ఎ.బి.వాజపేయి, ఎల్.కె.అద్వానీ, యం.యం.జోషి లాంటి పాత తరం నాయకుల శ్రమదానం భాజపా నిర్మాణంలో ఎంతో తోడ్పడింది. వీళ్ల కాలం నుండి పనిచేస్తున్న భాజపా తెలుగు ప్రాంత నాయకులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, జంగారెడ్డి, మందాడి సత్యనారాయణరెడ్డి వంటి నేతలు ఇప్పటికీ పనిచేస్తున్నారు. బంగారు లక్ష్మణ్ ఏకంగా ఆ పార్టీ అఖిల భారత అధ్యక్షుడే అయ్యాడు. ఆలె నరేంద్ర, వి.రామారావు వంటివాళ్ళు పార్టీకోసం ఎంతో శ్రమించారు. మొన్నటివరకు ‘్భజపా ఉత్తరాది పార్టీ’ అనే ముద్ర ఉందని, ఇక్కడ ఆ పార్టీ ప్రభంజనం కష్టమని రాజకీయ విశే్లషకులు అంటూ ఉంటే ఆ మాటను ‘రక్షణ కవచం’గా పెట్టుకొని ఇక్కడి నాయకులు దాటవేస్తున్నారు. దక్షిణ భారతంలోని కేరళలో, ఆఖరుకు కమ్యూనిస్టుల కంచుకోట అయిన బెంగాల్‌లో ప్రవేశించడంతో ఇప్పుడు మమతాబెనర్జీ కమ్యూనిస్టుల కన్నా భాజపాకే ఎక్కువ భయపడుతోంది. ఒడిశాతో పాటు అసోం, మణిపూర్ లాంటి ఈశాన్య భారతంలోనూ భాజపా హవా కొనసాగుతోంది.
‘పోలేని చోట్లన్నిటిలోకి భాజపా ప్రవేశిస్తుంటే మరి తెలుగు ప్రాంత భాజపా నాయకులు ఏం చేస్తున్నట్టు? ‘ఇక్కడ కుల రాజకీయం ఎక్కువ కాబట్టి కష్టం’- అని కొందరు నాయకులు తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని రాజకీయ అవలక్షణాలైన కుల, మత, వర్గ, గుండాగిరీ, మూఢత్వం వంటివన్నీ ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. మరి అక్కడ అధికారం సాధ్యమైనప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాదు. అక్కడి కుటుంబ పార్టీని, కుల పార్టీని, సంతుష్టీకరణ పార్టీని మట్టికరిపించిన నాయకులను చూసైనా ఇక్కడి భాజపా నాయకులు చైతన్యం పొందాలి. ఈ మూడు లక్షణాలు రెండు తెలుగు రాష్ట్రాలలోని పాలక పార్టీల్లో ఒక్కొక్కరిలోనే దాగి ఉన్నాయి.
ఎన్టీఆర్‌ను లక్ష్మీపార్వతి నెపంతో గద్దెదింపిన చంద్రబాబు పదేళ్ళు తన పాలన సాగించి స్థిరీకృతమయ్యాడు. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ కుటుంబ పార్టీకి వాళ్ళ సామాజిక వర్గం అంతా అండగా నిలిచింది. ధనవంతులైన చంద్రబాబు ‘సామాజిక వర్గం’ అధికార దండం చేజారకుండా చూస్తోంది. ఎటొచ్చీ చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఒకే సామాజిక వర్గం వారు కావడం కూడా ఏపిలో భాజపా అధికారానికి దూరంగా ఉంటుందని విశే్లషకుల అంచనా. ఎన్టీఆర్‌పై ప్రశ్నలు సంధించిన వెంకయ్యనాయుడే- అదే ఎన్టీఆర్‌కు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిస్తే అండగా నిలిచాడు. ప్రస్తుతం కేంద్ర భాజపాలో వెంకయ్యనాయుడిది మొదటి ఐదుస్థానాల్లో ఒకటి కావడం తెలిసిందే. అయినా ఆంధ్రప్రదేశ్‌లో భాజపా పరిస్థితి ‘నానాటికి తీసికట్టు’గానే ఉంది. ఇంతో అంతో ఇతర పార్టీల్లో పేరున్న కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి వంటివాళ్లు భాజపాలోకి వచ్చినా తెలుగుదేశంతో పొత్తు వాళ్ళకు ముందరికాళ్ళ బంధమయ్యింది. సోము వీర్రాజు లాంటి సిద్ధాంత బలం ఉన్న నాయకుల దూకుడుకు కూడా తెదేపావారు కళ్ళెం వేస్తున్నారని వినికిడి. కంభంపాటి హరిబాబు విశాఖ ఎంపీ అయినప్పటి నుండి పెద్దగా వార్తల్లో కన్పించడం లేదు. కృష్ణంరాజు లాంటి సినీనటులు పార్టీవేవ్‌ను ఉపయోగించుకొంటున్నా, పార్టీకి ఉపయోగపడడం లేదు. మళ్ళీ అదే చోటామోటా నాయకులే అడపాదడపా కన్పిస్తున్నారు, స్పందిస్తున్నారు.
కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో దేవాలయాలను అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చినా భాజపాకు చెందిన దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్పందన పేలవంగా ఉందని అందరూ పెదవి విరిచారు. భాజపాకు చెందిన మరో మంత్రి కామినేని శ్రీనివాస్ తెదేపా సభ్యునిగా వ్యవహరిస్తున్నాడు తప్ప పార్టీపరంగా పెద్ద ముద్ర వేయడం లేదు. తెదేపా చేసే ప్రతి మంచి పనిని తమ ఖాతాలో వేసుకొంటున్నా, ప్రత్యేక హోదా లాంటి నెగెటివ్ విషయాలు భాజపా పైకి నెట్టినా కేంద్రాన్ని, భాజపాను దుమ్మెత్తిపోసినా ‘కమలనాథులు’ కిమ్మనడం లేదు. ఆఖరుకు ప్రధాని మోదీని తిట్టినా భాజపా శ్రేణుల్లో కదలిక లేదని విశే్లషకుల అభిప్రాయం. ఇటీవలి కాలంలో చంద్రబాబు, జగన్‌కు ప్రత్యామ్నాయంగా సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ను ‘ఎక్స్‌పోజ్’ చేస్తున్న ఒక సామాజిక వర్గం, ఒక వర్గం మీడియా భాజపాను అణగదొక్కాలని చూస్తోంది. పవన్‌కళ్యాణ్ ఉత్తరాది, దక్షిణాదివారని విమర్శలు చేయడం, వెంకయ్యను, మోదీని తిట్టిపోయడం చేస్తున్నా అంతేస్థాయిలో విమర్శించే భాజపా నాయకుడే కరువయ్యాడు. వెంకయ్య అప్పుడప్పుడు ప్రారంభోత్సవాలకు కేంద్ర మంత్రులను తీసుకువచ్చి చంద్రబాబును పొగిడి, ప్రత్యేక హోదాపై వివరణ ఇచ్చిపోవడంతోనే సరిపోతుంది. తెలివిగా భాజపాను వీలైనంత అపఖ్యాతిపాలు చేసి క్రొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమీచేయలేదన్న అభియోగాన్ని తెదేపా నాయకత్వం సజీవంగా ఉంచుతోంది.
ఇక, తెలంగాణలో భాజపా పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు. ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అని అన్ని పార్టీలకన్నా ముందే కాకినాడలో తీర్మానం చేసిన భాజపా తెలంగాణ సాధనలో ఎన్నో అవరోధాలను అధిగమించింది. తెలంగాణ వస్తే భాజపా ప్రధాన పార్టీ అవుతుందనుకొన్న విశే్లషకుల అంచనాలు తలక్రిందులయ్యాయి. కేసిఆర్ ఉద్యమం మొదలుపెట్టాక అతణ్ణి ఢీకొట్టి ఓడించింది భాజపానే. పాలమూరు ఉప ఎన్నికల్లో యెన్నం శ్రీనివాసరెడ్డిని తెరాస అభ్యర్థిపై ప్రజలు గెలిపించారు. అలాగే, తెరాస తరఫున ఎమ్మెల్సీకి పోటీపడ్డ దేవీప్రసాద్‌ను భాజపా అభ్యర్థి రామచంద్రరావు ఓడించాడు. ఇవి చూసుకొనే భాజపా నాయకులు ‘తెరాసకు ప్రత్యామ్నాయం మేమే’ అని గంభీరత ప్రదర్శిస్తుంటారు. నిజానికి భాజపా తెలంగాణలో ఎదగడానికి చాలా అవకాశం ఎక్కువ. ఇక్కడ నిజాం పాలన వల్ల, రజాకార్ల దౌర్జన్యాల వల్ల అయిన గాయాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సికింద్రాబాద్ నుండి గెలిచిన ఏకైక ఎంపీ బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రిగా బిజీగా గడుపుతూ పార్టీని పట్టించుకోవడం లేదన్నది ప్రధాన విమర్శ. ‘అలయ్ బలయ్’ లాంటి కార్యక్రమాలతో అందరివాడు అనిపించుకొంటున్న దత్తన్న, విమర్శలు చేయలేని సహృదయుడు. పార్టీపరంగా పట్టున్నా విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా, కేసిఆర్‌కు నమ్మిన మిత్రుడిగా ఉండిపోయాడు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు కేంద్రంలో మాత్రమే మెరిసే మెరుపుతీగ. బద్దం బాల్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, డా.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి మాత్రమే పాతవాళ్ళు తెరపై కన్పిస్తున్నారు. దూకుడుగా ఎంఐఎంపై కాలుదువ్వే ఎమ్మెల్యే రాజాసింగ్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. ‘గోల్కొండ సింహం’గా పేరొందిన బద్దం బాల్‌రెడ్డిలో వయసురీత్యా మునుపున్న ఉత్సాహం లేదు. ఇక వెంకటరమణి, చింతా సాంబమూర్తి, శాంతకుమార్, ప్రేమేందర్‌రెడ్డి వంటివాళ్ళు వేదికపైకి ఎక్కడం లేదు. గట్టి వాదనా పటిమ ఉన్న ఎన్వీవియస్ ప్రభాకర్ ఎమ్మెల్యే అయ్యాక తన నియోజకవర్గానికే పరిమితం అయ్యాడు. చింతల రామచంద్రారెడ్డి కేసిఆర్ తిరుపతి వెళ్ళినప్పుడు, కేటిఆర్ పుట్టినరోజునాడు ఫొటోలు దిగినపుడు చూపించిన అత్యుత్సాహాన్ని అందరూ విమర్శిస్తున్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి, రఘునందన్‌రావు, కె.దిలీప్‌కుమార్ లాంటి నేతలు మంచి వాదనా పటిమ ఉన్నవాళ్ళే. యెన్నం శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఇమడలేకనే వెళ్ళిపోయి చెరుకు సుధాకర్‌తో కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. వీళ్ళందరినీ ఉపయోగించుకోకపోతే వాళ్ళు వేరే దారి వెతుక్కునే అవకాశం ఉంది. మొత్తానికి ‘కేసిఆర్ మేనియా’కు అందరూ భయపడిపోతున్నారు. ‘మనం అతణ్ణి ఢీకొట్టడం కష్టం. ప్రజలే వాళ్ళకు ఇష్టం వచ్చినపుడు మనకు ఓటేస్తారులే’ అనే ధోరణి తెలంగాణ భాజపా నాయకుల్లో ఉందనేది క్రిందిస్థాయి కార్యకర్తల అభిప్రాయం. కేసిఆర్ లాంటి చరిష్మా ఉన్న నాయకుడు ఏ పార్టీలో లేడు. మనం ప్రయత్నించడం వృథా అనుకొంటున్న భాజపా నాయకులు చరిత్రలో కేసిఆర్ లాంటివాళ్ళు ఎందరో వచ్చిపోయారన్న విషయం మరువొద్దు.
కంచుకోట లాంటి కాంగ్రెస్‌ను కూలద్రోసి అఖండ ప్రజాభిమానంతో అలనాడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ప్రజలను ఆశ్చర్యంలో ముంచింది. బీసీలకు రాజ్యాధికారం, మండల వ్యవస్థ ఏర్పాటు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, 2రూ.లకే కిలో బియ్యం వంటి కార్యక్రమాలు ఎన్టీఆర్‌ను అగ్రపథంలో నిలబెట్టాయి. అంత పెద్ద నేత ఎన్టీఆర్‌ను గద్దె దింపేసిన చంద్రబాబు ఎలా పాలిస్తాడనుకొనే సరికి చంద్రబాబు రాజకీయం, ఎత్తులు, కేంద్రంలో చక్రవ్యూహం, ప్రజలవద్దకు పాలన ఇవన్నీ అతణ్ణి తిరుగులేని రాజకీయవేత్తను చేశాయి. అలాంటి శిఖరాన్ని పడగొట్టడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి కరడుగట్టిన కాంగ్రెస్‌వాది అవసరమయ్యాడు. అదిష్ఠానానే్న మింగేసే రాజకీయవేత్తగా ఎదిగిన వైఎస్ ప్రవాహం ఆపడానికి ‘తెలంగాణ ఉద్యమం’ ఊపుఅందుకొంది. అందులోంచి పుట్టినవాడే కేసిఆర్. ప్రస్తుతం కేసిఆర్‌ను ఎదుర్కొనే కులబలం, గుంపు కాంగ్రెస్‌లో ఉంది. కాని కేంద్రంలో వారికి వెన్నుదన్ను లేదు. తెదేపా నుండి రేవంత్‌రెడ్డి వెళ్ళిపోతే ఎవరిదారివారు చూసుకొంటారు. కోదండరాం లాంటి వాళ్ళు పెట్టే పార్టీ కమ్యూనిస్టు పార్టీల అవశేషమే తప్ప ఇంకొకటి కాదు. మరి ఇలాంటి సమయంలో తెరాసతో కయ్యానికి కాలుదువ్వే శక్తి ‘కమలాని’కే ఉంది. ఇలా ఎవరిమటుకువాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే భాజపా బలపడుతుందా? కేసిఆర్ యాదాద్రికి, వేములవాడకు కోట్లు కేటాయించి బ్రాహ్మణులకు సంతర్పణ చేసి శత చండీయాగం చేస్తే మాకేం పనిలేదని భాజపా నాయకులు అనుకొంటున్నారా?
రాజకీయ ప్రస్థానంలో ‘వాక్యూమ్’ను పూర్తిచేయడానికి ఒకరి అవసరం ఎప్పుడూ ఉంటుంది. అది భాజపాతోనే పూర్తిచేయాలని ఎందుకు అనుకోగూడదు. కేవలం భావోద్వేగాలతోనే రాజకీయాలు నడవవు. అభివృద్ధి, సమగ్ర వికాసం, సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజ, విద్య, వైద్యం, పారిశ్రామికీకరణ ఇవన్నీ ప్రజలకు ఎప్పుడూ అవసరం ఉంటాయి. అవన్నీ ప్రజాస్వామ్యయుతంగా పాలకులు చేస్తున్నారా? లేదా? అని బేరీజువేసి పోరాడడమే రాజకీయ పార్టీల పని. ‘తప్పులు ఎవరైనా చేస్తారు.. కానీ ఉద్దేశ పూర్వకంగా తప్పులు చేయవద్దు’అన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకొని తెలుగు రాష్ట్రాల భాజపా విభాగాలు ముందుకు వెళ్ళకపోతే ‘పంచ పాండవులు మంచం కోళ్లలా ముగ్గురే అని ఒక వ్రేలు’ చూపించినట్లవుతుంది జాగ్రత్త!!
డా. పి. భాస్కరయోగి, సెల్: 99120 70125
Published Andhrabhoomi Wednesday, 22 March 2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి