తెలంగాణలో ఇంకెవరికీ 'ఛాన్స్' లేదా?




‘ప్రతి మనిషికి ఒరే! అని పిలిచే స్నేహితుడు ఉండాలి’ అంటారు పెద్దలు. ఎందుకంటే మనుషులకు ధనం, రూపం, యవ్వనం, అధికారం అహంకారాన్ని కలిగిస్తాయి. వాటి బలం ముందు ఎవరి బలం సరిపోదు. కాబట్టి వ్యక్తిచేసే తప్పొప్పులను ఎవరూ చెప్పలేరు. అందుకే ‘ఒరే’ అని పిలవగలిగిన స్నేహితుడు ఆంతరంగిక చర్చల్లో దోషాలను ఎత్తిచూపుతాడు. అందుకే ఇలాంటి నియమం విధించారు పెద్దలు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ‘ఆంతరంగిక మిత్రుల’ అవసరం చాలా ఉంది. లేకపోతే ఆయన ‘బోనులో ఉన్న సింహమే!’ సింహం బోనులో ఉంటే చూడ్డమే గాని ‘ముట్టలేం.. పట్టలేం’! తామే తెలంగాణకు ‘పెద్దతల’ వహించే హక్కు, నేర్పు ఉన్న వాళ్లమనే భావన కేసీఆర్, తెరాస నాయకుల్లో ఉందని విమర్శకుల అభిప్రాయం.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మాజీ సీబిఐ ఉన్నతాధికారి విజయ రామారావు తెదేపాలో చేరాడు. విజయ రామారావు, కేసీఆర్‌లది ఒకే సామాజిక వర్గం కావడంతో ‘కులాల బ్యాలెన్స్’లో విజయ రామారావుకు అప్పట్లో మంత్రి పదవి దక్కగా కేసీఆర్‌కు రాలేదని, అందువల్లనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని భుజాలపైకి ఎత్తుకొన్నాడని చెప్తారు. విచిత్రం ఏమిటంటే- ఆ విజయరామారావే ఇటీవల తెరాసలో చేరడం! ఇలాంటి కారణాల వల్లనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత, ఇతర మంత్రులు ప్రతిపక్షాలను నోరు తెరవనివ్వడం లేదు. ప్రతిపక్షాలు కూడా తెలియకుండానే కేసీఆర్ ఉచ్చులో బిగించుకపోవడం మరో దురదృష్టకరం. ఉదాహరణకు తన ‘కంట్లో నలుసులా’ ఉన్న భాజపాను కేసీఆర్ తన వ్యూహాలతో నిర్వీర్యం చేస్తున్నాడు. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రధాని మోదీకి మద్దతిచ్చి కేంద్రాన్ని మచ్చిక చేసుకోవడం, వాటర్‌గ్రిడ్ ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించి ‘శభాష్’ అనిపించుకోవడం ఇందులో వ్యూహమే! కేంద్రాన్ని తనకు అనుకూలంగా ఉంచుకొని పనులు నెరవేర్చుకొంటూనే, తెలంగాణలో భాజపాను ఎదగకుండా చేయడం రెండవ వ్యూహం. గతంలో ఎప్పుడూ లేనంతగా పూటకో కేంద్రమంత్రిని కలిసి, రకరకాల గొంతెమ్మ కోర్కెలు కోరడం, అవి కేంద్రం తీర్చితే మా ‘నైపుణ్యం’ అని ప్రచారం చేసుకోవడం, తీర్చకపోతే ఆ ‘నెపాన్ని’ కేంద్రంపైకి నెట్టేసి లబ్ధిపొందడం తెరాస నేతల చతురత. హైకోర్టు విభజన జరగదని, దానికి అడ్డంకులున్నాయని కేసీఆర్ లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతకు తెలియదనుకోవడం అమాయకత్వం. దానిని ‘ఎద్దు పుండును కాకి పొడిచినట్లు’ అవసరమొచ్చినపుడు భాజపాను తెగనాడడానికి ఉపయోగించుకోవడం ఆయన వ్యూహంలో భాగం. మొత్తానికి ‘పాము పగ తోక చుట్టం’ అన్న ఎత్తుగడతో భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేస్తున్నారు కేసీఆర్! తెలంగాణలో భాజపా ప్రతిపక్షమో, మిత్రపక్షమో వాళ్లకే తెలియకుండా చేశాడు కేసీఆర్.
మిగతా ప్రతిపక్షాలది మరో దీనగాథ. ఒకప్పుడు తెలంగాణను అప్రతిహతంగా ఏలిన తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ చాలావరకూ పోగొట్టుకొంది. రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య మాత్రమే మిగిలిపోయారు. వీరిద్దరూ ‘ఓటుకు నోటు’ కేసులో ఉన్నవాళ్లే! రేవంత్‌రెడ్డి అంటే పొడగిట్టని కేసీఆర్ ఏదో రకంగా అతణ్ణి శాసనసభలో మాట్లాడనివ్వడం లేదు. ఇటీవల గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారన్న నెపంతో ఉన్న ఇద్దరినీ సమావేశాలు మొత్తం అసెంబ్లీలో లేకుండా సస్పెండ్ చేశారు. గవర్నర్ ప్రసంగాలకు అడ్డుతగలడం, బడ్జెట్ పత్రాలను చించి వేయడం ఈ ప్రజాస్వామ్య చరిత్రలో పెద్ద విషయం కాదు. కానీ, తెదేపా సభ్యుల గోల శాసనసభలో విన్పించడం కేసీఆర్‌కు ఇష్టం లేదు. తమ ప్రభుత్వానికి ఎదురు మాట్లాడుతారనే వాళ్లందరినీ కేసీఆర్ తనవైపు తిప్పుకొంటున్నారు. మహేందర్ రెడ్డి, తలసాని, తీగల, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి లాంటి నేతలను- ‘రాజకీయ శూన్యత’ను అవతలి పార్టీలో కలిగించడానికి తెరాసలో చేర్చుకొంటే, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలవడానికి హైద్రాబాద్‌లోని తెదేపా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొన్నారు. ఆఖరుకు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కాలేజీలపై జరిగిన ఐటి దాడులకు భయపడి తెరాసలో చేరాడని అక్కడి ప్రజల అభిప్రాయం. రేవంత్‌రెడ్డి ఇలాంటి వాటికి భయపడడం లేదు. ఎందుకంటే కేసీఆర్ పార్టీపెట్టే నాటికే రేవంత్‌రెడ్డి వ్యాపారంలో, రాజకీయంలో ఆరితేరాడు. వైయస్‌నే ఒక దశలో ‘్ఢకొట్టే’ప్రయత్నం చేశాడు. మరి రేవంత్ రాజకీయ జీవితం ‘నందోరాజా భవిష్యతి’ అన్నట్లుగా ఉంది. భవిష్యత్తు రాజకీయ పరిణామాలే తెదేపా, రేవంత్‌ల రాజకీయ మార్గాన్ని నిర్ణయించబోతున్నాయి.
ఇక, కాంగ్రెస్ పరిస్థితి ‘అప్పుడు చావకుండా ఆర్నెల్లు బ్రతకకుండా..’ అన్నట్లుంది. తెలంగాణ కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేలంతా ఎక్కువ భాగం ఒక సామాజిక వర్గం వారే! ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి ‘రాజకీయ అపరిపక్వ నాయకుడు’ పీసీసీ అధ్యక్షుడుగా ఉండడం కేసీఆర్ అదృష్టం. ఒక ప్రతిపక్ష సభా నాయకుడు ‘్ఫలానా విషయంపై నేను ప్రిపేర్ కాలేదు.. తర్వాత మాట్లాడతాను’ అనడం తెరాస అదృష్టం కాక మరేమిటి? ఇటీవల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘శ్రీమతి’ శాసనసభలో ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిందని అందరూ చెప్పుకోవడం ఇందులో విశేషం. జానారెడ్డి లాంటి సౌమ్యత ఉన్న నాయకుడిది మంచి తనమో! శల్య సారథ్యమో! కాంగ్రెస్ నేతలకే అంతుబట్టడం లేదు. మల్లు భట్టివిక్రమార్క, సంపత్, వంశీచంద్‌రెడ్డి లాంటివాళ్లు దూకుడుగా ఉన్నా, కాంగ్రెస్ పెద్దలే వారిని నీరుగారుస్తున్నారన్న అభిప్రాయం లేకపోలేదు. మహిళా ప్రతినిధిగా డీకె అరుణ గట్టిగానే తెరాస సర్కారును ఎదిరిస్తున్నా దానిని కాంగ్రెస్ నాయకులే ‘క్యాష్’ చేసుకోవడం లేదన్న విమర్శ ఉంది. అన్నిటికన్నా దిగ్విజయ్‌సింగ్ లాంటి ‘ఫెయిల్యూర్ నాయకుడు’ అధిష్ఠానం దూతగా ఉండడం మరో అవరోధం అని కాంగ్రెస్ పెద్దలు వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో ‘రెడ్డి సామాజిక వర్గం’ పోలరైజేషన్ మీదే కాంగ్రెస్ రాజకీయం ఆధారపడి ఉంటుందని మరికొందరి అభిప్రాయం. ‘పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టినట్లు’ కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. తాము అస్తస్రన్యాసం చేసినట్లు పరోక్షంగా ప్రకటిస్తూ మధ్యలో ‘బాహుబలి’ వస్తాడని మురిసిపోతున్నారు!
తెలంగాణలో కమ్యూనిస్టుల పరిస్థితి మరీ ఘోరం. పేపర్ పులుల్లా నారాయణ, రాఘవులు ఆంధ్రా నుండి అప్పుడప్పుడు వచ్చి ప్రకటనలు ఇస్తుంటారు. సురవరం సుధాకర్‌రెడ్డి కేంద్ర కార్యవర్గం నుండి స్పందిస్తూ తెలంగాణకు వచ్చినపుడల్లా మతతత్వాన్ని, మోదీని ప్రధానంగా విమర్శించి వెళ్తాడు. ‘శంకరాచార్యులకూ పీర్ల పండుగకూ’ లంకె పెట్టినట్లు తెలంగాణకు వచ్చి మోదీని తిడితే ఏం లాభం? ఇక చాడ వెంకట్‌రెడ్డి ప్రకటనలు పెద్దగా పట్టించుకొనేవాళ్లు లేరు. చక్కని వాక్పటిమ ఉన్న నోముల నర్సింహయ్య లాంటి ప్రజానాయకులను కేసీఆర్ ఎప్పుడో లాగేసుకొన్నాడు. కేసీఆర్ వ్యూహాల ముందు ‘కామ్రేడ్ల’ సిద్ధాంతం వట్టిపోయింది. ఎందుకంటే ఏ సిద్ధాంతం లేని కేసీఆర్‌లో ‘రాజకీయ చాణక్యం’ ఎక్కువ! అందుకు ఉదాహరణ- సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకమనే ముద్రను చెరిపి, పార్టీ పటిష్టతకు పాదయాత్ర చేశాడు. ఐదు నెలలకు పైగా నడిచిన వీరభద్రం ఇటీవల హైద్రాబాద్‌లో సభ జరిపి ముఖ్యఅతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్‌ను పిలిచారు. సభకు వచ్చిన విజయన్‌ను కేసీఆర్ తన ఇంటికి పిలిచి, విందు ఇచ్చి తన సీట్లో కూర్చోబెట్టి తెలంగాణలో అమలుచేసిన పథకాలన్నీ ఆసక్తిని కలిగేటట్లు వివరించాడు. అతను ఎంతోమర్యాదగా కేసీఆర్ ఆతిధ్యాన్ని మన్నించి, ‘సాదాబైనామా’ లాంటి పథకాలను గురించి విని ‘శెభాష్’అని మెచ్చుకొన్నాడు. అలాంటి వ్యక్తే సాయంత్రం ‘సీపిఎం పాదయాత్ర ముగింపు’ సభలో కేసీఆర్‌ను తిడితే ఎవడు నమ్ముతాడు? ఇదీ దార్శనికత..! కాళ్లువాచిపోయేలా తమ్మినేని వీరభద్రం చేసిన పాదయాత్ర ఇలా నీరుగారిపోవడం వెనుక కేసీఆర్ చాణక్యం ఎంతైనా ఉంది.
తెలంగాణ ప్రాంతంలో ప్రజాసంఘాలు, పౌర సంఘాలు ఎక్కువ. వీళ్లు మీడియాలో ప్రముఖంగా కన్పిస్తుంటారు. వీళ్ల సభల్లో జనం ఉంటే ‘సమావేశం’ అంటారు. పార్టీకో వ్యక్తి చొప్పున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కలిస్తే ‘రౌండ్ టేబుల్ సమావేశం’ అంటుంటారు. వరవరరావు, చుక్కా రామయ్య, హరగోపాల్ ప్రతిరోజు ప్రజలు, హక్కులు, ప్రజాస్వామ్యం, లౌకికవాదం.. లాంటి పదాలతో నిర్దేశాలు చేస్తుంటారు. రోజుకోసారి ప్రభుత్వం ఏం చేయాలో వీళ్లు చెప్తుంటారు. కానీ కేసీఆర్‌కు వీళ్లను ఎలా వాడుకోవాలో తెలుసు, వీళ్ల నిబద్ధత ఎంతోకూడా తెలుసు. చుక్కా రామయ్య లాంటి పెద్ద మనిషి ‘అలయ్ బలయ్’లో కేంద్రమంత్రి దత్తాత్రేయతో సన్మానం చేయించుకొంటాడు. రోహిత్ వేముల హత్యకు దత్తాత్రేయనే కారణం అంటాడు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను విమర్శిస్తూ ఇందిరాపార్కు వద్ద ధర్నాలో కన్పిస్తాడు. వ్యక్తిగతంగా వెళ్లి కేసీఆర్‌ను అభినందిస్తాడు. ఇది ఎంత భావ దారిద్య్రమో, దేనిని ఎదుర్కోవాలో కేసీఆర్‌కు బాగా తెలుసు.
కోదండరామ్ మంచి వ్యక్త అని, ఆయనను టి.జేఏసీ చైర్మన్‌గా తానే చేశానని కేసీఆర్ చెప్పారు. ఇటీవల కోదండరామ్ తనకు వ్యతిరేకంగా పనిచేయడం కేసీఆర్‌కు నచ్చడం లేదు. కేసీఆర్ ఎంత ఉదారవాదిగా తాను నమ్మిన వాళ్లకు మేలుచేస్తుంటాడో, తనను వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్లను అంతే కఠినంగా ఎదుర్కొంటాడు. ఇటీవల జరిగిన ‘నిరుద్యోగ ర్యాలీ’ నాటి ముందురోజు రాత్రి కోదండరామ్ ఇంటి తలుపులు పగులగొట్టి పోలీసులు అరెస్ట్‌చేశారు. అదే పాత జ్ఞాపకాల్లో వరవరరావును ఉమ్మడి రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌చేయడానికి వచ్చి, తెల్లారాక జైలుకు తరలించారు. జైలుకువెళ్లి మరీ కేసీఆర్ వరవరరావు బృందాన్ని పరామర్శించాడు. ఇదే కేసీఆర్‌లోని అంతుబట్టని నైజం అని విశే్లషకులు భావిస్తారు. కోదండరామ్ లాంటి మేధావి పది చెప్తే ఎనిమిది ప్రజలు వింటారని మీడియా, ప్రతిపక్షాలు భావించడం వల్లే ఎక్కువ ఎక్స్‌పోజింగ్ ఉందంటున్నారు. ‘ఇంటిగుట్టు పెరుమాళ్లకెరుక’ అన్నట్లు పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్ లాంటి ‘కోవర్టుల’ను ప్రభుత్వమే తయారు చేసిందనే విమర్శలున్నా, నిబద్ధతగల కోదండరామ్ వాళ్లకు సమాధానం చెప్పాల్సిందే! ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్లకు ‘మతం బూచి’ చూపి పబ్బం గడిపే ఎంఐఎం పార్టీ ఇప్పుడు తెరాసకు మిత్రపక్షమే. కిరణ్‌కుమార్‌రెడ్డిలా ‘మజ్లిస్’ పట్ల కఠినంగా ఉంటూ రోజూ బురద వేయించుకోవడం కంటే ‘లౌకిక సర్కారుగా’ మార్కులేయించుకోవడమే మంచిదని ప్రభుత్వం భావన. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన గద్దర్ వౌనంగా ఉంటూ తీర్థయాత్రలు చేస్తుండగా, మల్లేపల్లి లక్ష్మయ్య, ఘంటా చక్రపాణి, దేశపతి శ్రీనివాస్ లాంటివారు పదవుల పీఠాలెక్కి కూర్చొన్నారు. చెఱుకు సుధాకర్ లాంటి నాయకులు ఏదో మాట్లాడుతున్నా ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇలా ఎవరి ప్రపంచంలోవాళ్లు విహరిస్తుంటే కేసీఆర్ రాజ్యం హాయిగా కొనసాగుతోంది. ప్రభుత్వం మీద ఎవరికీ సర్వేచేసే దమ్ము కూడా లేకపోవడం వల్ల ‘వాళ్ల సర్వే వాళ్లేచేసుకొని’ 2019 ఎన్నికలు కూడా మాకు ‘నల్లేరుమీద నడకే’ అని కేసీఆర్ ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం ఎలా ఉన్నా తర్కబద్ధతలేని ప్రతిపక్షం, నిబద్ధత లేని కూటములు ఉండడం ప్రజాస్వామ్య సౌధానికి ప్రమాదం. ఏమీ చేయకున్నా చేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయవేత్త మొదటి లక్షణం. అది కేసీఆర్‌లో పుష్కలంగా ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం!

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi  Saturday, 1 April 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి