•  పరిస్థితులు అనుకూలంగా లేకున్నా ఆయన ప్రసంగం చాలా శక్తివంతంగా ఉంటుంది! మోదీ మాటల మాంత్రికుడు!
– ఎన్‌.సి.పి. నేత శరద్‌ పవార్‌
 శరద్‌ పవార్‌ గారూ.. ఇంతకీ ఏమిటి మీ భావం..? అవి తిట్లా లేక పొగడ్తలా..?
  •  దిగ్విజయ్‌సింగ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకే కాంగ్రెసు సభ్యులు నిరసన తెలిపి బయటకు వెళ్లారు.
– తెరాస నేత గువ్వల బాల్‌రాజ్‌
 పార్టీ పనులన్న పరమార్థమేదన్నా..!
  • నల్లధనం ఏదీ ? ఉగ్రవాదం అంతరించిందా ? నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం! 55 రోజులు గడుస్తున్నా తీరని కష్టాలు! మోదీజీ ఏం సాధించారు!
-టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
 మీరు 55 ఏళ్ళు పాలించినా ఈ దేశానికి ఏమీ చెయ్యలేకపోయారు! అవతలి వాళ్లు 55 రోజుల్లోనే అన్నీ చెయ్యాలి! ఏం నీతి ఉత్తమ కుమారా! గురివింద సామెత ఇందుకే పుట్టి ఉంటుంది!
  •  సామాజిక మార్పు చాలా సంక్లిష్టమైనది. కఠినతరమైనది. మద్యనిషేధం అమలు కోసం నితీశ్‌ కుమార్‌ కృషి శ్లాఘనీయమైనది. నీతీశ్‌ అందరికీ ఆదర్శం.
– ప్రధాని నరేంద్రమోదీ
 మోదీజి! మంచి పనిని ఎవరు చేసినా మెచ్చుకోవటంలో మీకు మీరే సాటి.
  •  మెజారిటీ శాసన సభ్యుల మద్దతు ఉన్న మాదే అసలైన సమాజ్‌వాదీ పార్టీ. మేం సైకిల్‌ గుర్తుతోనే పోటీ చేస్తాం. ములాయం ఆశీస్సులలతో ముందుకు పోతాం!
– యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌
 తొడ గిల్లి జోల పాడడం అంటే ఇదే! సైకిల్‌కు రెండు చక్రాలుంటాయి. ఒకటి మీరు, మరొకటి నాన్న – బాబాయ్‌లకి! అలా పంచుకోవడం ఉత్తమం. మరి నాన్న ఆశీస్సులు అబ్బాయికా! బాబాయికా!
  • నోట్ల రద్దు తర్వాత అన్నీ యూటర్న్‌ లే. అచ్చేదిన్‌ రాలేదు కాని, చచ్చేదిన్‌ వచ్చాయ్‌. నియంతలను పారద్రోలేంత వరకు నిద్రపోం. మోదీ తుగ్లక్‌..!
– టిపిసిసి ధర్నాల్లో కాంగ్రెసు నేతల వ్యాఖ్యలు
 మీది అవినీతి హైవే. అది ముందుకు సాగడమే తప్ప వెనక్కి మళ్లదు. ‘మీకు విశ్రాంతి అవసరం’ అనే ఉద్దేశ్యంతోనే ప్రజలు మోదీకి అధికారం ఇచ్చారు. మీరు ప్రజల మాట విని విశ్రాంతి తీసుకోవడమే మంచిది.
  •  మన పార్టీ వాళ్లకు (బిజిపి) లంచం డబ్బులు తీసుకోవడం కూడా తెలియదు. ఏ కాగితంపై సంతకం పెట్టమన్నా పెట్టేస్తారు.
– మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే
మీ పార్టీ వాళ్లకు తెలియనివి చాలా ఉన్నాయమ్మా తల్లీ! లంచాలు తీసుకోవడం తెలియదు, అవినీతి చేయటం తెలియదు, కుట్రలు.. కుతంత్రాలు తెలియవు. రాజకీయంగా ఇతరులను అణచివేయటం తెలియదు. ప్రజలను చక్కగా పరిపాలించడం తప్ప. అందుకే ప్రతిపక్షాలు ఇంతలా గోల చేస్తున్నాయి..!
  •  ప్రజలకు చట్ట సభలపై అవగాహన కల్పిస్తాం
– స్పీకర్‌ మధుసూదనాచారి
 స్పీకర్‌గారూ! ప్రజలకు చాలా అవగాహన ఉంది కాబట్టే మిమ్మల్ని చట్ట సభలకు పంపించారు. మొదట ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించండి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్లకే రాజ్యాంగ విలువలు తెలియకపోతే ఎలా..! 
– డా||పి.భాస్కరయోగి  మాటకు మాటవిశ్లేషణ జాగృతి 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి