‘మనుషులు ఆకాశంలో పక్షిలా ఎగరడం నేర్చుకొన్నారు; చేపలా నీటిలో ఈదడం నేర్చుకొన్నారు; కానీ మనిషిలా బ్రతకడం మర్చిపోయారు’ అంటారు ఓ మహాత్ముడు. అలా మనిషిలా తయారు చేయడం కోసం ‘స్వామి శాంభవానంద’ ‘మీ గమ్యం మీ చేతుల్లోనే…’ అనే పేరుతో రచించగా జి.వి.జి.కె. మూర్తి తెలుగులో అనుసృజన చేశారు. మొత్తం 27 అంశాలతో 244 పుటలతో ప్రతి అక్షరం అనుసరణీ యంగా, ఆచరణీయంగా ఉంది. పూర్వం ఇళ్లలో, పాఠశాలలో సుమతి, వేమన, భాస్కర శతకాల వంటి నీతి శతకాలను నేర్పించి సమాజాన్ని నైతిక బంధంలో ఉంచేవారు. ఈ రోజు మానవతా విలువలు నేర్పని వ్యాపార విద్య నేర్చుకొంటున్న తరుణంలో ‘రామకృష్ణ మఠం’ వారు చేసిన ఈ ప్రయత్నం అభినందించ దగింది.
పిల్లలకు, పెద్దలకు పనికివచ్చే ఈ పుస్తకం నైతిక జీవనానికి కరదీపిక లాంటిది. వేసవిలో నైతిక తరగతులు, సదాచారం, బాల వికాస్ లాంటి కార్యక్రమాలకు ఇది ఓ పాఠ్య గ్రంథంగా చెప్పవచ్చు. వ్యక్తిలో వ్యక్తిత్వ పునాదులు ఉంటేనే జీవితం సుగమం అవుతుంది. వాళ్ల మాటలకు సమాజంలో గౌరవం ఉంటుంది. ‘ఇతరులపై విజయాన్ని సాధించే వాడు బలమైనవాడు, తనపై తాను విజయాన్ని సాధించేవాడు అందరికంటే బలవంతుడు’ అన్న లావొత్సె సూక్తితో ప్రారంభమైన ఈ పుస్తకం ‘యువకులు తమ చదువులతో పాటు ఒక సమ వ్యకిత్వాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కృత నిశ్చయంతో కృషిచేయాలి’ అని చెప్పారు. ఆ వ్యక్తిత్వ నిర్మాణానికి ఆత్మగౌరవం, స్వీయ విశ్లేషణ, స్వశక్తిపై ఆధారపడడం, స్వీయ బాధ్యత, వ్యక్తిగత చొరవ, ఆత్మస్థైర్యం, స్వీయ పరిశ్రమ, కృత నిశ్చయం వంటి ఉపశీర్షికల్లో చెప్పిన విషయాలు మనిషిని సన్మార్గంలో పెట్టడానికి పనికి వస్తాయి.
‘సభ్యత, సత్ప్రవర్తన- ఆవశ్యక విలువలు’ అన్న శీర్షికలో ‘చిన్న చిన్న విషయాలలో కూడా మంచితనంతో దయాగుణంగా ఉండడం’ అని చెప్పిన మాటలు పుస్తకం నిండా కన్పిస్తాయి. మానవునిలో చేరిన రాక్షస ప్రవృతిని తొలగించి దైవీతత్వంతో నింపడానికి ఇందులో ప్రతి అధ్యాయం, ప్రతి శీర్షిక పనికి వస్తుంది. వేకువనే మేల్కొనే అలవాటు, శుచి శుభ్రత, వస్త్రధారణ, ఆరోగ్యం-వ్యాయామం, ఆహారం, భోజన అలవాట్లు, మన ఇల్లు, మన కుటుంబం, స్నేహం, పాఠశాల, ఆటస్థలం, రహదారులు, పాదచారుల మార్గాలు, గ్రంథాలయం, వ్యక్తిగత వ్యవహారాలు, అతిథులు, దేశ సంచారం, విహార యాత్రలు, కాలం, సమాచార సదుపాయాలు సద్వినియోగ విధానాలు, సంస్కృతి, భావావేశ నియంత్రణ, వ్యవహార జ్ఞానం, చదువు, పరిక్షలకు తయారయ్యే పద్ధతి, పౌరసత్వం, జీవితంలో విజయం సాధించడం, నైతిక, ఆధ్యాత్మిక విలువలు… ఇలా ప్రతి శీర్షిక మనల్ని జ్ఞానుల్ని చేసి చక్కని జీవితం జీవించడానికే కాబట్టి ఈ పుస్తకం అవశ్య పఠనీయం.
మీ గమ్యం మీ చేతుల్లో…
రూపకల్పన : స్వామి శాంభావనంద
అనువాదం : జి.వి.జి.కె.మూర్తి
పుటలు : 244
వెల : 40/-
ప్రతులకు : సాహిత్యనికేతన్, హైదరాబాద్ -27
దూరవాణి :040-27563236
సాహిత్యనికేతన్, విజయవాడ – 520002
దూరవాణి : 9440643348
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి