హిందూ మతంపై అపోహలు 




పురుషసూక్తంలో చేసిన అలంకారిక వర్ణనను బూచిగా చూపిస్తూ కులతత్త్వం రెచ్చగొట్టడం ఎంత వరకు సబబు? మధ్యయుగాల్లో ముస్లిం రాజుల పాలన వల్ల పేరుకుపోయిన కులతత్త్వాన్ని రూపుమాపాల్సిన మనం కులం ఆధారంగా మనుషుల్ని విభజించి, పాలిస్తున్న శక్తులకు ఊతమిస్తున్నాం. కుటుంబాల మధ్య సౌహార్దానికి కులం గానీ వైషమ్యాలకు ఎంత మాత్రం కాదు. 

మతం అంటే మార్గం. ఆలోచనాపథం. ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్లు నడిచే త్రోవ. అందుకే 'వాడి మతం వాడిదే' అన్నమాట లోకోక్తిగా మారిపోయింది. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. మన భారతదేశంలో ప్రాచీనమైన మతాలుగా చెప్పబడే శైవ, శాక్తేయ, గణాపత్య, సౌర, వైష్ణవాలు కాగా, మధ్యలో వచ్చిన జైన, బౌద్ధాలు, సిక్కు.. ఆ తర్వాత దురాక్రమణతో, రాజకీయ అధికారంతో ప్రవేశించిన ఇస్లాం, క్రైస్తవాలు ప్రధానమైనవి. ముందు చెప్పిన షణ్మతాలే ఇవాళ హిందూ ధర్మానికి పునాదులుగా నిలబడగా జైన, బౌద్ధ, సిక్కు మతాలు హిందూ ధర్మ అనుయాయ మతాలుగా, అంతర్భాగాలుగా స్థిరీకృతమయ్యాయి.

హిందుత్వను మతం అనవద్దని, ధర్మం అని పిలవాలని పండితులు చెప్తారు. ఎందుకంటే ఎన్నో మతాలను ఇముడ్చుకొనే శక్తి దీనికున్నది; నదులన్నీ సాగరాన్ని చేరినట్టుగా పరమాత్మను చేరే వివిధ మార్గాలను ఈ మతం ప్రబోధించింది. అలాగే హిందూ ధర్మం ఒక వ్యక్తి చేత స్థాపించబడలేదు. ప్రత్యేకమైన ప్రవక్త దీనికి లేడు.

అట్లాగే హిందుత్వను సనాతన మతం అనీ, ఆర్యమతమనీ, వైదిక మతమనే పేర్లతో పిలుస్తారు. ఇదొక జీవన విధానం. ఈ విషయం సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది. అవిచ్ఛన్నంగా అమృతధారగా కొనసాగుతూ తత్త్వ జ్ఞానానికి భాండాగారంగా నిలిచింది. 'మతాలన్నీ మానవత్వాన్ని ప్రబోధించడానికే ఏర్పడ్డాయి' అని భావించే సంస్కృతి హిందువులది. మానవత్వం ఉండాల్సిన స్థాయికన్నా, ఎక్కువై అది స్వేచ్ఛగా రూపాంతరం చెందింది. ఆ స్వేచ్ఛ ఈ రోజు పరమత సహనం రూపంలో, దేశానికి, ధర్మానికి ఏం జరిగినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే దుస్థితికి దిగజారింది.

ఇటీవలి కాలంలో కుహనా మేధావులు విదేశీ శక్తులతో కలిసి, కుట్రపూరిత సిద్ధాంతాలను వల్లెవేస్తూ హిందుత్వంపై విషం చిమ్ము తున్నారు. అందులో ప్రధానంగా ఆర్య-ద్రావిడ సిద్ధాంతం ఒకటి. ఆర్య శబ్దం గొప్పవారు అనే అర్థం సూచించేదేకానీ మరోటికాదు. శ్రీమద్రామాయణంలో కోసల దేశంలో పుట్టిన రాముణ్ణి సీత ఆర్య పుత్రా! అని సంబోధిస్తుంది.

లంకను పాలించే రావణుణ్ణి మండోదరి కూడా ఆర్య పుత్రా! అని సంబోధిస్తుంది. మరి ఆర్య-ద్రావిడ వర్గాలేమిటో వీళ్ళ ఎర్ర మస్తిష్కాలకే తెలుసు. అలాగే దళితులు-వారి సమస్యలు భారతదేశం అంతటా ఒకే పరిస్థితుల్లో ఉన్నాయా? లేవా? ఆర్య దళితులు, ద్రావిడ దళితులు వేర్వేరుగా ఉన్నారా? విదేశీ చరిత్రకారులు వండి వార్చిన సిద్ధాంతాలను వడ్డించే బాధ్యతను తీసుకొని ఇక్కడి వైదేశిక మానసిక శక్తులు ఈ యాభై ఏళ్ళలో ఆర్య-ద్రావిడ సిద్ధాంతానికి కావలిసినంత రంగు అద్దాయి. ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించే పనిలో ఉన్న ఈ సంస్థలకు ఇదొక ఆయుధం. వీటికి విదేశీ నిధులు మానవహక్కుల సంస్థల పేరిట, ప్రజాస్వామ్యసంఘాల పేరిట కావలసినన్ని అందుతున్నాయి.

దళిత వాదం పేరిట ఇటీవల కొందరు భ్రష్ట మేధావులు పదవుల కోసం, పదిమందిలో పేరు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. బలి చక్రవర్తి, రావణుడు, నరకుడు 'మా వాళ్లు' అనీ, హిందూ దేవీ దేవతలు వాళ్ళను చంపి పండుగలు చేస్తున్నారని అజ్ఞానపు రాతలు రాస్తున్నారు. పురాణం ముఖం చూడని ఇలాంటి రాతల వల్ల జాతిని చీల్చాలన్నదే వారి కుట్ర.

శంభూకుడి కథను రామాయణంలో ఉదాహరణగా చూపిస్తూ రాముణ్ణి అధార్మికుడిగా ప్రచారం చేయాలని సంకల్పించడం సూర్యుని ముఖం మీద దుమ్ము పోయడమే.

'కులమొక కుట్ర-దాని పడగొట్ర' అన్న సిద్ధాంతం చేయాల్సిన విద్యావంతులు కులంపేరుతో సమాజాన్ని చీల్చివేస్తున్నారు. ఆత్మాభిమానం కలిగిస్తున్నామనుకొనే ఈ మేధావులు జాతిని ముక్కలు ముక్కలుగా చేయాలనే విదేశీ శక్తుల సంకల్పానికి ఊపిరి అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యక్తుల, పార్టీల, వర్గాల, గ్రూపుల మధ్య ఉండే అనేక రాజకీయ వర్గాల వైరాల కారణాల వల్ల జరిగిన హత్యలకు హిందుత్వంపై నెపం వేసి సంబరపడిపోతున్నారు. వేలయేళ్లనాడు మనువు రాసిన స్మృతిపై వాళ్ల అక్కసును అప్పుడప్పుడూ వెళ్ల గక్కుతారు.

యాభై ఏళ్ల క్రితం ఉన్న సమాజ స్వరూపమే ఈ రోజు పూర్తిగా మారిపోయింది. ఆహార్యం, ఆహారం, ఆచారం, ఆచరణ వేటిలోనైనా హిందువుల్లో వచ్చిన సంస్కరణ ప్రపంచంలో ఏ జాతిలో రాలేదు. అలా రావడానికి ప్రధానంగా హిందువులకు సనాతనంగా వస్తున్న తత్త్వ చింతన. బాహ్య విషయాలకే ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఆంతరికమైన విజ్ఞానమే మనకు అలంకరణం అనే గొప్ప భావం ఈ జాతిలో జీర్ణించుకుపోయింది.

అరవై ఏళ్ళ క్రితం రాసుకొన్న రాజ్యాంగానికి ఇంతవరకూ 112 సవరణలు చేసుకొన్నాం. వేల యేళ్ళ నాడు రాసిన మనుస్మృతిని ఎన్ని మార్లు సంస్కరించాలో ఆలోచించవలసిన అవసరం లేదా? పోనీ... అసలు మనుస్మృతి చదివిన హిందువులు ఎంత మంది? భక్తి, జ్ఞాన, యోగాలకు తత్త్వభూమిక అయిన భగవద్గీతనే చదివే తీరికలేని హిందువులు మనుస్మృతి చదివి ఇతర జాతులపై యుద్ధాలు చేస్తున్నారా? ఎంత మూర్ఖపు వాదన! విదేశీ పండితులు ఎందరో ఈ సాహిత్యంలో వేలుపెట్టి, ప్రక్షిప్త -ప్రక్షేపాలను చొప్పించారు.

ఉదాహరణకు వరరుచి నిఘంటువు ఉన్నంత వరకూ అంటే ఎనిమిదవ శతాబ్దం వరకూ హిందూ సంస్కృతి, సాహిత్యానికి దెబ్బతగలలేదు. జైనుడైన అమరసింహుడు వచ్చిన తర్వాత (చాలామంది సంప్రదాయ పండితులకు కూడా నా మీద కోపం రావచ్చు) మన సాంస్కృతికపదాలకు భ్రష్టత్వం వచ్చింది. మందిర శబ్దానికి ఇల్లు -గృహం అనేవి అర్థాలుగా వచ్చాయి. అంతకు ముందు 'మందిరం' కేవలం దేవతలకు సంబంధించినదనే అర్థంలో వాడేవారు.

ఇవాళ చీరల దుకాణానికి, చెప్పుల దుకాణానికి కూడా మందిర్ పేరు తగిలించి పెట్టుకొంటున్నారు. ఇతర మతాల ప్రార్థనా మందిరాల పేర్లతో ఇలాంటివి సాధ్యమా? పురుషసూక్తంలో చేసిన అలంకారిక వర్ణనను బూచిగా చూపిస్తూ కులతత్త్వం రెచ్చగొట్టడం ఎంత వరకు సబబు? మధ్యయుగాల్లో ముస్లిం రాజుల పాలన వల్ల పేరుకుపోయిన కులతత్త్వాన్ని రూపుమాపాల్సిన మనం కులం ఆధారంగా మనుషుల్ని విభజించి, పాలిస్తున్న శక్తులకు ఊతమిస్తున్నాం. కుటుంబాల మధ్య సౌహార్దానికి కులం గానీ వైషమ్యాలకు ఎంత మాత్రం కాదు.

కులం అనే వల వేసి బ్రతికే రాజకీయ నాయకులు, హిందుత్వకు వ్యతిరేక పుస్తకాలు రచించి అంతర్జాతీయ అవార్డులు కొట్టేసే అధమస్థాయి రచయితలు కులాన్ని 'సజీవం' చేస్తున్నారు. దళిత క్రైస్తవులపేరుతో కొందరు ఇటీవల మాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలని అంటున్నారు. ప్రపంచంలో ఎవ్వరికైనా పుట్టుకతో కొన్ని సంక్రమిస్తుంటాయి. అవి కులం, మతం, ప్రాంతం, తల్లిదండ్రులు... వీటిని ఎవ్వరూ మార్చలేరు.

కానీ ఇందులో ఉండే ఆర్థిక వ్యత్యాసాలను మన ప్రయత్నం ద్వారా మార్చవచ్చు. రాజ్యాంగవేత్తలు హిందూ మతంలో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని సంకల్పించి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కల్పించారు. దళితుల రాజ్యాంగబద్ధ హక్కును హరించాలనే దురూహతో ఇటీవల కొందరు మేధావుల పేరుతో చెలామణీ అవుతూ, నాయకులను ఓట్ల కొరకు లొంగదీసుకొని, మతం మారిన క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని తెలిసినా పదే పదే లేవనెత్తి రాజకీయ అంశంగా తయారు చేస్తున్నారు.

మతం మారినప్పుడు కులం ఎందుకు మారదు? అలాగే మతం పేరిట రిజర్వేషన్ వద్దనే రాజ్యాంగ మూల భావనను విస్మరించి ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని భ్రమలు కల్పించి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారు. దేశవిభజన జరిగినప్పుడు 18 శాతం జనాభా, 32 శాతం భూమి కోల్పోవడం జరిగింది. ఇంకా తాయిలాలతో దేశాన్ని ఇంకెన్ని ముక్కలు చేస్తారు? కులాన్ని, మతాన్ని ఓట్లకోసం ఉపయోగించే కుయుక్తులు నశించే పోరాటాలు రావాల్సిన అవసరముంది.

హిందుత్వ అనగానే బ్రాహ్మణిజం అంటూ మండిపడే మరో వర్గం, దేశంలో చైతన్యంగానే పనిచేస్తున్నది. హిందువులు కేవలం బ్రాహ్మణులా? హిందూమతం అంటే బ్రాహ్మణుల సంప్రదాయా లా? వీళ్లలో స్పష్టత లేదు. అసలు బ్రహ్మ శబ్దానికి అర్థం తెలియని లౌకికవాదులు బ్రాహ్మణ కులతత్త్వాన్ని హిందుత్వగా ప్రచారం చేస్తూ, వీళ్లు అనుకొనే-సంబోధించే నిమ్న కులాలను హిందుత్వం నుంచి దూరంచేయాలని చూస్తున్నారు. 

విశ్వకుటుంబ భావన (వసుధైవ కుటుంబం), మానవత్వ భావన (ఆత్మైక దృష్టి), అందరిలో భగవంతుణ్ణి చూసే (ఈశావాస్య మిదం సర్వం) 'భావన' హిందుత్వ ప్రత్యేక లక్షణాలు. భారతదేశంలో అహింస వంటి గొప్ప సిద్ధాంతాలను వ్యాప్తిలోకి తెచ్చింది జైనం. జైన తీర్థంకరులు క్షత్రియులు. శ్రీరాముడు క్షత్రియుడు. 

వ్యాసుడు, వాల్మీకి నిమ్నకులాలకు ప్రతీకగా వచ్చి గ్రంథరచన చేశారు. స్వామి వివేకానందుడు కుల బ్రాహ్మణుడు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉపనిషత్ వాఙ్మయాన్ని వైదిక ధర్మ ప్రతీకగా ప్రబోధించి హిందుత్వను విశ్వజనీనం చేశాడు. ఉపనిషత్ వాఙ్మయం అంతా ఆత్మతత్వాన్ని ప్రవచించిందే. అం దులో స్త్రీలకు ప్రధాన పాత్ర ఉంది. ఈ దేశంపై భౌతికంగా ఇస్లామిక్ తీవ్రవాదం, మావోవాదం ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నాయి.

ఈ రెండింటికీ పాకిస్థాన్, చైనా ప్రోద్భలం ఉంది. క్రైస్తవుల దృష్టి భారత్‌పై పడింది. అందుకే కుప్పలుతెప్పలుగా నిధులు వెదజల్లుతూ, భారత్‌లోని కుల, రాజకీయ, సామాజిక పరిస్థితులను ఆధారం చేసుకొని మతమార్పిడికి పాల్పడుతూ దైవనిర్ణయాన్ని హననం చేస్తున్నారు. అమెరికా, రష్యాల్లో చర్చిలు అమ్మకానికొస్తే వాటిని కొని ఇస్కాన్ సంస్థ కృష్ణ మందిరాలు ఏర్పాటు చేస్తున్నది. (ఇది భరించలేకే రష్యాలోని ఓ చర్చి భగవద్గీతకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసింది).

కేరళను 'దేవభూమి'గా చెబుతూ క్రైసవాన్ని విశృంఖలంగా ప్రచారం చేస్తున్నారు. దేశ రాజకీయ పరిస్థితులు, నాయకుల ప్రవర్తన వాళ్లకు బలాన్ని సమకూరుస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నా ఈ దేశంలోని 85శాతం హిందువులు నిశ్శబ్దంగా గమనిస్తున్నారు (మరే దేశంలో అయినా విప్లవం వచ్చేది). ఈ దేశాన్ని ముక్కలుచేసే కుటిలయత్నం రకరకాలుగా జరుగుతూనే ఉంది.

- డాక్టర్ పి.భాస్కరయోగి
ఆంధ్రజ్యోతి  04-09-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి