ప్రొద్దునే్న నిద్రలేచిన తండ్రి ముఖం కడుక్కోవడానికి వెళ్తున్నప్పుడు అడ్డుగా ఓ బకెట్ వచ్చి కాలికి తగిలింది. ‘ఎవడ్రా! ఇక్కడ ఈ బకెట్ పెట్టింది’ అని కొడుకును చెడామడా తిట్టాడు. కొడుకు వౌనంగా వెళ్లిపోయాడు. ఓ వారం అయ్యాక అదే బకెట్ కొడుకు కాలికి తగిలింది. అక్కడేవున్న తండ్రి ‘కళ్లుకనిపించడంలేదా’ చూసుకుని నడవక్కర్లేదా! అంటూ కొడుకుపై మండిపడ్డాడు. విషయం ఒక్కటే. కానీ దోషి కొడుకయ్యాడు. ఎందుకంటే తండ్రి దగ్గర తర్కం ఉంది. కొడుకు దగ్గర వౌనం వుంది. అంతే తేడా!
ఈ దేశంలో ఇప్పటివరకు చరిత్రకారులంతా తండ్రి బాపతు. భారతీయ చరిత్రను అష్టవంకర్లుగా మార్చి విలన్లను హీరోలను చేసిన ఘనత మన సోకాల్డ్ చరిత్రకారులదే! గతవారం భాజపాకు చెందిన ప్రముఖ నాయకుడు సంగీత్‌సోమ్ మొగలాయి పాలనలో జరిగిన దుర్మార్గాలను ఎండగట్టాడు. మొఘల్ పాలకులను హిందువులను బానిసలుగా, కాఫిర్లుగా భావించిన దుర్మార్గులు అన్నాడు. అంతటితో ఊరుకోకుండా తాజ్‌మహల్ మన సంస్కృతిని, చరిత్రను అవమానించే కట్టడం, అది తాజ్ మహల్ కాదు, తేజో మహాలయం అన్నాడు.
వెంటనే దేశంలోని సూడో సెక్యులర్ గ్యాంగంతా రంగంలోకి దిగింది. ఆజంఖాన్, అసదుద్దీన్ ఒవైసీ ఓ అడుగు ముందుకు వేసి ‘తాజ్‌మహల్ బానిస చిహ్నమైతే, ఢిల్లీలోని లాల్‌ఖిల్లా (ఎర్రకోట) కూడా వాళ్లే (మొగలాయిలు) కట్టారు. కాబట్టి ప్రధాని దానిపైనుండి పతాకావిష్కరణ చేయడానికి వీల్లేదు’ అన్నారు. ఇక సెక్యులర్ చరిత్రకారులు ఎగిరి గంతేసి మొగలాయి పాలనంతా స్వర్ణయుగం అన్నట్టు చానళ్లకు కావాల్సిన మసాలా ఇచ్చారు.
ఇక రాష్ట్ర స్వాభిమాన్ దళ్, హిందూ యువవాహిని కార్యకర్తలు మొన్నటి కార్తీక సోమవారంనాడు ‘తాజ్‌మహల్ కాదది తేజోమహాలయం’ అంటూ అక్కడికి వెళ్లి ‘శివచాలీసా పారాయణం’ చేసారు. డా.సుబ్రహ్మణ్యస్వామి మాత్రం ఆ భూమి షాజ్‌హాన్ అక్రమంగా ఆక్రమించి అక్కడ తాజ్‌మహల్ నిర్మించిన ఆధారాలు ఉన్నాయన్నాడు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీర్ధక్షేత్రాలనుండి తాజ్‌మహల్‌ను తొలగించి, పర్యాటక క్షేత్రాల్లో తాజ్‌మహల్‌ను చేర్చడం ప్రతిపక్షాలు వివాదాస్పదం చేసాయి!?
భవిష్యత్తులో కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ప్రధాని అభ్యర్థిగా యోగీ ఆదిత్యనాథ్‌ను తెరమీదకు రాకుండా చేయడమే సూడో సెక్యులర్ వాదుల అజెండా. మతతత్వవాది అనే అపనిందలు వేసి ఇతడు ఈ దేశ సెక్యులర్ రాజ్యాంగానికి సరిపోడు అని అపఖ్యాతిపాలు చేయడమే ప్రధాన కుట్ర. గతంలో మోదీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. కొత్తగా యోగి ఆదిత్యనాథ్ వచ్చాకే మొగల్ రాజుల గురించి, తాజ్‌మహల్ గురించి చర్చ వచ్చిందా? అన్న ప్రశ్న వేసుకునే మనం చరిత్రను విశే్లషించుకోవాలి.
యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకముందే ఎంపీగా ఉన్నప్పుడే గోరఖ్‌పూర్‌లోని ‘మియాబజార్’ను ‘మాయా బజార్’గా, ఉర్దు బజార్‌ను హిందీ బజార్‌గా, అలీనగర్‌ను ఆర్యనగర్‌గా పేర్లు మార్చాడు. ‘బానిసత్వాన్ని గుర్తు చేసుకునే చిహ్నాలు నా నియోజకవర్గంలో ఉండడానికి వీల్లేదు’ అన్నాడు. అందుకే ఇటీవల జరుగుతున్న చర్చను సెక్యులర్ పార్టీలు, ఎర్ర చరిత్రకారులు రచ్చ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొగలాయి బాబర్‌నుండి ఔరంగ జేబు వరకు అందరూ ఉదార స్వభావులనే చరిత్రకారుల గుంపు బ్రిటిష్ కాలంనుండే ఉంది. కానీ తారేఖ్‌ఫతేలాంటి ఇస్లాం మత చరిత్ర విశే్లషకుడే ‘గజనీ, ఘోరీ, తైమూర్, నాదిర్షా, బాబర్, ఔరంగజేబు’ లను తమ పూర్వీకులుగా భారతదేశంలోని ముస్లింలు అంగీకరిస్తే అది ఆత్మహత్య సదృశమే’ అని ఎన్నోసార్లు చెప్పాడు. ఆయనే స్వయంగా ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్డు ఫలకంపై నల్లరంగుపూస్తాను అని ప్రకటించాడు. కానీ మెకాలే చదువులను మోకాళ్లనుండి మెదడు వరకు నిండానింపుకున్న మన చరిత్రకారులు చరిత్రహీనులను ఈదేశ ఆరాధ్య పురుషులుగా మార్చారు. మెకాలే, మాక్స్‌ముల్లర్ ఈ ప్రహసనానికి దారులు వేస్తే రోమిల్లా థాపర్, సతీశ్‌చంద్ర, రామచంద్రగుహ లాంటి వామపక్ష చరిత్రకారులు చరిత్ర గ్రంథాలకు తమ కలంపోటు ద్వారా పక్షవాతం వచ్చేట్టు చేసారు. ఈ భావ జాలానికి అనుకూలంగా రచనా రంగంలో అరుంధతీరాయ్, బిపిన్ చంద్ర, అర్బన్ సుఖియా వంటి వాళ్లు ఎన్నో విష బీజాలు నాటివేసారు. ఆ విష వృక్షాలకు పుట్టిన ఫలాలే కన్హయకుమార్, ఉమర్ ఖాలీద్ లాంటివాళ్లు!
జేమ్స్‌మిల్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు ఎప్పుడూ భారతదేశం రాకుండానే, బ్రిటన్‌లో ఏ భారతీయుణ్ణి కలవకుండానే, ఏ భారతీయ గ్రంథాన్ని చదవకుండానే భారతదేశ చరిత్ర రచించాడు. ఇంతకన్నా వికృతం ఇంకేముంటుంది? ‘నిఆ జఒ ఘ శ్ఘఆజ్యశ జశ ఆ్దళ ఘౄరీజశ’ మేమే ధేశంగా మార్చాం అన్నాడు. మరో దుర్మార్గమైన చరిత్రకారుడు జాన్ మాల్కమ్ ‘పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా’ అన్న తన గ్రంథంలో సిక్కులను, మరాఠీలను వేరు చేసాడు. ఎల్సిస్టన్ కేధ్, పార్జిటర్ దళిత, ఆదివాసులను ఈ దేశంనుండి వేరు చేసారు. వీళ్ల త్రోవలోనే తు.చ. తప్పకుండా నడిచిన మన ఎర్రకళ్లద్దాల చరిత్రకారులు బ్రిటిష్ వాళ్ల కొసను అందుకుని ఆర్య-ద్రావిడ సిద్ధాంతంతో మొన్న మొన్నటి వరకు కాలక్షేపం చేసారు. ఆఖరుకు బాలగంగాధర్ తిలక్ లాంటి మహా పండితుడు కూడా ఈ ఉచ్చులో మొదట పడ్డాడు.
ఈ దేశంలోని ప్రజలను ఆర్యులుగా-ద్రావిడులుగా విభజించి భావోద్వేగాలు రాజేసి ఆ మంటల్లో చలి కాచుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ దీనిపై విస్తృత పరిశోధన చేసిన డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ‘ఆర్యులు భారతదేశంపై దాడి చేసి జయించారన్నది అభూత కల్పన’ అని తన రచనల్లో (డా.బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, సంపుటం-7, పుట-73)లో పేర్కొన్నారు. అదే పుస్తకంలో ‘ఆర్యులు వెలుపలినుంచి వచ్చి భారతదేశాన్ని జయించారన్న మాట ఋజువు కాలేదు. దాసులు దస్యులు భారతదేశానికి చెందిన ఆదిమ తెగలవారనడం ఖచ్చితంగా తప్పు’ అని కుండ బద్దలు కొట్టారు. అంతేకాకుండా హైదరాబాద్ సిసిఎంబి శాస్తవ్రేత్తలు అమెరికా హార్వర్డ్ మెడికల్ స్కూల్ లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి 13 ప్రాంతాల్లో చేసిన పరిశోధనల ఫలితాలు 2009 సెప్టెంబర్ ‘నేచర్’ పత్రిక ప్రకటించింది. ‘సోకాల్డ్ అగ్రకులాల జీవజన్యు వారసత్వం, దళిత, వనవాసీల జన్యు వారసత్వం ఒక్కటే అని తేల్చింది. కానీ చరిత్రకు మసిబూసి మారేడు కాయ చేసి, మార్కెట్లో అమ్ముకునే మేధావులు ఆర్య-ద్రావిడ సరుకుకు గిరాకీ పెంచుతూనే ఉన్నారు.
ఇక ఇటీవల దేశంలో ఔరంగజేబు భక్తులు ఎక్కువయ్యారు. సిక్కుల 8వ గురువైన తేజ్‌బహదూర్‌ను అతని అయిదుగురు శిష్యులను మతం మార్చుకోనందుకు ఢిల్లీలో ఊరేగించి చాందినీ చౌక్ దగ్గర తలలు ఖండించిన ఔరంగజేబు గొప్ప ఇస్లామిక్ వాది అని ప్రచారం చేస్తున్నారు. తండ్రిని జైల్లో బంధించి అన్నను, చెల్లిల్ని చంపిన ఔరంగజేబు హజ్‌యాత్ర కూడా చేయలేదు. ఇలాంటి మతోన్మాదిని మతాచారాలు పాటించి జీవించిన సహృదయుడుగా చిత్రీకరించడం విడ్డూరం. మహ్మద్ ఘజనీ సోమనాధ్ మందిరం కూల్చి మూర్తిని కాబుల్‌కు తీసుకెళ్లి తన మెట్లుగా మార్చుకున్నాడన్న మనకు ఏ చరిత్రకారుడు చెప్పగలడు?
మానవతావాది, పరమత సహనం గలవాడని మన ఏడుపుగొట్టు చరిత్రకారులు చెప్పే అక్బర్ పాదుషా నిష్కారణంగా చిత్తోడ్‌లో 30 వేల మందిని ఒకేరోజు సంహరించిన విషయం ఎందరో చరిత్రకారులు పేర్కొన్నారు. సాక్షాత్తు విశ్వవిఖ్యాత చరిత్రకారుడు వినె్సంట్ స్మిత్ ‘అక్బర్ ది గ్రేట్ మొగల్’ గ్రంథంలో ‘అక్బర్ భారత్‌లో పుట్టి మరణించినా అతడి రక్తంలో భారతీయ రక్తం లేదు. తండ్రివైపునుండి అతడు తైమూర్‌కు ఏడోతరంవాడు. తల్లివైపునుండి చెంఘిజ్‌ఖాన్‌కు వారసుడు’ అన్నాడు. ఈ ఆధారాలను స్వయంగా అక్బర్ వెలువరించిన ‘్ఫత్‌నామా-ఇ-చితోడ్’ అనే విజయ పత్రంలో చూడవచ్చు.
అలాగే తాజ్‌మహల్‌ను ముందుపెట్టి అమర ప్రేమికుడిగా చూపిస్తున్న షాజహాన్ ఏం తక్కువ తినలేదు. మనుషుల్ని చంపటంలో మహా స్పెషలిస్టు. అతని తండ్రి ఏనుగులతో తొక్కించి మనుషులను చంపితే షాజహాన్ పాములతో కరిపించి సరదాగా చంపుతాడని ‘ట్రావెల్స్ ఇన్‌ది మొఘల్ ఎంపైర్’లో బెర్నియర్ పూసగుచ్చినట్టు వివరించాడు. అయితే ఈయన అతిగా ప్రేమించే ముంతాజ్ 1631లో మరణిస్తే పర్షియా, ఇండియా మధ్య ఆసియా ప్లానర్ల ఆలోచనతో రోజూ 20 వేలమంది కూలీలు పనిచేసి 1643 నాటికి తాజ్‌మహల్ పూర్తి చేసారని ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా’ చెప్పింది కాబట్టి అందరూ నమ్మి చావాల్సిందే! విచిత్రంగా మొగల్ దర్బార్‌లో దీనికి సంబంధించి ఆవగింజంత రికార్డు కూడా దొరకలేదు. షాజహాన్ కాలకృత్యాల వివరాలను కూడ రాసిపెట్టిన ఇనాయత్‌ఖాన్ లాంటి వాళ్లు ఈ విషయాలు ఎందుకో రికార్డు చేయలేదు?! బహుశా! అది కబ్జా చేసిన భవనం అని రాయలేదా? విచిత్రం ఏంటంటే షాజ్‌హాన్ కన్నా 300 సంవత్సరాల పాతదని న్యూయార్క్ ప్రొఫెసర్ మార్విన్ మిల్లర్ కార్బన్ డేటింగ్ పరీక్ష ద్వారా తేల్చాడు. అసలు షాజహాన్ భార్యపేరు ముంతాజ్-ఉల్-జామాని. ఆమె అసలు పేరు అంజుమంద్ బానుబేగం. మరి ఈ ముంతాజ్‌లోని తాజ్‌ను మహల్ అనే హిందూ పేరుతో మొగలు చక్రవర్తులు తగిలిస్తారా? ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మహల్ అనే పేరు వాడుతారా? అన్నవి కోటి డాలర్ల ప్రశ్నలు. అలాగే తాజ్‌మహల్‌పైన గుర్తులు, నిర్మాణం అన్నీ భారతీయ సంప్రదాయంగా ఉన్నవే. తాజ్‌మహల్ ప్రాంగణంలోని వక్కల్ ఖానా ఓ సంగీత మందిరం, అష్ట భుజాకృతిలో గోపురాలు, ఇనీ ఏం తెలియజేస్తున్నాయి? అసలు చరిత్ర చదివిన సంగీత్‌సోమ్‌కు ఒళ్లు మండదా?
ఇటీవల కర్నాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిద్ధరామయ్య రకరకాల వేషాలు వేస్తున్నాడు. ముఖ్యంగా టిప్పుసుల్తాన్ గొప్ప దేశభక్తుడని పేర్కొన్నాడు. 8 వేలకు పైగా దేవాలయాలను కూల్చి, మలబారు ప్రాంతంలోని దాదాపు లక్షమంది హిందువులను, 70 వేల మంది క్రైస్తవులను బలవంతంగా జైళ్లలో వేసి ఇస్లాంలోకి మార్చిన విషయం ముఖ్యమంత్రి విస్మరిస్తాడా! దీపావళి రోజు ఎందరో హిందువుల్ని మెల్కొటే ఆలయంలో చంపినందుకు అక్కడ ఈనాటికి చాలామంది ఈ పండుగ జరుపుకోరు. చరిత్రను ఇంత ధ్వంసం చేసి మన మెదళ్లను విషపూరితం చేసినందుకే గదా ఈరోజు సినిమా హాళ్లలో 52 సెకన్ల జాతీయ గీతం వచ్చినపుడు లేవడానికి కూడా బద్ధకిస్తున్నాం! ఇలాంటి చరిత్రను బోధిస్తున్న ఈ మహనీయులు మొగలుల కాలంలో పుట్టివుంటే వారికి భారీ నజరానాలే వుండేవి సుమా! గతం మరిచిన జాతికి భవిష్యత్తు చీకటి అనేది సత్యం! ఆలోచించండి.

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi,  Friday, 27 October 2017


1 కామెంట్‌: