విజ్ఞాన వీచికలు
డా.కె.అరుణా వ్యాస్
144 పుటలు
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
‘సామాన్యాన్ని విశేషంతో కలిపి చెప్పడం అర్ధాంతర వ్యాసాలంకారం’’. ఈ పుస్తక మంతా విషయపరంగా అలాంటిదే. డా.కె.అరుణా వ్యాస్ ఎన్నో సామాన్య విషయాలు స్వీకరించి వాటిలోని లోతును పరిశీలించి తెలుగు పాఠకులకు విజ్ఞానం అందించారు. 144 పుటలతో 35 శీర్షికలతో వున్న ఈ పుస్తకం అవశ్య పఠనీయం. సాధారణంగా పోలీస్ వాళ్లనుండి నైతిక బంధం (మోరల్ బాండేజ్) కన్నా న్యాయ బంధం (లీగల్ బాండేజ్) మాత్రమే ఆశిస్తారు. నైతిక బంధం వాళ్ల దగ్గర తక్కువని ప్రజల అభిప్రాయం. కానీ డా.అరుణా వ్యాస్ పోలీసు కుటుంబ భాగస్వామురాలైనా ఆమె ప్రతి అక్షరం నైతికత ప్రబోధించేదే. సంస్కృతాంధ్రాంగ్ల పండితురాలైన రచయిత్రి ఈ సమాజంలో నైతిక బీజాలను నెలకొల్పాలని సంకల్పించారు. అందుకే ప్రతి శీర్షికా ప్రసిద్ధ పద్యపాదమో, శ్లోక భాగమో, కవిత్వపు తురుపు ముక్కనో పెట్టి పాఠకులకు ఆసక్తి కలిగించారు.
‘బూచాడమ్మా బూచాడు, యత్ర నార్యస్తు పూజ్యంతే..,నీవే తల్లివి దండ్రివి, విద్య నిగూఢ గుప్తమగు, కలలు కనండి సాకారం చేసుకోండి’ ఇలాంటి శీర్షికలు ఆకర్షణీయంగా పఠనీయంగా మనసుకు హత్తుకునేలా వున్నాయి.
‘బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు’ అన్న వ్యాసంలో 1876లో గ్రహంబెల్ మాట్లాడే ఫోన్ కనుగొన్నప్పటినుండి మొదలుకుని ఈరోజు సెల్ ఫోన్ వరకు జరిగిన సాంకేతిక అభివృద్దిని వివరిస్తునే దానినుండి మనకు కలుగుతున్న లాభాలతోపాటు నష్టాలను, అది మానవ సంబంధాలను ఎలా దెబ్బ తీస్తుందో తెలియజేసారు. సమాజంపట్ల రచయిత్రి తనకున్న బాధ్యతను రచయిత్రి తెలియజేసారు. పగలస్తమానం బళ్లకీ, కళాశాలలకీ బై చెప్పి యువత మొబైల్‌తో గడుపుతూ ఉంది. వాళ్లకి పబ్బులు, మాదక ద్రవ్యాలూ, మత్తు పదార్ధాలు వంటి అనవసరమైన సమాచారం పుష్కలంగా అందుతుండడంతో యువత నిర్వీర్యము, నిస్తేజము, నీరసమూ అవుతోంది అంటూ ఆవేదన చెందారు.
‘తాను కరుగుతూ వెలుగునిచ్చే దీపం’ అన్న శీర్షికలో పోలీసులు జాతికి చేస్తున్న సేవను చక్కగా వివరించారు. ఉగ్రవాదులు చనిపోతే బంధాలను గురించి మాట్లాడే మేధావులు మరి పోలీసులు ఉగ్రవాదుల చేతిలో చనిపోతే ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించి వాళ్ల సిద్ధాంతంలోని డొల్లతనాన్ని ప్రశ్నించారు.
రచయిత్రి ప్రతి వ్యాసంలో కుప్పలుకుప్పలు సమాచారం రాశిపోశారు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని తేలికగా చెప్పకుండా ఆయా విషయాలకు సంబంధించిన గణాంకాలను అందించారు. అందువల్ల ఈ వ్యాసాలకు మరింత ప్రామాణికత వచ్చింది. స్వామి వివేకానంద ఎప్పుడూ ఉదహరించే కఠోపనిషత్ వాక్యం ‘ఉత్తిష్ఠ-జాగ్రత-ప్రాప్యవరాన్నిబోధిత’ అన్న శీర్షికలో స్వామి జీవితాన్ని తారీఖులతో రాయడం కాకుండా ఆయనిచ్చిన సందేశాన్ని గొప్పగా వివరించారు. ఇలా ప్రతి శీర్షికలో ఎన్నో ఆసక్తికర అంశాలను రచయిత్రి ప్రస్తావించారు.
పుస్తకం నిండా అరుణావ్యాస్ మానవత్వ పరిమళాలను వెదచల్లారు. అవన్నీ మనసుకు హృద్యంగా చెప్పడమే కాదు తన వాదనకు బలాన్ని చేకూర్చడానికి ఎన్నో ఎత్తుగడలను ప్రదర్శించారు. ప్రసిద్ధ కవులు, సినిమాల, సంస్కృత శ్లోక భాగాలను ఎంతగా ఇందులో చేర్చారో, జరుగుతున్న పరిణామాలను అంతే బాగా వివరించారు. మన శాస్త్ర, పురాణాల్లో ఎన్నో విషయాలను ఆధునిక విషయాలతో కలిపి వివరించారు. ఎన్నో పుస్తకాల నుండి అనేక విషయాలు ఈ వ్యాసాల్లో వివరించడం వల్ల దీనికి మరింత శోభ చేకూరింది.
ఆమె జీవితంలో అనుభవానికొచ్చిన ఎన్నో విషయాలకు సాహిత్య పరిమళాలను అదీ తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లోని సొబగులను విస్తృతంగా ఉదహరించారు. ప్రతి వాక్యానికీ వాటితో ప్రామాణికత కల్పించారు. పుస్తకం చిన్నదైనా ‘మానవత్వపు విజ్ఞాన సర్వస్వం’లా తీర్చిదిద్దారు రచయిత్రి.
క్షీణించిపోతున్న విలువల్ని రక్షించడం మనుషులుగా అందరికీ బాధ్యత ఉంది. మరి రచయితలకు అంతకన్నా ఎక్కువ ఉంది! అందుకే రచయిత్రి సంస్కృత కవి కాళిదాసు దగ్గరనుండి సినీ కవుల వరకు ఎవ్వరిని వదిలిపెట్టలేదు. అందరిలోని మానవత్వపు మెరికల్ని ఏరి తాను చెప్పాలనుకున్న విషయ వాకిట్లో వెదజల్లింది!
క్షీణించిపోతున్న కుటుంబ వ్యవస్థను నిలబెట్టాలని ‘జగమంత కుటుంబం నాది’ వ్యాసంలో ప్రస్తావించింది. ఇందులో సమిష్టి కుటుంబాలవల్ల కలిగే లాభాలను విడిపోవడం వల్ల కలిగే నష్టాలను ఏకరువు పెట్టింది. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన విధానాలను చెప్పే ఓ వ్యాసంలో దానికి సాహిత్య సుగంధాలద్దారు. గురువులు, విద్య ప్రాధాన్యాన్ని వివరించి సమాజంలో విద్య నైతికతను, విలువలను కాపాడాలనే ఆకాంక్షను వ్యక్తం చేసారు.
ఈ వ్యాస సంకలనంలో ప్రత్యేక విషయాలను ప్రస్తావించేటప్పుడు రచయిత్రి ఎంత జాగ్రత్త తీసుకున్నారో, అలవోకగా సామాన్యంగా చెప్పే విషయాలకు అంతే జాగ్రత్త తీసుకున్నారు. ప్రతి విషయాన్ని సోపపత్తికంగా నిరూపించారు. ఉపనిషత్తులలోని వాక్యాలను చెప్పేందుకు ఎంతలా ఉత్సాహం చూపించారో, కృష్ణశాస్ర్తీ భావ కవిత్వం ప్రస్తావన చేసేటప్పుడు అంతే ఉత్సాహం ప్రదర్శించారు. కొన్ని కొన్నిసార్లు పరస్పర విరుద్ధ మూల గ్రంథాలనుండి ఉదాహరణలు ఇచ్చినా వాటిని ఎప్పుడు ఎలా వాడాలో గ్రహించే ఒడుపు రచయిత్రికి ఉంది. అందుకే ప్రతి వ్యాసం సాహితీ సుగంధాలతో విరాజిల్లుతూ సందేశాత్మకంగా ఉంది.
రచయిత్రి ఎక్కడ తాత్విక సామాజిక సందేశం అందించాలో తెలిసిన నేర్పుగలది. అందుకే తన మానవత్వ విజ్ఞాన రాశికి కావలసిన ముడి పదార్ధాలను రుచికరమైన వంటగా వండి తెలుగు పాఠకులకు అందించింది. ప్రతి అక్షరం మంచి కోసం, సత్ప్రవర్తనకోసం ఉపయోగపడాలని ఆశించింది. ఆమె అనుసరించిన మార్గంలోకి పాఠకులను బలవంతంగా తీసుకెళ్లినట్టు కాకుండా చేయిపట్టి నడిపించుకుంటూ తీసుకెళ్లినట్టు రచన చేసింది. సమాజంలో గొప్ప విలువలు పాదుకొల్పాలంటే ఇలాంటి పుస్తకం ప్రతివారు చదివి తీరాలి.

డాక్టర్ పి. భాస్కర యోగి 
అంధ్రభూమి అక్షర పుస్తక సమీక్ష 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి