‘‘మీపూర్వీకులు అరణ్యాల్లో నివసించిన అనాగరిక మనుష్యులు కారు. ఈ ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన మహనీయులు వారు. మీ చరిత్ర పరాజయాల మోపు కాదు; విశ్వవిజయాల యశోగానమది. మీ వేదాంత శాస్త్రాలన్నీ ఆవుల కాపరుల ఆలాపనలు కావు. శ్రీరాముడు, శ్రీకృష్ణుల వంటి మహా మహితాత్ములను రూపుదిద్దిన అమృత సత్య వచో నిధులవి. లేవండి! మేలుకొనండి! వైభవోపేతమైన మీ చరిత్రను చూసి సగర్వ భావంతో పులకించండి!’’ - అని స్వామి దయానంద సరస్వతి భారత జాతికి ఇచ్చిన పిలుపు ఇది! కానీ స్వాతంత్య్రం రాక ముందు ఈ దేశంలో జాతీయతను సాధించడానికై ఒక రకమైన పోరాటం చేస్తే స్వాతంత్య్రం వచ్చాక విజాతీయ మనస్తత్వంపై స్వదేశస్థులు పోరాటం చేయాల్సి రావడం ఒక విషాదం!?
1945 జూలై 16 సమయంలో మాన్‌హట్టన్ ప్రాజెక్టు నాయకుడిగా ఉండి మొదటి అణుబాంబు తయారీలో కీలకపాత్ర పోషించిన రాబర్ట్ జూలియస్ ఓపన్ హామర్ సంస్కృతం నేర్చుకొని, భగవద్గీత చదువుకొని ‘నేను ఈ పని చేయగలిగిన స్థితప్రజ్ఞతను భగవద్గీత నుండి పొందాను’ అని చెప్పుకొన్నాడు. అంతేగాకుండా అణుపరీక్ష సమయంలో శ్రీకృష్ణుడు చెప్పిన విశ్వరూప సందర్శనం నేను చేయగలిగానని, అందుకు గీతలోని 11/12, 11/32 శ్లోకాలను తన జీవిత చరిత్రలో ఉటంకించాడు.
కానీ మన దేశంలో మాత్రం భగవద్గీతను నిషేధించాలని చెప్పేవాళ్లు ఉన్నారు. భారతీయ జీవనతత్వ సారమైన భగవద్గీతను నిషేధించాలని, అది మతోన్మాద గ్రంథమని ఆరోపిస్తూ ఒక మహామేధావి మధ్యప్రదేశ్ హైకోర్టు తలుపు తట్టాడు. అంతేగాదు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాలకు పెట్టిన పేర్లు హిందూ జాతీయతను సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
బాలికల సంక్షేమం కోసం లాడలీ లక్ష్మీ పథకం, చెరువులు త్రవ్వించే పథకానికి బలరామ్ తాల్ పథకం, జలవనరుల అభివృద్ధి పథకానికి కపిల ధార పథకం అని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం పేర్లు మన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అన్నాడు. ఇవన్నీ మతతత్వ పేర్లని క్యాథలిక్ బిషప్ కౌన్సిల్‌కు చెందిన ఫాదర్ ఆనందం కేసు వేశాడు. అయితే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి పేర్లతో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నా సెక్యురల్ ప్రభుత్వం కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. ఇవన్నీ ఒకే రకమైన పథకాలు, ఒకే రకమైన పేర్లు. కానీ సెక్యులర్, జాతీయవాద ప్రభుత్వాలు గద్దెపై ఉండడమే తేడా! ఇక్కడ కెసిఆర్ అయినా, అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ అయినా అవన్నీ సదుద్దేశంతో పెట్టిన పేర్లే కానీ జాతీయవాద భావజాలం ఉన్నవాళ్లు ఏం చేసినా ఈ దేశంలో నేరమే అన్నంత స్థాయిలో ఈ డెబ్బయి ఏళ్లలో దుష్ప్రచారం జరిగింది.
అయితే హైకోర్టులో ఆనందం వేసిన కేసు కొట్టివేయబడింది. అంతేగాకుండా కోర్టు ఆనందంపై ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. ‘భగవద్గీత భారతీయ జీవన మూల్యాలకు ప్రతీక అని, అది జీవిత సారాన్ని తెలిపేదని, అలాగే లక్ష్మి, బలరాం, కపిల వంటి పదాలు భారతీయ సంస్కృతికి ప్రాధాన్యం వహిస్తాయని’ పేర్కొంది. ఇవి ఏ మతానికీ సంబంధించినవి కావని కూడా చెప్పింది.
ఇలాంటి స్థితిలో కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, మోదీలాంటి నికార్సయిన ప్రకర జాతీయవాది గద్దెపై ఉన్నా జాతీయవాద సంస్కృతిని విస్తరించడం వైపు దృష్టి పెట్టలేదనే సున్నితమైన విమర్శ అక్కడక్కడ వినిపిస్తోంది. చరిత్ర, సాహిత్య సాంస్కృతిక రంగాల్లో జరగాల్సినంత వేగవంతమైన మార్పులు జరగడం లేదని జాతీయవాదుల ఆందోళన. ఈ ప్రమాదాన్ని జాతీయవాద సంస్థలు గుర్తించకపోవడం మరో విడ్డూరం.
గత డెబ్బయి ఏళ్ల నుండి సాంస్కృతిక, సాహిత్య రంగాలను కమ్యూనిస్టులకు అప్పగించి అధికారం అనుభవించిన కాంగ్రెస్ హయాంలో ఎలా ఉందో ఈ రోజుకూ అలాగే వుందని విమర్శకుల అభిప్రాయం. భారతీయ సంస్కృతికి ప్రతీకగా చెప్పే ద్రౌపదిని అపహాస్యం చేస్తూ నవల రచించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నరేంద్ర మోదీ జాతీయ ప్రభుత్వంలో పద్మ అవార్డు పొందడం ఒకింత జీర్ణించుకోలేని విషయమే! జాతీయవాదానికి విరుద్ధంగా తన జీవితాంతం కృషిచేసిన ఓల్గాకు కేంద్ర సాహిత్య అవార్డు, మావోయిస్టు రచయితలకు వెన్నుదన్నుగా నిలిచిన కె.శివారెడ్డికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే కబీర్ పురస్కారం లభించడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది! అవసరమొస్తే వీళ్లంతా అవార్డు వాపస్ చేసి కూడా సంచలనాలు సృష్టించగలరు. ఇవన్నీ ఉదాహరణకు చెప్పేవే. కానీ చెప్పాలంటే పెద్ద లిస్టే వుంది!
జాతీయ చరిత్రను నిర్మించే సంస్థకు యల్లాప్రగడ సుదర్శనరావును చైర్మన్‌గా ప్రభుత్వం నియమించగానే కమ్యూనిస్టులు, మేధావులు, సూడో లిబరల్ సిద్ధాంతకర్తలు ఒంటికాలుపై లేచారు. పురాణాలు చదువుకున్న సుదర్శనరావును ఆ సంస్థకు ఎలా అధ్యక్షుణ్ణి చేస్తారని గగ్గోలు పెట్టారు. విచిత్రం ఏమిటంటే నిరసన తెలిపే గుంపు చాలా తక్కువగా ఉన్నా దానిని ప్రచారం చేసే మీడియాకూడా ఏం తక్కువ తినలేదు. వాళ్లకు ప్రసార మాధ్యమ రంగంపై కావలసినంత పట్టు ఉంది.
చరిత్రలో మరుగుపడిన, ఎన్నో అజ్ఞాత విషయాలను జాతికి అందించాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి నిరసనను కట్టడి చేయకపోవడమే గాక, సమూల ప్రక్షాళనకు వెనక్కి తగ్గడం చారిత్రక తప్పిదం. అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో నాటి మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి డా.మురళీ మనోహర్ జోషీ చేసిన ఇలాంటి ప్రయత్నం మొదలుపెట్టగానే సూడో సెక్యులర్ పార్టీలు, సంస్థలు, మేధావులు వ్యతిరేకించారు. అంతేగాకుండా ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలు కూడా ఆ ప్రచారానికి భయపడి వెనక్కి తగ్గమని ప్రభుత్వ పెద్దలను కోరాయి. కానీ ఈ రోజు సంపూర్ణ మెజారిటీ ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయడంలేదు. కేవలం పార్టీ విస్తరణకు జరుగుతున్న రాజసూయ యాగమే తప్ప సాంస్కృతిక, చారిత్రక రంగాల మకిలిని వదలించే పని చేస్తున్నట్లు లేదని ఎందరో జాతీయవాద మేధావులు కుమిలిపోతున్నారు.
ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు అన్ని సాంస్కృతిక, చారిత్రక రంగాల్లో కీలక స్థానాల్లో ఈ రోజుకు వామపక్ష మేధావులదే పైచేయి. దాని అండతోనే వాళ్లు ప్రచార, ప్రసార మాధ్యమాలను అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.
అలాగే ఈ దేశంలో ప్రాచీనమైన సంస్కృతికి ప్రతీకగా ఉన్న సంస్కృత భాషను సంరక్షించే ఒక్క అడుగూ ముందుకు పడలేదు. సంస్కృత శ్లోకాలను ఉటంకిస్తూ ఈ జాతి జాతీయ మహాపురుషులను తిట్టడానికి ఆ భాషలోని సాహిత్యాన్ని ఉపయోగిస్తారు. కానీ సంస్కృతం ఈ దేశంలోని ప్రజల వారసత్వం అంటే ఒప్పుకోరు. ప్రపంచ భాషా పితామహుడిగా పిలవబడే పాణిని మహర్షి గొప్ప సాంకేతిక అంశాలతో సంస్కృత భాషను మనకు వారసత్వంగా ఇచ్చాడు. సుదీర్ఘాయుష్షుగల సంస్కృతం అపభ్రంశం లేకుండా, మార్పులు చెందకుండా నిలబడగలిగింది. 500 ఏళ్ల క్రితం వాడిన ఆంగ్లం, అంతెందుకు షేక్స్‌స్పియర్ ఇంగ్లీషుకు ఈనాటి ఆంగ్లానికీ చాలా తేడా ఉంది. అంతకన్నా కాస్త వెనక్కి వెళితే క్రీ.శ. 700 నాటి చాపర్ రాసిన ‘పిలిగ్రిమ్స్ ప్రోగ్రెసెస్’ వంటి ఆంగ్ల గ్రంథాలు ఇప్పటి ఆంగ్లేయ పండితులకే అర్థం కావని ‘రట్జర్ కోర్టెన్ హార్ట్స్’ అనే సుప్రసిద్ధ రచయిత పేర్కొన్నాడు.
నిజానికి చాలా భాషలు మార్పు పొందాయి. కొన్ని గుర్తుపట్టలేనంతగా మారిపోతాయి. మరికొన్ని భాషలు కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ సంస్కృతం జీవభాష. దానికి మతం ముద్రవేసి వెనక్కి నెట్టేస్తున్న సాంస్కృతిక సంస్థలకు చలనం లేదు. అంతేగాక భారతీయ భాషలను కూడా ప్రమాదంలోకి నెట్టివేస్తున్న ఆంగ్లంపై వెర్రివేలం మన యువకుల్ని మనకు వ్యతిరేకంగా మార్చేస్తోంది. 2012 సివిల్స్ పరీక్షలో సెలక్ట్ అయిన మొత్తం 1,150 మందిలో కేవలం 26 మంది (2.3 శాతం) మాత్రమే భారతీయ భాషల్ని ఎంచుకుని పరీక్ష రాశారంటే వాళ్లలో ఉత్తీర్ణులై వచ్చిన వాళ్లు ఈ దేశానికి ఏ రకమైన సేవ చేస్తారో ఆలోచించండి.
రాజకీయంగా ‘హిందుత్వ’ ఓ తిట్టుపదంగా మారిపోయింది. హిందువుగా ఉండి రాజకీయం చేయడం తప్పని చాలామంది నాయకుల మెదళ్లలో వున్న ఆలోచన. దీనికి కారణం ఏమిటి? మన సాంస్కృతిక విధానంపై అవగాహన కల్పించే వ్యవస్థ లేకపోవడం శోచనీయం. కేవలం పార్టీలు, ఓట్లు, సీట్లు అన్న విధానంలో పాలన జరిగితే సాంస్కృతిక విధానం చక్కబడదు. తరతరాలుగా ఈ జాతి జీవనాడులన్నీ ముడిపడి వున్న రంగం డెబ్బయి ఏళ్లనుండి క్యాన్సర్‌తో కొట్టుమిట్టాడుతూ కొనఊపిరితో వుంది. అలాంటి రోగం ఈ మధ్య మరింతగా ముదిరిపోయి విశ్వవిద్యాలయాలకూ ప్రాకిపోతోంది.
అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఏళ్లకు ఏళ్లు తిష్టవేసుకొని తీరిగ్గా కూర్చుని సాహిత్య రంగాన్ని విదేశీ యిజాలతో నింపుతున్న వాళ్లపై ప్రభుత్వం ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తుందో అర్థం కావడంలేదు. దశాబ్దాలుగా జాతీయవాద సాహిత్యాన్ని బ్రతికిస్తున్న కవులు, రచయితలు, మేధావులు తీవ్ర నిరాశా నిస్పృహలతో వున్న జాతీయవాద సంస్థలకు చీమ కుట్టినట్టయినా లేదు.
దీనికితోడు కళారంగాల్లో జరగాల్సిన ప్రక్షాళన జరుగకపోవడంవల్ల సంజయ్‌లీలా భన్సాలీ వంటి వాళ్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఓవైపు స్వచ్ఛ భారత్‌లో భాగస్వామిగా ఉంటూనే దేశం అభద్రంగా ఉంది అంటూ తన భార్య భుజాలపై తుపాకీ పెట్టి జాతీయ ప్రభుత్వాన్ని కాల్చాలనుకొన్న అమీర్‌ఖాన్‌లు రోజూ మనల్ని తిడుతూనే వున్నారు.
ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు దానికదే బాగుపడుతుందిలే అని ఎవరి మానాన వాళ్లు నిశ్చింతగా ఉంటే భవిష్యత్తరాలు మనల్ని క్షమించవు. పంజాబ్‌లో పటిండా అనే చోటు నుండి రాజస్థాన్‌లోని బికనీర్‌కు ఓ రైలు వెళుతుంది. ఆ రైలు పేరు పటిండా ఎక్స్‌ప్రెస్. కాని దీనిని ప్రస్తుతం క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆ రైలులో ప్రతిరోజూ దాదాపు 2,100 మంది క్యాన్సర్ రోగులు బికనీర్‌లో చికిత్స పొందడానికి వెళ్తారు. అందుకే ఆ రైలు పేరు ‘క్యాన్సర్ రైలు’గా మారిపోయింది.
దేశంలో జాతీయతను కూడా దేశద్రోహం అని పిలిచే అకడమిక్ భాషను ఇటీవల ‘సూడో ఇంటెలెక్చువల్స్’ కనిపెట్టారు. ఈ మేధావులు అన్ని సాంస్కృతిక రంగాల్లో పీఠం వేసుక్కూచుని ఎప్పటికప్పుడు క్రొత్త సిద్ధాంతాలను అందిస్తుంటారు. ఆర్యద్రావిడ సిద్ధాంతం నుండి ఐలయ్య తర్కం వరకు అన్నింట్లో ఒకటే లక్షణం. భౌతికంగా అది వేర్వేరు రూపాల్లో కనబడుతుంది. భారత్ ఒక వలస రాజ్యమనే భావన కలిగించి ప్రపంచ మతమార్పిడి శక్తులకు పట్టం గట్టడమే ఈ సిద్ధాంతాల పరమ లక్ష్యం. అత్యాచార సాహిత్యం (అట్రాసిటీ లిటరేచర్) ద్వారా వివాదాస్పద అంశాలను ఎప్పటికప్పుడు ఎద్దుపుండు కాకి పొడిచినట్లుగా గాయం చేయడమే ఈ సంస్థల ప్రధాన ఎజెండా.
అలాగే సుదీర్ఘమైన విదేశీ రాజుల పాలనవల్ల ఇక్కడి మెజారిటీ ప్రజలు సంస్కృతి నాగరికతపరంగా గందరగోళంలో పడ్డారు. కాబట్టి జాతీయవాద సంస్థలు మొద్దునిద్ర, అమాయకత్వం వదలి శరవేగంగా చర్యలు చేపట్టకపోతే ‘భారతీయత’ను భ్రమ ప్రమాదంలోకి నెట్టేస్తారు, జాగ్రత్త!

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi, Friday, 8 December 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి