హైదరాబాద్ నడిబొడ్డున గతనెలలో సంధ్యారాణి అనే యువతిని ప్రేమోన్మాది కార్తీక్ కిరాతకంగా పెట్రోల్ పోసి హత్య చేశాడు. దీనికి కారణం అతని ప్రేమను సంధ్యారాణి తిరస్కరించడమే! ‘ఏకపక్ష ప్రేమ’తో చాలాచోట్ల ఇలాంటి దారుణాలు వెలుగుచూస్తున్నా, కొన్ని మాత్రమే తెరపైన కన్పిస్తున్నాయి. ఇవాళ ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల చుట్టుప్రక్కల స్థలాలు, పార్కులు, క్లబ్బులు, పబ్బులు, కాఫీ షాపులు ఈ అపరిపక్వ ప్రేమకు వేదికలవుతున్నాయి. ఇవి కొన్ని సత్ఫలితం ఇచ్చి వివాహం జరుగగా, మరికొన్ని మధ్యలోనే వికటిస్తున్నాయి. ఫ్యామిలీ కోర్టుల్లో భార్యాభర్తల కేసులు, ఇతర కోర్టుల్లో విడాకుల కేసుల సంఖ్యలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి. ఇక ప్రేమ పేరుతో జరుగుతున్న అఘాయిత్యాలకు అంతే లేదు. గృహహింస, స్ర్తిలపై హింస మనం రికార్డు స్థాయిలో నమోదు చేసుకొన్నాం. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటి?!
అపరిపక్వ ప్రేమను సినిమాల్లో ప్రమోట్ చేస్తూ యవ్వనారంభ దశలోని యువతరం మనసులను విషపూరితం చేస్తున్న సినిమాలపై నియంత్రణ లేదా? ఆ కథలతో జీవితంలో ‘ప్రేమ’ తప్ప ఇంకోటి లేదనుకొని ఆత్మహత్య చేసుకొంటున్నవాళ్లకు, లేదా ప్రేమకోసం హింసకు పాల్పడే కథలతో తీసిన సినిమాలను చూసి స్ర్తిలపై జరిపే అత్యాచారాలను ఆపే వ్యవస్థ లేని సమాజంలో మనం జీవిస్తున్నామా?
ఒక సుప్రసిద్ధ సినిమా నటుడు తన జీవితం మొత్తంలో ముప్ఫై ఏళ్లకుపైగా సినిమాల్లో నటించాడు. ఆయన ప్రతి చలన చిత్రంలో దాదాపు విలన్ కూతురును ఎత్తుకెళ్లో, ప్రేమించో పెళ్లి చేసుకొన్నట్లు నటించాడు. చివరకు తన కూతురు ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకొంటే తెగ బాధపడినట్లు పత్రికల్లో చదివాం. ‘‘మీ సందేశాన్ని మీ కూతురు అమలుచేస్తే తప్పెలా అవుతుంది!’’ అనడం మన తప్పు!? ఇవాళ సినిమా రంగం మనం అవునన్నా కాదన్నా ప్రజలపై తప్పక ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా యువతీ యువకులకు సినిమాలన్నా, సినిమా నటులన్నా చాలా క్రేజ్. వాళ్ల భాష, వేషం, ప్రవర్తన, నటన.. అన్నింటిని యువకులు ఆదర్శంగా తీసుకొంటున్నారు. ఇటీవలకాలంలో బుల్లితెర మాధ్యమాల ప్రభావం ఎక్కువ కావడంవల్ల సినిమా నటులు అనేక షోలల్లో నటిస్తున్నారు. కొందరికి సినిమా అవకాశం తగ్గాక ఇలా వెండితెరపై మళ్లా కాంతులీనుతున్నారు. సినిమా నటులు మొదలుకొని బిత్తిరిసత్తి వరకు అందరూ ఇవాళ సెలబ్రిటీలుగా యువతరంతో ఆరాధింపబడుతున్నారు. ఈ సెలబ్రిటీలే ఎన్నో వ్యాపార, వాణిజ్య ప్రకటనలకు ప్రమోటర్లుగా ఉన్నారు. వస్తువులు మొదలుకొని రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనుగోలు వరకు అన్నీ కొనుక్కోమని ఊదరగొడుతున్నారు. ఒక పేస్ట్ మంచిదా! చెడ్డాదా! అని నిర్ణయించాల్సిన డెంటల్ డాక్టర్ల వేషం కూడా సినిమా యాక్టర్లే తెల్లకోటు వేసుకుని రకరకాల పేస్టులు కొనిపిస్తున్నారు. మన దేశంలో కోట్లమంది ప్రజలు త్రాగునీటి కోసం అల్లాడుతుంటే మనల్ని కోకోకోలా, పెప్సీలు తాగమని సినిమాతారలు మన మెదళ్లలోకి చొచ్చుకుపోయే విధంగా చెప్పడం ‘జాతీయనేరం’ కాదా! కోకోకోలావల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల అనారోగ్యానికి, మన భూగర్భ జలాల విధ్వంసానికి ఈ అడ్వర్టైజ్‌మెంట్ చేసే సినిమా నటులు వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారా? కోల్గెట్, కోకోకోలా, క్లోజప్, ఫోర్‌హన్స్ మొదలుకొని అండర్‌వేర్‌ల వరకు అన్నీ వీరికి ఆదాయ వనరులే.
బహుళజాతి కంపెనీల మాయలో ప్రజలనూ, ప్రభుత్వాన్ని తెలియకుండానే పడేస్తున్న సినిమా తారలు, క్రికెటర్లు దేశాన్ని విషాదంలో నింపడమే కాదు, వాళ్లూ వివాదాల్లో చిక్కుకొంటున్నారు. 1977లో మొరార్జీ దేశాయి ప్రభుత్వం జీరో టెక్నాలజీకి చెందిన 840 ఉత్పత్తుల జాబితా సిద్ధం చేసి వాటివల్ల ప్రజలకు, మన దేశ ఆర్థిక వ్యవస్థకు భంగం కలుగుతుందని వాటిపై నిషేధం విధించాలని ప్రతిపాదించింది. సరళీకరణ, ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్‌గా మార్చుతున్న క్రమంలో ప్రపంచంలో ఎక్కువ మానవ వనరులున్న మన దేశం అందరికీ పెద్ద మార్కెట్‌గా మారింది.
ఈ మార్కెట్‌ను విస్తరించే క్రమంలో మన సెలబ్రిటీల పాత్ర ఎక్కువగా వుంది. అందమైన ముఖాలు మార్కెట్ చేస్తున్న ఈ తరుణంలో సినిమా తారలు జీవితాలను మార్కెట్‌గా మార్చేశారు. సమాజంలోని యువతరాన్ని మానసిక రోగులుగా మార్చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న మన దేశం ఒకప్పుడు ..... స్వామి వివేకానందను సృష్టించింది. ప్రపంచ ఆధ్యాత్మిక రంగాన్ని ఆ యువకుడు ఉఱ్ఱూతలూగించాడు. 25 ఏళ్లు నిండకుండానే ఉరిత్రాడును ముద్దాడడానికి సిద్ధమైన భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లు ఈ గడ్డపై ప్రభవించారు. అలాంటి చైతన్యమూర్తులు జన్మించిన ఈ గడ్డపై యువతరాన్ని ఎటువైపు తీసుకుపోతున్నాం?
ప్రతి విషయాన్ని మార్కెట్ కోణంలో చూపించే పాశ్చాత్య సంస్కృతిని సినిమాల ద్వారా మన సమాజంలోకి ఒంపుతున్న ఆ రంగానికి చెందిన మేధావులు జీవితాన్ని కళగా మార్చాల్సింది పోయి కళనే జీవితంగా భ్రమింపజేస్తున్నారు. పెద్ద జనాభా ఉన్నందువల్ల ఈ ప్రభావం మనకు తెలియడంలేదు. ఒకవేళ మన దేశం ఐర్లండ్, నార్వే, క్యూబాలాగా చిన్నదేశాలుగా ఉండేట్టు అయితే అప్పుడు మన సమాజం పరిస్థితి ఏమిటి?
ఐరోపా సమాజంలో సాంకేతికాభివృద్ధి బ్రహ్మాండంగా జరిగినా కొన్ని విషయాల్లో వారి నైతిక పతనం అక్కడి బుద్ధిజీవులకు నిద్రపట్టనివ్వడంలేదు. ఈ విశృంఖలత్వం మెల్లమెల్లగా మన సమాజంలోకి తీసుకువస్తున్నవాళ్లు ఎక్కువగా సినిమా రంగంవారే అంటే మనపై విరుచుకుపడతారు. పదేళ్ల క్రితం బ్రిటన్‌లో 11 ఏళ్ళ బాలుడు 15 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేశాడు. ఆనాడు అదొక వార్త. కానీ ఈ దుస్థితి మనకు దాపురించింది. ఏ వార్తాపత్రిక తిరగేసినా ‘నేరాలు - ఘోరాలు’ పేరుతో ప్రత్యేక శీర్షిక పెట్టాల్సిన దుర్దశ వచ్చింది. హత్యలు, అత్యాచారాలు ఈనాటి పాఠకుల దృష్టిలో సాధారణంగా మారిపోయాయి. సినిమాల్లో సున్నితంగా కన్పిస్తున్న ‘ప్రేమ’ కథనాలు స్ర్తిలపై అత్యాచారాలకు పరోక్షంగా కారణం అవుతున్నాయి. అపరిపక్వమైన మనసున్న వ్యక్తులు దీనిని నిజంగా జీవితంలోకి తీసుకురావాలనుకొన్నపుడే సంఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ప్రేమ అనగానే ఇద్దరు స్ర్తి, పురుషుల మధ్య మాత్రమే జరిగే రసాయన ప్రక్రియగా చూపిస్తున్న సెల్యులాయిడ్ మగధీరులకు ఎవరు చెప్పగలరు? అదీ ఇరవై ఏళ్ల వయసున్న యువతలో నాటుతున్న విషబీజంగా మారడం దురదృష్టం. మార్కెట్‌లోకి వస్తున్న చలనచిత్రాల్లో ఎనభై శాతం ఈ రకానికి అద్దం పట్టడం దిగజారిన విలువలకు ప్రతీక. ఇదంతా ‘కళాఖండం’ అంటూ సినిమా పెద్దలు దబాయించడం మరో నయవంచన. నిజానికి ప్రేమ అనేది ఒక అమార్తమైన ఆనందభావన. అది బంధాన్ని తెలిపేది. ఎన్నో రకాలుగా ఉన్న ప్రేమను గుర్తించకుండా దానిని ఒక లైంగిక వాంఛ తీర్చే సాధనంగా మార్చడం క్షమించరాని నేరం. స్ర్తిలపై పురుషులకు, పురుషులపై స్ర్తిలకు ప్రేమ ఉంటే దానిని ‘మోహం’ అని, ధనంపై ప్రేమ ఉంటే అది ‘లోభం’ అని, పుత్ర పౌత్రాదులపై ప్రేమ ఉంటే ‘వాత్సల్యం’ అని, దేహంపై ప్రేమను ‘అభిమానం’ అని పిలుస్తారు. అలాగే దీనప్రాణులపై ప్రేమ ఉంటే ‘దయ’గా, వస్తువులపై ప్రేమ వుంటే ‘మమకారం’గా, మన సమానులపై ప్రేమ వుంటే ‘మైత్రి’గా, సత్పురుషులపై, పెద్దవారిపై వుండే ప్రేమను గౌరవంగా, దేవునిపై, గురువుపై ఉండే ప్రేమను భక్తిగా చెప్పారు. కానీ ఈనాడు సినిమా ప్రభావంవల్ల ప్రేమ సంకుచిత రూపం పొంది పరోక్ష హింసకు కారణం అవుతుంది.
అలాగే సినిమాల్లోని అతిశయోక్తులవల్ల సమాజంలో విపరీతంగా అశాంతి పెరిగిపోతుంది. ఈ అశాంతికి కారణమైనవారే నేడు వివిధ వేదికల ద్వారా, రాజకీయాల్లో చేరడం ద్వారా నీతివాక్యాలు వల్లిస్తున్నారు. వారి జీవితాలే ఆదర్శంగా ఆరాధిస్తున్న యువశక్తి విధ్వంసం అవుతోంది. ఇటీవల పాటల రిలీజ్‌లు, సినిమా విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. రియాలిటీ షోల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అతివ అందాన్ని మార్కెట్‌గా మార్చి ఏమార్చుతున్న తారాగణం వైఖరిలో మార్పు తెచ్చేవారెవరు?
ఆఖరుకు రాజకీయ వ్యవస్థ కూడా సినిమా రంగానికి లొంగిపోతున్న వైనం చూస్తాం. కొందరు నటీనటులు ఏ పార్టీ అధికారంలో వస్తే వారికి బాజా వాయిస్తూ తమ ఆస్తులను కాపాడుకుంటున్నారు. సమాజంలో ప్రజాస్వామ్య వాతావరణ నిర్మాణాన్ని వదిలేసి అభూత కల్పనల పెద్దరికాన్ని బలవంతంగా మన మెదళ్లలోకి చొప్పిస్తున్నారు. అనేక సంఘర్షణలతో సతమతమవుతున్న మనుషులను అశాంతికి గురిచేస్తున్నారు. డబ్బు, అధికారం, రూపం మాత్రమే గొప్పవన్న భావన కల్పిస్తూ మానవతా లక్షణాలను మంటగలుపుతున్నారు. వినోదం మాత్రమే మనిషికి ప్రధానం అన్న ఏకైక లక్ష్యంతో సినిమా వ్యవస్థ పనిచేస్తూ ధనార్జన చేస్తుంది. కథలో అంతస్సూత్రం ఎలా ఉన్నా, అది ఎలాంటి సందేశం ఇచ్చినా పేర్లు మహా విచిత్రంగా ఉంటున్నాయి. పోకిరి, ఇడియెట్, జేబుదొంగ, అసెబ్లీ రౌడీ, ఐ లవ్ యు టీచర్.. లాంటి పేర్లు ఉదాహరణ మాత్రమే! ఇక కులాలపై, మతాలపై సినిమాలు నిర్మించి విడుదలకు ముందే వివాదాలు సృష్టించి ప్రచారం పొందుతున్నారు. కొన్ని కుటుంబాలకే అగ్రతాంబూలం ఇచ్చే షోలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. వాళ్లు పండుగలు మొదలుకొని పచ్చిగడ్డి వరకు అన్నింటికి అడ్వర్టైజ్ చేస్తారు.
ధనార్జనే జీవిత లక్ష్యంగా సాగే ఈ తంతు విలువలకు తావులేకుండా పోవడంతో సమాజంలో సంఘర్షణ మొదలయ్యింది. వ్యక్తిని కులానికి, మతానికి, వర్గానికి పరిమితం చేసే కుటిల రాజకీయ చదరంగం ఒకవైపు నడుస్తుంటే వ్యక్తిత్వాన్ని అపరిపక్వ ‘ప్రేమ’ అనే చట్రంలో ఇరికించి సినిమా రంగం యువతను పెడద్రోవ పట్టిస్తుంది. ఇందులో కొందరికి మినహాయింపు ఉన్నా సింహభాగం ఇదే తంతు నడుస్తోంది. అనేక దుశ్చర్యలతో మనిషిని పశువుగా మార్చివేస్తున్న ఈ రంగంవారే మహాత్ముల్లా సందేశాలు ఇస్తుంటే రేపటితరం భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఎందరి మెదళ్లనో తొలుస్తుంది. సమాజంలోని బుద్ధిజీవులు ఈ విషయంపై తీవ్రంగా ఆలోచించకుంటే కాన్సర్‌లా లోపల పుట్టిన ఈ పుండు సమాజాన్ని నిర్వీర్యం చేయడం ఖాయం. మేడిపండులా పైన నిగనిగలాడుతూ లోపల మురిగిపోయిన సమాజం గొప్ప దేశాన్ని ఎలా నిర్మించుకుంటుందో ఆలోచించాలి?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి