– నిజాం మన రాజు. నిజాం మన చరిత్ర. నిజాం మన ఘనత. తెలంగాణ చరిత్ర తిరగరాయిస్తాం. ఆంధ్రపాలకులు వక్రీకరించారు. దేశం దివాలా దీస్తే నిజాం బంగారం ఇచ్చారు. ఇష్టమున్నా లేకున్నా వాస్తవాలు ఒప్పుకోవాల్సిందే. ముస్లింలకు 12 శాతం కోటా ఇచ్చి తీరుతాం.

– సిఎం కెసిఆర్‌
– అంటే ‘ఈ నిజాం నవాబు జన్మజన్మల బూజు’ అని పద్యమల్లిన దాశరథి కృష్ణమాచార్యులు; మోదుగుపూలు రాసి తెలంగాణ సాయుధ పోరాటంలో జైలుకెళ్లిన రంగాచార్య; నిజాం మోచేతి నీళ్లు తాగి ప్రజలను పీడించిన విసునూరి దొర గుండెల్లో దడపుట్టించిన చాకలి ఐలమ్మ పోరాటం; జల్‌-జంగల్‌-జమన్‌ కోసం ప్రాణాలర్పించిన కొమరం భీం; వెయ్యి ఊడల మర్రి క్రింద ప్రాణం వదలిన రాంజీ గోండు; నిజాంకు వ్యతిరేకంగా రచించిన వార్తలతో ప్రాణం పోగొట్టుకొన్న షోయబుల్లాఖాన్‌ల త్యాగాలు మూసీనదిలో కలిపేయాలన్న మాట. ఒకప్పుడు మీరే పేర్కొన్న ‘పాతబస్తీ పిడికెడంత పార్టీ’ చెవులకు ఆనందం కలిగించడానికి చరిత్రను తారుమారు చేస్తారా? అయినా తెలంగాణ వాళ్ళే అయిన మందుముల నర్సింగరావు, మాడపాటి హనుమంతరావు, వెంకటరామారావు, వందేమాతరం రాంచందర్‌రావు, డా||కసిరెడ్డి రాసిన చరిత్రల్లో కూడా నిజాంను దివ్యపురుషుడని పేర్కొనలేదే! అనవసరంగా బొందలో శవాలను లేపి ఎందుకు చరిత్ర హననానికి పాల్పడతారు !? మీ ‘బంగారు తెలంగాణ’ ఏదో మీరు సాధించండి !?
– ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయడంలో సిఎం విఫలం. వెంటనే 12 శాతం కోటా అమలు చేయాలి.
– కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
– ‘ఊరంతా ఓ చింత అయితే ఊసుకండ్లోడికి ఇంకో చింత’ అన్నట్లు మీకు తెలంగాణాలో ఇంకో టాపిక్‌ లేదా? ఒకర్ని మించి ఇంకొకరు ఛాంపియన్ల లాగా పోటీ పడుతున్నారు. అరవై ఏళ్ళ నుండి తమరు మైనార్టీలకు తాయిలాలు ఇస్తూనే ఉన్నారు. మరి వారెందుకు అభివృద్ధి చెందలేదు ? ఓటు బ్యాంకు రాజకీయాలు ఇకనైనా మానుకోండి.
– కెసిఆర్‌ను చరిత్ర మరువడు. తెలంగాణ ఉన్నన్ని రోజులు ఆయనను గుర్తుపెట్టుకొంటారు. ఆయన ముస్లింలకు దోస్త్‌.
– ఎం.ఐ.ఎం. నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసి
– వహ్వా.. వహ్వా.. ! క్యా బాత్‌ హై !
– నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. న్యాయ నిపుణులను సంప్రదించా. నియోజకవర్గాల పునర్విభజన అసాధ్యం.
– కాంగ్రెస్‌ నేత జానారెడ్డి
– క్యా ‘జాన్తా’ హై జీ !
– నల్లగొండ నియోజకవర్గంలో నాపై సిఎం కెసిఆర్‌ స్వయంగా నిలబడినా, కనీసం 50 వేల మెజార్టీతో గెలుస్తా.
– కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– గతంలో ‘బస్తీ మే సవాళ్ళ’ను కెసిఆర్‌ మీకు విసిరితే, ఇప్పుడు మీరు విసురుతున్నారన్నమాట ? బాగుంది వరస.
– దేశంలో హిందూ ఉగ్రవాదం ఎక్కువైంది.
– నటుడు కమల్‌ హాసన్‌
– అదే ఈ మధ్య ఎవరూ రావట్లేదేంటా అని ఆలోచిస్తున్నా. మీరొచ్చారు. కేజ్రీవాల్‌, మమత, రాహుల్‌, కన్హయ్య, కమల్‌హాసన్‌.. మీరంతా మోదీని తిట్టండి. ఉచితంగా ప్రచారం పొందండి.
– దేశ ఆర్థిక వ్యవస్థను లూటీ చేశారు. మతిలేని నిర్ణయాలతో కడుపు కొట్టారు.
– కాంగ్రెస్‌ నేత రాహుల్‌
– మీరేమో 2జి, 3జి, స్పెక్ట్రం, బొగ్గు, బోఫోర్స్‌ కుంభకోణాలు చేసి దేశ ధనాన్ని లూటీ చేశారు. మోదీ కోట్ల ఉద్యోగాలు కల్పించారు. ఇదేగా మీరు చెప్పాలనుకున్నది ! ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి.. ! సెభాష్‌ !?
– భారత్‌లో ముస్లింలు, క్రైస్తవులకు రక్షణ లేదు
– అమెరికా ప్రభుత్వం
– మీరేమో తీవ్రవాదులను వెతుక్కొంటూ ఇరాన్‌, ఇరాక్‌లపై దాడి చేస్తారు. ఇక్కడి ప్రభుత్వం తీవ్రవాద తండాలను, వారి మద్దతు దారులను కట్టడి చేస్తే అది మతస్వేచ్ఛను హరించడమా! గురివింద నీతులంటే ఇవే మరి!
– మార్క్సిజం ఓ సోషల్‌సైన్స్‌. దాన్ని మించిన సిద్ధాంతం లేదు. మరో పోరాటానికి కమ్యూనిష్టులు సిద్ధం కండి.
– సిపిఐ నేత నారాయణ
– అసలు మార్క్సిజం సోషలా! సైన్సా! ఏదో ఒకటి చెప్పండి. లేకుంటే ప్రజలు అదో సామాజిక విజ్ఞానం అనుకొనే ప్రమాదం ఉంది. ఇంకెన్నేళ్ళు పోరాటం చేస్తారు !?
– డా|| పి.భాస్కరయోగి  మాటకు మాట, విశ్లేషణ జాగృతి  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి