ఓ బియ్యం మిల్లులో ఎలుకలను చంపడానికి యజమాని ఓ గండుపిల్లిని తెచ్చిపెట్టాడు. ఆ పిల్లి రోజూ విపరీతంగా ఎలుకలను తినేస్తున్నది. పిల్లి భయంతో ఎలుకలు బయటకు రావడం మానేశాయి. మొత్తానికి ఓరోజు ఎలుకలన్నీ ఓ కలుగులో సమావేశం అయ్యాయి. దీనికి పరిష్కారం ఎలా? అని ఆలోచిస్తే పిల్లిమెడలో గంట కట్టడమే సరైన ఆలోచన అని అన్నీ తేల్చాయి. కానీ, పిల్లి మెడలో గంట కట్టడానికి అన్నీ భయపడ్డాయి. పెద్ద పెద్ద సైజున్న ఎలుకలున్నా, ఓ చిట్టెలుక మాత్రం ‘నేను పిల్లిమెడలో గంట కడతాను’ అనడంతో మిగతా ఎలుకలన్నీ ఆశ్చర్యపడ్డాయి. ‘నాకు రెండురోజులు సమయం ఇస్తే ఆ పని చేస్తాన’న్న ఆ చిట్టెలుక ఓ మెడికల్ షాపుకెళ్లి మత్తు బిళ్ల తీసుకువచ్చి పిల్లితాగే పాల గినె్నలో వేసింది. యజమాని దాంట్లో పాలుపోస్తే పిల్లి తాగి మత్తులోకి జారుకుంది. వెంటనే చిట్టెలుకతో పాటు ఎలుకలన్నీ వెళ్లి పిల్లిమెడలో గంట కట్టాయి. ఆరోజు నుండి పిల్లి రాగానే గంట చప్పుడు విని ఎలుకలు తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాయి.
ఇప్పుడు అరవై ఏళ్ల తరువాత ‘సెక్యులరిజం’ అనే పిల్లిమెడలో నరేంద్ర మోదీ అనే చిట్టెలుక ‘జాతీయవాదం’ అనే గంట కట్టాడు. ఆ గంట చప్పుడు ఎక్కడి నుండి వస్తుందో తెలియక పిల్లి బంధువులు గగ్గోలు చేస్తున్నారు. అందులో భాగమే పదేళ్ల పాటు చక్కగా ఉప రాష్టప్రతి పదవిని అనుభవించి, దిగిపోయేటప్పుడు ఈ దేశ మెజార్టీ ప్రజలపై హమీద్ అన్సారీ రాళ్లు వేసిపోయాడు. నిజంగానే ఈ దేశంలో ఎవరు భద్రంగా ఉన్నారు..? ఎవరు అభద్రంగా ఉన్నారు!? నిజంగా మెజార్టీలైన హిందువులు దుర్మార్గులా..?
క్రీ.శ 1398లో తైమూర్లంగ్, 1526లో బాబర్, 1739లో నాదిర్షా, 1756లో అహ్మద్ షా అబ్దాలీ వంటి మత దురాక్రమణదారులు భారతదేశంపై దండెత్తి వచ్చి హిందువులకు సంబంధించిన ముప్పై వేల దేవాలయాలను కూల్చి, ఎందరినో క్రూరంగా చంపినా, అంతే స్థాయిలో మెజార్టీ ప్రజలు ప్రతి క్రియ చేయలేదు. క్రీశ 1025 నుండి 1707 దాకా ఈ దేశాన్ని పాలించిన మత నియంతల దారుణ నియంతృత్వాన్ని, నిరంకుశ పాలనను పట్టించుకోకుండా అమాయత్వంలో జీవించిన హిందువులు నిజంగా దుర్మార్గులే!? క్రీశ 1528లో మన దేశంలో పుట్టని, ఎక్కడి నుంచో వలస వచ్చి మనపై దాడి చేసి అయోధ్యలో రామాలయం ధ్వంసం చేసినా- బాబర్‌ను ఈ దేశంలో ఆరాధించే వారున్నా వారిని ఏమీ అనకుండా ఇక్కడి హిందువులు మిన్నకుండడం దుర్మార్గం కాకపోతే ఇంకేమిటి? హిందూ ధర్మానికి ఆయువుపట్టు లాంటి, శ్రీరాముని లాంటి మర్యాద పురుషోత్తముని జన్మస్థానంలోని దేవాలయాన్ని ఒక విదేశీ దురాక్రమణదారుడు ధ్వంసం చేస్తే 500 ఏళ్లనుండి ఎందరో హిందువులు ప్రాణాలు పణంగా పెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, ఏనాడూ ‘మేం ఈ దేశంలో మెజారిటీ ప్రజలం కాబట్టి గుడి కట్టిస్తాం’ అని ప్రశ్నించకపోవడం వల్లనే హిందువులు దుర్మార్గులయ్యారు!? ఈ దేశంలో 87 శాతం మెజార్టీ ప్రజలు హిందువులే కాబట్టి ‘రామమందిరం కట్టి తీరుతాం’ అని ఎందుకు అనడం లేదు! ఇప్పటికీ భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్నీ గౌరవించడం హిందువుల రక్తంలో ఉంది. కాబట్టే తమ ఆరాధ్య దైవాన్ని ప్రతిష్ఠించుకోవడానికి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకన్నా ‘సహనం’ ఇంకెవరికుంటుంది? ఇది హిందువుల దుర్మార్గం కాకపోతే ఇంకేమిటి?
కాశ్మీర్‌లో హిందువులంతా కాఫిర్లుగా మారిపోయి కాందిశీకుల్లా పుట్టకొకడు, చెట్టుకొకడు పొట్ట చేతపట్టుకుని వెళ్లినా, ఈ అరవైఏళ్లలో అక్కడ ఒక్క హిందువైనా ముఖ్యమంత్రి కాకపోవడం ఎందుకు? అని అడగకపోవడం దుర్మార్గం కాకపోతే ఇంకేమిటి? అమర్‌నాథ్ యాత్రికులపై దాడి జరిగినా, శ్రీనగర్ దాల్ సరస్సు పక్కనున్న శంకరాచార్య హిల్‌ను ‘తఖ్-ఏ-సులేమాన్’గా సర్వే ఆఫ్ ఇండియా సంస్థ వారు పేరుమార్చినా హిందువులు ఎప్పుడైనా నోరు తెరిచారా? ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ 15 మే 1999లో శ్రీనగర్‌లో మాట్లాడుతూ- ‘కాశ్మీర్ భూలోక స్వర్గం. వేలాది విగ్రహాలను, ఆవులను పూజంచే అవిశ్వాసులు స్వర్గాన్ని సొంతం చేసుకోలేరు’ అని ప్రకటించినా హిందువులు చప్పుడు కాకుండా జీవించడం వారి దుర్మార్గమే. భారతదేశాన్ని దురాక్రమణ చేసిన వాళ్లను గురించి మన చరిత్ర పుస్తకాల్లో పేజీలకు పేజీలు రాస్తూ, హైందవ చక్రవర్తులకు ఒక పేరాతో సరిపెట్టి ఇక్కడి హిందూ పిల్లలతో చదివించినా మిన్నకుండి చదువుకోవడం, అదే చరిత్ర అని నమ్మడం హిందువుల మూర్ఖత్వం కాకపోతే ఇంకేమిటి? 1757 ప్లాసీ యుద్ధం తరువాత భారతదేశాన్ని ముస్లింలకు బదులు బ్రిటిష్‌వారు అధికారంలోకి వచ్చారు. అప్పుడు హిందువులకేమైనా స్వాతంత్య్రం వచ్చిందా? 15 ఆగస్టు 1947వ తేదీన బ్రిటిష్‌వారు ఈ దేశాన్ని వదిలినా హిందువులకు స్వాతంత్య్రం వచ్చిందా? అని చాలామందికి అనుమానం. జిన్నా పుణ్యకార్యం వల్ల పాకిస్తాన్ ఏర్పడి ముస్లింలకు స్వాతంత్య్రం నిజంగానే సిద్ధించింది. హిందువులకు స్వాతంత్య్రం వచ్చి వుంటే దేశ విభజన సమయంలో అంతమంది హిందువులు ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటారని అభాస్ చటర్జీలాంటి మేధావి ప్రశ్నిస్తాడు. మైనార్టీ ఓటు బ్యాంకు పేరుతో 65 ఏళ్లుగా జరుగుతున్న రాజకీయాల్లో హిందువులకు భద్రత ఎంత?
1921లో కేరళ మలబార్ ప్రాతంలో అక్కడి మోప్లాలు హిందువులను ఊచకోత కోశారు. మహిళలపై అత్యాచారాలు చేసి, దేవాలయాలు విధ్వంసం చేసారు. అలాంటి వాళ్లను భారత ప్రభుత్వం గౌరవించి స్వాతంత్య్ర సమరయోధులుగా పించన్లు ఇచ్చినా హిందువులు నోరు తెరిచారా? కల్బుర్గి, దభోల్కర్, అక్లాక్‌లను చంపడం అన్యాయమే! దానికి నిరసనగా భారతదేశంలోని 50మంది వృద్ధ రచయితలు, 250మంది అంతర్జాతీయ మేధావులు, రచయితలు తీవ్ర నిరసన తెలిపి ప్రపంచానికి చాటింపు వేసారు. మరి కర్నాటకలో ప్రశాంతి పూజారి హత్య, కేరళ, బెంగాల్‌లో హిందువుల హత్యలు, మొన్నటికి మొన్న కేరళలో జాతీయవాద సంస్థ కార్యకర్త రాజేశ్ హత్య.. ఇలా ఎన్ని జరిగినా ఈ మేధావులు, రచయితలు కలాన్ని కదిపారా? తమకు వచ్చిన అవార్డులు తగలబెట్టారా? హిందువులు వారిని పనె్నత్తి ఒక్క మాటైనా అన్నారా? ప్రస్తుతం దుబాయ్,అబుదాబి,రియాద్,టెహ్రాన్,సౌదీల్లో అడుగుపెట్టే భారతీయులు జేబులో శ్రీరాముని చిత్రం పెట్టుకోలేరు. ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేరు. ఎలాంటి యజ్ఞ యాగాలు నిర్వహించుకోలేరు. కానీ మన దేశంలో హిందూ రాజకీయ నాయకులే ఇఫ్తార్ విందులు, హజ్ యాత్రలకు భారీ సబ్సిడీలు, మత స్వేచ్ఛ ఇచ్చి గౌరవిస్తుంటే అది ‘గంగా యమున తెహజీబ్’ అని మురిసిపోతాం. ఏనాడూ వాటిని ఆటంకపరిచే ప్రయత్నం హిందూ సమాజం చేయదు. ఇదీ హమీద్ అన్సారీ అసహనం!
పొద్దున్న లేచింది మొదలు కమ్యూనిస్టులు, సోషియో లిబరల్ మేధావులు టన్నులకొద్దీ వ్యాసాలు, పుస్తకాలు హిందువులకు వ్యతిరేకంగా రాసినా కిమ్మనకుండా దైవ ప్రార్ధనల్లో, స్తోత్రాల్లో మునిగిపోయే హిందువులది అసహనమే కదా అన్సారీజీ! ఈ దేశ సంపదతో నడిచే విశ్వవిద్యాలయాల అపర మేధావులు రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ సుప్రీం కోర్టు తీర్పుతో జరిగిన యాకుబ్ మెమెన్ ఉరిని వ్యతిరేకిస్తారు. తీవ్రవాదులకు అనుకూలంగా ర్యాలీలు చేస్తారు. మరి ఈ దేశ మెజారిటీ ప్రజలు దానిపై మాట్లాడితే మతతత్వవాదులని ముద్ర వేస్తారు. అయినా నోరు తెరవని హిందువులు అసహనవాదులే మరి!
ఒకప్పుడు ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ ప్రధాని ఇంటి ముందే జీటీవీ విలేఖరి యూసఫ్ అన్సారీపై చేయి చేసుకున్నాడు. ఆయన భారత సెక్యులర్ పార్టీలకు శాంతిదూత. పదిహేను నిముషాలు పోలీసులు సైడైపోతే- ఇతర మతాల వాళ్లను నామరూపాల్లేకుండా చేస్తానన్న ఓ ముస్లిం శాసనసభ్యుడు మనకు వీర సెక్యులర్ వాది. కోయంబత్తూర్ పేలుళ్ల కేసులో నిందితుడైన అబ్దుల్‌నాసర్ మధానీని విడుదల చేయాలని కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. మరి కంచి పీఠాధిపతి అరెస్టయితే ఒక్క ఎమ్మెల్యేనైనా బయకు వచ్చి ఎందుకు ఖండించలేదని ఏ హిందువు అయినా ఈ దేశంలో అడగగలడా? సాల్మన్ రష్దీకి, తస్లిమా నస్రీన్‌కు ఫత్వాలు జారీ అయ్యాయి. హైదరాబాద్ వస్తే తస్లిమా నస్రీన్‌పై ముస్లిం మతోన్మాదుల దాడి జరిగింది. కానీ- రామాయణ విషవృక్షం, సీత జోస్యం, నేను హిందువునెట్లయిత? వంటి పుస్తకాలు రాసిన వారిపై హిందూ సమాజం ఎప్పుడైనా తిరగబడిందా? ఇంతకన్నా ‘అసహనం’ ఇంకేముంటుంది?
జ్యోతిషం మూఢ నమ్మకం, రంగురాళ్లు ధరించడం అంధ విశ్వాసం, ఉగాది రోజున ‘పంచాంగం అశాస్ర్తియం’, మహిషాసురుడు దేవుడు అంటూ టీవీ చానళ్లు తెలుగునాట ప్రదర్శిస్తున్న సహనానికి ఇక్కడి హిందువులు వౌనంగా ఉండి ప్రకటిస్తున్నది అసహనం కాకపోతే ఇంకేమిటి? మా ధర్మాన్ని ఇలా కించపరచడం సబబు కాదని ఒక్కనాడైనా నోరు తెరువని హిందువులు దుర్మార్గులు కాకపోతే మరేమిటి? భారతదేశ ప్రాచీనమైన ‘యోగ’ను ప్రపంచమంతా సమర్ధించినా మేం వ్యతిరేకిస్తాం’ అని పబ్లిగ్గా టీవీ చానళ్లలో చెప్పిన ఇతర మత గురువులను ఒక్క మాటైనా అనకుండా ‘మా యోగ ఏదో మేం చేసుకుంటాం’ అని వౌన ముద్రాధారులై శవాసనంలో పడుకున్న హిందువులను అన్సారీ సాహెబ్ నిందించాల్సిందే.
ఇస్లాంలోని అసలైన భావనలను వెల్లడిస్తూ కెనడాలో స్థిరపడిన పాక్ జాతీయుడు తారెఖ్ ఫతే భారత్‌లోని వివిధ చానళ్లలో ‘్భరత జాతీయత’ను నిర్భయంగా ప్రకటిస్తే అతనిపై తృణమూల్ కాంగ్రెస్‌కు అనుయాయి అయిన టిప్పుసుల్తాన్ మస్జిద్ ఇమాం బర్కతీ ఫత్వా జారీ చేసాడు. మరి బూతు చిత్రకారుడైన ఎంఎఫ్ హుస్సేన్ జంతువులతో మానవ శృంగారం, సరస్వతీ మాత నగ్నచిత్రాలు గీసాడు. అలాంటి అత్యద్భుత చిత్రకారుడ్ని ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో సత్కరించింది. ఇంత జరిగినా ఎంఎఫ్ హుస్సేన్‌పై హిందువులు ఎలాంటి పగ బూనలేదు. ఇదే కదా హిందువుల్లో అసహనం!
ఇన్ని అసహనాలు, దుర్మార్గాలు వున్న హిందువులు వౌనంగా వుండడం బహుశా అన్సారీ సాహెబ్‌కు నచ్చకపోవచ్చు. వేల సంఘటనలు ఈ వెయ్యేళ్లలో జరిగినా వౌనంగా భరిస్తున్న హిందూ సమాజం అసలు భద్రంగా ఉందా? మోప్లా మారణకాండ నుండి రజాకార్ల హత్యల వరకు జరిగిన దారుణాలను మతాల ఖాతాలోవేస్తే, ప్రతి విషయానికి ఆవేశంగా స్పందిస్తే దేశం నిండా శ్మశానాలే మిగులుతాయి తప్ప భూమి కనిపించదు. ఎవరో కొందరు భావోద్వేగంతో చేసే సంఘటనలను మతాలకు అంటగడితే అన్సారీ సాహెబ్ తనది అనుకుంటున్న చరిత్రలో అంతా రక్తపు మరకలే వుంటాయి. ఎప్పుడో పూర్వులు చేసిన సంఘటనలకు కూడా ఈనాటి వారసులను వేలెత్తి చూపే అలవాటు హిందూ జాతికి లేదు. రజాకార్లు పోలీసు చర్య ద్వారా అణచివేయబడ్డా కొన్ని సంవత్సరాలు గ్రామీణ హిందువులు రజాకార్ల భయంతోనే బతికారు. 800 ఏళ్ల విదేశీ శక్తుల పాలన ఈరోజుకూ హిందువులను అభద్రతలోనే వుంచిందన్నది ప్రత్యక్ష సత్యం.
ప్రపంచంలో ఏ ముస్లిం దేశంలో లేని సంరక్షణ, సౌభ్రాతృత్వం హిందువులు మెజారిటీగా వున్న ఈ దేశంలో ఉంది. ప్రతి ముస్లిం నియంతృత్వ రాజ్యంలో నిత్యం మారణ హోమమే మనం చూస్తాం. కానీ మెజార్టీ ప్రజలున్న హిందూ దేశంలో అన్ని మతాల వాళ్లు సోదర భావంతో, గౌరవ భావంతో జీవిస్తారు. ఏవో చిన్న చిన్న సంఘటనల ఆధారంగా జాతిని లేదా ఓ మతానికి చెందిన ప్రజలనందరినీ వేలెత్తి చూపడం అన్సారీ చేస్తే ఏరు దాటాక తెప్ప తగలబెట్టడమే అని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే ఈ దేశంలోని హిందువులు అభద్రతతో ఉండడం చూస్తున్నాం. మారుతున్న రాజకీయ పరిణామాలు ఇందుకు నిదర్శనం.*

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published AndhrabhoomiFriday, 18 August 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి