సీత జోస్యం
-నార్ల వెంకటేశ్వరరావు
ధర: రూ.130/-
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలు
*
పేరులో ‘రామస్వామి’ ఉండి, రావణబ్రహ్మ భక్తులుగా మారిన వారు దక్షిణ దేశంలో ఇద్దరు పుట్టారు. వ్యక్తిగత కులద్వేషంతో హిందూ ధర్మాన్ని జీవితాంతం ద్వేషించి, దూషించిన వాడు రామస్వామి నాయకర్. అదే అడుగుజాడల్లో జస్టిస్ పార్టీలో చేరి తెలుగునాట నాస్తిక విద్వేష విషం విరజిమ్మినవాడు త్రిపురనేని రామస్వామి చౌదరి.
అతని అడుగుజాడల్లో కొందరు నాస్తిక, హేతువాద రచయితలు తెలుగునాట బయల్దేరారు. అలాంటి వాళ్లలో సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత నార్ల వెంకటేశ్వరరావు ప్రసిద్ధుడు. రాముని దగ్గర ఉంటూనే నాస్తిక ప్రబోధం చేసిన ‘జాబాలి’ని హీరోగా చేస్తూ ‘జాబాలి’ నాటకం రచించాడు. అదే దారిలో ‘సీత జోస్యం’ పేరుతో రామాయణాన్ని కూడా విమర్శించాడు. రామాయణ, మహాభారత, మహాభాగవత గాథలన్నీ కల్పిత గాథలేనని ప్రచారం చేశాడు. దానిని నిరూపించే ప్రయత్నమే ఈ ‘సీత జోస్యం’. ‘ఉపక్రమణిక’ పేరుతో 124 పుటల పీఠికలో ‘రామాయణంపై విమర్శ’నే ఉంది. వాస్తవంగా ఆయన రాసిన నాటకం కేవలం 30 పుటలే. ఈ నాటకం కేవలం పేరుకే. రామాయణ విమర్శకే ఈ విపులమైన పీఠికను రచించాడని చెప్పవచ్చు.
‘ఏదో ఒక పక్షం వహించాలన్న పట్టుదల పెరగాలి; మనలో విస్సన్నల పట్ల వారి వేదాల పట్ల గౌరవం తగ్గాలి’ అన్న నార్ల మాటలు అతని భారతీయ సాంస్కృతిక వ్యతిరేక దృష్టిని తెలియజేస్తున్నాయి. రామాయణంపై రచించిన పుస్తకాలకు రెఫరెన్సుగా ఎక్కువగా డి.డి.కోశాంబి లాంటి పాశ్చాత్యుల పుస్తకాలపై రచయిత ఆధారపడ్డాడు. భారత, రామాయణాలను తూలనాడుతూ ఎందరో పాశ్చాత్య రచయితలు రచనలు చేశారు. అవన్నీ నార్ల వారికి ఆదర్శం కావడం మరో విచిత్రం.
పండిట్ ద్వారకాప్రసాద్ మిశ్రా రచించిన రామాయణ వ్యాఖ్యను నార్ల గట్టిగా ఖండించాడు. మిశ్రా చెప్పినదంతా ‘ఓ సర్కస్ ఫీట్’ అన్నాడు.
‘ఏ సర్కస్ ఫీట్’ చేయకుండా రామాయణాన్ని విచక్షణా పూర్వకంగా పరిశీలించిన జాతీయ, విజాతీయ పండితులు దానికి ఏ పాటిగా చారిత్రకాధారం కలదన్న విషయాన్ని విభిన్నాభిప్రాయాలను వెల్లడించారు.’ (పుట.14) అని చెప్పినపుడు ఏ ఆధారం లేని రామాయణాన్ని గురించి ఇంత చర్చ ఎందుకు? రామాయణానికి సంబంధించి ఎన్నో చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి. పురావస్తు, లిఖితపూర్వక ఆధారాలు చెప్పలేనన్ని బయల్పడ్డాయి. రామాయణం ఈ జాతి నరనరాల్లో చొచ్చుకుపోయింది. అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాలో ఈ రోజుకూ ‘రామలీల’ జరుగుతుంది. ఇంతకన్నా చారిత్రక ఆధారం ఇంకేం కావాలి.
నార్ల దృష్టిలో రామాయణం ఓ కల్పిత గాథ. ‘రామాయణంలో అసంభవ విషయాలు అభూత కల్పనలు పెక్కులున్నా దానికి చారిత్రకాధారం ఏ స్వల్పంగానో లేకపోలేదు’ (పు.14) అంటూ గోడమీది పిల్లివాటం ప్రదర్శించాడు.
రామాయణ గాథ మూలాన్ని వేదంలో చూడవచ్చని 1872కు చెందిన జర్మనీ సంస్కృత పండితుడు అల్‌బ్రెక్ట్ లేబర్ సూచించాడు. దానిన మన దేశ సుప్రసిద్ధ పండిత పరిశోధకుడు రమేశ్‌చంద్ర దత్తు నిజమని ఉద్ఘాటించాడు. భారతీయ పురాణ, ఇతిహాసాలన్నీ వేద ప్రమాణాన్ని అంగీకరించేవే. వేద శాస్త్రాలను అత్యంత సులభశైలిలో చెప్పేందుకే పురాణ వాఙ్మయం వచ్చింది. ఇతిహాసాలు పూర్వ చరిత్రలు. అవి వేద ధర్మాలను ప్రవచిస్తాయి. పురాణ కథల్లో ఎక్కువ భాగం ప్రతీకాత్మకంగా ఉంటాయి. ఇతిహాసాలు అలా కాదు. వాటిలో ఒక్క అక్షరం మార్చడానికి వీలు లేదు. ఇతిహాసం - అనే మాటకు ‘ఇలా ఉండేవట’ అని అర్థం. కానీ నార్లవారు ఇక్కడే తప్పులో కాలేసి ఇది వేదంలోని ప్రతీకలతో రచింపబడిందని నిరూపించబోయారు. రామగాథను కల్పిత గాథగా నిరూపించాలని వారు ఎంతో శ్రమపడ్డారు.
వేదంలోని ఇంద్ర వృత్తాసుర యుద్ధమే ‘రామాయణం’ అని ఓ చోట చెప్పిన రచయిత, రామాయణానికి మూలం బౌద్ధుల జాతక కథలన్నాడు.
‘బాల అయోధ్యకాండలు బౌద్ధ జాతక కథల్లో సామ, వెస్సంత జాతక కథల కలగాపులగమే అని దినేశ్ చంద్రసేన్ వ్యాఖ్యలు (పు.19)లో ఉటంకించాడు.
రామాయణంలోని ప్రతి పాత్రను తక్కువ చూపెట్టాలని నార్ల వారు ప్రయత్నం చేశారు. ‘కొందరు శైవుల విశ్వాసం ప్రకారం శివుడు హనుమంతుడిగా అవతరించాడు. బౌద్ధ జాతక కథల ప్రకారం ఒక పూర్వజన్మలో బుద్ధుడు వానరుడు. నిజానికి వైష్ణవంలోనే ఆంజనేయుని స్థానం తక్కువ. దానిలో అతడు రాముని నమ్మినబంటు మాత్రమే. దినేశ్ చంద్రసేన్ కంటే చాలా ముందుగానే హనుమంతుని గురించి సర్ ఆల్‌ఫ్రెడ్ సి.లియోల్, హెర్మన్, యాకోబీలు కొన్ని ఆసక్తిదాయకమైన విషయాలు వ్రాశారు’ (పు.22)
నార్లవారు ప్రతి విషయంలో పాశ్చాత్య పరిశోధకులను ముందుబెట్టి భారతీయ పరిశోధకులపై దాడి చేశాడు. ఏ కథకైనా మూలం ఎక్కడున్నా పోలికలు సర్వసామాన్యంగా ఉంటాయి. పురాణ, ఇతిహాస గాథలను సరిపోలే కథలు భారతీయ సాహిత్యం మొత్తం కన్పిస్తాయి. అంతమాత్రాన ప్రతి కథా తోకకథల్లోదే అని దబాయించడం పరిశోధకుల లక్షణం కాదు. నార్ల చెప్పే మాటల్లో రామాయణం మూలం వేదంలోనిదనీ, బౌద్ధంలోని జాతక కథల్లోదనీ రామాయణానికి అస్తిత్వమే లేదన్నట్లు రాస్తూ పోయారు. అస్తిత్వమే లేని కథను విమర్శించడానికి ఇంత సైజు పుస్తకమెందుకు? రాముణ్ణి విమర్శించి సాహిత్యం అంటూ దబాయిస్తూనే దానికి ఎలాంటి అస్తిత్వం లేదని నిందలేయడం ద్వంద్వ ప్రమాణం కాక ఇంకేమిటి? ఉత్తరాది కట్టుకథలు, దక్షిణాది పిట్టకథలు, వాల్మీకి ఇంద్రజాలం కలిసి రామాయణ మహాకావ్యం రూపొందిందని దినేశ్ చంద్రసేన్ చెప్పినట్లు నార్ల (పు.23) పేర్కొన్నారు.
మరి కట్టుకథలపై పిట్టకథలపై ఇనే్నళ్ల నుండి పరిశోధన అవసరమా? ‘పరస్పర వైరుధ్యాలుంటే వాటిని అనివార్యం చేసినట్టిది రామాయణమే. దానిలోని ప్రత్యక్షరాన్ని పరమ పవిత్రమైనదిగా కళ్లకద్దుకొనే రామభక్తులను విడిచి పుచ్చితే... రామాయణంలో పరస్పర వైరుధ్యాలు ఎక్కడలేవు, ఎంతగా లేవు? వాటిని కప్పిపుచ్చడం కోసమే తిలక, కతక, శిరోమణి, భూషణాది వ్యాఖ్యానాలను వ్రాసిన వారు కప్పదాట్లు వేశారు. పీత నడక నడిచారు. పిల్లిమొగ్గలు వేశారు. కోతిచేష్టలు చేశారు. కాకిగోల పెట్టారు. కొక్కిరాయి వేషాలు వేశారు.’ (పు.24) ఇవన్నీ రామాయణ వ్యాఖ్యానకారులను తిట్లుగాక ఇంకేమిటి? ఇంత అక్కసు ఎందుకు? రామాయణ గాథ మానవ సమాజంలో ధర్మాన్ని నిలిపే మహత్తరమైన కావ్యం. ధర్మాన్ని లోకంలో నిలబెట్టడానికి మానవ సమాజాన్ని సవ్య మార్గంలో నడిపించడానికి ఓ ఆదర్శ జీవనం లోకానికి అందించాడు. అందులో స్వల్ప అతిశయోక్తులు ఉండవచ్చు కానీ విశ్వాసాలు లేవు అనడం చారిత్రక ద్రోహం.
రాజ్యాంగంలోని చిన్నచిన్న ఆచరణాత్మక సమస్యలుంటే అవి లోపాలుగా చూపడం సబబా? అయినా ఇతిహాస, కావ్యాల్లోని ప్రతి ఘట్టం ఈ రోజు సంఘటనలతో, ఇవాళ్టి నాగరికతతో చూడడం సాధ్యం కాదు. మొఘల్‌ల కాలంలోనిది ఆంగ్లేయుల కాలంలో లేదు. ఆంగ్లేయుల కాలంలోనిది ఈ రోజు లేదు.
ఆఖరుకు నార్ల రామాయణంలోని పాత్రలు (గ్రీకు పురాణాలను పోలి ఉన్నాయని మరో బాంబు పేల్చాడు. (పు.25) దానిని తాను చెప్పకుండా పాశ్చాత్యుల పుస్తకాల నుండో, రామాయణ వ్యతిరేకుల నుండో చెప్పిస్తాడు. రాధాకుముద్ ముఖర్జీ వ్యాఖ్యను ఓచోట ఉటంకిస్తూ ‘రాముడు నిజంగా వింధ్య పర్వతాలను దాటి వచ్చినా, సింహళం వరకు పురోగమించినా, కిష్కింధను గాని లంకను గాని తన కోసం రాజ్యంలో ఆయన అంతర్భాగం చేసుకోలేదు (పు.26) మొదటనేమో రామాయణంలో రామునిది కోసల రాజ్యం కానే కాదని చెప్పిన రచయిత ఇక్కడ దానికి విరుద్ధమైన వ్యాఖ్య చేశాడు.
ఆనాటి ప్రదేశాలన్నీ (రామాయణ కాలంనాటి) ఈ రోజు వెదకడానికి నార్ల చేసిన ప్రయత్నాలన్నీ రంధ్రానే్వషణ. యాభై ఏళ్ల క్రింద ఉన్న దేశాల సరిహద్దుల పేర్లే ఈ రోజు కన్పించడం లేదు. అలాంటిది వేల యేళ్ల నాటి రామాయణంలోని పట్టణాల పేర్లు ఈ రోజు రచయిత వెదకడం - అవి లేవు లేదా పేరు మారో, కన్పించడం లేదు కాబట్టి ఈయన రామాయణమే లేదంటాడు. రామనగరం, రామాపురం, రామంతాపురం, హనుమాన్‌నగర్, అంజవరం.. లాంటి గ్రామాలు ప్రాచీన కాలం నుండి ఆ పేర్లతో ఉన్నాయి కదా. అవి ఎలా ఏర్పడ్డాయనే దానికి శాస్ర్తియ కోణం అవసరం లేదా?
రామాయణంపై అనేక విషయాలను చర్చించి, పరిశోధించి తెలియజేసిన విమర్శకులందరిని తూర్పారబట్టిన రచయిత, తన కనుకూలమైన వాళ్లను మాత్రం ఆకాశానికి ఎత్తేశాడు.
‘రాముడు నర్మదానదిని దాటలేదు. రామభక్తులకు, భజనపరులకు, సీతారామ బొమ్మలకు ఏడాదికొకసారి పెళ్లి చేసి, స్వర్గ ద్వారాలు తమ కోసం తెరచుకొని, వుండగలవని విశ్వసించే ప్రబుద్ధులకు ఎవరేమి చెప్పినా ఎంత చెప్పినా అది కంఠశోష మాత్రమే’ (పు.51) అంటూ సీతారాముల కల్యాణం చేసేవాళ్లు స్వర్గం కోసం చేస్తారని వ్యాఖ్యానించాడు.
సీతారాముల కల్యాణం చేస్తే స్వర్గం లభిస్తుందని, ఏ శాస్త్ర గ్రంథం చెప్పింది? ఇది శాస్త్రంలో ఉందో లేదో కూడా తెలియకుండా అవాకులు చెవాకులు రాయడం కపట విమర్శ కాక ఇంకేమిటి? సీతారాముల పెళ్లి లోకకల్యాణం కోసం, భగవంతుని కల్యాణం ఆనాడు చూడని వాళ్లు ఇందులో పాల్గొనేటట్లు చేసే ఓ సాంస్కృతిక ఉత్సవం ఇది అని తెలియని నార్ల ఇదంతా అక్కసుతో చేసిన విమర్శ అని తెలుస్తూనే ఉంది.
అయినా పురాణ కాలం నాటి ఊళ్లు వాటి పేర్లు యథాతథంగా ఉండాలని రచయిత కోరడమే ఓ అపభ్రంశపు ఆలోచన. అలాగే రామాయణ పాత్రలను ఈనాడు మనుషుల సంబంధాల చట్రంలో కూడా చూడడం అశాస్ర్తియం. నార్ల కూడా ఆర్య - ద్రావిడ సిద్ధాంతాన్ని రామాయణంలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఆంగ్లేయ రచయితలు భారత్‌ను ముక్కలు చేయడానికి అనేక పద్ధతులు ఉపయోగించారు. అందులో ఆర్య - ద్రావిడ సిద్ధాంతం ఒకటి. మండోదరి తన భర్త రావణుణ్ణి ‘ఆర్యపుత్రా’ అని సంబోధిస్తే, సీత శ్రీరాముని ‘ఆర్య పుత్రా’ అని పిలిచింది. అలాంటప్పుడు ఆర్యులెవరు? ద్రావిడులెవరు? ‘అసురులు ఆర్య జాతికి చెందిన ఒక శాఖ వారైనప్పటికీ రాక్షసులు మాత్రం ఏదో ఒక జాతికి లేదా దాని శాఖకు చెందిన ప్రజలు ఎంత మాత్రం కాదు... పరజాతుల వారి పట్ల ఆర్యుల వైర విద్వేషాల నుంచి వారి భయభ్రాంతుల నుంచి పుట్టుకు వచ్చినవారే రాక్షసులైనా, పిశాచులైనా వేదకాలంనాటి ఆర్యులు..’ (పు.59)
ఇలా రాక్షసులను కూడా ఆర్య - ద్రావిడ రాక్షసులుగా మార్చిన రచయిత కలానికి జోహార్లు..!
ఈ పుస్తకం మొత్తంలో ఏవి నార్ల అభిప్రాయాలో ఏవి ఉటంకింపులో తెలియనంత గందరగోళంగా ఉంది. పాఠకులకు ఒక నిర్దిష్ట అభిప్రాయం కలుగకుండా ఈ పద్ధతి అడ్డు పడింది. రాక్షసులెవరు? ఋషులెవరు? ఋషుల కుట్రలో రాముని పాత్ర? ఆయుధాల ప్రశ్న, సీతారాములు, దశరథుని జాతకం.. వంటి శీర్షికలు రామాయణంపై కటువైన విమర్శ చేశాయి.
ఇక నాటకంలో సీతా లక్ష్మణులు సంభాషణ చూస్తే ఇది కుత్సిత బుద్ధితో రామాయణ కథను విమర్శించాలనుకొని రాసిన పుస్తకమేనని అర్థమవుతుంది.
‘మా వంశీకులు అఖిల జగత్తును పదేపదే జయిస్తూ పోయారా? అశ్వమేధాలను పదేపదే చేస్తూ పోయారా? వారు సాగరాన్ని తవ్వారా? పాతాళాన్ని చేరారా? స్వర్గం నుండి గంగను భూతలానకి దించుకు వచ్చారా? మీ వారితో మావారికెక్కడ పోలికలే? (పు.139) ఇదంతా సీత వ్యంగ్యంగా రాముని వంశాన్ని నిందించిన డైలాగ్. భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం రామాయణం. అలాంటి రామాయణంలోని భాతృప్రేమ, పితృభక్తి, రాజ్యపాలన, కరుణ దయ వంటివి గ్రహించకుండా స్థలాలను, పేర్లను బట్టి విమర్శ చేయడం కొండను తవ్వి ఎలుకను పట్టడమే! ఏది ఏమైనా రాముని ప్రభావం తగ్గించాలని నార్ల లాంటి వారు ఇంత గట్టి ప్రయత్నం చేయడం చూస్తూంటే ఆయన (రాముడు) ఈ జాతికి ఎంత ఆదర్శ పురుషుడో అర్థమవుతుంది. నార్ల చేసిన అలాంటి ప్రయత్నం వల్ల రాముని కొత్త కోణాలు తెలుస్తాయి కాబట్టి రామాయణంపై పరిశోధనకు పనికి వస్తుంది. నార్ల నాస్తికుడైనా రాముని మీద కోపంతో ఈ పరిశోధన చేసినా అది కూడా రామనామ జపం చేసినట్లే భావించవచ్చు.

డాక్టర్ పి. భాస్కర యోగి 
అంధ్రభూమి అక్షర పుస్తక సమీక్ష


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి