ఇటీవలి కాలంలో హిందూ ధర్మాన్ని విమర్శించడంవల్లనే గొప్పవాళ్లం అవుతామని, గొప్ప పేరువస్తుందని భావిస్తున్నవాళ్లు ఎక్కువయ్యారు. వాళ్లు హిందూ ధర్మంపై పొరలను మాత్రమే పరిశీలించి తమ అహంకారం ప్రదర్శించి ఆనందం పొందుతున్నారు. నిజానికి హిందూధర్మం ప్రస్తుతం భారత్‌కు మాత్రమే పరిమితమైంది కాదు. ఇటీవల కాలంవరకు నేపాల్‌లో హిందూ రాజ్యం ఉండేది. అది కూడా మావోయిస్టుల తిరుగుబాట్లు, రాజకీయ వ్యూహం పుణ్యమాని ధ్వంసమైంది.
ప్రస్తుతం భారత్‌లో మెజార్టీ ప్రజల మతం హిందూ మతం; కానీ ఘోరమైన కష్టనష్టాలను హిందూత్వం ఎదుర్కొంటున్నది. ఇపుడే కాదు చరిత్ర తెలిసినప్పటినుండి హిందూ ప్రజలకు కష్టాలే. కానీ వేల యేళ్ల చరిత్రలో హిందూ ధర్మాన్ని ఎవరూ ధ్వంసం చేయలేకపోయారు. ఇది ఈ రోజు ప్రపంచమంతటా అధ్యయనంలో తేలిన పరిశోధనాంశం. ఉదాహరణకు ఇరాన్‌ను ముస్లింలు కేవలం 15 సం.లు పరిపాలిస్తే అది ఇస్లామిక్ రాజ్యం గా, ఇరాక్‌ను 17 సం.లు, ఈజిప్ట్‌ను 21 సం.లు ముస్లింలు పరిపాలిస్తే అవి పూర్తి ఇస్లామిక్ రాజ్యాలుగా మారిపోయాయి. అలాగే ఐరోపా ఖండాన్ని క్రైస్తవులు 50 ఏళ్లు పాలిస్తే అవన్నీ క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి. మరి భారత్‌ను 800 ఏళ్లు ముస్లింలు, 200 ఏళ్లు బ్రిటీషువారు (క్రైస్తవులు) పాలించినా హిందూధర్మం దెబ్బతిన్నది కాని ధ్వంసం కాలేదు. అది హిందుత్వానికున్న జీవనాడి. హిందూ సంస్కృతి వ్యాపించిన ఇస్లామిక్ దేశాలలో కూడా హిందుత్వం పట్టు తగ్గలేదు. ఇండోనేషియా మతపరంగా అతిపెద్ద ముస్లిం దేశం. 87% ముస్లిం జనాభా ఉన్న ఆ దేశంలోని ప్రజలు ఇప్పటికి సంస్కృతిపరంగా హిందుత్వను అనుసరిస్తారు. వాళ్ల ఎయిర్‌వేస్ పేరు ‘గరుడ’, వాళ్ల కరెన్సీపై గణేశుణ్ణి ముద్రించుకొన్నారు. వాళ్ల రాజధాని జకార్తా కూడలిలో శ్రీకృష్ణార్జునుల విగ్రహం పెట్టుకొన్నారు. ముస్లిం దేశమైన ఇండోనేషియా రెండేళ్లక్రితం స్నేహపూర్వత బహుమతిగా 16 అడుగుల ఎతె్తైన సరస్వతీ విగ్రహం అమెరికాకు పంపిస్తే, వారు దాన్ని వాషింగ్టన్ డి.సిలో ప్రదర్శనగా పెట్టారు. మన దేశంలో ప్రసిద్ధమైన, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేవాలయం బృహదీశ్వరాలయానికి వెయ్యేళ్లు పూర్తిగావడం, అది యునెస్కో గుర్తించినందున కొనే్నళ్లక్రితం ఆర్‌బిఐ ఓ నాణేన్ని విడుదల చేసింది. నఫీజ్‌కాజీ, అబూసరుూద్ అనే ఇద్దరు కోర్టులో ఈ విషయాన్ని సవాలుచేశారు. బి.డి.అహమ్మద్ అనే జడ్జి ప్రభుత్వంపై సీరియస్‌గా స్పందించారు. ఇదీ ఈ దేశంలో హిందూ ధర్మానికి ప్రభుత్వం, వ్యవస్థలు ఇస్తున్న గౌరవం. జర్మనీవాళ్లు వాళ్ల వైద్యానికి మన దేశానికి చెందిన చరకుడి పేరుతో ‘చర్కాలజీ’అని పేరుపెట్టుకొంటారు. కానీ మన దేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ చేసే ప్రపంచ సాంస్కృతికోత్సవానికి అనుమతి దొరకదు. అమెరికాలో ‘ఆయవా’ రాష్ట్రంలో రామముద్ర ఉన్న కరెన్సీ ఉంది. ‘రాముని బాండ్లు’ 35 అమెరికా రాష్ట్రాల్లో చెల్లుబాటు అవుతున్నాయి. మనంకూడా రాముని చిత్రపటాలను రాజ్యాంగంలో పెట్టుకొన్నాం కానీ రాముని పేర ఓ నాణెం విడుదల చేయగలమా? హిందూ మతం అనగానే ‘మనుస్మృతి’ని విమర్శిస్తుంటారు. మనుస్మృతి వేలయేళ్లనాటి- ఇంకా చెప్పాలంటే కృతయుగం అనుసరించే స్మృతి. ప్రస్తుతం వివిధ ప్రాచ్యలిఖిత భాండాగారాల్లో లభిస్తున్న 30నుండి 35 మనుస్మృతుల్లో చాలా శ్లోకాలు ఈరోజు ప్రతుల్లోనివి లేవని పరిశోధకులు తేల్చారు. మనుస్మృతిలో మొత్తం 2685 శ్లోకాలుండగా అందులో మూల శ్లోకాలు కేవలం 1183 మాత్రమేనని, కల్పించి అందులో ప్రక్షిప్తాలుగా చేరినవి 1502వరకు ఉంటాయని పరిశోధకులు తేల్చారు.
హిందూ మత సాహిత్యం, సంస్కృతి చాలా ప్రాచీనమైంది. విశాలమైంది. అంతే గాకుండా లోతైనది. ప్రశ్నించడానికి ఎక్కువ అవకాశమున్నది. ఇది ఒకే పుస్తకం, ఒకే ప్రవక్తతో నిర్మితమైంది కాదు. పూనకం దగ్గరనుండి వేదం వరకు అన్ని అంశాలు హిందూ ధర్మంలోనివే. అందువల్ల ఇంత విస్తృతమైన విషయాల్లో ఏదైనా ప్రశ్నించేవారికి సులభమే, కానీ జవాబు చెప్పే వాళ్లకు లోతైన అధ్యయనం ఉండాలి. హిందూ మతంలోని కొన్ని బలహీనతలు, తప్పులను మాత్రమే ఫోకస్ చేస్తూ అది ప్రపంచానికి అందించిన తాత్విక దృష్టిని మరుగుపరచాలనుకొంటే అది సూర్యుణ్ణి గంపక్రింద దాచిపెట్టడమే అని గ్రహించాలి.
- డా.పి. భాస్కరయోగి
ఆంధ్రభూమి
Published Saturday, 17 September 2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి