* మీరు కన్న కలను మేం సాకారం చేశాం! కానీ మీ ఆకాంక్షలు నెరవేరు తున్నాయా? ఒక కుటుంబం కోసం మీరు ఉద్యమం చేశారా ? మీ భవిష్యత్తును నలుగురు ఉన్న ఒక కుటుంబం చేతిలో పెడతారా? ఇదేనా మీరు ఆశించిన బంగారు తెలంగాణ ?..
– కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
+ ఆవును. 1300 మంది ఆత్మ బలిదానాలయ్యాక తెలంగాణను మీరు సాకారం చేశారు. అదే కెసిఆర్ ధీమా, మిమ్మల్ని తిట్టడానికి ! మీ కుటుంబం అధికారంలోకి రావడానికి దేశాన్నే పణంగా పెట్టారు. ఇప్పుడు కెసిఆర్ అదే బాటలో నడుస్తున్నారు. మీరు 60 ఏళ్లపాటు పాలించి భారతదేశాన్ని బంగారం చేశారా ?! కెసిఆర్ కూడా మీలాగే చేస్తున్నాడు. ఆయన చేస్తే తప్పూ..! మీరు చేస్తే ఒప్పా..!
* మా కార్యకర్తల జోలికొస్తే సహించం. కాళోజీ మాట మేరకు కెసిఆర్‌కు పాతరే.
– టిపిసిసి అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
+ ఉత్తమ్ అన్నా ! నీకు తెలియంది ఏముందన్నా..! తాటాకు చప్పళ్లకు కుందేళ్లు కూడా బెదరవ్ కదన్నా !
* పాకిస్తాన్ సైనికులు ఆవు మాంసం తినడం వల్లనే బలంగా ఉన్నారు.
– కంచ ఐలయ్య
+ మరి ఆ ‘మొనగాళ్లు’ నాలుగు యుద్ధాల్లోనూ ఎందుకు ఓడిపోయారో..?!
* కాశ్మీరీ వేర్పాటువాదుల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకోవాలి.
– కాంగ్రెసు నేత దిగ్విజయ్ సింగ్
+ గత డెబ్భై ఏళ్ల నుండి తీసుకుకొంటూనే ఉన్నారుగా దిగ్గీ ! ఈ సంతుష్టీకరణ ఇంకెన్నాళ్లు..! ఇలాంటి కారుకూతలతోనే నీవు మధ్యప్రదేశ్‌లో కాలు పెట్టడానికి కూడా పనికిరాకుండా పోయావు. ఇలాగే మాట్లాడి కేంద్రంలో కాంగ్రెసును గద్దె దింపావు. గోవాలో, తెలంగాణలో కాలుబెట్టి కాంగ్రెసును సర్వనాశనం చేశావు. ఇంకా ఏం మిగిలాయి ?!
* ఆవు మాంసం తిన్నట్టు పురాణాల్లో ఉంది. ముసలివాటిని తినక ఏం చేస్తారు?
– సిపిఐ నేత నారాయణ
+ ఏ పురాణంలో ఉందో దాని పేరు చెప్పండి నారాయణ గారూ ! నీవు కూడా ముసలి అయ్యావు కదా ! జాగ్రత్త !
* లంచం అడిగితే నాకు చెప్పండి
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
+ ‘భూ కుంభకోణం’ లో మంత్రులే ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. దాని గురించి ఎవరికి చెప్పాలి !?
* పరువు హత్యలు పెరుగుతున్నాయ్; పోలీసులు ఏం చేస్తున్నారు?
– హైకోర్టు
+ కెసిఆర్ ఇచ్చిన రక్షక్ వాహనాల్లో చక్కగా చక్కర్లు కొడుతున్నారు.
* జూదం, పందేలకు చట్ట బద్ధత అవసరమా?
– ప్రజాభిప్రాయం లా కమిషన్
+ గోవధపై నిషేధం ఉన్నా చట్టం అమలు చేయరు. ఇవి చట్టబద్ధత లేకున్నా ఆచరణలో చూపిస్తారు. అదే మన ప్రజాస్వామ్యం.
* చేతనైతే రాజీనామా చేసి పోటీ చేయండి. ఎవరు గెలుస్తారో తేల్చుకొందాం. మా సర్వే బోగస్ కాదు, వాళ్ల దమాక్ లే బోగస్.
– కాంగ్రెసుకు సిఎం కెసిఆర్ సవాల్
+ ఎందుకు తొందర ! ఇంకా కొన్నాళ్లు ఆగండి. నిజం తెలుస్తుంది కదా..!
* మంత్రిగా నా నిర్ణయాల్లో కుటుంబీకుల పాత్ర లేదు.
– మాజీ కేంద్రమంత్రి చిదంబరం
+ అంటే ‘కార్తీ చిదంబరం’ మీ అబ్బాయి కాదా?
* తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతాం.
– భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్
+ 2019 లోనా ? 2024 లోనా ?
– డా||పి.భాస్కరయోగి మాటకు మాట, విశ్లేషణ జాగృతి 12-18 June 2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి