భారతీయ సంస్కృతిలో వనితామణులు
వెల: రూ.60/-
ప్రతులకు: ప్రొ.గోగినేని యోగ ప్రభావతీదేవి
జీ/్య. వి.వి.శేషగిరిరావు,
ప్లాటు నెం.41,
లక్ష్మీపురం కాలనీ
పోరంకి,
విజయవాడ-521 137
99080 73543

‘వాళ్లు ఆకాశంలో సగం అని కొందరు అంటారు కానీ, త్రివిక్రముడిలా అంతా పరచుకొన్న అమృతమూర్తులు - స్ర్తిలు’ అనేది మన భారతీయ సామాజిక, సాహిత్య చింతన ప్రతిపాదిస్తుంది. ఆధునిక కాలంలో అన్ని సాంకేతిక పరిజ్ఞానాలు వచ్చాక స్ర్తిలు గొప్పవాళ్లు అంటున్నది పాశ్చాత్య సంస్కృతి. కానీ వేదకాలంనాడే మంత్రద్రష్టల్ని చూసిన ధర్మం మనది. మరోసారి అలాంటి వేదకాలపు స్ర్తిల నుండి ఆధునిక చరిత్రకారిణి అచ్చమాంబ వరకు ద్రాక్షాపాక న్యాయంలో స్ర్తిల గొప్పతనాన్ని తెలిపిన పుస్తకం ఇది.
రచయిత్రిగా చేయి తిరిగిన గోగినేని యోగ ప్రభావతీ దేవి 96 పుటలతో 11 శీర్షికలతో అత్యద్భుతంగా ‘సముద్రాన్ని గంగాళం’లో బంధించినట్లు అనేక విషయాలు తెలిపారు. అపార శక్తిసంపన్నులైన భారతీయ వనితల మేధను, కవితా ప్రతిభను, సామాజిక స్పృహను లోకానికి పరిచయం చేయడానికి ప్రభావతిగారు విశేష కృషి చేశారు. స్ర్తితత్వాన్ని వివిధ గ్రంథాల ఆధారంగా చేసిన విశే్లషణ పఠితల్ని కదలనివ్వకుండా చేస్తుంది. విషయం ప్రాచీనమైనదైనా ఆధునిక శైలిలో రచించిన ఈ వ్యాస సంపుటి ప్రతి అక్షరం అవశ్య పఠనీయం.
వేద ఇతిహాస పురాణాల్లో స్ర్తిలు ఎవరున్నారనేది తెలియని ఆధునిక కాలం ఇది. అసలు హిందూ ధర్మంలో స్ర్తిలకు పూర్వం విద్యనే లేదనే విమర్శకులకు ఇది చెంపపెట్టు లాంటి గ్రంథం. వేదకాలపు స్ర్తిలైన ఉత్పల, గార్గి, మైత్రేయి, లోపాముద్ర వంటి వారిని ఆమె ఉదహరించారు. ఋగ్వేదంలో 27 సూక్తాలను స్ర్తిలే చెప్పడం రచయిత్రి చెప్పిన మరొక విశేషం. విద్యాగంధమే లేదని భారతీయ ధర్మ వ్యతిరేకులు వాదనలు వినిపిస్తుంటే, వేదాలే భారత వనితలు వినిపించారని రచయిత్రి చాటి చెప్పింది. మనుస్మృతి, దేవీ భాగవతం, సౌందర్యలహరి వంటి గ్రంథాల నుండి అక్కడక్కడ ఉటంకించారు. సీతాదేవి, సత్యభామ, రుక్మిణి, ద్రౌపది వంటి స్ర్తిలు అనేక సంఘర్షణలో వారివారి పాత్రను ఎలా నిర్వహించారో చక్కగా వివరిస్తూ, వారిలోని త్యాగం, క్షమ, శాంతి, ధర్మం, సత్యం, దానం, దయ ఎలా వ్యక్తమయిందో రచయిత్రి సోదాహరణంగా వివరించారు.
ద్రౌపది, సత్యభామ లాంటి ప్రసిద్ధ పాత్రలనే కాకుండా సుభద్ర, హిడింబి లాంటి పాత్రల్లోని వ్యక్తిత్వాన్ని కూడా వివరించారు. సాధారణంగా అందరూ ప్రసిద్ధ పాత్రల్లోని వ్యక్తిత్వాలు మాత్రమే చెప్తే రచయిత్రి అప్రసిద్ధ పాత్ర స్వభావాలను విశే్లషించారు.
చంద్రమతి (పు.35)ని గురించి చెప్తూ ‘సత్యహరిశ్చంద్రుడి కీర్తిసౌధానికి మూల స్తంభం చంద్రమతి. ఇంత క్షమ, సహనం ఆమెకెలా సాధ్యమైంది అనిపింపజేసే స్ర్తి చంద్రమతి. సంపద పోయినా సహనం చూపిస్తుంది. కొడుకును కోల్పోయినా పల్లెత్తదు. అమ్ముడుపోయినా అడ్డుకాదు’ అంటుంది. చాలామందికి సీతకు, సావిత్రికి, సుమతికి ఉన్న క్షమత మాత్రమే తెలుసు. చంద్రమతి గొప్పదనం కొందరికే తెలుసు. ఆయా పాత్రల్లోని ఉదాత్తతను కొన్ని మాటల్లో చెప్పినా రచయిత్రి చిక్కగా చెప్పారు. శర్మిష్ఠ, దేవయాని, మాధవి, దమయంతి, సావిత్రి, సుకన్య లాంటి పురాణకాలపు స్ర్తిల చరిత్రను ఆయా గ్రంథాల నుండి శ్లోకాలు, పద్యాలతో సహా పేర్కొన్నారు.
అలాగే తెలుగులో తొలి కవయిత్రిగా పేరొందిన తిమ్మక్క ప్రజ్ఞాపాటవాలు విశేషంగా ఈ పుస్తకం పేర్కొంది. తేటతెలుగు పరిమళాలతో, ‘సుభద్రా కళ్యాణం’ కావ్యాన్ని ద్విపదలో అందించిన తిమ్మక్క పాండిత్య ప్రతిభ ఎనలేనిది. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, పాల్కురికి సోమనాథుని ద్విపద కావ్యాలు అప్పటికే ప్రసిద్ధం. అదే కోవలో ఓ స్ర్తిమూర్తి ప్రతిభ ఆనాడు లోక పరిచయం అయ్యిందంటే ఆనాడు పెద్ద విశేషమే. అప్పటివరకు తొలి తెలుగు కవయిత్రి స్థానంలో మొల్ల ఉంటే ఆ స్థానాన్ని తాళ్లపాక తిమ్మక్కకు 1950లో వేటూరి ప్రభాకరశాస్ర్తీ ఇప్పించిన విషయాన్ని కూడా పరిశోధనా దృష్టితో ప్రభావతీదేవి వివరించారు.
అలాగే ఈనాటికీ తెలుగునాట రామాయణాలను పరిశోధించాల్సి వస్తే మొల్ల రామాయణం అగ్రస్థానంలో ఉంటుంది. సంస్కృతాంధ్ర భాషల్లో ఎంతోమంది కవులు మొదలుపెట్టిన రామాయణాల సరసన మొల్ల రచించిన రామాయణం నిలబడటం విశేషం. ‘్భజన కల్పకం బగుచు భుక్తికి ముక్తికి మూలమైన యా రాజును దైవమైన రఘురాము నుతించిన, దప్పు గల్గునే!’ అంటుంది మొల్ల. అలాంటి అద్భుతమైన రామాయణం అందించిన మొల్లను ఈ రచయిత్రి సంపూర్ణంగా స్పృశించింది.
తెలుగు సాహిత్యం క్షీణదశకు చేరుకొన్నపుడు బురద నుండి కమలం పువ్వుల్లా వికసించిన సాహితీమూర్తులు రంగాజమ్మ, ముద్దుపళని. వీళ్లను క్షీణ సాహిత్య యుగంలో పుట్టినందున తక్కువగా చూస్తుంటారు. ఈ పుస్తకం చదివితే వారి ‘అశేష పాండితీ ప్రజ్ఞ’ కవిత్వంలో ప్రస్ఫుటమవుతుంది. పసుపులేటి రంగాజమ్మ మన్నారు దాస విలాసం, ఉషా పరిణయం, మన్నారుదాస విలాస యక్షగానం అనే ఈ మూడు గ్రంథాలు ప్రసిద్ధం. రాజగోపాలాంబిక విజయరాఘవుని పట్టమహిషి. రంగాజమ్మ ధర్మపత్ని. ఓసారి ఈ రాజగోపాలాంబిక పంపిన వర్తమానంతో నొచ్చుకున్న రంగాజమ్మ తెలుగు సాహిత్యమున్నంత వరకుండే ‘ఏ వనితల్ మమున్ దలపనేమి పనో? తమరాడువారు గారా? వలపించు నేర్పెరుగదా’ అనే పద్యం రచించింది. రంగాజమ్మ ఎంత గడుసుదో అంత రాజనీతి ప్రజ్ఞ గలది. అలాగే రాధికా సాంత్వనము రచించిన ముద్దు పళని రాధికగా మారిపోయి ఆ కావ్య రచన చేసింది. శృంగార శాస్త్రాన్ని హద్దులు దాటకుండా కావ్యగర్భితం చేసిన ముద్దు పళనిని గురించి రచయిత్రి పరిశోధనాత్మకంగా రచించారు. తిరుమల ప్రాంతంలో నివసించిన తరిగొండ వెంగమాంబ సంప్రదాయాల్లో కొన్ని సంస్కరణలు చేసిన విషయాన్ని ఈ పుస్తకంలో రచయిత్రి విశే్లషించారు. అలాగే గురజాడకన్నా ముందే ‘దిద్దుబాటు’ను తలదనే్న ధనత్రయోదశి పేరుతో కథ రాసిన భండారు అచ్చమాంబ గొప్పతనం, రచనలు సమగ్రంగా చర్చించారు. అదే విధంగా స్ర్తి జనాభ్యుదయం కాంక్షించిన కనపర్తి వరలక్ష్మమ్మను పరిచయం చేసి ఆధునిక స్ర్తిల అభ్యుదయ కాంక్షను తెలిపారు. మొత్తానికి చిన్న పుస్తకంలో ఎక్కువమంది మహిళా మణులను పరిచయం చేసి భారతీయ సంస్కృతిలో స్ర్తిల ప్రాధాన్యతను తెలిపారు.
...............................................................
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

డాక్టర్ పి. భాస్కర యోగి 
అంధ్రభూమి అక్షర పుస్తక సమీక్ష 
Published Friday, 19 May 2017


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి