"మతే ఫశ్యత కుత్రాపిదృశ్యతే న కులస్థితిః
కులం తు కేవలా సంఘ వ్యవస్థా పరికల్పితా"
మతంలో ఎక్కడా కులప్రస్తావన లేదు. గమనించండి! కులం కల్పితమైన ఒక సంఘ వ్యవస్థ మాత్రమే.
వేదయుగానంతర కాలంలో పుట్టిన కులం ఆనాటి సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించింది. వృత్తిని ఆధారం చేసుకొని పుట్టిన కులం ఈనాడు వటవృక్షమైపోయింది.
సరళీకరణ ఆర్థిక విధానాలతో మనుషుల మధ్య దూరం తగ్గిపోయింది కాని కులం ఛాయలు ఇంకా మనల్ని వీడలేదు. ఇప్పటికైనా సామాజిక సామరస్యానికి కులం బలమైన ఆలంబన అయితే ఫర్వాలేదు కాని అది అడ్డుగోడగా మారితే ప్రమాదం.
కులం పేరుతో మనుషుల్ని దూరం పెట్టేవారికి ఆదిశంకరుల వృత్తాంతం మంచి ఉదాహరణ. ఒక రోజు ఆదిశంకరుని కాశీ పట్టణంలో ఉన్నపుడు మార్గమధ్యంలో కాశీవిశ్వనాథుడు అన్నపూర్ణతో కలిసి చండాలుడి రూపం ధరించి ఎదురుపడ్డాడు. సత్యం గ్రహించని శంకరాచార్యులు ‘‘హే, చండాలాధమై ఇతో గచ్ఛ గచ్ఛేతి’- ఓ చండాలుడా! దూరంగా తొలగిపొమ్ము అని చెప్పాడు. చండాల రూపంలో పరమేశ్వరుడు ‘‘ఓ ద్విజశ్రేష్ఠా! నీవు అన్నమయ శరీరంనుండి శరీరాన్ని దూరంగా పొమ్మంటున్నావా? లేక చైతన్యం నుండి శరీరాన్ని దూరంగా పొమ్మంటున్నావా? మన ఇద్దరి శరీరాలు అన్నమయాలే అయినపుడు, ఇద్దరిలోని చైతన్యం ఒక్కటే అయినపుడు ఈ భేదభావం నీకెలా కలిగింది’’ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో శంకరాచార్యుడు తన తప్పు గ్రహించి- ‘‘జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థాత్రయమందు ఏ చైతన్యం అతిస్ఫుటంగా ప్రకాశిస్తుందో, బ్రహ్మ మొదలుకొని పిపీలికము వరకు సర్వదేహాల్లో ఏ చైతన్యం సాక్షిగా ఉందో అదే నేను. నేను ఈ జడమైన దృశ్యాన్ని కాను. అనే ఈ నిశ్చయ జ్ఞానం ఎవరికి కలదో అతడు చండాలుడైనా ద్విజుడే అవుగాక. అతడే నాకు గురువు. ఇది నా నిశ్చయం’’ అంటూ మనీషా పంచకం చెప్పారు.
కాబట్టి ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకుంటే మనకు కులం మకిలి అంటదు.
కులరక్కసి తన విశ్వరూపం ప్రదర్శిస్తూ ఇవాళ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నది. గుణప్రధానమైన మన హిందూ జాతిలో ఒక అవాంఛనీయ శక్తిగా కులం ఎదగడం విజ్ఞులు సహించవద్దు. ఒకనాడు ‘నన్ను ముట్టుకోకు’ అన్న అమానుషతత్వం విపరీతంగా ఉండేది. నేడు ‘‘నా కులంలో ఇంతమంది ఉన్నారు! నాకేం లాభం చేస్తారు’’ అని అధికారంలో ఉన్నవాళ్లని, అధికారంలోకి వచ్చేవాళ్లని ప్రశ్నిస్తున్నారు. కులబలం చూపించి అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. కేవలం ఈ స్వార్థానికే కులాన్ని కొందరు ప్రబుద్ధులు పెంచి పోషిస్తున్నారు. ఇదంతా హిందూమత విధ్వంసానికి దారితీస్తుంది. దీని వెనుక ఉన్న రాజకీయం మన జాతిని పలుచన చేస్తంది. మనకు కులం అనేది సామాజిక విలువల ఏకీకరణకు ఉపయోగపడాలి కాని సమాజ విధ్వంసానికి, ఓ కులం ఇంకో కులంపై ద్వేషం పెంచుకోవడానికి లేదా పెత్తనానికి అక్కరలేదు.
కుల, ప్రాంత, వర్గం, పార్టీ భేదాలతో ఇప్పటికే ముక్కలుగా హైందవ సమాజం చీలిపోయింది. తద్వారా విదేశీ శక్తులు మత విద్వేషం వెదజల్లుతున్నాయి. వాటి ఎంగిలి మెతుకులు తిని బలిసిన మన కుహనా మేధావులు హిందూ సమాజాన్ని దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకొన్నారు. మనలో కొందరు కులగజ్జితో హైందవ సృహను గాలికొదిలేశారు. హిందూ సమాజం ఇలాగే ముందుకు పోతే రాబోయే రోజుల్లో అధికారికంగానే అన్యమత శక్తులు మనపై ఆధిపత్యం చేస్తాయి. ఈ కులపంకిలం కడిగిపారేయకపోతే భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. కాబట్టి హిందూ సమాజంలోని మేధావులు, ఆశ్రమాధిపతులు, స్వామీజీలు, పీఠాధిపతులు, విజ్ఞులు కులతత్వాన్ని పారద్రోలి హిందూ సమాజ నిర్మాణానికి దోహదం చెయ్యాలి.
సనాతనమైన మన హైందవ జాతి విలువల్ని ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్టు చెబుదాం! మన కళల్ని విశ్వవ్యాప్తం చేద్దాం! మన ఇతిహాసాలను సామాజిక దృష్టితో ప్రచారం చేద్దాం! మన వీరుల గాథల్ని విశ్వగాథలుగా మార్చుదాం! మన కుటుంబ వ్యవస్థను విశ్వయవనికపై నిలబెడదాం! మన వసుధైక కుటుంబ భావన లోకవ్యాప్తం చేద్దాం!
*********************************************
*✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి