హిమాలయాల నుండి వేదాంతం నేర్చుకోవడానికి ఓ నవయువకుడైన సన్యాసి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త వద్దకు వెళ్లాడు. అతనిలో ‘నేను గొప్పవాణ్ని’ అనే అహం ఉంది. ‘నాకు అన్నీ తెలుసు కానీ గురువు ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చాను’ అనే తెంపరితనం ఆ యువ సన్యాసిలో ఉంది. ఆ అహంతోనే.. ఆశ్రమం గేటు దగ్గరికి వెళ్లి ‘నేను వచ్చాను’ అనే మాట ఓ చీటీపై రాసి లోపలికి పంపించాడు. లోపలున్న ఆధ్యాత్మికవేత్త ఆ చీటి వెనక్కి త్రిప్పి ‘‘నేను’ చచ్చాక లోపలికి రమ్మను’- అని జవాబురాసి పంపించాడు. ‘‘నేను’- అనే అహంకారం చచ్చాక రమ్మని చెప్పు’ అని దీని అర్థం. దీంతో ఆ యువ సన్యాసి తలతిరిగిపోయింది. అహంకారం, మమకారం.. మన వేదాంత శాస్త్రాలన్నీ ఈ రెండు మాటలపైనే ఎక్కువ శ్రద్ధపెట్టాయి. ఆ రెండూ నశిస్తే వచ్చేది మోక్షమే. ఈ ‘నేను’లో కులం, మతం, అందం, రూపం, గుణ, భాష, ప్రాంతం, ధనం, పేరు, పదవి - ఇలా ఏదో ఒకటి ఉంటుంది. వీటిలో దేనిపైనా వ్యామోహం చెందకుండా జీవించడమే నిజమైన వేదాంతి లక్షణం. దేన్నో తెలుసుకోవడం కన్నా మనల్ని మనం తెలుసుకోవడమే నిజమైన సత్యాన్వేషణ. ఆదిశంకరుడు ఈ విషయాన్నే ‘అద్వైతం’ అనే సిద్ధాంతాన్ని అందించి చూపిస్తే రమణమహర్షి లాంటి వాళ్లు ఆచరించి చూపించారు. ‘నేను’ అనే వలయంలో చిక్కుకొన్నవారు సత్యాన్వేషణ చేయలేరు. వాళ్లు చేసే ప్రతి పనికి అది అడ్డుగా నిలబడుతుంది. అది ఉన్నవాళ్లు ఆత్మజ్ఞానం కన్నా అర్థజ్ఞానం గొప్పది అనుకుంటారు. దానికోసం అనేక విషవలయాల్లో చిక్కుకొంటారు. అన్నీ నాకే కావాలనుకొంటారు. అది వదలడం అంత సులభం కాదు. ‘నేను’ అన్న అహంకారమే రావణబ్రహ్మను, దుర్యోధనుణ్ని అధ:పాతాళంలోకి తొక్కివేసింది. ఆ అహంకార, మమకారాలను తగ్గించడమే వేదాంతం లక్ష్యం. అందుకే మన పెద్దలు వాటిని తగ్గించేందుకు ఆ రెండిటి చుట్టూ రకరకాల కథలల్లారు.
ఆంధ్రజ్యోతి 11-12-2017 01:25:18 - డా.పి.భాస్కరయోగి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి