గురువు గోష్ఠిపూర్ణులు అర్ధ నిమీలిత నేత్రుడై అప్పుడే ధ్యా నముద్ర నుండి కళ్లు తెరిచారా? అన్నట్లు చూస్తున్నారు. ఆయన వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చిన పరిచారికుడు ‘గురువుగారూ! గురువుగారూ! మీ ప్రియశిష్యుడు రామానుజుడు ఏం చేశాడో తెలుసా?’ అన్నాడు. ఏం చేశాడన్నట్లు గురువు ప్రశ్నార్థక ముఖం పెట్టారు! ‘రహస్యంగా చెవిలో చెప్పిన అష్టాక్షరీ మంత్రం.. మంత్రం..’ అని ఆగిపోయాడు వచ్చినవాడు. గురువుగారు తేరుకొని ‘ఏం జరిగిందో చెప్పు’ అని తీక్షణ దృక్కులతో శిష్యుడి వైపు చూశాడు. గురువు సౌంజ్ఞను గమనించిన శిష్యుడు మళ్లీ చెప్పనారంభించాడు. ‘పరమ పవిత్రమైన నారాయణ మంత్రం రామానుజులు అపవిత్రం చేశాడు. తిరుకోష్ఠియూరు విష్ణ్వాలయం గోపురం పైకి ఎక్కి గట్టిగా ‘ఓం నమో నారాయణాయ’ అని సకల జనులకూ ఉపదేశించాడు గురువుగారూ’ అన్నాడు. ఈ సంగతి స్వయంగా శిష్యునితోనే తేల్చుకోవాలని గోష్ఠిపూర్ణులు నిర్ణయించుకొని, రామానుజుణ్ణి పిలిచి గద్దించాడు. ‘ముక్తిదాయకమైన అష్టాక్షరిని నాకు మీరు రహస్యంగా చెవిలో ప్రబోధించారు. ఎవరికి పడితే వారికి ఇది బోధిస్తే వేలయేళ్లు నరకంలో ఉండాల్సి వస్తుందని మీరు ఉపదేశించారు. కానీ నాకు ఎన్నివేల యేళ్లు నకరప్రాప్తి కలిగినా చింతలేదు. ఈ మంత్రోపదేశం పొందిన వ్యక్తులకు మాత్రం ‘నారాయణ ధామం’ కలుగుతుందనే సంకల్పంతో ఈ ఆలయంపై నుండి వేలాదిమందికి ఈ మంత్రోపదేశం చేశాను’ అని శ్రీమద్రామానుజులు గురువుకే జ్ఞానోదయం కల్గించారు.
.. ఇలా హిందూ ధర్మంలో ఓ సంస్కర్త 11వ శతాబ్దంలోనే గొ ప్ప సామాజిక విప్లవాన్ని ఆధ్యాత్మిక జీవనానికి జోడించడం మనం చూస్తాం. రామానుజులు ఆ రోజుల్లో అస్పృశ్యులని భా వించే వాళ్లను ‘తిరుక్కులథర్’- ఉన్నతులైన వారు- అని పిలిచారు. రామానుజుల గురువులు ‘తిరుకచ్చినంబి’ శూద్రుడు, మరో గురువు పెరియనంబి కూడా శూద్ర కులస్థుడే.! ఇలా సంస్కర్తలందరిలోనూ మహోన్నత ఆదర్శాలు కన్పిస్తాయి. ఆదిశంకరుడి నుండి అంబేద్కర్ వరకు ఇలాంటి సంస్కరణ దృక్పథం ఉండడం వల్లనే ‘కులజాడ్యం’ తొలగిపోయి, ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టి అందరూ సమానమే అని నినదించ గల్గుతున్నాం!
కానీ, ఈ రోజు కులం ఓ జటిల సమస్యగా ఎందుకు మా రింది? కులం ఓ సాంఘిక ఆచారం. వ్యక్తుల మంచి, చెడ్డలను పంచుకొనే ఓ సమూహం. ఒక వ్యక్తికి ఏదైనా ఆపద వస్తే దేశంలోని మొత్తం జనాభా అతణ్ణి రక్షించాలని తహతహలాడదు. అతనితో దగ్గరి సంబంధమున్న వ్యక్తులు మాత్రమే చేదోడు వాదోడుగా ఉంటారు. సుఖాన్ని పంచుకొనేందుకు కొందరు వ్యక్తులు కావాలి. అలాంటి సాంఘిక దృక్పథం ఉన్న గుంపే కులం.! అలాంటి కులానే్న ఆధారం చేసుకొని తమ పబ్బం గడుపుకోవాలనే మేధావులు, నాయకులు కులాన్ని మెట్టుగా చేసి తమ రాజకీయ భవనం ఎక్కి కూర్చుంటున్నారు. ఒక కులం పునాదులపై ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేమని తన ‘కుల నిర్మూలన’ పుస్తకంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ పేర్కొన్నాడు. ‘నేను గొప్ప’ అన్న సుపీరియారిటీ, ‘నేను తక్కువ’ అన్న ఇన్‌ఫీర్‌యారిటీ.. రెండూ ఒకే మెట్టుపైకి రావడమే కులతత్వ నిర్మూలన. దీనినే కుల నిర్మూలన పేరుతో డెబ్బయి ఏళ్ళ నుండి ఊదరగొట్టినా అది నశించకుండా కొత్త రూపాలను పొందుతోంది.
కులతత్త్వ నిర్మూలనకు అనాదిగా ప్రయత్నం జరుగుతూనే ఉంది. వ్యక్తుల్లో ఎల్లప్పుడూ రకరకాల వికృతులు కలుగుతుంటాయి. ఆ వికృతులు భారత స్వాతంత్య్రానికి ముందు ఉన్నాయి, తర్వాతా ఉన్నాయి. ఎందరో మహానుభావులు ఈ రుగ్మత పోగొట్టడానికి ప్రయత్నం చేశారు. స్వయంగా ఆదిశంకరుడే అడ్డుగా వచ్చిన చండాలుడు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ‘చండాలోపి మమగురు’ అన్నాడు. అందరిలో దాగివున్న ఆత్మతత్వం ఒక్కటే అనే అద్వైత బోధ ఈ సమాజానికి అందించాడు. భారతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన శ్రీమద్రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. రత్నాకరుడనే పేరుగల వాల్మీకి పూర్వాశ్రమంలో కిరాతుడు. అతనిలో కలిగిన హృదయ పరివర్తన, శోకం మొదటిసారి శ్లోకంగా మారింది. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచరిత్రను లోకానికి అందించాడు. క్షత్రియ కులంలో పుట్టిన శ్రీరాముని జీవితాన్ని భారత జాతికి అందించిన వాల్మీకి బోయ కులస్థుడని- కుహనా మేధావులకు ఎందరికి తె లుసు? అలాగే ప్రపంచంలో అతి ప్రఖ్యాతి పొందిన మహాభారత ఇతిహాసం రచించిన వ్యాసమహర్షి మత్స్యగంధి కడుపులో పుట్టాడని చెప్పడానికి కూడా జంకుతున్న వాళ్ళు భారతాన్ని విమర్శ చేస్తారా?
వ్యక్తిగత కులద్వేషంతో హైందవ ధర్మంపై నిప్పులు గక్కిన పెరియార్ రామస్వామి మార్గంలో నడిచిన త్రిపురనేని రామస్వామి ‘శంభూకుడు’ ఎవరి సృష్టి? అసలు రామాయణంలోని ఆరుకాండల్లో దేనిలోనైనా ఈ కథ ఉందా? శంభూకుడు వేద సాహిత్యంలో ఓ వైద్యుడన్న విషయం ఈ విమర్శకులకు తెలియదు. గుహుడు నిషాదుడైనా రాముడు అక్కున జేర్చుకొన్నాడు, గిరిజన వనిత శబరి అతిథ్యం స్వీకరించాడు. వానర జాతిలో శ్రేష్ఠురాలైన అంజనాదేవి తపస్సు చేసే కదా హనుమంతునికి జన్మనిచ్చింది. ఇంతమందిని ఆదరించిన శ్రీరాముడు శంభూకుణ్ణి సంహరించడం ఎలా సాధ్యం? అసలు శంభూకుడి చరిత్రనే తెలియని వాళ్ళు అతడిపై పుస్తకాలు, వ్యాసాలు రాసేస్తున్నారు!
భారతంలో శ్రీకృష్ణుడు రాజపుత్రుడైన దుర్యోధనుడి విందును నిరాకరించి, దాసీ పుత్రుడైన విదురుని విందు స్వీకరించిన విషయం భారతం చదివితే తెలుస్తుంది. ఉదంకుడనే భృగువంశ శ్రేష్ఠుడు కులగర్వంతో విర్రవీగితే శ్రీకృష్ణుడు అతని అహంకారాన్ని కూకటివ్రేళ్లతో పీకేస్తాడు. కౌశికుడనే బ్రాహ్మణుడే ధర్మవ్యాదుని దగ్గర ధర్మోపదేశం పొందుతాడు. హిందూమతాన్ని విమర్శించేవాళ్లు ఈ కథలను ఆధారం చేసుకుంటారు. అదే ఆయాగాథల్లోని ఆదర్శాలను జనానికి చెప్తాం అంటే అవన్నీ పుక్కిటి పురాణాలని అంటుంటారు. విమర్శకేమో ఆధారాలు కావాలి. అందులోని ఆదర్శాలేమో అశాస్ర్తియమైనవి. ఇదీ రెండు నాల్కల ధోరణి.
కులతత్వం ఎప్పుడు పెచ్చుమీరినా హిందూధర్మంలో దానిని అణచేసే ప్రయత్నం నిరంతరం కొనసాగింది. కేవలం 11 మంత్రాలతో ఉన్న సామవేదాంతర్గతమైన వజ్ర సూచికోపనిషత్తు మొదటిసారి కులంపై ఎక్కుపెట్టిన బాణంలా, పాశుపతాస్త్రంలా ఉం టుంది. డా. రామ్‌మనోహర్ లోహియా ఈ ఉపనిషత్తును ప్రత్యేకంగా పేర్కొన్నాడు. బహుశా బౌద్ధంలో అశ్వఘోషుడు రాసిన ‘వజ్రసూచి’కి ఇది ప్రేరణ అయి ఉండవచ్చని పరిశోధకులు చెప్తారు. కులం గుణ ప్రధానమే గాని జన్మ ప్రధానం కాదని ఈ ఉపనిషత్తు ప్రబోధించింది. భారతీయ మతాల్లో ప్రముఖమైన బౌద్ధ, జైనాలకు సంబంధించిన 24 మంది బౌద్ధ, జైన తీర్థంకరులు క్షత్రియకులంలో పుట్టినా ‘అహింసా పరమో ధర్మ’ అన్న వైదిక ధర్మ సూత్రాన్ని చక్కగా అమలు పరచారు. సమాజాన్ని అలంకారిక దృష్టిలో విరాట్పురుషునిగా వేదం అభివర్ణించింది. కానీ ఏ మనిషి ముఖం నుండి, కాళ్ళ నుండి మనుషులు పుట్టరు అన్న విజ్ఞత లేకుండా అంగాలను కులాలకు అంటగట్టి సమాజంలో విచ్ఛిన్నం తేవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. స్వామి దయానంద సరస్వతి ఓ ఉద్యమ రూపంలో ఈ జాతిని రక్షించడానికి వేద ప్రమాణాలను అందించి, అందరూ సమానమే అని చెప్పడమే కాదు, తన జీవితకాలంలో ఆ ఫలితాన్ని చవి చూశాడు. ఆయన యజుర్వేదం (116-26-మం-211) లోని మంత్రాన్ని ప్రమాణంగా చూపి అన్ని కులాల వారు పరమాత్మ పుత్రులే అన్నారు. మహాభారతాన్ని ‘పంచమ వేదం’ అంటారు. మరి భారతాన్ని చదవడానికి, బ్రహ్మవిద్య అయిన భగవద్గీత పఠనానికి అందరికీ అధికారం ఉన్నపుడు, వేద విజ్ఞానం తెలుసుకోవడానికి అందరికీ అధికారం ఉందని పరిశోధకులైన హిందూ మేధావులే చెప్తున్నారు. ఇంకెందుకు వెనుకంజ.? (‘ఓ సర్పరాజా! తత్వవేత్తలు, మహాత్ములు కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా శీలాన్ని మాత్రమే ప్రధానంగా గ్రహించి, ప్రమాణంగా ఆచరణలో పెడుతున్నారు’ అని మహాభారతం (3-180-32, 33, 34) తెలియజేస్తుంది. వనపర్వంలో సర్పరాజైన నహుషుడు, ధర్మరాజు మధ్య సంభాషణ ఇది.)
ఇక ఈ రోజు ఏ కులతత్వవాదిని కదిలించినా మనుస్మృతిని ఉతికి ఆరేస్తారు. దాదాపు 50 దాకా ఉన్న స్మృతుల్లో మనుస్మృతికి మాత్రం వ్యతిరేక ప్రచారమే ఎక్కువ. మనుస్మృతి ఏ కాలానిదో ఎవరూ చెప్పరు. భారతదేశం దాదాపు 800 ఏళ్ళకు పైగా బానిసత్వంలో ఉంది. ఈ మధ్యలో ఎందరు ఇతర మతాల పండితులు ఇందులో ఎన్ని ప్రక్షిప్త (లేనిది తెచ్చి పెట్టడం), ప్రక్షాపాలు (ఉన్నది లేకండా చేయడం) చేశారో తెలియదు. నేడు లభ్యమవుతున్న మనుస్మృతిలోని శ్లోకాలు ప్రాచీన మనుస్మృతిలో లేవని, ప్రస్తుతం వివిధ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారాల్లో లభిస్తున్న 30 నుండి 35 మనుస్మృతుల్లో చాలా వరకు ఈ రోజున్న శ్లోకాలు లేవని స్మృతులపై అధ్యయనం చేసిన డా. సురందర్ కుమార్ తన పుస్తకంలో రాశారు. మనుస్మృతిలో మూలశ్లోకాలు కేవలం 1,183 మా త్రమే కాగా, ప్రస్తుతం 2685 శ్లోకాలు కన్పిస్తున్నాయి. అంటే దాదాపు 1502 శ్లోకాలు కల్పించి, చేర్చినవేనని పరిశోధకుల వాదన.
అరవై ఏళ్ల క్రితం రాసుకొన్న రాజ్యాంగానే్న మనం ఈ రోజు వరకు 114 పైగా సవరణలు చేసుకొన్నాం. మరి వేల సంవత్సరాల మనుస్మృతిలోని శ్లోకాల్లో నిజమైనవి ఎన్ని? అబద్దాలు ఎన్ని? ఒకవేళ అందులో అమానుష విషయాలు రాసి ఉంటే వాటిని ఆచరిస్తామా? ఏది సమాజానికి అవసరమో.. అది మాత్రమే ఏ శాస్త్రం రాసినా గ్రహించబడుతుంది. కానీ సమాజ విరుద్ధమైనవి ఎంత గొప్ప శాస్త్రంలో రాసినా, ఎంతటి గొప్ప మహాత్ముడు చెప్పినా హిందూ సమాజం తిరస్కరించడం హిందూ చరిత్రను అధ్యయనం చేస్తే తెలుస్తుంది. భగవద్గీత ముఖమే చూసే తీరికలేని హిందువులు మనుస్మృతి ముఖాన్నైనా చూశారా? వెర్రితలలు వేసే కర్మకాండను గౌతమ బుద్ధుడు తిరస్కరించి అంతఃకరణ వైపు మనుషుల్ని పయనించమన్నాడు. కానీ బౌద్ధాన్ని రాజకీయ అవసరాలకు మాత్రమే తెరపైకి తెస్తున్న వ్యక్తులు బుద్ధుడి సాధనా పథంలోకి ఎప్పుడైనా పయనించారా? ప్రపంచ పరిస్థితులను, భారతదేశ స్థితిగతులను ఆకళింపు చేసుకొన్న అంబేద్కర్ 14, అక్టోబర్ 1956 విజయదశమి నాడు తన అనుచరులతో కలిసి బౌద్ధం స్వీకరించాడు. ఆయన అదే సంవత్సరం డిసెంబర్‌లో మరణించాడు. సామాజికంగా బౌద్ధాన్ని ఆ మహాత్ముడు ఈ జాతికి అందించాడు కానీ దాని తత్వదృష్టిని ఈ ప్రజలకు ఇవ్వడానికి ఆయన ఇంకొంతకాలం జీవించాల్సి ఉండేది. ఇది అర్థం చేసుకోని వాళ్ళు బౌద్ధం పేరు చెప్పి కాయలమ్ముకొనే యత్నం చేస్తున్నారు. ఇది విడ్డూరం. అంబేద్కర్ కన్నా ముందూ వెనుకా అనేకమంది మహనీయులు ఈ కుల భూతాన్ని, దాని అస్తిత్వాన్ని మనకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేశారు. 12వ శతాబ్దిలోనే అన్ని కులాల వారి మెడలో లింగం వేసి ‘శివశరణులు’గా మార్చాడు బసవేశ్వరుడు. తన అనుభవ మంటపం ద్వారా అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించిన సంస్కర్త ఆయన. చాపకూడు ద్వారా బ్రహ్మనాయుడు, తక్కువ వారిలో దైవం ఉంటాడని గురునానక్, నందనార్, తిరుప్పాణి ఆళ్వార్, తుకారాం, ఘసిదాస్, చొక్కమేళ వంటివారు ఎలుగెత్తి చాటారు.
ముక్తి ఏ ఒక్కరి సొత్తు కాదని ప్రకటించాడు అక్షరధామ్ వ్యవస్థాపకుడు స్వామి నారాయణ్. శూద్ర కులాలకు ఆధ్యాత్మిక పీఠాలను అందించాలని ఉద్యమాన్ని మొదలుపెట్టాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కులం పుట్టుకతో రాదని గుణమే ఔన్నత్యాన్ని కలిగిస్తూందని వేమన, నారాయణగురు తెలిపారు. బ్రాహ్మణుడు - చండాలుడు మెట్ట్భుమి ఒకటే అని అన్నమ య్య ఎలుగెత్తి చాటాడు. గిరిజనులకు ఆరాధ్యులైన సంత్ సేవాలాల్ మహరాజ్, హథీరాం బాబా బలమైన ధార్మిక పునాదులు నిర్మించారు. భగవత్సాత్కారానికి కుల, సంప్రదాయ, భాషాభేదం లేదని రామకృష్ణ పరమహంస చెబితే, దానిని తూ.చ. తప్పకుండా ప్రపంచ వేదికపై నుండి ప్రవచించిన స్వామి వివేకానంద కులం విషయంలో భారత జాతి కళ్లు తెరిపించాడు. దళితుడిని దగ్గరకు తీసుకొని శివమంత్రోపదేశం చేసిన రమణమహర్షి, పంచజన చర్చ చేసి భాగ్యరెడ్డివర్మ లాంటి దళిత నాయకుడిచే ‘ముని’ బిరుదు పొందిన కావ్య కంఠగణపతి ముని ఈ జాతిలో అనర్ఘరత్నాలు. దళిత, శూద్రకులాలకు వేదాంత విజ్ఞానం అందించిన మలయాళ స్వామి, మొదటిసారి దళితుల కోసం ధర్మశాల కట్టిన గాడ్గేబాబాను ఈ జాతి మరచిపోగలదా? బాబా సాహెబ్‌ను ఆదుకొన్న సయాజీరావు గైక్వాడ్, శూద్రుని కష్టం చూస్తే హృదయం ద్రవిస్తుందని కన్నీళ్లు పెట్టుకొన్న పూలేను, స్ర్తివిద్య కోసం తపించిన ఆధునిక సరస్వతీదేవి సావిత్రీ బాయి పూలేకు ఈ జాతి ఎప్పటికీ ఋణపడి ఉంటుంది. సమానత్వాన్ని చాటి చెప్పిన సాహూ మహరాజ్, మరో జన్మంటూ ఉంటే అస్పృశ్యునిగానే జన్మిస్తానన్న మహాత్మాగాంధీని ఈ జాతి అంత సులభంగా విస్మరించగలదా? విషాన్ని మింగి అమృతాన్ని పంచిన డా. అంబేద్కర్ భారతదేశ పీడిత, తాడిత జాతి ప్రజల కోసం అలుపులేని హృదయ పూర్వక పోరాటం చేశాడు. ఆయన అందించిన అమృత ఫలమే మనం అనుభవిస్తున్నాం. లోహియా, సానే, డా.కేశవరావ్, యంయస్ గోళ్వాల్కర్, దేవరస్ వంటి మహాత్ములు కుల నిర్మూలనను జీవన విధానంగా భావించారు.
దళితులకు గాయత్రి మంత్ర ఉపాసన ఉందన్న సావర్కర్, అంటరానితనం నిర్మూలించడానికి కాంగ్రెస్ వెంటపడ్డ శ్రద్ధానంద, ‘నేనే ఆది హిందువును’ అని ప్రకటించిన దళిత రాజకీయ వేత్త భాగ్యరెడ్డి వర్మ, రామస్వామి, వెంకట్రావుల జీవితాలు ఎంతమందికి తెలుసు? కులాల చట్రంలో రాజకీయ అవకాశాలు వెతుక్కుంటున్న మన దౌర్భాగ్యం అవకాశవాదమే తప్ప, ఆకాశం లాంటి ఈ మహాత్ముల జీవితాలను అధ్యయనం చేయనివ్వడం లేదు. అన్ని కులాల్లో పుట్టిన మహాత్ముల జీవితాలను అన్ని కులాల వాళ్లూ అధ్యయనం చేస్తే సమానత్వం మనం సులభంగా సాధించవచ్చు.

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published AndhrabhoomiThursday, 10 August 2017


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి