కొన్నాడు.

త్రిమూర్తులు సృష్టికర్తలు ఆ ముగ్గురిని పేర్కొనడం సముచితం. చాలామంది కవులు శివ, విష్ణువులిద్దరికే పరిమితమయ్యారు. కాన సృష్టికర్తఅయిన బ్రహ్మను విస్మరించారు. కాని బ్రహ్మలేకుంటే ఈ సృష్టేలేదు. అతని భార్యలేకుంటే వాక్ప్రపంచమే లేదు కదా! వాక్స్వాధీనం కొరకు అందరూ ఆమెను తలచారు కాని ఆమె భర్తను మాత్రం విస్మరించారు. ఇది లోకం తీరులో ఒకటి. అందుచేత నన్నయ అలా కాకుండా మొదట వారిని భార్యాసహితులుగా స్మరించాడు. ఎందుకంటే స్ర్తిలు పతులను ఏ పనికైనా ప్రేరేపిస్తారు. వాళ్లు లేకుంటే పురుషులకు అస్తిత్వం ఉండదు. వ్యక్తి స్వభావాన్ని పసిగట్టడంలో పురుషులకన్న స్ర్తిలే ముందుంటారు. వారికి (సిక్స్త్‌సైన్స్- అతీంద్రియజ్ఞానం ఎక్కువ. అందుకే చాలామంది పురుషులు స్ర్తిల సలహాతో నిత్య వ్యవహారాలు చేస్తుంటారు.)

నన్నయ త్రిమూర్తుల తర్వాత గజాననుణ్ణి ప్రార్థించాడు. ఈయన విఘ్నాధిపతి. అంతేకాకుండా మహాభారతానికి లేఖకుడు. దంతపాణి అయిన వినాయకమూర్తులు ఈ చాళుక్యుల కాలంలోనే ఎక్కువగా వచ్చినవి. అందువల్ల విఘ్నం కలుగకుండా గణపతిని స్తుతించినా తనను ప్రత్యేకంగా స్తుతించలేదని అనుకుంటాడని నన్నయ స్తుతించినా ఆయనపై గజాననుడు తన అస్త్రం ప్రయోగించనే ప్రయోగించాడు

ఇక ఇందులో చెప్పిన అర్కుడు- సూర్యుడు, సూర్యుడు వేదాలకు అధిపతి. నన్నయ అనువదించేది పంచమవేదం. అందుకోసం సూర్యుణ్ణి స్తుతించాడు. అలాగే షడాస్య అని కుమారస్వామి స్తుతి కూడా చేసాడు. చాళుక్యుల కాలంలో మహాసేనాని అయిన కుమారస్వామే ప్రధాన దైవం. ఎందుకంటే మనకు లభించిన గుణగవిజయాదిత్యుని శాసనంలో కుమారస్వామికి సంబంధించి ‘కుమారస్వామి చేబ్రోలు నుండి బెజవాడకు వచ్చినట్లు’ చెప్పబడింది. మనకు మొదటి జాతరను పేర్కొన్న శాసనం కూడా అదే.

- ఇంకావుంది...

*****************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి