సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భూ సర్వేను అధికారులు నైతికంగా తమ భుజస్కంధాలపై వేసుకొని సరైన పద్ధతిలో అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా నిర్వహించాలి. వీలైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని తెలుగు పండితులను ఇందులో భాగస్వాములను చేసి తప్పుల తడకల్లేని రికార్డులను సిద్ధం చేయాలి. పహాణి, పాస్‌బుక్, టైటిల్ డీడ్‌లో అవసరం లేని కాలమ్స్ తీసివేసి ఆధునికంగా రూపొందించాలి. 

దేశంలోనే సామాజిక సంక్షేమం కోసం వినూత్న పథకాలతో ముందుకెళ్తున్న కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనకు రుగ్మతల్లా పట్టిన వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాలనే సంకల్పం తో ముందుకు వెళ్తున్నది.

ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ సమగ్ర భూ సర్వే చేయాలన్న అవసరాన్ని గుర్తించారు. చిన్నచిన్న భూ కమతాల్లో, అనేక వివాదాలకు నెలవుగా ఉన్న భూ రికార్డుల గందరగోళం అధికారుల సమయాన్ని హరిస్తున్నది. మనుషుల్లో అనేక వైషమ్యాలకు దారితీస్తున్నది.
భూ రికార్డుల్లో అయోమయానికి ప్రధానకారణం అవినీతి అయితే, అధికార యంత్రాంగ అలసత్వం, చట్టాల్లోని లొసుగులు, శాఖల మధ్య సమన్వయ లోపం, ప్రజల నైతిక విలువల్లో లోపం ఇతర కారణాలు. గతంలో ఒక కాగితం రాసేటప్పుడు సూర్యచంద్రుల సాక్షిగా అన్న ఒక్కమాట సాక్షుల అవసరం లేకుండా మనుషుల మధ్య నైతిక బంధంగా పనిచేసేది. ఇప్పుడెంత భూమి, ధనం ఉన్నా మనుషులకు శాంతి లేక రోజు రోజుకు వివాదాలు పెంచుకుంటున్నారు. 

ఉదాహరణకు ఇద్దరన్నదమ్ము ళ్లు గతంలో ఎప్పుడో భూమి పంచుకున్నప్పుడు పెద్దల సమక్షంలో వ్యవసాయం చేసుకునే తమ్ముడు తాను లోపలివైపు భూమి తీసుకోగా, ఏదైనా కులవృత్తే కదా అని అన్న రోడ్డు పక్కన తీసుకున్నాడు. ఇప్పుడు రోడ్డు వైపు భూమికి డిమాండ్ రావడంతో ముప్ఫై ఏండ్ల తర్వాత తమ్ముడు కోర్టుకు ఎక్కుతున్నాడు.1950లో వచ్చిన రక్షిత కౌలుదారు చట్టం (పీటీ యాక్ట్) భూస్వాముల అధిక భూమిని సీలింగ్ చేయాలనే సదుద్దేశంతో చేశారు. పట్వారీ లు భూస్వాముల భూములను వాళ్ల ఆధీనంలోనే ఉంచడానికి వారి దగ్గర పనిచేసేవాళ్ల పేర్లే ఎక్కువ కౌలుదారు కాలంలో రాశారు. ఎక్కువగా ఇలా గే జరుగడం వల్ల డ్బ్భై ఏండ్ల తర్వాత వారి వారసుల పేరుతో పీటీ హక్కులతో కోర్టుకు ఎక్కుతున్నారు. రెవెన్యూ ఆఫీసుల్లో మేనేజ్ చేసి దొంగ పత్రాలను సృష్టించి వారి వారసులమని ఈరోజుకూ కోర్టుల్లో కేసులు వేసేవారు, వేయించే బినామీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎక్కువయ్యారు. దీనివల్ల రెవెన్యూ అధికారుల, కోర్టుల సమయం చట్టపరంగా వృథా అవుతున్నది. కనీసం ఈ భూ సర్వేకు ముందు సీఎం కేసీఆర్ ఈ చట్టానికి సవరణలు చేయాలి. అట్లయితే అనవసర వివాదాలు తగ్గుతాయి.

రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఆఫీసులకు అనుబంధం లేకుండా ఎవరికి వారు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. భూమి కొన్న తర్వాత కర్ణాటక మాదిరి మ్యుటేషన్ విధానం ఉండాలి. రెవెన్యూ అధికారులు నిజాయితీగా ఉం టేనే మ్యుటేషన్, పట్టా మార్పిడి సరిగా జరుగుతుంది. లేకపోతే ఎన్ని సర్వే లు చేసినా ఎక్కడి గొంగడి అక్కడే ఉంటాయి. 1984కు పూర్వం పహాణి లు పట్వారీ ఆధీనంలో ఉండేవి. అప్పుడు వారి అరాచకాలు కొన్ని ఉన్నా రికార్డులు పక్కగా ఉండేవి. తర్వాత పహాణీలు అష్టవంకరలు తిరిగాయి. డబ్బుకు అలవాటు పడ్డవాళ్ళు ఏది పడితే ఆ కాగితం సృష్టించడం మొదలుపెట్టారు. రికార్డులన్నీ గందరగోళంలో పడి అనేక అపభ్రంశపు సంఘటనలు రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్నాయి. గత పాలకులు ఇదంతా విస్మరించడం వల్ల ఇది రాచపుండులా తయారైంది. చాలామంది గ్రామ రెవెన్యూ అధికారులకు భాషా పరిజ్ఞానం లేకపోవడం, పై అధికారుల భయం లేకపోవడం వల్ల రికార్డు నిర్వహణ ఒక ప్రహసనంగా మారిపోయింది. 

మళ్లీ వాటిని సరిచేయడానికి చట్టపరంగా అనేక అవరోధాలు ఉం డటం వల్ల అవినీతితో వాటిని అధిగమించాలని భూ యజమానులు, అధికారులు ప్రవరిస్తున్నారు.కాబట్టి ఇప్పుడు గ్రామస్థాయి నుంచి ఆర్డీవో స్థాయి వరకు సాంకేతిక పరిజ్ఞానం, భాషా పరిజ్ఞానం ఉన్నవాళ్లనే నియమించాలి. తప్పులు రాయ డం కూడా పెద్ద ఎత్తున అవినీతికి, వివాదాలకు తావునిస్తుంది. అలాగే నిష్ణాతులైన ఐటీ నిపుణులతో మంచి సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసి రికార్డుల మాయాజాలానికి చరమగీతం పాడాలి. అలాగే ఎన్నో పనుల్లో తలమునకలై ఉంటూ ప్రతి శనివారం రెవెన్యూ కేసుల పరిష్కా రం చేస్తున్న ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ల న్యాయ విచారణ పారదర్శకంగా చేయాలి. వాళ్లపై ఉన్నతాధికారుల, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చూడాలి.మండల పరిధిలోని తహసీల్దార్లకు అపరిమిత అధికారులను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలకు, అవినీతికి చట్టంలోని లొసుగుల ద్వారా తమ పని కానిస్తున్నారు. అలాగే మ్యుటేషన్ చేసేటపుడు చాలా నిర్లక్ష్యంగా చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. పట్టా మార్పిడి కోసమే భాషా పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం రెండూ అపారంగా ఉన్న వ్యక్తిని రెవెన్యూ కార్యాలయంలో బాధ్యుడిగా ఉంచాలి. రెవెన్యూ అవగాహనలో నైపుణ్యం ఉన్న కమిటీ ఒక టి జిల్లా స్థాయిలో ఉండాలి. అదే సమయంలో సామాన్యుడికి ఎలాంటి సమస్య లేకుండా విధానాలు ఉండాలి.

లంచాలకు మరిగిన కొందరు రెవెన్యూ అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ వక్రభాష్యం చెబుతూ నిజమైన సమస్యలను జటిలం చేస్తున్నారు. తద్వారా లంచం ఇస్తేనే పని అవుతుందనే సందేశం ఇస్తున్నారు. తమ అనుచరుల ద్వారా అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. అధికారుల దుర్నీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా మొత్తం వ్యవహారం జరుగాలి. ప్రైవేట్ సంస్థల్లో తమ వ్యవస్థకు దెబ్బ తగులకుండా ఉద్యోగులు ఎలా బాధ్యతలు నిర్వహిస్తున్నారో రెవెన్యూ శాఖలో అలాంటి ప్రక్షాళన జరుగాలి.

భూ రికార్డుల్లో అర్థం కాని పదాలు తొలిగించాలి. అలాగే సర్వే నంబర్లకు ఇచ్చే ఉప సంఖ్యలను, అక్షరాలను సాంకేతికంగా సరిగ్గా ఉండేట్లు నిర్ధారించాలి. ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు వేరే సీక్వెన్సులో ఉండా లి. అనేక పొలాల మధ్య నుంచి రోడ్లు విస్తరించినపుడు భూమి రోడ్లు, భవనాల శాఖ తీసుకుంటున్నది. దానికి భూ యజమానులకు నష్ట పరిహారం చెల్లిస్తున్నది. కానీ రికార్డుల్లో అది అలాగే కొనసాగడం వల్ల కొత్త పట్టాదార్లు లేదా భూమి మొత్తం అమ్మిన వ్యక్తులే రికార్డుల్లో మిగిలిన భూముల కోసం కేసులు, వివాదాలు సృష్టిస్తున్నారు. రోడ్లు, భవనాలు, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ వివాదాలకు కారణం.

అలాగే దస్తావేజు లైసెన్సు ఉన్నవాళ్లు ఎక్కువ పని ఒత్తిడితో కంప్యూట ర్లో కాపీపేస్ట్ దస్తావేజులు రాస్తున్నారు. రిజిస్ట్రర్ కార్యాలయంలో పని ఒత్తిడి వల్ల వాటిని సరిచూడకుండా అలాగే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అవ న్నీ రెవెన్యూ అధికారిక కార్యాలయంలోకి వెళ్లి అనేక భూ వివాదాలకు కారణమవుతున్నాయి.
 
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భూ సర్వేను అధికారులు నైతికంగా తమ భుజస్కంధాలపై వేసుకొని సరైన పద్ధతిలో అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా నిర్వహించాలి. వీలైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని తెలుగు పండితులను ఇందులో భాగస్వాములను చేసి తప్పుల తడకల్లేని రికార్డులను సిద్ధం చేయాలి. పహాణి, పాస్‌బుక్, టైటిల్ డీడ్‌లో అవసరం లేని కాలమ్స్ తీసివేసి ఆధునికంగా రూపొందించాలి. ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు భూ సంబంధమైన ముఖ్యంగా పట్టా మార్పిడి రికార్డులు ఉన్నతాధికారులు పరిశీలించాలి. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణులను కూడా ఇందుకోసం వాడుకోవాలి. 

పేదల సంక్షేమం ప్రధానమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా, రికార్డుల ప్రక్షాళన జరుగాలె.

డాక్టర్. పి. భాస్కర యోగి 
నమస్తే తెలంగాణ 01-09-2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి