*    మోదీ హవా ఉండదు. గత ఎన్నికల్లో గరిష్ఠంగా సీట్లొచ్చేశాయ్‌. ఇప్పటి నుండి ఆయన ప్రభ తగ్గుతుంది. 2019 నాటికి తటస్థం అవుతుంది. తెలంగాణలో తెరాసకు, తిరుగుండదు. 111 సీట్లు తెరాసకు, మజ్లిస్‌కు 6 సీట్లు, 2 కాంగ్రెసుకు. మంచి అభ్యర్థులుంటే అవి కూడా మనవే.
    – తెరాస పార్టీ సర్వే
+   లగడపాటి రాజగోపాల్‌ను మించి పోతున్న మీ సర్వేకు, ఆమ్‌ఆద్మీ పార్టీని వెనుకేస్తున్న మీ ఆత్మవిశ్వాసానికి, అరవింద్‌ కేజ్రీవాల్‌ను తలదన్నే మీ ఆరోపణలకు హాట్సాఫ్‌ !
*     ప్రధాని నరేంద్రమోది నేతృత్వంలో కేంద్రం అమలు చేస్తున్న కీలక పథకాల కింద దేశవ్యాప్తంగా 813.76 కోట్ల పని దినాలు సృష్టించబడ్డాయి. గ్రామీణాభివృద్ధికి 2013-14లో రూ.58,630 కోట్లు కేటాయించగా, 2016-17లో ఆ మొత్తం రూ.95,099 కోట్లకు పెరిగింది.
– నరేంద్రసింగ్‌ లోయర్‌, కేంద్రమంత్రి
+     మీరంతలా పని చేస్తుంటే ప్రతిపక్షాల కళ్లు మండుతున్నాయి. కులాలు, కుటుంబాలు, మతాల మద్దుతుతో ప్రభుత్వాలు నడిపిన నాయకులు పార్టీలు ఈ మార్పును భరించలేకపోతున్నారు.
*     కాంగ్రెసుపై వ్యతిరేకతతోనే టిడిపి పెట్టారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకొంటారా ? పార్టీ మారలేదు. విలీనం చేశాం.
– ఎర్రబెల్లి, తీగెల, మాగంటి (తెరాసలోకి వెళ్ళిన తెదేపా నేతలు)
+     బాబ్బాబు ! తెరాస భవన్‌లో ఎన్టీఆర్‌ ఫోటో పెట్టించండి చూద్దాం!
*     భూములు లాక్కోవడం సరికాదు.
– జెఎసి చైర్మన్‌ ఆచార్య కోదండరాం
+     ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఏమయ్యారు మీరు…!?
*     తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బదీస్తే ఊరుకోం. అమిత్‌షా క్షమాపణలు చెప్పాలి. అమిత్‌షా ఓ భ్రమిత్‌ షా ! నల్గొండ చౌరస్త కొచ్చి పాములాట బెడ్తే నడువదు. మా అంగి, లాగు గుంజుతమంటే మీ గొంతు పట్టుకుంటం బిడ్డా ! 
– సిఎం కెసిఆర్‌
+     మీరు ఏదైనా స్వతంత్ర రాజ్యంలో ఉన్నామను కొంటున్నారా! అమిత్‌షా వచ్చి మీకు బిపి పెంచింది మాత్రం నిజం!
*     కొనేవారి, అమ్మేవారి పేర్లు మార్కెట్‌ కమిటీ వద్ద ఉండాలి. ఒకసారి కొన్న పశువును 6 నెలలు దాకా అమ్మకూడదు. వధించేవారికి పశువులు అమ్మొద్దు. వ్యవసాయ దారులకు మాత్రమే విక్రయించాలి.
– పశువుల క్రయ విక్రయాలపై కేంద్రం ఆంక్షలు
+     గోమాతాకీ జై !
*     నా లెక్కల్లో ఏది తప్పు! చెప్పిన తర్వాత స్పందిస్తా.
– కెసిఆర్‌కు అమిత్‌ షా సవాల్‌
+     చర్చను ఇక్కడే కాస్త గట్టిగా చేయాల్సింది ‘షా’ గారూ !
*     టిడిపి కుటుంబం మరింత బలోపేతం. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం.
– తె.తెదేపా నాయకుడు ఎల్‌.రమణ
+     అంటే చంద్రబాబు, లోకేశ్‌, బాలయ్య – వీరంతా ఉన్న కుటుంబం అనేనా మీ మాటల అర్థం ? సరిగ్గా వివరించండి.
*     మోదియే ముందడుగేయాలి. రాష్ట్రపతిపై ఏకాభిప్రాయానికి ప్రయత్నించాలి.
– సోనియా విందులో 17 పార్టీల తీర్మానం
+     అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు. సంఖ్యాబలం ఉన్న ఎన్‌.డి.ఎ.కు లేని తొందర మీకెందుకు !?
*     70 సీట్లు సులువుగా గెలుస్తాం. 2019లో మాదే అధికారం.
– టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
+     ఇప్పుడు ఎలక్షన్ల గురించి మిమ్మల్ని ఎవరడిగారు ? గెలిచాక రెండేళ్లు సంబరాలకే సరిపోతాయి. ఎలక్షన్లు రాకముందు రెండేళ్లు సన్నాహాలకు. అసలు మీ హయాంలో పాలన జరిగిద్దా..!

– డా||పి.భాస్కరయోగి మాటకు మాట, విశ్లేషణ జాగృతి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి