తలమీధ పోసే (పాలు-బియ్యం) అని అర్థం. మన వివాహ వేడుకల్లో అత్యంత వినోదంగా సాగే కార్యక్రమం. అత్యంత వినోదంగా సాగే కార్యక్రమంలో వధూవరులు తలంబ్రాలు పోసుకోవడం ఒక చక్కని సంప్రదాయం. వధూవరులు పసుపుతో అలంకృతమైన అక్షతలను దోసిళ్ళతో పోసుకోవడం మనం చూస్తాం. ఈ కార్యక్రమాన్ని ‘అక్షతారోపణ’మని పిలుస్తారు. మనం వివాహాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాం. అలాగే తెలుగువారి పెళ్ళిళ్ళలో ఈ తలంబ్రాల సమయంలో ప్రత్యేక వాద్యం కూడా వాయిస్తారు.

తలంబ్రాలు మొదట పురోహితుడు ఎండుకొబ్బరి చిప్పలో పోసి, నేతిలో ప్రోక్షించి మంత్రపఠనం చస్తూ ఈ కార్యక్రమం వధూవరులతో నిర్వహింపజేస్తాడు. ‘కపిల గోవులను స్మరించి, దానం, పుణ్యం చేయాలని శాంతి, పుష్టి, తుష్టి వృద్ధి కలగాలని, విఘ్నాలు తొలగి ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమం, మంగళం కలగాలని, సత్కర్మలు వృద్ధి చెందాలని, నక్షత్రాలు, సోముని వల్ల దాంపత్యం సరిగా జరిగి, శాంతి కలగాలని’ పురోహితుడు మంత్ర పఠనం చేస్తాడు.

తలంబ్రాల సమయంలో చదివి ప్రతి మంత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. రెండవసారి దోసిళ్ళలో తలంబ్రాలు నింపుకొని వధువు దోసిలి పైభాగంలో పెట్టి ‘పశవోమేకామస్సమృధ్యతామ్’- నాకిష్టమైన పశువులు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలి అంటూ వరుని తలపై తలంబ్రాలు పోస్తుంది. అలాగే వరుడస ‘యజ్ఞోమేకామస్సమృధ్యతామ్’ నా కిష్టమైన త్యాగం సమృద్ధిగా ఉండాలి అంటూ తలంబ్రాలు వధువుపై పోస్తాడు. కొందరు చివరగా ఒకేసారి శ్రీయోమే కామస్సమృధ్యతామ్- మాకు కావాల్సిన సిరిసంపదలలు సమృద్ధిగా ఉండాలి అనే మంత్రం కలిసి చదువుతారు.

వాత్సాయనుడు, గాయత్రీ మంత్ర రహస్యాల్లో చెప్పబడ్డ మానవుల దేహంలోని 24 కేంద్రాల్లో ప్రధానమైన బ్రహ్మరంధ్రస్థానం తలపై ఉండడంవల్ల అక్కడ ఈ అక్షతలను పోయడం చూస్తాం. మనఃకారకుడైన చంద్రుని ధ్యానమైన బియ్యంతో, శుభకారకమైన పసుపు కలపడం తలంబ్రాల మరో ప్రత్యేకత. కొన్ని ప్రాంతాల్లో బియ్యంతో చేసిన తలంబ్రాల తర్వాత జొన్నలు కూడా పోస్తారు. బహుశా! అవిఅలంకరణ కోసం ఇందులో ప్రవేశించాయో లేక పూర్వం బియ్యం విస్తృతంగా పండని రోజుల్లో వచ్చిందో తెలియదు. కాని ‘ప్రాలు’ అనే మాట ప్రత్యేకంగా వుంది కాబట్టి ఈ కార్యక్రమానికి బియ్యమే ప్రశస్తి. బియ్యంలో మొలకెత్తే జీవగుణం లేదు. మన పూర్వులు జీవలక్షణాన్ని వెదజల్లే ఇలాంటి కార్యక్రమాలు అక్షతలుగా, తలంబ్రాలుగా బియ్యాన్ని వాడడం విశేషం. అయితే తలంబ్రాలు పోసుకొనే సమయంలో చదివే మంత్రాలు చాలా గొప్ప అంతరార్థాన్ని కలిగి సమాజోపయోగంగా ఉన్నాయి. ఆ మంత్రాల్లో ఎక్కడ వ్యక్తిగతం స్వార్థం లేకుండా విశ్వశ్రేయస్సును కాంక్షించే లక్షణం ఉంది.

ఇటీవల కొందరు స్వామీజీలు ప్రవర్తిస్తున్న తీరు మన సమాజానికి ఇబ్బంది కల్గించడంలేదా?

భారతదేశంల అనాది కాలం నుండి ఎందరో ఋషులు, మునులు, యోగులు, తాపసులు, పీఠాధిపతులు పుట్టిన సంగతి మనకు తెలుసు. ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు స్థాపించిన పీఠాలు ఒక క్రమ పద్ధతిలో శాస్త్ధ్య్రానం చేసి పరంపరగా గురుశుశ్రూష చేసి, అతణ్ణి అన్ని విధాలా పరీక్షించి పీఠాధిపతికి అర్హుడో, కాదో నిర్ణయించి సన్యాసదీక్ష ఇస్తారు.

శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానంద, స్వామి దయానందుల వంటివాళ్లు తమ తపచ్ఛశక్తితో సంస్కరణ దృక్పథంతో పనిచేసి మహాత్ముల కోవలో చేరిపోయారు. అయితే దివ్యమైన భగవతత్త్వం ఎవరైనా మహాత్ముల్లో వెలువడి వారు సర్వసంఘ పరిత్యాగులై మహాత్ములై రమణ మహర్షిలా సమాజంలోకి వస్తే ఫర్వాలేదు. కాని కాముక దృష్టితో, ఏ ఆధ్యాత్మిక శిక్షణ లేకుండా, అనుభూతులు లేకుండా మన ఋషి సంప్రదాయం తెలుసుకోకుండా సమాజంపై పడి, నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తే అది ముమ్మాటికీ దోషమే.
మన సంప్రదాయం జ్ఞానం ఆధారంగా ప్రతిష్ఠించబడింది. అందుకే రాజులు ఋషులకు దాసులయ్యారు. వారి కనుసన్నల్లో రాజ్యాలు నడిపించారు. నేడు కొందరు స్వాముల పేరుతో స్కాములకు పాల్పడుతూ, విలాసవంతమైన జీవితాలు గడుపుతూ సాధారణ గృహస్థులకన్నా హీనమైన జీవితం గడుపుతామంటే సమాజమే వారిని తిరస్కరిస్తుంది.
చతుర్విధ ఆశ్రమాల్లో ఉన్న అంతరార్థాం ఆలోచించి, మెట్టు తర్వాత మెట్టు ఎక్కితే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే స్వామీజీలు చేస్తున్న వికృతాలు నిజమో, కాదో నిజనిర్థారణ చేయాలి. లేక హిందూమతాన్ని అపఖ్యాతి పాలు చేయాలన్న దురాలోచన ఇందులో ఏదైనా ఉందో పరిశోధన చేయాలి. స్వామీజీల కామక్రీడలు ప్రచార ప్రసార మాధ్యమాలకు వార్తలుగా మారడం ఆశించదగిన పరిణామం కాదు.

అయితే ఎవరో ఒక్కరు ఇలా వికృత ప్రర్తన చేస్తే ఈ మార్గావలంబులు అందరూ అలాంటి వారని నిర్థారణ చేయడం సరికాదు. శాస్త్ర సాంకేతిక రంగాలు విస్తృతమైన ఈ సందర్భంలో ఇలాంటి రచ్చ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి పై అన్ని కోణాల్లో ఈ విషయాన్ని ఆలోచించాలి. అలాగే ప్రతి భాతీయుడు త్యాగబుద్ధి, ధర్మవర్తన, దయ, కరుణ ఎలా అలవర్చుకోవాలో శాస్త్రాలు చెప్పనే చెప్పాయి. ఇక స్వామీజీల విషయంలో చెప్పేదేముంది.

--ఇంకావుంది...

*********************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి