‘వంద తప్పలు చేస్తే గానీ శిశుపాల వధ’ జరగదు కాబట్టి కేసిఆర్ నూరు తప్పుల వైపు ప్రయాణం చేస్తున్నారు! ఇక్క డ ‘వధ’ అంటే తెరాస గద్దె దిగడమే! తాను ‘పంది’ అంటే ‘అ వును’ అనే వాళ్లు, ‘కాదు నంది’ అంటే కాదనే ‘వందిమాగధులు’ చుట్టూ చేరితే అది ‘కెసిఆర్ ప్రభుత్వం’ అవుతుంది. సరిగ్గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా అడుగులు వేశాడో, కేసిఆర్ అలాంటి ‘పాదయాత్ర’నే చేస్తున్నాడు. వైఎస్ బయటకు కన్పించేవాడు, ఇతను కన్పించకుండా కవర్ చేస్తున్నాడు. వీళ్లిద్దరూ ఉదారవాదులుగా, వితరణ శీలురుగా, నమ్మిన వాళ్లకు మేలు చేసే వ్యక్తులుగా, అవసరమైతే శత్రువులపై కర్కశులుగా వ్యవహరించే ధీరులుగా తమను తాము ఊహించుకున్నారు. కేసిఆర్ మరో అడుగు ముందుకు వేసి తాను విశేష భక్తిగల ధార్మికుడిగా, ‘జాతిపిత’గా భావించుకుంటున్నారు. అందులో భాగంగానే ముస్లిం మతస్థులకు 12 శాతం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చారు. ముస్లింలకు వైఎస్ 5 శాతం ‘కోటా’ ఇవ్వడానికే ఆనాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పడింది. వైఎస్ ప్రసాదించిన రిజర్వేషన్లపై ఇప్పటికీ సుప్రీం కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ఎన్నికల హామీల్లో భాగంగా ‘మ్యానిఫెస్టో’లో తెరాస ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఉద్యమంలో అన్ని వర్గాలనూ కలుపుకుపోవాలన్న ఆలోచనతో సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా కేసిఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని ‘వరం’ ఇచ్చారు. గాంధీజీ ఎలాగైతే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రతి వర్గాన్ని సంతృప్తి పరచడానికి హామీలిచ్చి ఆఖరుకు తప్పనిసరి పరిస్థితిలో పాకిస్తాన్‌నే ఇచ్చి ‘జాతిపిత’గా పేరు పొందాడో, కేసిఆర్ కూడా ఈ చర్య ద్వారా ‘తెలంగాణ జాతిపిత’ కావాలనుకుంటున్నాడో ఏమో..!?
తెలంగాణ ప్రాంతంలో హిందువులది ప్రత్యేక పరిస్థితి. 250 ఏళ్లకు పైబడి ఇక్కడి హిందువులు ముస్లిం రాజుల పాలనలో ఉన్నారు. ఈ వందల ఏళ్ల మతవ్ఢ్యౌంలో హిందువులు తమ అస్తిత్వాన్ని పోగొట్టుకున్నారు. భాష, సంస్కృతి, చరిత్రను పాలకులు ధ్వంసం చేస్తుంటే వారు నిస్సహాయులుగా చూస్తూ ఉండిపోయారు. ఇది ముఖ్యంగా 1911లో సింహాసనం అధిష్టించిన చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ పాలనలో మరింత పరాకాష్ఠకు చేరింది. అతడు ఔరంగజేబులాగా తనను తాను ‘జిందాపీర్’గా పరిగణించుకున్నాడు. 1922లో టర్కీలో ఖలీఫా వ్యవస్థ రద్దు చేశాక ఓ కవిత రాసుకున్నాడు. ‘ప్రపంచంలోని ముస్లిం చక్రవర్తులందరూ కనుమరుగయ్యారు. ఓ ఉస్మాన్! ఇక ముస్లింలందరికీ నీవే రక్షకుడివి!’ అనే ఈ కవితను బట్టే అతని మతోన్మాదపు స్థాయిని ఊహించుకోవచ్చు. అతని రాజ్యంలోని హిందువులను హింసించే క్రూరమృగం ‘రజాకార్’ సంస్థ. ఖాసిం రజ్వీ నేతృత్వంలో ఈ సంస్థ తెలంగాణలో చేసిన హింస బాబర్, ఘజనీ, ఘోరీ, ఔరంగజేబు, నాదిర్షాలు చేసిన హింసకు సరిసమానమైనదే. అప్పంపల్లి, భువనగిరి, పరకాల ప్రాంతాల్లోని రాళ్లను అడిగినా రజాకార్ల హింసకాండను వర్ణిస్తాయి. కొమురం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ, నారాయణరావు పవార్ వంటి వారు తెలంగాణలో ఏ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడారో తెలియని వాళ్లం కాదు. ‘మా అన్నల జంపిన.. మన స్ర్తిల చెరిచిన మానవాధములను, మండలాధీశులను మర్చిపోకుండగా గుర్తుంచుకోవాలె’ అని కాళోజీ నారాయణరావు నిప్పులు చెరిగింది ఎవరి మీద? ఎన్నో దుష్కృత్యాలను అనుభవించిన హిందువులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ భాష, సంస్కృతి, చరిత్రలను పునర్లిఖించుకుంటామని అనుకున్నారు. కానీ, తెరాస ప్రభుత్వ ‘సంతుష్టీకరణ విధానం’ చూస్తే ఆ ఆశలన్నీ అడియాసలే అని తెలిసిపోయాయి. కేసిఆర్ ఎన్నోసార్లు బహిరంగంగానే నిజాంను కీర్తించడం, నిజాం సమాధిని దర్శించడం, తెలంగాణ విమోచన దినం నిర్వహించకపోవడం, ఉమ్మడి రాష్ట్రంలో లేనంత ఎక్కువగా మైనార్టీ వర్గాలకు పదవులు ఇవ్వడం, మత ప్రాతిపదికన గురుకులాలు ఏర్పాటు చేయడం.. చివరగా ముస్లింలకు మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించడం.. ఇవన్నీ సంతుష్టీకరణలో భాగాలే. ‘్భమినీ ఆకాశాన్నీ ఏకం చేసైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తాం’ అని తెంపరితనంగా ఆయన మాట్లాడడం రాజ్యమదానికి నిదర్శనం. అంతేకాదు, ఓసారి ముస్లింల సమావేశంలో మాట్లాడుతూ ‘మేన్ బాత్ కహతా హూ తో బర్కరార్ రాహెతాహూ హే ఆప్ తమామ్ జాన్‌తాహై’- ‘మీకు తెలుసు నేను చెప్పింది వెనక్కి తీసుకోను’ అన్న కేసిఆర్ మాటలు తెలంగాణ తాజా కేబినెట్ సమావేశంలో ప్రస్ఫుటమయ్యాయి.
ఈ సంతుష్టీకరణ విధానం ఈనాటిది కాదు. మొదటిసారి 1909లో మింటే మోర్లే సంస్కరణల్లో భాగంగా బ్రిటిష్ వాళ్లు ము స్లింలకు ప్రత్యేక నియోజకర్గాలు కేటాయించాలన్నారు. అప్పటి నుండి మొదలైన విధానం 1922లో ఖలీఫా రద్దుతో తీవ్రరూపం దాల్చింది. టర్కీలోని ఖలీఫా రద్దుకు ఇక్కడ గాంధీజీ స్పందిస్తే కేరళలో మోప్లాల హత్యలకు దారితీసింది. ఈ విధానాన్ని నెహ్రూ చేత కమ్యూనిస్టు బుద్ధిజీవులు చక్కగా స్వాతంత్య్రానంతరం అమలు చేయించారు. మొదట ఆర్యసమాజం, హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్ వంటి సంస్థల ‘జాతీయ వాద భావజాల విస్తరణ’ను అడ్డుకోవడానికి ప్రారంభించిన ఈ ఆట, తదనంతర పరిణామాల్లో ముస్లింలను కాంగ్రెస్ తన ఓటుబ్యాంకుగా మార్చుకుంది. 1947-48 మధ్య తెలంగాణలో జరిగిన రజాకార్ల దాష్టీకం మొదలుకుని ఈరోజువరకు జరుగుతున్న పరిణామాలను సంతుష్టీకరణ పార్టీలు ప్రస్తావన కూడా చేయవు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ అవలంబించిన ఈ విధానం తెరాస సర్కారు కొనసాగించడం పెద్ద విశేషమేమీ కాదు. తెలంగాణలో ఉద్యమ భావోద్వేగాలు ఇప్పుడిప్పుడే అణిగిపోతున్నాయి కాబట్టి రేపు ఈ ప్రాంత ప్రజలను భాజపా ఆక్రమిస్తుందన్న భయం కేసిఆర్‌కు ఉంది. 2019 ఎన్నికల్లో ప్రత్యేక ఓటుబ్యాంకును ఏర్పాటు చేసుకుంటే గానీ గట్టెక్కడం కష్టం అని ఆయనకు తెలుసు. బీసీలను చీల్చేసి వారి గొంతును నొక్కేశారు. అగ్రకులాల వాళ్లకు ఎలాగూ రిజర్వేషన్లు లేవు, రావు కాబట్టి ‘రిజర్వేషన్లు ఎవరికిస్తే మాకేంటి?’ అనుకుంటారు. గనుక వాళ్లు నోరు మెదపరు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు కోత పడదు కాబట్టి వాళ్లు మాట్లాడరు. బీసీ కులాల నోటికాడి ముద్దను గుంజి మైనార్టీలకు పంచాలన్నది కేసీఆర్ వ్యూహం. మైనార్టీల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టకుండా ఇలాంటి తాయిలాలు ఇచ్చి ఓటు బ్యాంకుగా మార్చుకున్నారన్నది సత్యం. ఏ ముస్లిం నాయకుణ్ణైనా అడిగితే- ‘్భరత్ లౌకికవాదం తమకు ఏమీ లాభం చేకూర్చలేదనే’ అంటాడు. మరి ముస్లింల అభివృద్ధి నిరోధక శక్తి ఎవరు? లౌకిక వాద ఓటుబ్యాంకు రాజకీయమా? ము స్లింల స్వయం కృతాపరాధమా?
డాక్టర్ అంబేద్కర్ ఒకవేళ ఆనాడు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే రాజ్యాంగంలోనే పొందుపరిచేవారు. 29, 30వ రాజ్యాంగ అధికరణాల ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల హోదా ఉన్నవాళ్లకు విశేషావకాశాలు, హక్కులు, లాభాలు ఎలా కల్పించబడ్డయో వాటి వివరణ ఉంది. అనుసూచిత జాతులకు, అనుసూచిత కులాలకు (ఎస్టీ, ఎస్సీలకు) రిజర్వేషన్లు ఇవ్వడం వెనుక ఉన్న తర్కం, హేతుబద్ధత భిన్నంగా ఉంది కాబట్టే బాబాసాహెబ్ ఈ విషయంలో పోరాటం చేసాడు. శతాబ్దాలుగా ఈ జాతులు అధికారంలో లేవు. వారికి కనీస సదుపాయాలు లేవు. వారిపట్ల కొందరు అమానవీయంగా ప్రవర్తించారు కాబట్టి ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ రక్షణ పరిధిలో రిజర్వేషన్లు కల్పించారు. ఇలాంటివేవీ ముస్లింలు ఎన్నడూ ఎదుర్కోలేదు. ఈ రిజర్వేషన్లు మత రాజకీయాలకు వేదిక అయితే రేపు మళ్లీ తెలంగాణలో రజాకార్ రాజ్యమే! బీసీల సమస్యలపై ఎన్నో పుస్తకాలు రాసిన బి. ఎస్.రాములు వంటి ‘సాధు రచయిత’ను ముందు పెట్టి ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ బీసీలకు ఎలాంటి మేలు చేయకపోగా, బీసీల రిజర్వేషన్లను ధ్వంసం చేసే విధంగా మారడం ఆత్మహత్యా సదృశం. నాడు కేంద్రంలో రాజేంద్రసచార్ కమిటీ వేసి ముస్లిం సంతుష్టీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకున్నట్టే, సుధీర్ కమిటీ పేరుతో కేసిఆర్ అదే పని చేస్తున్నారు.
తెలంగాణలో ‘తమిళనాడు తరహా రిజర్వేషన్లు’ తెస్తామంటున్న ముఖ్యమంత్రి అక్కడి పరిస్థితులను తెలంగాణతో పోల్చి చెప్పగలరా? తమిళనాడులో ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి చాలా తతంగం జరిగింది. 1969లో ఏఎన్ సత్తనాథన్ చైర్మన్‌గా బీసీ కమిషన్‌ను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది పూర్తిగా బీసీలకు మేలు చేయడానికే. ఇక్కడేమో బీసీ కమిషన్ భుజం మీద తుపాకీ పెట్టి మైనార్టీ రిజర్వేషన్లకు తెర తీస్తున్నాడు కేసిఆర్. నాటి సత్తనాథన్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ కోటా 25 నుండి 31 శాతానికి పెంచింది. ఎస్సీ కోటా 16 నుండి 18 శాతానికి పెంచగా అది 49 శాతానికి చేరింది. 1980లో మళ్లీ బిసి రిజర్వేషన్ కోటా 31 నుండి 50 శాతానికి పెంచగా మొత్తం రిజర్వేషన్లు 69 శాతం అయ్యాయి. ఆ తర్వాత 1992లో సుప్రీం కోర్టులోకి వచ్చిన ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటరాదంటూ అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ తీర్పుకు భయపడ్డ నాటి తమిళ సర్కారు 1993లో ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపగా, 76వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశం 9వ షెడ్యూల్‌లో చేరింది. దానివల్ల ఈరోజు తమిళనాడులో బీసీలకు 30 శాతం రిజర్వేషన్లలో 26.5 శాతం బీసీ (జనరల్) వాళ్లు అనుభవిస్తుండగా, బిసీ (ముస్లిం)లు కేవలం 3.5 శాతం మాత్రమే పొందుతున్నారు. మిగతా ఎంబీసీలు 20 శాతం, ఎస్సీలు, ఎస్టీలు 19 శాతం రిజర్వేషన్ల లబ్ధి పొందుతున్నారు. మరి తెలంగాణలో కేవలం ముస్లిం మైనార్టీలకే 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ తమిళనాడును సాకుగా చూపడం ఎంతవరకు సబబు?
తమిళనాడు సిద్ధాంతమే ఆధారమైతే ఇప్పటికే తెలంగాణలో మైనార్టీలు 4 శాతం రిజర్వేషన్లను సుప్రీం కోర్టులో కేసుండగానే అనుభవిస్తున్నారు. తమిళనాడులో ముస్లిం బీసీ కోటా 3.5 శాతం మాత్రమే. జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు అక్కడి ప్రభుత్వం న్యాయంగా రిజర్వేషన్లు ఇస్తున్నది. తెలంగాణలో బీసీ కులాలను ముంచేస్తూ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటిస్తే, మిగిలిన పార్టీలన్నీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఓటుబ్యాంకు రాజకీయం కాకపోతే మరేమిటి? 2001 నుండి 2011 వరకు తెలంగాణలో హిందువుల జనాభా కన్నా ముస్లింల జనాభా వృద్ధిరేటు ఎక్కువగా ఉంది. 2001లో 85.84 శాతం నుండి హిందూ జనాభా 2011లో 85.09కు పడిపోయింది. అదే ముస్లిం జనాభా 2001లో 12.43 శాతం ఉండగా, 2011లో 12.68 శాతానికి చేరింది. ఇలాంటి స్థితిలో మత ప్రాతిపదికపై పెంచుతున్న ఈ రిజర్వేషన్లు వెర్రితలలు వేస్తే భవిష్యత్తులో రెండువర్గాల మధ్య శాశ్వత ఘర్షణగా స్థిరం అవుతుంది.
గతంలో చంద్రబాబుతో మొదలైన ఈ తంతు వైఎస్‌తో కార్యరూపం దాల్చింది. ఇప్పుడు కేసిఆర్ చారిత్రక తప్పిదం చేయడం వల్ల తెలంగాణ బీసీల నోట్లో మట్టికొట్టినట్టవుతుంది. కమ్యూనిస్టు నేత, నాటి కేరళ ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూద్రిపాద్ కేరళలోని మల్లప్పురం, కోజికోడ్, పాలక్కాడ్ జిల్లాలలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేసారు. దానివల్ల అక్కడ ఇప్పుడు ఓ చిన్నపాటి పాకిస్తాన్ ఏర్పడి, మరో కాశ్మీర్‌లా అక్కడి నుంచి హిందువులు వలస వెళ్లిపోయారు. వేలాదిమంది హిందువులు చంపబడ్డారు. ఇప్పుడు తెలంగాణలో సంతుష్టీకరణలో భాగంగా అమలు చేయబోయే రిజర్వేషన్లు ఏ పరిణామాలను సంతరించుకుంటాయో చెప్పలేం!
ఇప్పటికే మైనార్టీ వ్యవస్థల పేరుతో పాఠశాలలు, కళాశాలలు, వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు నడస్తున్నాయి. ప్రత్యేకంగా వీటి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల గ్రాంటును మంజూరు చేస్తున్నాయి. వీటిని నడిపే మైనార్టీ ధనవంతులు ఎంతమంది బీద ముస్లింలకు మేలు చేస్తున్నారనే విషయం పరిశీలించాల్సిన ప్రభుత్వాలు ఇలా ఓటుబ్యాంకు రాజకీయాలకు దిగజారిపోవడం విడ్డూరం. ‘బీదవాళ్లకు చేపలకూర పెట్టడం కన్నా, చేపలు పట్టడం నేర్పించాలన్న’ చైనా సామెత తెలియని మన నాయకులు స్వతంత్ర భారతంలో ఇలాంటి వాటిని పెంచి పోషిస్తున్నారు. వైఎస్ ఇచ్చిన 5 శాతానే్న సుప్రీంలో సవాలు చేసినా, కేసిఆర్ మొండిగా వెళ్లడం నిక్కచ్చిగా ఓట్ల రాజకీయమే. తెరాస ప్రభుత్వం గత 3 ఏళ్లలో ఎన్నిసార్లు కోర్టుతో మొట్టికాయలు తిన్నదో చె ప్పలేం. మతం పేరున ఇచ్చే ఈ రిజర్వేషన్లకు పేరు ఏం పెట్టుకున్నా పరోక్షంగా లక్ష్యం అదే అవుతుంది. అగ్రవర్ణ పేదలకే ఈసౌకర్యం కల్పించడాన్ని రాజ్యాంగంలోని 14, 15 అధికరణాలు అంగీకరించవు. వైజ్ఞానికంగా వెనుకబబడ్డ వాళ్లకే రిజర్వేషన్లని ఈ అధికరణాలు చెప్పగా, మండల్ కమిషన్ నివేదిక ఇచ్చిన బిందేశ్వరీ ప్ర సాద్ స్వయంగా పెట్టిన హద్దు 27 శాతమే. ‘దునే్నటపుడు దూడల్లో.. మేసేటప్పుడు ఎద్దుల్లో ..’ కలిపే ఈ రాజకీయ కుట్రను తెలంగాణ ప్రజలు తెలుసుకుంటే మొన్నటి యుపి ఎన్నికల ఫలితాలే ఇక్కడా పునరావృత్తం అవుతాయి. సాఫీగా సాగుతున్న తెలంగాణ రాజకీయ రథాన్ని నిలువరించమని కేసిఆర్ స్వయంగా అమిత్‌షాకు స్వాగతం పలుకుతున్నట్టు కన్పిస్తుంది. వందల ఏళ్లనుండి బానిసత్వ బాధలు అనుభవించిన ఇక్కడి హిందూ ప్రజలను మరోసారి నిజాం ఆలోచనల వైపు తీసుకెళ్లే ఈ ప్రక్రియ సరైందా? కాదా? అని కాలమే నిర్ణయిస్తుంది. చరిత్రలో పాలకులు భాగం అయితే మంచిదే కానీ, ఏకంగా చరిత్రనే పాలకుడు మింగేస్తే జరిగేది- ‘చంద్ర’ గ్రహణమే! *

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi Friday, 14 April 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి