ధర్మానికి ఎన్నిరకాల అర్థాలు చెప్పినా.. పురాణగ్రంథాల ప్రకారం ‘ఆచరించదగిన సిద్ధాంతం’ అనే తీసుకోవాలి. ఎవరు ధర్మాన్ని వదిలిపెట్టరో వారిని ధర్మం కాపాడుతుంది. ధర్మం మనిషిని తన మార్గంలో సక్రమంగా నడిపిస్తుంది. సమబుద్ధిని కలిగించి దివ్యయోగం వైపు నడిపిస్తుంది. పరమాత్మను నిరంతరం తలుస్తూ ‘ఈ తత్వం అతనిదే’ అనుకొన్నవాళ్లకు తమకంటూ ఏమీ ఉండదు. అదే యోగవిద్య. పురాణ, ఇతిహాస కథలు అలాంటి ప్రతీకలతో మనకు సందేశం ఇస్తాయి. ఉదాహరణకు.. కురుక్షేత్ర సంగామ్రం కన్నా ముందు పాండవులు శ్రీకృష్ణుని పాదాలవద్ద కూర్చున్నారు. దుర్యోధనుడు కృష్ణుడి పాదాలవద్ద కూర్చోవడం ఇష్టం లేక తల దగ్గరకు వెళ్లాడు. యుద్ధంలో ఆయుధం ధరించనని కృష్ణుడు చెప్పినా పాండవులు ఆయన్నే కోరుకున్నారు. పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టే భగవంతుడైన శ్రీకృష్ణుడి పాదాల చెంత కూర్చున్నారు. శ్రీకృష్ణుని తమవైపు ఉంచుకోవడం ద్వారా వారు ఓటమికైనా, విజయానికైనా సిద్ధపడే ఉన్నారు. ఒకవేళ వారికి ఓటమి కలిగినా ధర్మాన్ని విడిచిపెట్టని నిశ్చలతత్వం వారిలో ఉంది.
 
శ్రీకృష్ణుడు పాండవుల దృష్టిలో ధర్మస్వరూపం. ఆ ధర్మాన్ని పొందడానికి వారు ఎలాంటి అవమానాలనైనా భరిస్తారుగానీ అధర్మాన్ని అనుసరించరు. ఇలా పౌరాణిక గాథలన్నిటిలో ధర్మం-అధర్మం అనే రెండు వర్గాలను చూపి మానవజాతికి సందేశం ఇచ్చారు మన రుషులు. ఆ సందేశం ఆధ్యాత్మికంగా, ఆత్మగతంగా ఉంటుంది. దానిని తెలుసుకోలేనివారు వాటిని కథలుగానే భావిస్తారు. ధర్మం గురించి, పరమాత్మను గురించి తెలుసుకున్నవారు తమ శరీరం చిక్కిశల్యమైనా చింతించరు. ధర్మాన్ని ఆచరించే క్రమంలో తమ ప్రాణమైనా వదులుతారు. అపజయాన్ని కూడా లెక్కచేయని దృఢనిశ్చయం ఉంటుంది. ఎన్ని కష్టాలెదురైనా అధైర్యపడకుండా వారు ధర్మాచరణ చేస్తారు.

డాక్టర్ పి. భాస్కర యోగి 
నవ్య నివేదన ఆంధ్ర జ్యోతి 25-12-2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి