సెక్యులరిజం ప్రబోధించే భక్త శిఖామణులు !


‘ఏమండీ! మీ నాస్తిక సభలు ఎలా జరిగాయి? అని ఓ నాస్తిక సంఘం అధ్యక్షుణ్ణి అడిగితే-పూర్వ వాసనలు నశించని ఆ అధ్యక్షుడు ‘దేవుని దయవల్ల బాగానే జరిగాయి’! అన్నాట్ట! ఇది పాత కాలం జోక్ అయినా ఈ రోజుకూ నవ్వుకుంటాం! ప్రస్తుతం దేశ రాజకీయాల్లో, ప్రచార ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా వినిపించే పదం ‘సెక్యులరిజం’. భారతదేశంలో ‘అన్నిమతాలు సమానమా!’, ‘్భరతదేశం మత నిరపేక్ష రాజ్యమా’! అన్న మీమాంస బుద్ధి జీవులను వేధించినా సరైన సమాధానం రాదు. ముఖ్యంగా హిందూ మతం అంటేనే భగ్గుమని మండిపోయే నాయకులు, సెక్యులర్ మంత్రాన్ని నిత్యం జపించే నాయకులు తాము వ్యక్తిగతంగా విపరీతమైన మతాన్ని అనుసరిస్తారు! ఇదంతా ఒక రకమైన భావ దారిద్య్రమే! విచిత్రం ఏమిటంటే వారు ఇలాంటి ‘సిద్ధాంత రాహిత్య భావనతోనే’ రాజకీయాల్లో ముందుంటారు. భారతదేశంలోని ‘సెక్యులర్ నాయకుల చరిత్ర’ అంతా ఇలాంటి ‘వీరభక్తి’ నిండి ఉంటుంది.
భారతదేశంలో గాంధీని మించిన ‘సెక్యులరిస్టు’ ఎవరుంటారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సెక్యులరిజం’ అనే పదం రాజ్యాంగంలోకి ఎక్కినా అంతకన్నా యాభై ఏళ్ల ముందునుండే గాంధీజీ సెక్యులరిస్టును అని ముద్ర వేయించుకున్నాడు. కానీ గాంధీజీ చేతిలో ఎప్పుడూ హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత ఉండేది. ‘అహింస, ఉపవాసం, సత్యాచరణ అన్నీ నేను హిందూ గ్రంథాలనుండి హిందూ మహాపురుషులనుండే నేర్చుకున్నా’నని చెప్పుకున్నాడు. చివరకు మరణించే సమయంలో ‘హేరామ్!’ అన్నాడని చెప్తారు. అలాగే తనకు ‘రాజకీయ సంక్షోభం’ వస్తే భగవద్గీతను చదువుతానని అందులోంచి తప్పక పరిష్కారం లభిస్తుండేదని’ గాంధీ చెప్పుకున్నాడు. కానీ గాంధీజీని అనుసరించే గాంధేయవాదులు, పార్టీలు హిందూమతం అంటేనే భగ్గుమంటారు. ఇది ఎలాంటి ‘సెక్యులరిజం’? ఇక్కడే గాంధీ వాదానికీ, గాంధీ జీవితానికీ మధ్య వైరుధ్యం కనిపిస్తుంది. ఇక గాంధీకి అపరభక్తుడైన జవహర్‌లాల్ నెహ్రూ గాంధీయిజాన్ని, కమ్యూనిజాన్ని కలగలిపి-దానిని పాశ్చాత్య భోగవాదంతో సమ్మిళితం చేసాడు. నెహ్రూ తాను ఆచరించే విధానాల్లో కమ్యూనిస్టుగా కన్పిస్తాడు. ఆయన కూడా ప్రధానిగా తిరుమలకు వెళ్లాడు. ఇంట్లో వ్యక్తిగతంగా హిందూ జీవితమే గడిపాడు.
నెహ్రూ అనంతరం ప్రధానిగా వచ్చిన ఆయన కూతురు ఇందిరాగాంధీ మెడలో ఎప్పుడూ జపమాల ఉండేది. మొదటిసారి అణుపరీక్షలు నిర్వహించినపుడు పార్లమెంటులో నాటి ప్రతిపక్ష నాయకుల్లో ఒకరైన అటల్‌బిహారీ వాజ్‌పేయి ఆమెను ‘అపర దుర్గగా, కాళి’గా వర్ణిస్తే అమితంగా సంతోషపడింది. ఎన్నో గుళ్లను, ఆశ్రమాలను, గురువులను ఇందిర సందర్శించింది.
ఆ కాలపు సోషలిస్టు మేధావి రామ్‌మనోహర్‌లోహియా పెద్ద సెక్యులరిస్టు. కానీ ఆయన ఓసారి ‘కాశ్మీర్‌ను కన్యాకుమారిని శ్రీరాముడు కలిపితే, తూర్పు పశ్చిమాలను శ్రీకృష్ణుడు కలిపాడు’ అని ప్రకటించి, తన రామకృష్ణ భక్తిని చాటుకున్నాడు. నంబూద్రిపాద్ లోలోపల శంకరుని అద్వైతాన్ని ఇష్టపడేవాడని చెబుతారు. హిరేన్ ముఖర్జీ వంటి కమ్యూనిస్టు కూడా దైవభక్తుడే. అదేవిధంగా రాజీవ్‌గాంధీ షహబానో కేసులో వేసిన తప్పటడుగులను సరిచేసుకోవడానికే అయోధ్య రామమందిర తాళాలు తెరిపించాడని విశే్లషకులు చెప్తారు. జార్జి ఫెర్నాండెజ్ పేరులో క్రైస్తవం వున్నా బొట్టు పెట్టుకునేవాడు. పి.వి.నరసింహారావు లాంటి కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది లోపల గట్టి హిందుత్వ వాది అని చెప్తారు. బాబ్రీ మసీదు కూలగొడుతుండే సమయంలో ఆయన ప్రధానిగా వౌనంగా వున్నాడని ఇప్పటికీ సెక్యులర్ వాదులు విమర్శిస్తారు. రాష్టప్రతిగా శంకర్ దయాళ్ శర్మ ఎంత భక్తుడో మనకు తెలియంది కాదు.
ఇక ఇప్పుడు బతికున్న చాలామంది నాయకుల్లో వ్యక్తిగతంగా తీవ్ర హిందు ఆచారాలు పాటిస్తారు. కానీ రాజకీయంగా సెక్యులరిస్టులమంటూ దబాయిస్తారు. హిందుత్వం, ఆర్‌ఎస్‌ఎస్ అన్నా తోకతొక్కిన తాచులా మండిపడే లాలు ప్రసాద్ యాదవ్ అతి ఎక్కువగా ఆచారాలు పాటిస్తాడు. అలాగే ములాయంసింగ్, శరద్ పవార్, శరద్ యాదవ్ తమ వ్యక్తిగత వ్యవహారాల్లో హిందూ ఆచారాల్లో మునిగి తేలుతారు.
మాజీ ప్రధాని కర్నాటక సెక్యులర్ టీం అధినేత దేవెగౌడ ఎప్పుడూ బొట్టుతో కనిపిస్తాడు. కర్నాటక బసవేశ్వరుని ప్రభావంవల్ల వెలసిన లింగాయత్ మఠాల ఆధిపత్యం ఎక్కువ. వాళ్లతో పెట్టుకుంటే అక్కడి రాజకీయ నేతల రాజకీయానికి నూకలు చెల్లినట్టే. అందువల్లనే దేవెగౌడతో సహా అక్కడి రాజకీయ సెక్యులర్ నేతలంతా కన్నడ మఠాల చుట్టు ప్రదక్షిణ చేస్తారు. కరుణానిధి లాంటి కరుడుగట్టిన సెక్యులర్ హిందూ వ్యతిరేక ద్రావిడ నేతను 2016లో గోపాలపురంలో ఆయన ఇంట్లో టిటిడి అర్చకులు వేదాశీర్వచనం తెలిపారు. శ్రీమద్రామానుజుల జీవితంపై కరుణానిధి రాసిన సీరియల్ తమిళనాట కళైంగర్ టీవీలో బహుప్రచారం పొందింది. అక్కడే మొన్నటివరకు రాజ్యమేలిన జయలలిత కరుణానిధికి వ్యతిరేకంగా హిందుత్వకు ప్రతినిధిగా నిలబడింది. కాశ్మీర్‌కు చెందిన ఫరుఖ్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లా 2013లో విల్లుపురం దగ్గరలోని వైష్ణవాలయాన్ని సందర్శించాడు. అతని భార్య పాయల్ అబ్దుల్లా, చెల్లెలు, కొడుకులు జహీర్, జమీర్ 2017లో తిరుమలను సందర్శించారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో హిందుత్వ రాజకీయం గిరాకీ బాగా పెరిగింది. మొన్నటికి మొన్న బెంగాల్‌లో భాజపా వారు శ్రీరామనవమి ఘనంగా నిర్వహిస్తే మమతతో సహా తృణమూల్ కార్యకర్తలు ఆ తర్వాత వచ్చిన హనుమజ్జయంతి అట్టహాసంగా చేసారు.
భారతదేశంలో సెక్యులరిజానికి దత్తపుత్రులైన కమ్యూనిస్టుల్లో ఎందరో భక్తులు ఉన్నారు. ఇటీవల సిపిఐ నారాయణ తిరుమలకు వెళ్లివచ్చారు. ఏదో కుటుంబం కోసం వెళ్లానని మీడియాలో బుకాయించారు అది వేరే విషయం! ప్రజా గాయకుడు గద్దర్ ఇటీవలి కాలంలో కొమురెల్లి మల్లన్న మొదలుకుని భద్రాచల రాముని వరకు అందరి దర్శనం చేసుకున్నాడు. చలం వామపక్ష వాద ప్రభావంతో ఎన్నో విధ్వంసక రచనలు చేసి తర్వాత అరుణాచలం గొప్పభక్తుడై పోయాడు. రావిశాస్ర్తీ లాంటి కమ్యూనిస్టు రచయిత, తెలంగాణలోని రాచకొండను సందర్శించి, పూజలు చేసి ఇది మా పూర్వీకుల గ్రామం అన్నాడు. జ్వాలాముఖి, మహాస్వప్న, చెరబండరాజు వంటివారు అంతర్గతంగానో, బహిరంగంగానో భక్తులే. శ్రీశ్రీ కవిత్వంలోని ప్రతీకలన్నీ సంప్రదాయంలోనివే. కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వ అధీనంలోని శబరిమలై దేవాలయంలో తిరుపతిలో కూడా లేని నిబంధనలను ఆమలు చేస్తున్నది. కమ్యూనిస్టు రచయితలమని చెప్పే చేకూరి రామారావు (చేరా) చివరి దశలో భగవద్గీత పట్టుకు తిరిగాడని చెప్తారు. అలాగే గజ్జెల మల్లారెడ్డి స్వామి వివేకానందునిపై ‘ది సాంగ్ ఆఫ్ సన్యాసి’ని ‘యతి గీతం’గా అనువదించాడు. హిందుత్వకు వ్యతిరేకంగా పత్రికల్లో పనిచేసిన పురాణం సుబ్రహ్మణ్య శర్మ ’నారాయణీయం’ పేరుతో అనువాదం చేసాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుగా పాల్గొన్నానని వాదించే దాశరథి రంగాచార్య వేదసాహిత్యాన్ని ఆపోశన పట్టారు. ఇలా ఎందరో కమ్యూనిస్టు, సెక్యులరిస్ట్ భావజాలంతో ఉంటే వ్యక్తిగతంగా హైందవ జీవన విధానం అనుసరించినవారే.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పని చేసిన మర్రి చెన్నారెడ్డి పుట్టపర్తి సాయిబాబా భక్తుడే. టి.అంజయ్య యానగొంది మాణిక్యమ్మను కొన్నాళ్లు ఆరాధించాడు. ఎన్టీఆర్ జీవితమంతా హిందూ విధానంలోనే గడిచింది. తర్వాత పైకి ఆచారాలు పట్టనట్టు కనిపించే చంద్రబాబు పుట్టపర్తి సత్యసాయి భక్తుడిగా, బ్రహ్మకుమారీ ధ్యాన పద్ధతి అవలంబించినట్టు చెప్పుకుంటారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పక్కా వైష్ణవుడిగా కన్పిస్తాడు. అలాగే గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్రైస్తవుడిగా మతం మారినా తిరుపతికి వెళ్లడం, ఫ్రారంభోత్సవాలన్నీ హిందూ పద్ధతిలోనే చేసేవాడు. ఇక అపరభక్తుడైన కెసిఆర్ ఉద్యమం నాటినుండి ఏ యాత్రకువెళ్లినా, సమావేశానికి వెళ్లినా ‘్భజం కట్టు’ రక్ష కట్టుకుంటాడు. ముఖ్యమంత్రి అయ్యాక త్రిదండి చినజీయర్ స్వామిని తన ఆసనంలోనే కూర్చోబెట్టాడు. ఇటీవల శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానందను కలిసాడు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మొక్కులు చెల్లించడానికి ఏకంగా ప్రభుత్వ కామన్‌ఫండ్‌నుండి నిధులు విడుదలకు జీవోలు తెచ్చారు.
సెక్యులరిజాన్ని బాగా నమ్మే జైపాల్‌రెడ్డి హిందు దేవాలయాలకు వెళ్లడం కనిపించలేదు కానీ ఇటీవల జాంగీర్ పీర్ దర్గాకు వెళ్లాడు. కమ్యూనిస్టుల మూల కాండానికి ఉద్భవించిన కోదండరాం కూడా ఇటీవల అనేక దేవాలయాలు సందర్శించాడు.
ఇక అసలు విషయానికి వస్తే హిందుత్వ వాదులుగా చెప్పే లేదా సెక్యులర్ వ్యతిరేకులుగా ముద్రపడిన జన సంఘ్, భాజపా నేతల్లో ఈ వ్యక్తిగత తీవ్రత కన్పించదు. శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాల్ ఉపాధ్యాయ, వాజపేయి, అద్వానీ ముఖాల్లో అకేషనల్‌గా తప్పితే ఎప్పుడు ముఖంపై బొట్టు కూడా కనిపించదు. నరేంద్ర మోదీ మాడ్రన్‌గా కన్పిస్తాడు. గెలిచాక కాశీలోని గంగాహారతిలో పాల్గొన్నాడు. అలాగే ఇటీవల యుపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాధ్ వేసుకునేవి కాషాయ వస్త్రాలైనా సన్యాసిలా వైరాగ్యంతో కాకుండా నిండువిశ్వాసిలా కన్పిస్తాడు. గతంలో హోలీ సందర్భంలో రంగుల్లో తేలేవారు వాజ్‌పేయి, అద్వానీ, ఇతర భాజపా నేతలు. ఇంతకుమించి వారు వ్యక్తిగతంగా హిందుత్వ ఆచార సంప్రదాయాలు కన్పించవు. ఒకవేళ ఉన్నా అవి సెక్యులర్ నేతల్లా ప్రచారానికి వాడుకోలేదు.
ఇక్కడ విడ్డూరమైన విషయం ఏమిటంటే వ్యక్తిగతంగా హిందూ ఆచార వ్యవహారాలను పాటించే నాయకులంతా సెక్యులరిజం పేరుతో హిందుత్వను దూషిస్తారు. హిందుత్వను దూషించడమే సెక్యులరిజం అనుకుంటారు. వ్యక్తిగతంగా ఎలాగైతే నమ్మకాలను పాటిస్తున్నారో అవి ప్రజల్లో వుండొద్దు అనుకోవడం వీళ్ల సెక్యులర్ ఉపదేశం. నాయకులు తమ కుటుంబాలు, తాము బాగుండడానికి నమ్మకాలను ప్రదర్శిస్తే తప్పులేదు కానీ ప్రజలు మాత్రం మేం చెప్పిన సెక్యులర్ వాదం అనుసరించాలంటారు! ఇదెక్కడి సూత్రం! ఆచరణలేని ఆదర్శాలు వల్లించే నాయకులు, రచయితలు, మేధావులు, ప్రజలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకోవడం అవివేకం. రాజ్యాంగంలో చెప్పిన సెక్యులర్ పదానికి విపరీతార్ధాలను సృష్టించి ప్రజల్ని గొర్రెల్ని చేస్తామనుకుంటే మోదీలు, యోగులు పుడుతూనే ఉంటారు. మతాలవారి సంతుష్టీకరణ మానుకుని, ప్రజలను నిజమైన అభివృద్ధివైపు తీసుకెళ్లాలి. మన సంస్కృతి, చరిత్రను సజీవంగా నిలిపి సరికొత్త అభివృద్ధితో ముందుకెళ్లాలంటే నాయకులకు దూరదృష్టి ఉండాలి. అంతేకానీ తమ వ్యక్తిగత జీవితాల్లో ఆచరించే జీవన సూత్రాలను ప్రజలనుండి దూరం చేసి ఓట్ల రాజకీయం చేస్తే వాళ్ల సమాధిని వాళ్లే తవ్వుకున్న వారవుతారు. ‘మేం చేస్తే సిద్ధాంతం, మీరు చేస్తే రాద్ధాంతం’ అనకుండా ప్రజల నమ్మకాల్ని గౌరవించండి. ఆచరణాత్మకంగా మీరు చూపే మార్గం ప్రజలు గమనిస్తున్నారని మరిచిపోకండి. భారతీయతను మీరు ఎంతగా గౌరవిస్తారో, ఆచరిస్తారో ప్రజలు అంతే ఆచరిస్తారు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం లౌకికవాదాన్ని-కులౌకిక వాదంగా మార్చకండి!

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi , Friday, 28 April 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి