నాగార్జునుఢి గురించి సకల శాస్త్ర పారంగతులు, అపరధన్వంతరి, శస్తశ్రాస్త్ర ప్రవీణుడు, తత్వవేత్త, తార్కికులు, ఖనిజ కళా నిష్ణాతులు, వేద విద్యా విశారదులు. కవి సార్వభౌములు, కళోపాసకులు, మాధ్యమికవాద (ప్రవక్త), మహాయన మార్తాండులు. శతాధిక గ్రంథకర్త- ఈ విధంగా ఎందరో పండితులు తమ తమ రచనలలో ప్రశంసించారు.

ఈ రోజున మనకు అందుబాటులో వున్న శాస్ర్తియ విజ్ఞానమంతా పరిజ్ఞానమే. ఇదంతా శతాబ్దాల సునిశిత పరిశీలన, పరిశోధనల ఫలితమే. ఎందరో మేధోజీవులు ప్రకృతి రహస్యాలను రాబట్టడానికి విరామమెరుగక పరిశ్రమించారు. తమ ఊహలకు, అంచనాలకు తార్కికతను జోడించి, చొప్పదంటు ప్రశ్నలు, సందేహాలతోనూ హేతుబద్ధతను పెంపొందించుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేశారు. అధునాతన అభివృద్ధి క్రమానికి బాటలు పరిచారు.

నాగరికత తొలి దశలో సాంకేతిక ప్రగతి మొగ్గతొడిగినా అప్పటికి నిజమైన శాస్ర్తియ విజ్ఞానం పెంపొందలేదు. ప్రాచీన భారతీయ శాస్తవ్రేత్తలలో రసాయనిక శాస్త్ర ఆవిర్భావానికి విస్తృతమైన సేవలు చేసి, సరికొత్త భాష్యాలు చెప్పిన పరిశోధకుడు ఆచార్య నాగార్జునుడికి చరిత్ర పుటలలో సరైన స్థానం లభించలేదు.

జనన కాలం

నాగార్జునుడి వ్యక్తిగత చరిత్ర విషయంలో కూడా చరిత్రకారులకు భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఎట్టకేలకు నిర్థారణ అయిన విధంగా నాగార్జునుడు క.శ.4033 (క్రీ.శ.931)లో సుప్రసిద్ధ సోమనాథ దేవాలయ (గుజరాత్ రాష్ట్రం) సమీప గ్రామం దైహక్‌లో జన్మించినట్టు చారిత్రక ఆధారాలు వున్నాయి. కొంతమంది జీవిత చరిత్రకారులు విదర్భ దేశంలో జన్మించారని పేర్కొన్నారు. మరికొంతమంది ఆంధ్రప్రదేశంలో ‘వేదుల’ అనే గ్రామంలో జన్మించినట్టు వివరించారు.

నాగార్జునుడు క్రీ.పూ. 1వ శతాబ్ది, క్రీ.శ.2వ శతాబ్ది కాలం మధ్య జీవించి వున్నారని కొంతమంది పరిశోధకుల వాదన. ఇంతకుమించిన వివరాలు లభ్యం కావడంలేదు. ఏదైనా ఆయన జనన కాలమును గురించి కొంత పరిశోధన అవసరము అని చెప్పాలి.

మాధ్యమిక చింతన

వేదయుగం అనంతరం క.శ.2502-2202 (క్రీ.పూ.600 - క్రీ.పూ.300) వరకుగల బౌద్ధ యుగం ‘బుద్ధం , ధమ్మం (సిద్ధాంతం), సంఘం (బౌద్ధ సంఘం) అనే మూడు ఆభరణాలతో బౌద్ధమతాన్ని వికసింపజేసింది. దీనినే చరిత్రకారులు రెండవ పట్టణీకరణ దశగా పేర్కొన్నారు. 

బౌద్ధమత శాఖలలో ఒకటైన మహాయాన శాఖ భారతదేశం నుంచి బయల్దేరి మధ్యాసియా, చైనా, జపాన్ వంటి దేశాలలో బాగా వ్యాపించింది. మహాయానంలో మాధ్యమిక, యోగాచార చింతన అనే రెండు ప్రధాన తాత్విక చింతనలు ఉన్నాయి. 

మాధ్యమిక చింతన వాదాన్ని ప్రతిపాదించిన వారు నాగార్జునుడు. ఈ వాదన శక్తివంతం కావడానికి ఈయన ‘మాధ్యమిక కారిక’ గ్రంథ రచన చేశారు. బౌద్ధ ధర్మాలలో అగ్రగణ్యమైన మాధ్యమిక చింతనవాద ప్రవక్తగా నాగార్జునుడు ‘ఆర్య నాగార్జునుడు’ కాగలిగారు.

నాగార్జునకొండ

వేదవేదాంగాలను అభ్యసించిన ఫలితంగా బౌద్ధమతం ఈయనను సులువుగా ఆకర్షించింది. మహాయాన బౌద్ధమును స్వీకరించారు. గుంటలూరు (గుంటూరు) మహామండల ప్రాంతంలోని శ్రీ పర్వత సానువులలో చాలాకాలం నివసించారు. తన శాస్త్ర అధ్యయనాలన్నీ పూరి అయిన తర్వాత దక్షిణ భారతదేశం వచ్చి, మన రాష్ట్రంలో శ్రీశైల కొండల వద్ద ‘విహార’ను ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతమే ‘నాగార్జునకొండ’గా ఈ రోజు ప్రసిద్ధమైంది. ఈయన పేరుమీదనే ఈ పర్వతానికి ‘నాగార్జునకొండ’ అనే నామకరణం జరిగింది.

విశ్వవిద్యాలయ స్థాపన

నాగార్జునకొండ ప్రాంతమున ఈయన ఒక విశ్వవిద్యాలయాన్ని ఇక్ష్వాకు రాజుల సహాయంతో స్థాపించారు. బౌద్ధతత్వవేత్త ఆచార్య నాగార్జునుడు తన బోధనలతో ఇక్ష్వాకు రాజులను ఆకర్షించాడు. ముఖ్యంగా రాణులు బౌద్ధంవైపు ఆకర్షితులయ్యారు. వారి సహాయ సహకారాలతో విజయపురి సమీపమునగల లోయలలో బౌద్ధస్థూపాలు, బౌద్ధశిల్పాలను నిర్మాణం చేయించారు. ఇక్ష్వాకుల ఈ విద్యాలయంలో విద్యను అభ్యసించే విద్యార్థులకు గురుకుల వసతులన్నిటినీ సమకూర్చారు. దేశ దేశాల నుంచి విద్యార్థులు విజ్ఞానార్జనకోసం వచ్చారని చరిత్రకారులు చెబుతారు.
కాలక్రమేణా ఈ విశ్వవిద్యాలయం ఆచార్య నాగార్జున పేరుమీద దేశ విదేశాలలో ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల నుండి బౌద్ధ్భిక్షువులు, సన్యాసులు మాత్రమే కాక వివిధ శాస్త్రాలను అధ్యయనం చేసేందుకు పలు వర్గాల విద్యార్థులు ఈ విద్యాలయంలో చేరి విద్యలను అభ్యసించారు. 

ఇచ్చట 108 అడుగుల వ్యాసం, 86 అడుగుల ఎత్తుగల మహాస్థూపాన్ని, 18 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు, 4 అంగులాల మందంతో ప్రత్యేకంగా తయారుచేయించిన ఇటుకలతో స్థూప నిర్మాణాలు అనేకం చేశారు. విజయపురి అంతర్జాతీయ బౌద్ధ విహార యాత్రా కేంద్రంగా రూపుదిద్దుకున్నది. 

ప్రపంచ దేశాలలోని ప్రాచీన బౌద్ధ గ్రంథాలను సేకరించి ఈ బౌద్ధ విహారంలో ఒక పెద్ద గ్రంథ భాండారాగాన్ని నెలకొల్పారు. వివిధ దేశాల నుంచి బౌద్ధబిక్షువులు ఈ విహారానికి తరలివచ్చి, అధ్యయనం సాగించడం ప్రారంభించారు. భిక్షువుల శిక్షణ కూడా పరంపరగా సాగేది. ఈ విధంగా విశ్వవిద్యాలయం ఒక విజ్ఞాన కేంద్రంగా రూపొందింది.

*************************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి

ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి