అది మిచిగన్ ఎవెన్యూలోని భవనం. ఈ భవనం చికాగో కళాభవనం (art institute) అంగరంగవైభవంగా ఉన్న సుదినం. 1893 సెప్టెంబర్ 11వ తేదీ సర్వమత మహాసభ జరిగే స్థలానికి కొలంబస్ భవనం అని పేరుపెట్టారు. ప్రపంచ ప్రదర్శనగా శిల్పాలు, చిత్తరువులు, కంచు విగ్రహాలు, 4వేలమంది ప్రతినిధులు, రోమన్ మేధావి మార్కస్ టులియస్ సిసిరో, గ్రీసు దేశపు వక్త డెమస్తనీస్ పాలరాతి శిలావిగ్రహాలు - ఆ విగ్రహానికి ఎడమవైపు కుడిచేతిని పైకెత్తి, ఒక విహంగాన్ని ఎగురేస్తూ నిలబడి ఉన్న రోమన్ విద్యాదేవత ‘మినర్వా’ రాగి విగ్రహం ఆ ప్రాంగణానికి శోభను చేకూర్చాయి. అంత శోభాయమానమైన ప్రాంగణంలో వేలాదిమంది మధ్య కొద్దిసేపట్లో సింహగర్జనకు సిద్ధంగా ఉన్న వేదాంత కేసరి స్వామి వివేకానంద ఎరుపురంగు దుస్తులు, పసుపురంగు తలపాగా ధరించి 31వ ఆసనంలో ఆసీనులయ్యారు.
అందరూ నిశ్శబ్దంగా కూర్చొన్నారు. హఠాత్తుగా పియానో వాద్యం మొదలైంది. అక్కడి ప్రతినిధులంతా ‘్భగవంతుణ్ని స్తుతించండి’ అనే స్తుతి చదివారు. మొదట గ్రీకు చర్చ్ ఆర్చిబిషప్ జానే్త, పదేళ్లకుపైగా అమెరికాలో ఉన్న మజుందార్, కన్ఫ్యూషియన్ మత ప్రతినిధి ఫుంగ్‌క్వాంగ్, శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ ధర్మ ప్రతినిధి ధర్మపాలుడు ప్రసంగాలు చేశారు. తన మదిలో భారతమాతను గురించి ఎన్ని భావోత్తుంగ తరంగాలున్నాయో తెలియదుకానీ వౌనంగా కూర్చొన్నాడు. అతని మనస్సులో ఎన్ని ఆధ్యాత్మిక విజ్ఞాన రాశులున్నాయో చెప్పలేంగాని గంభీర వదనుడై గమనిస్తున్నాడు. గురుదేవులైన శ్రీరామకృష్ణులను, ఆయన ఆరాధ్య దేవత కాళీమాత, మాతృమూర్తి శారదామాతను తనలోకి ఆవాహన చేసుకొంటున్నట్లుగా స్వామి వివేకానంద కూర్చొని అన్నీ వింటున్నాడు. తన వంతు రాగానే ఒక్కసారి సరస్వతిని మనసులో ప్రార్థన చేశాడు. ‘‘అమెరికా సోదర సోదరీమణులారా!’’ అని తన గంభీర స్వరంతో చెప్పగానే దిక్కులు పిక్కటిల్లేలా కరతాళ ధ్వనులు మారుమోగాయి. కాషాయ వస్త్రాలు ధరించిన తేజోమూర్తి అయిన యువకుని ఈ సంబోధన అక్కడి ప్రతినిధుల హృదయాల్లో సరికొత్త ఉత్సాహం కలిగించింది. కరతాళ ధ్వనుల స్వాగతం స్వామీజీలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. ‘‘సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సర్వమత సహనానే్నగాక, సర్వమతాలూ సత్యాలనే మేం విశ్వసిస్తాం’’ అంటూ హిందూమత ఔన్నత్యాన్ని స్వామి చెప్పారు. ఆ తర్వాత కొనసాగిస్తూ ‘‘ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేరున మీకు నా అభివాదాలు. సమస్త మతాలకూ, సమస్త ధర్మాలకూ తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేరున మీకు నా అభివాదాలు. నానాజాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జనసహస్రాల పేరిట మీకు నా అభివాదాలు’’ అంటూ ఉపన్యాసంతో ఉరకలెత్తించారు.
స్వామి ప్రసంగం ప్రపంచమత మహాసభను కొత్తమార్గంవైపు నడిపింది. స్వామీజీ ప్రసంగం గొప్పతనాన్ని గురించి పాశ్చాత్య ప్రసిద్ధ పత్రికలన్నీ అద్భుతంగా అభివర్ణించాయి. ఉపన్యాసం చిన్నదే అయినా ప్రపంచమత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన మహా సందేశం అది. ‘‘ఆయన మాటల్లో అగ్నికణాలు విరజిమ్మాయి’’ అని రోమరోలావంటి వాళ్లు పేర్కొన్నారంటే ఆయన ప్రభావం ఏమేరకు ఉందో మనం ఊహించుకోవచ్చు.

స్వామి వివేకానంద చికాగోలో మాట్లాడిన తరువాత రెండు ముఖ్య పరిణామాలు సంభవించాయి. భారతీయ ఆధ్యాత్మిక పాండిత్యాన్ని పురాణఫక్కీలో చెప్పడం అలవాటున్న మన దేశస్థులకు ‘ఆధునిక ఆధ్యాత్మిక ప్రబోధం’ ఎలా చేయాలో తెలిసివచ్చింది. పాశ్చాత్యులకు మన మత విశ్వాసాలపై ఉన్న అజ్ఞానపుటలు చిరిగిపోయాయి. సముద్రం దాటవద్దన్న భ్రమలో ఉన్న మన పండితులకు వివేకానందుని విప్లవాత్మక నిర్ణయం ఓ మార్గాన్ని సృష్టించింది. ఆయన తర్వాత పాశ్చాత్య దేశాలను అంతే స్థాయిలో అద్వైత తత్వంలో ముంచిన స్వామి రామతీర్థ, యోగుల జీవితాలను, భారతీయతత్వ చింతనను పాశ్చాత్యులకు అందించిన పరమహంస యోగానందలకు స్వామి వేసిన మార్గమే పూలబాటగా మారింది. భారతీయ యోగవిద్యను ప్రబోధించే పరమహంస యోగానంద విరచిత ‘ఏ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ అనే పుస్తకం వందేళ్ల తరువాత కూడా ఎన్నో పాశ్చాత్య విశ్వవిద్యాలయాలకు పాఠ్యగ్రంథంగా ఉందంటే మనం నమ్మలేం. పాశ్చాత్యులు - ముఖ్యంగా క్రైస్తవ మిషనరీలు హిందూమతం అంధ విశ్వాసుల మతమనీ, అనాగరికమనీ అప్పటివరకు భావించారు. కానీ వివేకానందుడు అమెరికా వెళ్లాక చేసిన ప్రసంగాల పరంపర వారి అజ్ఞానాన్ని విధ్వంసం చేసింది. అమెరికాలోని ఎన్నో నగరాల వీధుల్లో స్వామి చిత్రపటాలు పెడితే దారిన వెళ్లేవారు రెండు నిమిషాలు వినమ్రంగా అక్కడ నిలబడి వౌనంలోకి వెళ్లేవారంటే వారికి స్వామిపై ఎంత గౌరవం ఏర్పడిందో ఊహించుకోవచ్చు. ఒకవేళ భారతదేశం నుంచి స్వామి వివేకానందుడు అమెరికా వెళ్లకపోయి ఉంటే ఆయనకు ఈ దేశంలో గౌరవం దక్కేది కాదు. తగిన గుర్తింపు వచ్చేదీకాదు. పాశ్చాత్య దేశాల్లో హిందూ ధర్మవైభవం ప్రకటితమయ్యేది కాదు అన్న ఓ మహనీయుని మాటలు అక్షర సత్యాలు. స్వామి ప్రభావం అంత గొప్పది కాబట్టే పూర్ణయోగాన్ని ప్రకటించిన అరవిందుణ్ని, స్వాతంత్య్రోద్యమంలో వీరావేశంతో పనిచేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను ఏకకాలంలో ఆకర్షించగలిగాడు.
మత విశ్వాసాలకు మానవీయ దర్శనంతో ప్రవచించిన మహోన్నత మూర్తి స్వామి వివేకానంద. ‘మతాలెన్నో మార్గాలన్ని’ అని ప్రబోధించిన శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ జాతికి అందించారు. గ్రంథస్తమైన హైందవ మత ప్రాచీనతను, ఆధ్యాత్మిక అంతరంగాన్ని ఉపనిషత్తుల వెలుగులో ప్రపంచానికి చూపించారు. తమ మతమే గొప్పది, తమ ప్రవక్త ద్వారానే జ్ఞానం పొందగలరు, తమ దేవుడే మోక్షం కల్పించగలడు అనుకొన్న సంకుచిత వైదేశీ మతాల కళ్లు తెరిపించి ‘‘ఏకం సద్విప్రా బహుదావదన్తి’’ అన్న సనాతన ధర్మ సూత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన దివ్యమూర్తి స్వామి వివేకానంద.
‘‘హైందవునికి ప్రపంచంలోని మతాలన్నీ వివిధ పరిస్థితులలోను, సందర్భాల్లోను ఉన్న స్ర్తి, పురుషులంతా ఒకే గమ్యంవైపుగా చేసే ప్రయాణమే. ఒకే కాంతి వివిధ రంగు అద్దాలగుండా ప్రసరించి వివిధ రంగుల్లో కానస్తుంది. మనల్ని రక్షించుకోవడానికి ఈ వైవిధ్యాలు అవసరం’’ అని హైందవ మత గొప్పతనాన్ని అన్యమతాల తలబిరుసుతనాన్ని ఏకవాక్యంలో కడిగి పారేశారు స్వామి వివేకానంద.
అలాగే విజ్ఞానం, మతం రెండూ పరస్పర భిన్నకోణాలని పాశ్చాత్యుల నిశ్చితాభిప్రాయం. భూమి గుండ్రంగా ఉందని చెప్పిన శాస్తవ్రేత్తను శిక్షించిన మతాలను చూస్తే ఇలాంటి అభిప్రాయం కలగడం సహజమే! ఈ రోజుకూ భారతదేశంలోని అభ్యుదయవాదుల పేరుతో చలామణి అయ్యే వారందరూ ఇదే దురభిప్రాయంతో ఉన్నారు. దీనిని స్వామి 150 ఏళ్లనాడే ఖండించి సమన్వయం చేశారు. ‘‘ఏకత్వ స్థితిని ఆవిష్కరించడమే విజ్ఞానం. పరిపూర్ణ ఏకత్వ స్థితిని సంతరించుకోగానే విజ్ఞానం ఇక ముందుకు పోకుండా ఆగిపోతుంది. తన లక్ష్యాన్ని చేరుకోవడమే అందుకు కారణం. ముడిసరుకు మూలతత్వాన్ని తెలుసుకొన్నాక రసాయన శాస్త్రం, మూలశక్తి మూలం కనుగొన్నాక భౌతికశాస్త్రం ఆగిపోతాయి. కానీ మరణంతో కూడుకొన్న ఈ ప్రపంచంలో మరణానికి అతీతమైన, మారుతున్న ప్రపంచంలో పరిణామం లేని ఒకే ఆధారమైన అతణ్ని కనుక్కోగానే, ఒకే ఆత్మనుండి ఇతర ఆత్మలు వెలువడుతున్నట్లు మాయవల్ల కన్పిస్తుందో ఆ ఆత్మను కనిపెట్టగానే మత విజ్ఞానం పరిపూర్ణమవుతుందని’’ స్వామి తెలిపారు.
ఇవాళ సమాజంలో రేగుతున్న కుల, మత, వర్గ వైషమ్యాలను ఆనాడే స్వామి గుర్తించారు. ‘‘కావలసింది కలహం కాదు - సహకారం. ధ్వంసం కాదు - ఐక్యత. శత్రుత్వం కాదు - శాంతియుత సమన్వయం.’’ అన్న మాటలతో స్వామీజీ చికాగో ఉపన్యాసాలు ముగిశాయి. అవి ఈనాటికీ ఆదర్శం.
భారతదేశాన్ని భారతమాతగా - ఆదిశక్తిగా దర్శించాడు స్వామీజీ. ప్రస్తుతమున్న మూడు సముద్రాల కలయికగల వివేకానంద స్మారకస్థలంలో కూర్చొని భారతమాతను దర్శించాడు. శ్రీరామకృష్ణుల దివ్యతత్వ దర్శనాన్ని భారతదేశానికి అందించడానికి శ్రీరామకృష్ణ మిషన్ స్థాపించాడు. అది ఈనాడు ఆధ్యాత్మికతత్వానికి, సేవాతత్పరతకు ఆలవాలమై అలరారుతున్నది. ‘‘్భతిక విజ్ఞానం భౌతిక సంపదలను మాత్రమే చేకూర్చగలదు. ఆధ్యాత్మిక విజ్ఞానం శాశ్వతమైన బ్రహ్మానందాన్ని చేకూర్చుతుంది’’ అని భారతీయ తత్వచింతనను ప్రపంచమంతా వినిపించారు. స్వామి శరీరం ఈ భూమిపై 39 ఏళ్లు మాత్రమే నడయాడినా అపర ఆదిశంకరునిలా ప్రపంచమంతా చుట్టబెట్టి వేదాంత విజ్ఞాన బీజాలు వెదజల్లిన భారతీయ సన్యాసి.
కులతత్వాన్ని నిరసించి ఈ దేశంలో మనిషి కాదు కుక్క కూడా ఆకలితో ఉండరాదని ఘంటాపథంగా చెప్పిన సామ్యవాది! యువకుడిగా ఉండి దక్షిణామూర్తిలా ధర్మప్రబోధం చేసిన స్వామి వివేకానంద ‘‘ఇనుప కండరాలూ, ఉక్కు నరాలూ, వజ్రసంకల్పం ఉన్న వందమంది యువకుల్ని నాకు ఇస్తే ఈ దేశప్రగతిని మార్చేస్తాను’’ అని తూటాల్లాంటి మాటలు ఈనాటికీ ఈ దేశ యువత మననం చేసుకొని ముందుకు సాగుతున్నారు. వేదాంత గర్జన చేసిన దార్శనికుడిగా, సమసమాజ స్థాపన కోరుకొన్న సామ్యవాదిగా, యువత ఆలోచనలకు అద్దంలా నిలబడ్డ విజ్ఞానిలా, భారతీయ మూర్త్భీవించిన ప్రాచీన ఋషిలా, ఆధునికతను అర్థం చేసుకున్న శాస్తవ్రేత్తలా భిన్నకోణాల్లో దర్శనమిచ్చే ఏకతామూర్తి స్వామి వివేకానంద.

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125
Published Andhrabhoomi,  Friday, 12 January 2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి