* కెసిఆర్ రైతు. ఆయనవి రైతు ఆలోచనలు.
– మంత్రి హరీశ్‌రావు
- అవును హరీశ్ భాయ్ ! ఆ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వ్యవసాయం, దాని రాబడి ఇజ్రాయిల్ వ్యవసాయం కన్నా మెరుగ్గా ఉందటగా !
* చిల్లర కాసుల్లో తలదూర్చి పరువు తీసుకొంటున్న కాంగ్రెస్.
– మంత్రులు ఈటెల, తుమ్మల
- టోకు కేసుల్లో తలదూర్చుదామంటే వాళ్ళ ప్రభుత్వం లేదు. ఏం చేయమంటారు ?!
* తెలంగాణకు మొదటి విలన్ ఆ పార్టీయే. వ్యాజ్యాలేసి అభివృద్ధిని అడ్డుకొంటారా ? తెలంగాణ బిడ్డలేనా వీళ్ళు ! నాడు నెహ్రూ తెలంగాణ గోస పోసుకొన్నాడు. ఇందిరాగాంధీ 400 మందిని కాల్చి చంపిచ్చింది. ఇక చచ్చిపోత అనుకొని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.
– సిఎం కెసిఆర్
- ‘మరి సోనియా.. 1300 మందిని బలిగొన్నది’ అంటారనుకొన్నా ! అయినా అంత మాట అన్నవేందన్నా! మనం తెలంగాణ బిడ్డలమా, కాదా ? అని అనుమానం కలిగేటట్లు చేస్తవా ! చరిత్రంతా చెప్తవా ! పోయినసారి కెటిఆర్ తిట్లకే ఇంకా రెమెడీలు కనుక్కోలేక కాంగ్రెస్ వాళ్ళ దిమ్మదిరిగి మైండు బ్లాక్ అయితే – మీ తిట్లతో మరింత గొంతు పిసుక్కుంటున్నరు గద సారూ !
* కొంచెం హుందాగా విచారించరూ..!
– కెసిఆర్‌కు బహిరంగ లేఖలో సినీ పరిశ్రమ విజ్ఞప్తి
- మీ విజ్ఞప్తి ‘బుల్లెట్ దింపు- కానీ రక్తం రావద్దు’ అన్నట్లుగా ఉంది.
* కేరళలో గడచిన 17 నెలల్లో 17 మంది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. రాజకీయ ప్రత్యర్థులను తాలిబన్ల తరహాలో హతమారుస్తున్నారు. ఇవన్నీ చూస్తే దేవుడి స్వస్థలంలా ఉండే కేరళ దేవుడు విడిచిపెట్టిన రాష్ట్రంలా మారింది.
– మీనాక్షి లేఖి, భాజపా నాయకురాలు
- ఇప్పుడు కేరళని ‘సైతాన్’ ఆవహించింది. ఏం చేస్తాం ! దాని దుమ్ము దులిపే గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు తెలిసిన మాంత్రికుని కోసం కేరళ ఎదురు చూస్తోంది.
* దేశంపై పట్టుకోసం మోది, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నం.
– రాహుల్‌గాంధి, కాంగ్రెస్ నేత
- కొంపదీసి మీకు ఇంకా ఈ దేశంపై పట్టుందని అనుకొంటున్నారా ఏంటి ?
* నియంతృత్వ ధోరణికి పాల్పడిన హిట్లర్‌ను కూడా కమ్యూనిస్టులు కాలగర్భంలో కలిపారు. కెసిఆర్‌కు గుణపాఠం ఖాయం.
– వామపక్ష నేతలు
- కాలగర్భంలోంచి మీరు బయటపడలేరు కానీ.. మందిని కాలగర్భంలో కలుపుతారు..!
* రాహుల్‌పై దాడి అమానుషం; పెట్రేగుతున్న విచ్ఛిన్నకర శక్తులు
– కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క
- యువరాజు బాగానే ఉన్నాడులే సార్. కెసిఆర్ తిట్టినప్పుడు రాని కోపాన్ని ఇప్పుడెందుకు ప్రదర్శిస్తున్నారు మీరు ?
* ఇంగ్లీషు వస్తేనే అమెరికా వీసా
– అమెరికా కొత్త వలస బిల్లు
- ఆంగ్లం వస్తేనే ఆ ‘మెరిక’ కు ప్రయాణం అన్నమాట.
* నియంతృత్వ పాలనే పాక్‌కు మేలు
– పర్వేజ్ ముషర్రాఫ్, మాజీ నియంత
- ఏం మళ్ళీ వచ్చి, నియంతృత్వం స్థాపిస్తావా ఏంటి ?!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి