గ్రామాల్లో ‘శిగెం’ నింఢడం (దేవతలు ఆవహించడం, పూనడం) భవిష్యత్తు చెప్పడం నిజమేనా? వైదిక సంప్రదాయంలో వున్న దేవభాష, ఆచార వ్యవహారాలు అందుకోలేని కొందరు గ్రామ దేవతలను ఏర్పాటుచేసుకొన్నారు. అయితే గ్రామ దేవతల మూలాలన్నీ హిందూ ధర్మంలో పూజించే దేవతల నుండి గ్రహించినవే. మైసమ్మ - మహిష అమ్మ అనీ, (మహిషాసురమర్దినీ) ఎల్లమ్మ - ఎల్ల అంటే అంతటా వ్యాపించి తల్లి లేదా శక్తి అని అర్థం. ఇలా ప్రతి గ్రామ దేవతలకు మూలం వెతికి చూపవచ్చు. అయితే ఇందులో కొందరు భూమికి దేవతలు, మరికొందరు ఇంటిదేవతలు, ఇంకొందరు బావులకు దేవతలు. ఈ దేవతలు ఆవహించిన- పూనిన సందర్భానే్న ‘శిగెం’ అంటారు. శిగెం- అంటే శివోహం అనే పదం నుండి వచ్చింది. ‘నేనే శివుణ్ణి’ అని దీని భావం. శివుడు పరమాత్మ అని కావచ్చు. పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు కావచ్చు లేదా ఏదైనా దైవతత్త్వం కావచ్చు. తత్త్వమసి, అహమాత్మ అనే అధ్యాత్మభావం కూడా కావచ్చు. ఏది ఏమైనా ‘నేను దైవత్వం పొందాను’ అనే భావం ఇందులో కన్పిస్తుంది. ఈ దైవత్వం ఓషధుల ద్వారా, గుర్వానుగ్రహం ద్వారా, యోగం ద్వారా కల్గుతుందని పతంజలి మహర్షే చెప్పడం జరిగింది.

ఎవరికైతే నైతిక జీవనం సరిగా ఉంటుందో ఈ మార్గంలో వారు ఇంకొంచెం పైమెట్టు ఎక్కుతారు. ఈ జాగృతి ఉన్నా నైతిక జీవనం సరిగ్గా ఉండదో వారు పైమెట్టు నుండి జారిపడతారు. ఈ జాగృతి కల్గిన తర్వాత కొందరికి మాత్రమే (అందరికి కాదు) వస్తువులను సృష్టించడం లేదా ఒక చోట ఉన్న కొన్ని వస్తువులను వారున్న చోటుకి రప్పించడం, భవిష్యత్తు సంబంధంగా ఎలాంటి దురాశ లేకుంటే కొన్ని విషయాలు సూచనామాత్రంగా మాత్రం తెలుస్తుంటాయి. అయితే కొన్నిసార్లు అధిక ప్రచారం, నైతిక ప్రవర్తన మంచిగా లేనపుడు ఈ సాధకులు అపఖ్యాతి పాలవుతారు. ఈ మార్గసాధకులు ముందే చెప్పినట్లు వారి అజాక్ఞనంవల్లనో, అవగాహనాలోపంవల్లనో పూర్ణస్థితి పొందినవారు తక్కువ. విస్తృత పరిశోధన పరిశీలన చేయగల అంశాలు ఇందులో ఉన్నాయి.

కులదైవం ఇంటిదైవం ఎవరు?

మన దేశంలో దేవతల సంప్రదాయాలను విశే్లషించాలంటే చారిత్రక పరిణామాల్ని తెరవెనుక పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఒక విస్తృత అధ్యయనం అవుతుంది. కులం ఎప్పటినుండి ఉందో అప్పటినుండి కులదేవతలు ఉన్నారు. ఒక సమూహం ఒకే రకమైన ఆచార వ్యవహారాలు పాటిస్తే, వారంతా ఒక దేవతను పూజిస్తే ఆ దేవతను ‘కులదైవం’ అంటారు. ఉదా విశ్వబ్రాహ్మణులు ‘విశ్వకర్మ’ను కులదేవతగా పూజిస్తారు. అలాగే చాలా కులాలకు కులదేవతలు ఉన్నారు.
అదేవిధంగా ఎవరి ఇంటిని ఈ దేవుడు కాపాడుతున్నాడో వారిని ఇంటిదేవతగా భావిస్తారు. ఈ ఇంటి దేవతల సంప్రదాయం త్రేతాయుగం నుండి కన్పిస్తుంది. ఈ ఇంటి దేవతలను గృహంలోని చిన్న అరలో ప్రతిష్ఠించుకొని, గృహాల్లో ఆయా సమయాల్లో పూజించి తిరిగి పైనున్న గూడు (అర)లో పెట్టడం పూర్వ సంప్రదాయం. అందుకే ‘ఉద్వాసన’ (దేవుని పూజ తర్వాత చెప్పడం) అనే మాట వచ్చింది. ఉత్ అంటే పైన, వాసం - వసింపజేయడం, పెట్టడం అని అర్థం. పూజాది ఉత్సవాల అనంతరం ఈ ఇంటిదేవతను ఉద్వాసంతో అటకపైకి ఎక్కిస్తారన్నమాట. మొదటి యుగాల్లో చాలామందికి గ్రామదేతల్లాంటి దేవతలే ఇలవేల్పులుగా ఉండేవారు. ఉదా- బాలమ్మ అంటే బాలా త్రిపుర సుందరి అనే అమ్మవారి స్వరూపం. ఈ దేవతలు అతి ప్రాచీన కాలం నుండి ఉన్నట్లు ముందే చెప్పడం జరిగింది.

అయితే చాలామందికి పురాణ దేవతలు కూడా ఇంటి దేవతలుగా ఉంటుంటారు. కొందరికి దక్షిణామూర్తి, మరికొందరికి హయగ్రీవుడు ఇంటిదేవుళ్లు వుంటే, మరికొందరికి నరసింహస్వామి, వేంకటేశ్వరుడు, శ్రీరాముడు, పాండురంగడు, శ్రీరంగడు ఇంటిదేవుళ్లుగా ఉన్నారు. ఈ ఇంటిదేవతలు గల గృహస్థులు తమ గృహాల్లో జరుపుకొనే ఏ కార్యక్రమంలోనైనా వీరికి ప్రాధాన్యతనిచ్చి, మొదట పూజించి ఇతర కార్యక్రమం పూర్తిచేస్తుంటారు.

సీతారాములు తమ పట్ట్భాషేకానికి ముందు నారాయణోపాసన చేసినట్లు శ్రీమద్రామాయణం తెలియజేస్తుంది. అలాగే శ్రీకృష్ణుడి ఆగడాలను యశోద ఫిర్యాదు చేసే సమయంలో తమ గోడలపై ఉన్న దేవతలను బాలకృష్ణుడు ఎంగిలి చేశాడని భాగవతం కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఇంటి దేవతల సంప్రదాయం యుగాలనుండి ఉన్నదని తెలుస్తుంది.

తమ కోర్కెలను సిద్ధింపజేసే దేవతల్ని ఇష్టదైవం అంటారు. అందులో పౌరాణిక దేవతలు, గ్రామ దేవతలు ఎవరైనా ఉండవచ్చు. ఇష్టదైవానికి నమస్కరించి యోగం చేయాలని యాజ్ఞవల్క్య మహర్షి కూడా చెప్పడం జరిగింది. అలాగే పరబ్రహ్మ సాధకమైన యోగమార్గానికి ఆటంకం కల్గించకుండా ఇష్టదేవతలను, ఇంటి దేవతలను ప్రార్థించాలని యోగశాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

- ఇంకావుంది...

*********************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి