.........................
ఒకప్పుడు రాజనీతిలో సరళమైన కవిత్వం ఉండేది. ఇప్పుడు కవిత్వమంతా రాజకీయమే అయి కూర్చుంది. అది వినోదాత్మక అంశంగా, అగ్రెస్సివ్
విషయాలు చెప్పే సాధనంగా
మారిపోయింది. సామాన్యుని స్థాయిని బిందువు వద్ద, స్థిరంగా ఉండే సాహిత్య సృష్టి చేసినంతకాలం కవిత్వంలో
విలువలు వెతికినా దొరకవు.
..........................
ఒక నెలలో ఐదు నుండి ఆరు సాహిత్య సభలకో, పుస్తకావిష్కరణకో, కవి సమ్మేళనాలకో వెళ్తుంటాను. కొన్నిచోట్ల తప్ప చాలా సభల్లో నిస్తేజం ఆవరించి ఉంటుంది. ఎందుకు!? అనే ప్రశ్న మెదడును తొలుస్తుంది. ఒక పట్టణంలో పదిమంది లబ్ధప్రతిష్ఠులైన కవులుంటే వాళ్లలో ప్రతి ముగ్గురికీ కలిపి ఓ సాహిత్య సంస్థ ఉంటుంది. వాళ్ళు ఒకరి సభకు ఇంకొకరు వెళ్లరు. దీనికి రెండు ప్రధాన కారణాలు. కొందరికి సిద్ధాంతపరమైన వైరుధ్యాలుంటే మరికొందరికి వ్యక్తిగత ద్వేషాలుంటాయి.
ఒక రచయిత కవిత్వాన్ని రాయడం ఒక మెట్టు. రాసినదాన్ని అచ్చు రూపంలో చూసుకోవడం రెండో మెట్టు. దాన్ని లోకార్పణం చేసి సమాజంలో తీసుకెళ్లడం మూడో మెట్టు. ఇంతవరకు సాఫీగానే సాగుతుంది కానీ ‘బుక్స్ కల్చర్ పోయి లుక్స్ కల్చర్’ పెరిగాక చదవడం తగ్గింది. ఇతరుల్ని ద్వేషించడానికో, అందులోని లోపాలను గుర్తించడానికో సాహిత్యం, కవిత్వం చదివే స్థితికి సాహిత్యలోకం దిగజారడం శోచనీయం. ఇటీవల వాట్సాప్ కవులు, ఫేస్‌బుక్ కవులు కూడా పెరిగిపోయారు. తమకిష్టమైన విషయాన్ని తమకిష్టమైన గ్రూపులో పోస్టు చేసి ఆనందం పొందుతున్నారు. అందులో తిట్లు, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, కువ్యాఖ్యానాలు, పొడిపొడి కవిత్వం, పొర్లాడే కవిత్వం చాలా ఉంది. అది తాత్కాలిక ఉపశమనం కల్గించే జండూబామ్ లాంటిది. కానీ రసాస్వాదన, సామాజిక స్పృహ కల్గించే కవిత్వానికి చోటెక్కడ అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!
నన్నయ, తిక్కన, పోతన కవిత్వం రాశారంటే ఉపదేశం, రసాస్వాదనను కల్గించారు. పాల్కురికి సోమనాథుడు, వేమన, అన్నమయ్య, దున్న ఇద్దాసు వంటి కవులు ప్రజలకోసమే కవిత్వం రాశారంటే మనం నమ్మగలమా! రాయడమే గాదు ప్రజలల్లోనే ఒకరుగా జీవించారు. శ్రీశ్రీ, విశ్వనాథ భిన్నమార్గాల్లో నడిచినా వాళ్ల రసదృష్టి ఒక్కటే. అది కవిత్వమనే ఆల్కేమీని సృష్టించడం. కవికి దేశ జెండాకున్నంత సమున్నత్వం ఉండాలని ఓ శేషేంద్ర కోరుకున్నాడు. గద్దర్, గోరటి వెంకన్న పాటను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో వెళ్తున్నారు. కేశవరెడ్డి, కసిరెడ్డి నిరాడంబరంగా రాస్తున్నారు. కానీ వాళ్ళు ప్రచారాన్ని కోరుకోరు. ఆచార్య నారాయణరెడ్డి, ఎన్.గోపి కవిత్వమే శ్వాసగా బ్రతుకుతున్నారు. ఇప్పటికీ బి.ఎస్.రాములు, కోవెల సుప్రసన్న వంటి పరిశోధకులు నిరంతరం సాహిత్య సుడుల్లో నడుస్తూనే ఉన్నారు. కె.శ్రీనివాస్ వంటి పాత్రికేయ రచయితలు తమ కలాన్ని ఎక్కడా నిలపడంలేదు. వీళ్లంతా కవిత్వాన్ని- సాహిత్యాన్ని తమ ఊపిరిగా భావిస్తారు. వీళ్లలో నడిచే ఋతంబరత్వం ఒక్కటే- అన్ని సిద్ధాంతాల సాహిత్యవేత్తలు గుర్తించాలి. వీళ్లందరి మార్గం ఒక్కటే. అది సరళమైన మార్గం. పేర్లు మాత్రమే వేరు. తీర్థయాత్రికులు భిన్నంగా ఉంటారు. తీర్థయాత్ర మాత్రం అదే.
కవిత్వం అనేది హృదయపు భాష. అది పెదవులతో పలికేంత అల్పమైంది కానే కాదు. అది మనిషి హృదయంలో జరిగే ఓ రసాయనిక చర్య. అది భావోత్పత్తిని కల్గించే విశిష్ట ప్రక్రియ. ‘‘ఒకవేళ ఏదైనా కాంతివేగంతో కదిలినపుడు అదే ఓ కాంతి అవుతుంది. ఎందుకంటే ఆ వేగం ఎంత ఎక్కువైతే ఆ రాపిడికే అగ్ని పుడుతుంది. అక్కడ వస్తువు కాలిపోయి ప్రకాశం మాత్రమే మిగులుతుంది. పదార్థం అదృశ్యం అయిపోయి ప్రకాశం మాత్రమే మిగులుతుందని భౌతిక శాస్తవ్రేత్తలు చెప్తారు. అది కవిలోని ప్రకాశం యొక్క విస్ఫోటనం. ఆ విస్ఫోటనం యొక్క అంతిమ వ్యక్తీకరణం కవిత్వం. భావాంకుర దశ అదే. ఇంత లోతుగా కవిత్వాన్ని గుర్తిస్తే నాణ్యమైనది పుడుతుంది. ప్రతి వ్యక్తి చేత కవి గౌరవింపబడతాడు.
పార్టీల్లాగా, వర్గాలుగా విడిపోయేది క్షుద్రమనస్తత్వం. అత్యంత తక్కువ స్థాయి హృదయం అది. ఉన్నత హృదయం దశలను సాహిత్య జిజ్ఞాసువు పొందాలి. పైపైన కలిగించే వినోదం కాదు. కవిత్వం. అది అనుభూతి ప్రధానం, ఇక్కడ అనుభూతి అంటే భావ కవిత్వంలో జీవించాలని కాదు. దానికి వ్యతిరేకం కూడా లేదు. ఓ ఉన్నత స్థాయి మనస్సుతో ఆలోచించాలి. మహాకవులెవ్వరూ తమను తాము వ్యక్తిగత అగాధాల వైపునకు దిగజార్చుకోలేదు. వ్యక్తులను- వ్యవస్థలను నిర్వీర్యం చేసి సామాజిక అంతరాలకు తావు ఇచ్చినపుడు పుట్టుకొచ్చే ఓ కృష్ణుడు, బుద్ధుడు, లావోట్టూ, అంబేద్కర్, పూలేలు... ఎలా సమాజానికి అవసరమవుతారో కవులూ అలాగే పుట్టుకొస్తారు. అక్కడ కవులు, సిద్ధాంతకర్తలు పుట్టడం కాదు వాళ్ళనుండి పుట్టే విస్ఫోటన ప్రకాశం జాతికి మార్గదర్శనం చేస్తుంది. భావాలు ఆలోచనల చేత, మమకారాల చేత నిండని చైతన్యమే కవిత్వం, దాని స్వరూపం చైతన్యం. దాని దృష్టిలో సమస్య నివారణే ప్రధాన లక్ష్యం. అందుకోసం ఆ చైతన్యరూపం పద్యం, గేయం, గద్యం, వచనం, హైకూ ఏ రూపంలోనైనా చొచ్చుకువస్తుంది. అది రైటిస్టులూ, లెఫ్టిస్టులూ అనే తేడా ఉండకుండా కలుగుతుంది. మనం కొన్ని రకాల కళ్లద్దాలు పెట్టుకొని చూసినపుడు మాత్రమే త్రీడి చిత్రంలా ప్రత్యేకంగా కన్పిస్తుంది. అది ప్రక్రియాపరమైన భేదం లాంటిదే కాని వస్తుపరమైన భేదం అందులో ఉండదు.
‘‘మార్క్స్ మన దేశంలో పుడితే గుళ్లు కట్టి పూజించేవారు. అలాగే కృష్ణుణ్ణి పాశ్చాత్య ప్రపంచం ఇవాళ అర్థం చేసుకొన్నట్లు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం’’ అని ఓ తత్వవేత్త చెప్పాడు. ఇందులో ఇద్దరివీ భిన్నదారులుగా కన్పిస్తాయి కానీ, అందులోని ఏకత్వాన్ని గుర్తించడంలోనే సాహిత్య నైపుణ్యం ఉంది. ప్రయోజన దృష్ట్యా భిన్న ప్రక్రియల్లో, భిన్న మార్గాల్లో వ్యక్తం చేసే సిద్ధాంతాల దారి, లక్ష్యం ఒక్కటే అని గుర్తించడం నేర్చుకోవాలి. ఒక రాయి, గులాబీలను మనం చూస్తే రాయి గట్టిదని భావిస్తాం. కానీ రాయిలో జీవం లేదు. గులాబీది తక్షణ జీవనం. అయినా అందులో దృఢత్వం ఉంది. దాని నాజూకుతనం, సుకుమారత రాయికన్నా బలమైంది. అది ఎక్కువ సజీవమైంది. దాని సొగసు అసమానం. అందులోని చైతన్యాన్ని గుర్తించాలి. అదే సాహితీ పిపాస. కానీ రాయి మాత్రమే బలమైంది అని వాదించడం క్షుద్ర మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి మూర్ఖపు వాదనల వల్లనే ఈనాడు కవిత్వం, సాహిత్యం స్థాయి దిగజారిపోయింది. ఒకప్పుడు రాజనీతిలో సరళమైన కవిత్వం ఉండేది. ఇప్పుడు కవిత్వమంతా రాజకీయమే అయి కూర్చుంది. అది వినోదాత్మక అంశంగా, అగ్రెస్సివ్ విషయాలు చెప్పే సాధనంగా మారిపోయింది. సామాన్యుని స్థాయిని బిందువు వద్ద, స్థిరంగా ఉండే సాహిత్య సృష్టి చేసినంతకాలం కవిత్వంలో విలువలు వెతికినా దొరకవు.
కవులు తమ సాహిత్యాన్ని ముద్రతో ప్రక్రియాపరమైన గుర్తింపు కోసం రాయవచ్చు కానీ వ్యాప్తి దృష్టికి అది ఆనదు. దీని ఆయువు పట్టును పట్టుకొన్నవాళ్ళు ఎప్పుడో ఓసారి మహాకవులుగా గుర్తింపబడతారు. గొప్ప సాహిత్యవేత్తలుగా గౌరవింపబడతారు. వేమన మరణించిన 300 ఏళ్ళ తర్వాత బ్రౌన్ వచ్చి వెతికినపుడు అనర్ఘరత్నాల్లాంటి ఆటవెలది పద్యాలను మనం పొందగలిగాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఓ దాశరథి, దున్న ఇద్దాసు, రాకమచర్ల వెంకటదాసు, ఖ్వాజా అహమదొద్దీన్, మామిండ్ల రామాగౌడ్ గుర్తించబడి గౌరవింపబడుతున్నారు. ఎప్పడో ఒకప్పుడు చైతన్యాన్ని గుర్తించే శక్తి ప్రజలకు వస్తుంది. అప్పుడు శ్రేణిలో చివర నిలబడేవాళ్లెవరో, ముందువరుసలో ఉండేవారెవరో మనం తేల్చుకోవాలి. కవిత్వ- సాహిత్య రంగాల్లో మాయతో, భ్రమతో ముందుకెళ్లడం ఓ ఆయాసం, అది పరుగెత్తుతున్నంతసేపు ఆనందాన్ని కల్గిస్తుంది కానీ నిలబడి అంతరంగంలోకి వెళ్తే ఆలోచన స్థాయిని తెలుపుతుంది. రసదృష్టి, సామాజిక దృష్టి రెండూ భిన్న పార్శ్వాలు కూడా కావు. అవి వ్యక్తీకరణలో ఒకదానిని ఒకటి అంటుకొని వచ్చేవి మాత్రమే అని గుర్తించాలి.
ఓ కవి గొప్ప ఉపమానాలతో కవిత్వం రాస్తాడు. అతడు ఓసారి మూడు రోజులు తిండి లేకుండా పస్తులుండాల్సి వచ్చింది. ఆ మూడు రోజుల్లో అతను ఆకలితో అలమటించిపోయాడు. మధ్యలో పౌర్ణిమ వచ్చింది. అంతకుముందు చంద్రుణ్ణి చూస్తే స్ర్తి ముఖం, అందం, సౌందర్యం మాత్రమే అతనికి కన్పించేవి. ఆకలితో ఉన్నందుకు ఇప్పుడు చంద్రుడు చపాతీలా కన్పిస్తున్నాడు. ఆకలి అతని కవిత్వంలో మార్పును కలిగించింది. రెండు భావాలూ అతనివే. ఇంత చిన్న కథ అర్థం చేసుకొంటే రసాస్వాదనకు, సామాజిక స్పృహకు మధ్యగల సమన్వయం అర్థం అవుతుంది. అప్పుడే ఆ విస్ఫోటక చైతన్యం పాఠకుల మనస్సుల నుండి మాలిన్యం తొలగి నిర్మలం అవుతుంది.
మనల్ని ఆవరించిన నిస్తేజం పోవాలన్నా, కీర్తికండూతి కరిగిపోవాలన్నా సిద్ధాంత వైరుధ్యాలు సమసిపోవాలన్నా నిజమైన కవిత్వం సాహిత్యం సృష్టింపబడాలి. అప్పుడే తెలుగు భాషలో కవితా ప్రస్థానం శిఖరాయమానం అవుతుంది.


డాక్టర్ పి భాస్కర యోగి 
ఆంధ్రభూమి సాహితి 
Published Sunday, 4 September 2016


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి