మోక్షగుండం విశే్వశ్వరయ్య దక్షిణ భారత దేశంలోనే పేరు ప్రఖ్యాతులున్న గొప్ప వ్యక్తి. మైసూరు రాష్ట్రంలో దివాన్‌గా పనిచేశాడు. ఓసారి ఆయన విదేశాలకు వెళ్దామని బ్యాంక్‌లో తన కరెంట్ అకౌంట్ మీద ఓవర్ డ్రాఫ్ట్ అడగాలని ‘బ్యాంక్ ఆఫ్ మైసూర్’ అధికారులకు ఉదయం పదకొండుం బావుకు వస్తానని కబురు చేశాడు. సరిగ్గా పదకొండు గంటల పధ్నాలుగు నిమిషాలకు కారు దిగితే ఆయన కోసం ఎదురు చూస్తున్న బ్యాంకు మేనేజర్ నారాయణ రెడ్డి అవాక్కయ్యాడు. అదీ ‘మోక్షగుండం’ సమయపాలన. తనకు స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లిన మేనేజర్ నారాయణరెడ్డికి తను వచ్చిన పనిని గురించి వివరించాడు విశే్వశ్వరయ్య. తనకు ఓవర్‌డ్రాఫ్ట్ మంజూరు చేసేందుకు అనుగుణంగా తన దగ్గరున్న భారత ప్రభుత్వ బాండ్లను సెక్యురిటీగా ఇస్తానని మేనేజర్‌కు చెప్పాడు. మేనేజర్ ఆదేశాల మేరకు దానికి సంబంధించిన అన్ని పత్రాలను పూరించి కిందిస్థాయి అధికారులు సిద్ధం చేశారు. ఆ కాగితాలను పరిశీలించిన విశే్వశ్వరయ్య అందులో తక్కువ వడ్డీ వుండడం చూసి- ‘మేనేజర్ గారూ! ఇంత తక్కువ వడ్డీని నాపై ప్రత్యేకంగా చొరవ చూపి తగ్గించారా? అందరికీ ఇలాగే చేస్తున్నారా?’ అని ప్రశ్నించాడు. మేనేజర్ ‘మీ కోసం ప్రత్యేకం’ అన్నట్టు చూస్తే ‘వడ్డీరేటు మిగతావాళ్లకు ఎలా వసూలు చేస్తున్నారో నాకూ అలాగే చేయండని’ పట్టుబట్టి మరీ రాయించుకున్నాడు. తనకు ఎలాంటి ప్రత్యేకత వద్దన్నాడు.
ఇందులో కొసమెరుపు ఏమిటంటే- అసలు బ్యాంక్ ఆఫ్ మైసూర్‌ను స్థాపించిందే విశే్వశ్వరయ్య. అంతేకాకుండా మైసూర్ స్టేట్ దివాన్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన అంత పెద్ద ఉన్నతోద్యోగి అంత సర్వసాధారణ వ్యక్తిలా బ్యాంకు అధికారులతో వ్యవహరించడం- ఆయన ఆదర్శాలకు నిలువెత్తు నిదర్శనం.
మరి ఈనాడో..? స్టార్ క్రికెటర్లు, మిగతా ఆటగాళ్లు, పారిశ్రామిక వేత్తలుగా చెలామణి అవుతున్న ధనవంతులు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, కాంట్రాక్టర్లు.. అందరూ ఇపుడు సెలబ్రిటీలే.
ఒక్క సీరియల్‌లో ఒక్క ఎపిసోడ్‌లో నటించినా ఆ మహానుభావుడు లేదా ఆ నటీమణి స్టార్ కాంపెయినరే. చూడ్డానికి ముఖం అందంగా వుండి, నాలుగు మాటలు చక్కగా మాట్లాడడానికి వచ్చినా సరే లేదా తెలుగు- ఆంగ్ల సంకర భాషతో అష్టవంకర్లు తిరుగుతూ అకారణ హాస్యంతో తన వాచాలతను ప్రదర్శించినా సరే, వారే మన మీడియాకు ఆదర్శ ఆరాధ్య పురుషులు. ఇంకా విచిత్రం ఏమిటంటే వాళ్లు తప్పులు చేస్తే ఇంకాస్త పాపులర్ అవుతారు. పబ్బుల్లోనో, హుక్కా సెంటర్లలోనో, బైక్ రైడింగ్‌లోనో, డ్రంక్ అండ్ డ్రైవ్‌లోనో, ఏదైనా ఫామ్‌హౌజ్‌లో పట్టుబడితే వాళ్లకు మరింత పవిత్రత, ప్రచారం ఖాయం!
వాళ్ల సినిమాలు, సీరియళ్లూ, ఇతర యాంకరింగులూ ఇంకా భారీ రేటింగ్‌తో నడుస్తాయి. ఈ ‘అర్హత’ వాళ్లకు మరింతగా ఉపయోగపడుతుంది. వీలైతే ఆడవాళ్లనో, ఏదైనా కులాన్నో, మతాన్నో, విమర్శిస్తే మరింత పాపులర్ అవుతారు. మొన్నటికి మొన్న సినిమా రంగంలోని అగ్రశ్రేణి నటులు, నిర్మాతలు, దర్శకులు, కొందరు పోరంబోకు యాక్టర్లు ‘డ్రగ్స్ స్కాం’లో ఇరుక్కున్నారనగానే సినిమా రంగం పెద్దలంతా విరుచుకుపడ్డారు. వాళ్లేదో అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేసే మునుల్లా నీతివాక్యాలు వల్లించారు. వీళ్లలో కొందరు కోకోకోలాకు,కోల్గేట్‌కు ప్రచార కర్తలు. జీవితాంతం సంపాదించిన డబ్బుతో, పేరుతో ఇటీవల వీరిలో కొందరు రాజకీయ నాయకుల అవతారం ఎత్తుతున్నారు.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ నాయకుల చంక కిందకు చేరి తమ పనులు నొక్కించుకుంటున్నారు. స్టూడియోల పేరుతో కొందరు, రాయితీల పేరుతో మరికొందరు తమ కార్యాలయ గంధర్వుల ద్వారా అనుకున్నవి సాధించుకుంటున్నారు. ఇక్కడ మాత్రం ప్రాంతీయ భేదాలు లేవు. వీళ్లెక్కడికెళ్లినా ప్రత్యేక సదుపాయాలు- దేవుడున్న తిరుమలకు వెళ్లినా- అది కూడా తమ ప్రచారానికే వాడుకుంటున్నారు. వీళ్లకున్న అపారమైన నటనను టీవీల్లో పండిస్తున్నారు. కొంగర జగ్గయ్యలా వీళ్ల దగ్గర పెద్ద లైబ్రరీ లేదు కానీ తమ మాటలతో, చేష్టలతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలో వీళ్లకు బాగా తెలుసు. నటుడు శోభన్‌బాబు లాంటి- నిత్య జీవితంలో ఎన్నో మానవీయ విలువలను పాటించిన వారి జీవితాలను ఒక్కసారైనా అధ్యయనం చేసారా? తమ దగ్గర ఉన్న డబ్బుపై ప్రభుత్వాల కన్నుబడకుండా వుండేందుకు వీళ్లు ఆడుతున్న నాటకాలకు ఎన్ని ‘ఆస్కార్’లు ఇచ్చినా తక్కువే.
విచిత్రం ఏమిటంటే- వీళ్లంతా ఇవాళ సెలబ్రిటీలు. ప్రజలంతా వాళ్ల ముఖాలు చూడడానికి ముఖం వాచిపోయి చూస్తున్నారు. వీళ్లతో కలవడానికి వెర్రిగెంతులు వేస్తున్నారు. వాళ్ల బ్రతుకులూ, వాళ్ల తప్పులూ, ఒప్పులూ.. అన్నీ ఇవాళ మీడియాకు దినభత్యమే.
పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి జరిగి మన సైనికులు ప్రాణాలు వదులుతుంటే ఇక్కడ ఓ సినిమా నాయకుడి జన్మదినం సంబరాలను చేస్తుంది ఓ న్యూస్ ఛానల్. వ్యక్తిగతంగా పరిశీలించాల్సిన శిరీష హత్య కేసు మన మీడియాకు మూడురోజుల మసాలా. ఎందుకంటే ఆమె బ్యుటీషియన్ కాబట్టి. పరోక్షంగా అక్రమ సంబంధాలను, ఇల్లీగల్ సెటిల్‌మెంట్లను ప్రజల మెదల్లోకి ఎక్కించడం మన ఛానళ్ల భావ దారిద్య్రం!
మన రాజకీయ నాయకులు కూడా ఈరోజు సెలబ్రిటీలే. ప్రజలకు సేవ చేయాల్సిన నాయకుల్లో కొందరు తమ జ్ఞాన విస్తృతిని పెంచుకోకుండా అంగబలం, అర్థబలం, కుల బలంతో పదవులు వెలగబెట్టడం విడ్డూరం. గాంధీ, నెహ్రూ, నేతాజీ, పటేల్, శాస్ర్తీ, ఇందిర, జెపి, వాజపేయి లాంటి నేతలు ప్రజల కోసం తమ సర్వస్వాన్ని వదులుకున్నారు. కొందరు తమ నైతిక విలువలకు కట్టుబడి జీవితాన్ని కొనసాగించారు. సిద్ధాంతాలకు విలువనిచ్చారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సాధారణ జీవితం గడిపాడు. సోమేపల్లి సోమయ్య లాంటి రైట్‌వింగ్ కార్యకర్త జీవితాంతం నిరాడంబర జీవనం కొనసాగించాడు. పుచ్చలపల్లి సుందరయ్య కూడా కొన్ని విలువలకు కట్టుబడ్డాడు. జార్జి ఫెర్నాండెజ్ అంత పెద్ద పదవులు నిర్వహించినా చాలా సాదాసీదాగా వుండేవాడు.
సరే.. రానురాను నిరాడంబరంగా జీవించడం వదిలేసినా, ప్రజలతో మమేకం అయ్యే నాయకులను ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. ఎన్టీఆర్ అనేక వేషాలేసినా ప్రజల మనిషిగా గుర్తించబడ్డాడు. వారితో మమేకమయ్యాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి లోలోపల కరుడుగట్టిన మనిషిగా ఉన్నా తన సంక్షేమ పథకాలతో ప్రజానాయకుడిగా చెలామణి అయ్యాడు. ప్రస్తతం కేసిఆర్‌ను ఎందరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజల నాడి తెలిసిన నేత. ప్రజల భాషలో మాట్లాడి వాళ్లను మెప్పిస్తాడు. తాను చాలాసార్లు అపార కరుణామూర్తిగా ప్రజల దృష్టికి కనిపిస్తాడు. అయితే- ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలాంటి అధ్యయనం లేకుండానే మాట్లాడతారు. వాళ్ల జాబ్ చార్ట్ ఏంటో కూడా వాళ్లకు తెలీదు. కేసిఆర్, చంద్రబాబు పథకాలను మిగతా నేతలు వల్లెవేస్తారు కానీ, తాము తమ నియోజకవర్గంలో కేసిఆర్‌లా, చంద్రబాబులా వుండాలని ఎందుకు కోరుకోరు?
ఇటీవల అధికార దర్పం తగ్గించడం కోసం కేంద్రం విఐపిల వాహనాలపై ‘ఎర్రబుగ్గ’ను తొలగించింది. కానీ గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా తమ కార్లపై ఎర్రరంగుతో పేర్లు రాసుకుని విఐపీల్లా పోజు ఇస్తున్నారు. ఢిల్లీలో కొందరికి రాజకీయ పునరావాసం కోసం పదవుల్లో ఉన్న వాళ్లందరినీ కోర్టు ఆదేశాల ద్వారా తొలగించడం జరిగింది. అలాగే తెలంగాణలో కార్యదర్శులను నియమించడంపై వివాదం వచ్చింది. పదవులు అధికార దర్పం ప్రదర్శించడానికి కాదు. అటల్ బిహారీ వాజపేయి మూడుసార్లు ప్రధానిగా పదవులు నిర్వహించి కూడా పరాయి ఇంట్లో చరమాంకం గడుపుతున్నాడు. లాల్ బహదూర్ శాస్ర్తీ జీవితమంతా ఆదర్శాలే.
డా.బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్లు తాము నమ్మిన సిద్ధాంతం కోసం పదవులను తృణప్రాయంగా భావించారు. ఆయన గనుక రాజీపడితే ఇంకెన్నో పదవులు ఆనాడు నిర్వహించేవాడు. పార్టీ ఫిరాయింపులు, ధనప్రవాహం, అధికార దర్పం, కులరాజకీయం.. ఇలాంటి వాటిని గురించి ఈరోజుల్లో మాట్లాడితే అదో ‘సత్యకాలపు సత్తయ్య అమాయకత్వం’ లా ప్రజలు చూసే దుస్థితికి మనం దిగజారిపోతాం. ఆదర్శాలు భారతీయ రక్తంలోనే ఉన్నాయి. 12వ శతాబ్దంలో బిజ్జల మహారాజు దగ్గర ప్రధానిగా, భండారిగా పనిచేసిన బసవేశ్వరుడు తన దగ్గర వ్యిక్తిగత విషయాలను మాట్లాడడానికి వచ్చిన మనుషులను ఒక్క నిముషం ఆపి, అక్కడ అప్పటి వరకున్న దీపం ఆర్పి రెండవ దీపం వెలిగిస్తాడు. ఎందుకు ఆ దీపం ఆర్పారని వచ్చినవాళ్లు ప్రశ్నిస్తే అది ప్రభుత్వ దీపం. ఇది నా స్వంత దీపం అనేవాడట! ఇదీ వాళ్ల నిబద్ధత. మరి ఈరోజుల్లో అలా దేశాన్ని ప్రేమించేవాళ్లు ఎందరు? ‘ప్రజాధనం అనేది భారతదేశపు బీద ప్రజలకు చెందింది. అందుచేత ప్రజాధనాన్ని వ్యయం చేసే విషయంలో అత్యంత జాగరూకతతో మెలగాలి’ అని మహాత్మా గాంధీ స్వయంగా ప్రకటించారు.
ఇవాళ సెక్యూరిటీ పేరుతో, ఆడంబరాల పేరుతో ఎంతో రాజకీయం నడుస్తోంది. దేశానికి అణుశాస్త్రాన్ని, ఏరోనాటికల్ వ్యవస్థను అందించిన డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం తన పదవీ విరమణ తర్వాత పాఠాలు బోధించడానికి వెళ్లిపోయారు. చివరకు బోధిస్తునే మరణించారు. తన పరిశోధనలకు రాయల్ సొసైటీ వాళ్లు డబ్బులిస్తామన్నా తిరస్కరించిన హరగోవింద్ ఖురానా, జగదీశ్ చంద్రబోస్ లాంటి మహనీయులను ఈనాడు ‘పరిశోధనలను వేలం పెడుతున్నవాళ్లు’ అధ్యయనం చేయాలి. రాష్టప్రతిగా అనే్నళ్లు పనిచేసిన డా.బాబూ రాజేంద్రప్రసాద్ తన చివరి జీవితాన్ని తన స్వగ్రామం దగ్గర వున్న ఆశ్రమంలో నిరాడంబరంగా గడిపాడు. ఆయన తయారుచేసిన ఎల్‌ఎల్‌ఎం ప్రశ్నా పత్రాలను ఆనాటి బ్రిటిష్ అధికారులు ఫ్రేం కట్టించి విశ్వవిద్యాలయంలో పెట్టారంటే ఆయనది ఎంత గొప్ప ప్రతిభో మనకు తెలుస్తుంది. నెహ్రూకు, ఆయనకు మధ్య ఎంత కోల్డ్‌వార్ నడిచినా దానిని లేఖల ద్వారా ఎంత గౌరవ ప్రదంగా పరిష్కరించుకునేవారో ఆయన జీవితం అధ్యయనం చేస్తే అర్థమవుతుంది.
రాజకీయవేత్తలు, టాప్‌లెవల్లో వున్నవారు మాత్రమే బాగుంటే సరిపోదు. తమ పార్టీల్లో గ్రామస్థాయి పదవుల్లో ఉన్నవాళ్లకు కూడా సరైన శిక్షణ ఇవ్వాలి. లేకపోతే ఈ మధ్య జరిగినట్టు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చేసిన ఘటన లాంటివి జరుగుతాయి. కేవలం పార్టీలు అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వ పథకాలు, వాటి లాభాలు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం వంటి విషయాల్లో మాత్రమే శిక్షణ ఇస్తారు. కానీ అకడమిక్‌గా నాయకులు చేయాల్సిన పనులను, ఆదర్శాలను, పాతతరం నాయకుల విలువలను శిక్షణలో భాగంగా నేర్పించాలి. అవేవీ లేకుండా కేవలం ‘రాజకీయాలే’ నేర్పిస్తే ఆ నాయకుడి పని ‘పదవే పరమావధి’గా భావించి దేశాన్ని దోచేస్తాడు.
తాను స్థాపించిన బ్యాంకులోనే సాధారణ అకౌంట్ హోల్డర్‌గా వుండాలనుకునే మోక్షగుండం విశే్వశ్వరయ్య గురించి- ప్రుడెన్షియల్ బ్యాంక్, చార్మినార్ బ్యాంక్‌లను నిండా ముంచిన నాయకులు తెలుసుకోవాలి. కొల్లాయిగట్టి అర్ధనగ్న ఫకీరుగా అవతారమెత్తిన గాంధీజీ జీవితాన్ని కింగ్ ఫిషర్ హీరో విజయ్ మాల్యా తెలుసుకోవాలి. విదేశీయులను వెళ్లగొట్టడం కోసం త్యాగాలను గాంధీజీ చేస్తే దేశాన్ని మోసం చేసి సుఖాలను అనుభవించడం కోసం విజయ మాల్యా విదేశాలకు పారిపోయాడు. ఎంత తేడా? ఎందరో శాస్తవ్రేత్తలు మనకు గొప్ప గొప్ప పరిశోధనలు చేసి ఎంతో సుఖాన్ని ఇస్తున్నారు. వారి పేర్లయినా మనకు తెలుసా?
తత్వవేత్తలు, శాస్తవ్రేత్తలు, కవులు రాజకీయ రంగంలోకి వచ్చినా పచ్చి రాజకీయ వాసనలు లేకపోతే జీవించని స్థితిలోకి ప్రజలను నెట్టేశారు. భారతదేశపుచివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ ఒక గొప్ప ఉర్దూ కవి. అందుకే బ్రిటిష్‌వారు అతని దగ్గర నుండి సులభంగా భారత దేశాన్ని లాగేసుకున్నారు. అతను ఓ చక్రవర్తి కొడుకు కావడం యాదృచ్ఛికం. కానీ ఓ కవి రాష్టప్రతి కావడమనేది ఇప్పుడు సాధ్యం కాదు. డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌కే రాజ్యాంగ పాఠాలు చెప్పగల దిట్టలు, గాంధీకే అహింస ప్రబోధాన్ని తిరగేసి చెప్పగల సమర్ధులు ఇప్పుడు గ్రామానికో వ్యక్తి కనిపిస్తున్నాడు. గంధర్వులకే నటన నేర్పగల నటులూ ఉన్నారు. ఇక మనల్ని సెలబ్రిటీల నుంచి ఎవరు కాపాడగలరు?*

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published AndhrabhoomiFriday, 21 July 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి