• పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఫెయిల్‌, లోక్‌సభలో స్పీకర్‌ విఫలం, నడపలేనప్పుడు సభను వాయిదా వేయండి.
    • – భాజపా అగ్రనేత అద్వాని
      భీష్మాచార్యా! మీ పార్టీ వాళ్లకు ఇంకా రాజకీయాలు ఒంటబట్టలేదు. ఎదుటివారిని ‘డిఫెన్స్‌’లో పడేయడం మీ వాళ్లకు మీరు నేర్పించలేదు. గోబెల్స్‌ ప్రచారం చేయడంలో కమ్యూనిస్టులు, గోక్కొని కొట్లాడటంలో కాంగ్రెసు వాళ్లు సమర్థులు..!!
      •  చివరకు అందమైన దేహం భూమి పాలు కావల్సిందే! లేదా అగ్ని పాలు కావల్సిందే. అస్థికలన్న గంగ పాలు.. ఈ జీవమంత యముని పాలు.. మనం చేసే తప్పులకు చాలామంది యమునికి దగ్గరగా పోతామేమో?
      – జయలలిత అంత్యక్రియలకు వెళ్ళొచ్చిన హరీశ్‌రావు వైరాగ్యం
      హరీషన్నా ! వైరాగ్యాలు మూడు రకాలు. స్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం. పిల్లల్ని కన్నతల్లి నవమాసాలు పడిన బాధను తట్టుకోలేక వద్దు బాబూ ఈ సంతానం అనుకుంటుందట, ఇది ప్రసూతి వైరాగ్యం. పురాణాలు విన్నాక ఈ జీవితం భగవంతుడిదా అనిపించి కలిగేది పురాణ వైరాగ్యం. ఎవరైనా మరణించిన తర్వాత స్మశానానికి వెళితే కలిగేది స్మశాన వైరాగ్యం. ప్రస్తుతం మీకు కలిగింది ఇదే. మళ్లీ రోజువారి కార్యక్రమాలు మొదలు పెట్టండి. మామూలవుతుంది.
      • సిఎం సీటులో చినజీయర్‌ స్వామిని కూర్చోబెట్టడంతో అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి.
      – తెదేపా నేత రేవంత్‌ రెడ్డి
      కూర్చొంటే మాత్రం ఆయన అట్టి పెట్టుకొన్నాడా! మాట తప్పిన నాయకులు కూర్చోగా లేనిది సర్వసంగ పరిత్యాగి ఒక్క నిమిషం కూర్చుని లేస్తే ఎందుకు అభియోగం ? రాజకీయమంటే కలపడం. విడదీయటం కాదు. తెలుసుకోండి రేవంత్‌గారూ..
      •  పార్లమెంట్‌ ఉన్నది చర్చించడం కోసం. ప్రదర్శనలు మరెక్కడైనా చేసుకోండి. దయచేసి ఇక్కడ మీ కర్తవ్యం నిర్వహించండి !
      – రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ
      మనదేశంలో కొన్ని ప్రతిపక్షాలు చివరకు గౌరవనీయ రాష్ట్రపతి చేత కూడా గడ్డి పెట్టించుకునే స్థితికి దిగజారాయి.
      •  కేంద్రప్రభుత్వం నానాటికీ పెట్టుబడిదారీ వ్యవస్థగా (క్యాపిటలిస్ట్‌) మారుతోంది.
      – బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ
      మీకూ కమ్యూనిష్టుల ‘పడికట్టు పదాలు’ అలవాటయ్యాయి. ఇక వారికి మీకు తేడా ఏముంది ? ముతకచీరలు కట్టినంత మాత్రాన పేదల పక్షం అవుతారనుకోవడం భ్రమ కదా దీదీ !
      •  నేను ముఖ్యమంత్రినవుతా.. ఆర్‌కె నగర్‌ నుంచి పోటీ చేస్తా..
      – తేల్చిచెప్పిన శశికళ
      దీనినే ‘శవ రాజకీయం’ అంటారు. శవం ఉన్నంతవరకే కన్నీళ్లు! ఆ తర్వాత అందరూ అధికార వ్యామోహంలో పడేవారే !
      • నేను మాట్లాడితే భూకంపమే.. నోట్ల రద్దు భారీ కుంభకోణమే.. !
      – కాంగ్రెసు నేత రాహుల్‌గాంధీ
      రాహుల్‌ భాయ్‌ ! ఇటీవల జయలలిత చావుకు వెళ్ళి గులాంనబీ ఆజాద్‌తో జోకులేసుకొని నవ్వుకొన్న తమరు, శవ సంస్కారంలో నమస్కరించడానికి వెళ్లి చెప్పులు విప్పాలని ఎవరో సూచిస్తే గాని తెలియని మీరు భూకంపం పుట్టిస్తారా? మీరున్న 60 ఏళ్ళలో ఎన్ని స్కాములు జరిగాయో. ముందు ఆ వివరాలు తెలుసుకోండి. లేదంటే మీ కాళ్ళ కిందే భూకంపం రాగలదు.

      – డా||పి.భాస్కరయోగి  మాటకు మాటవిశ్లేషణ జాగృతి 


      కామెంట్‌లు లేవు:

      కామెంట్‌ను పోస్ట్ చేయండి