‘రిషికేశ్‌లోని ఓ స్వామీజీ తపస్సు చేసుకుంటుంటే ఆయన వద్దకు ఇద్దరు అన్యమతస్థులు వచ్చారు. ‘స్వామీజీ.. మీ మ తం గొప్పదా? మా మతం గొప్పదా?’ అని ప్రశ్నించారు. ఏం చెప్పినా బాగుండదని తర్కించిన స్వామీజీ ‘మీ మతం మీకు గొప్ప! మా మతం మాకు గొప్ప’ అన్నారు. ‘లేదు లేదు.. మా మతమే గొప్పది.. మేం చెప్పేది నిజం’ అంటూ వారు కుతర్కం మొదలుపెట్టారు. ‘మీకు దమ్ముంటే మమ్మల్ని ఓడించండి లేదా మీరు మా మతంలో చేరండి’ అని వాళ్లు స్వామీజీని దబాయించారు. వాదన, తర్కం వద్దని స్వామీజీ వారించగా, వాళ్లు రెచ్చిపోయి ‘మీ మతం గొప్పదని నిరూపించు.. లేదంటే మా మతాన్ని స్వీకరించు’ అంటూ గొడవకు దిగారు. స్వామీజీ నిరాకరించగా ఒక దుడ్డుకర్ర తీసుకుని అతడిని కొట్టడం మొదలుపెట్టారు. అక్కడే వున్న కానిస్టేబుల్ దగ్గరకెళ్లి తనను రక్షించమని స్వామీజీ కోరాడు. ‘ఇది మతాల మధ్య సంఘర్షణ. ఇలాంటి వాటి మధ్యలో పోలీసులు జోక్యం చేసుకోరాదు. మనది సెక్యులర్ ప్రభుత్వం. ఒకవేళ మిమ్మల్ని రక్షిస్తే లొకికవాదం దెబ్బతింటుంది. అందువల్ల నిన్ను నేను రక్షించను’ అన్నాడు రక్షకభటుడు. వాళ్ల దౌర్జన్యాన్ని తట్టుకోలేని స్వామీజీ తిరగబడ్డాడు. పూర్వాశ్రమంలో స్వామీజీ కర్రసాములో మంచి ప్రావీణ్యం ఉన్నవాడు. తన పూర్వ జ్ఞానం గుర్తుతెచ్చుకుని వాళ్లపై కర్రతో ఫైట్ చేయడం మొదలుపెడితే వాళ్ల పరిస్థితి ఘోరంగా మారిపోయింది. వెంటనే కానిస్టేబుల్ అడగకుండానే వచ్చి ‘స్వామీజీ! మీరలా వాళ్లను కొట్టడం తప్పు, చట్టప్రకారం ఇతరులపై దాడి చేయడానికి వీల్లేదు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను’ అన్నాట్ట. ‘ఏమిటీ! ఇందాక నేను పిలిస్తే నాకు సంబంధం లేదని..సెక్యులర్..రాజ్యాంగం .. చట్టం ఏదేదో అన్నావు’? అని నిలదీశాడు స్వామీజీ. ‘గురువు గారూ! ఇప్పుడు మీరు పరస్పరం ఘర్షణ పడితే అది శాంతి భద్రతల సమస్య అవుతుంది. మెజార్టీలు మైనార్టీలపై దాడి చేస్తే నేను ఊరుకోను. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నా!’ అని చెప్పాడట. ఈ దేశంలోని సూడో సెక్యులర్ వాదులను గురించి నరేంద్ర మోదీ గురువుగా ప్రచారమైన స్వామి దయానంద చెప్పిన కథ ఇది.
మన దేశంలో ఇలాంటి ప్రహసనాలే నడుస్తున్నాయి. ఈ దేశంలో ప్రజలను మెజార్టీలు, మైనార్టీలుగా విభజించినపుడే సెక్యులరిజం మంట గలిసింది. ఈ రోజుకూ ఓట్లకోసం ఇలాంటి సంతుష్టీకరణ జరుగుతునే ఉంది. బరితెగించి హిందువులను, వారి సంప్రదాయాలను సభల్లో తిట్టేవాళ్లు, టీవీ చానళ్లలో కూర్చుని నిందించేవారు- ఇతర మతాలను ఒక్క మాట అనగలరా? హిందూ గ్రంథాలను నిదించేవాళ్లు, హిందూ పండగలను తూర్పారబట్టేవాళ్లు ఇతర మత విధానాలను ప్రశ్నించగలరా? హిందువులను తిట్టడమే ‘సెక్యులరిజం’ అనుకుంటున్న కుహనా మేధావులు, నాయకులు ఇంకెప్పుడు కళ్లు తెరుస్తారు? దీనికంతా కారణం హిందువుల్లో సమైక్యతా లోపం. ప్రత్యేకించి ‘హిందూ ఓటు బ్యాంకు’ లేకపోవడం! మన ప్రక్కనున్న తమిళనాడులో పెరియార్ రామస్వామి అనే ద్రావిడ పార్టీ నాయకుడు తనకు వ్యక్తిగతంగా ఉన్న కులద్వేషాన్ని మొత్తం జాతి ప్రజలపై ఆనాడు రుద్దుతాడా? 1953 ప్రాంతంలో పెరియార్ స్వయంగా నాయకత్వం వహించి పిల్లయ్యార్ (వినాయకుడు) విగ్రహాలను ధ్వంసం చేసాడు. 1955లో, 1968లో ఈ దేశంలో కోట్లాది మందికి ఆరాధ్య దైవమైన రాముడి బొమ్మల్ని, రామాయణ గ్రంథాల్ని పెరియార్, అతని అనుచరులు తగలబెట్టారు. రాముడిని, సీతను నిష్ఠూరంగా విమర్శించి రావణుడ్ని ఆరాధించాడు. అలాగే 1968లో అన్నాదొరై ప్రభుత్వం కార్యాలయాల్లో హిందూ దేవతల చిత్రపటాలను తొలగించాలని ఆదేశించింది. ఆఖరుకు ఈ తీవ్రత ముదిరిపోయి 1955లో హిందీ వ్యతిరేక ఉద్యమం పేరుతో పెరియార్ భారత జాతీయ పతాకం దగ్ధం చేసేవరకూ వెళ్లింది. 1957లో పదివేల మంది పెరియార్ అనుచరులు భారత రాజ్యాంగ ప్రతులనే ధ్వంసం చేసారు. గాంధీ చిత్రపటాలను తగలబెట్టేవరకు వెళ్లింది. ఇదంతా హిందూ మెజార్టీ ఉన్న భారతదేశంలో మాత్రమే సాధ్యం!
తదనంతర కాలంలో త్రిపురనేని రామస్వామి చౌదరి తనకు వ్యక్తిగతంగా ఎదురైన అవమానాన్ని జాతి అవమానంగా మార్చారు. మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ అనేక రచనలు చేసారు. ఆయనను అనుసరించిన నార్ల వెంకటేశ్వరరావు, తాపీ ధర్మారావు లాంటి పాత్రికేయ పెద్దలు తమ రచనలన్నీ మెజార్టీ ప్రజల మనోభావాలను గాయపరుస్తూ రాసినవే. ఇది అంతా హిందూ మెజార్టీ ప్రజలున్న ఈ సెక్యులర్ దేశంలోనే సాధ్యం. మొన్నటికి మొన్న రాష్టప్రతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ లాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న దళిత నేతను ఎన్‌డిఎ అభ్యర్థిగా ప్రకటిస్తే సెక్యులర్ పార్టీల నేతలు రంధ్రానే్వషణ చేయడం మొదలుపెట్టారు. మెజార్టీ ప్రజల భావజాలం అతనిలో ఉంటే ఈ దేశ రాష్టప్రతి పదవికి అర్హుడు కాడన్నట్టు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి కరుడుగట్టిన సంతుష్ఠీకరణ వల్లనే ఒక్కో రాష్ట్రం ‘కాషాయ మయం’ అవుతున్నదన్న సంగతి వీళ్లు మరిచిపోతున్నారా? మళ్లీ మాట్లాడితే ప్రజాభిప్రాయం అంటూ బుకాయిస్తారు. మరి అవతలి పార్టీ వాళ్లను గెలిపిస్తున్నది ఏ దేశ ప్రజలు?
మొత్తానికి మెజార్టీ ప్రజల మనోభావాలను గాయపరచడమే ఈ దేశ సెక్యులరిజం అన్న భ్రమలో ఈ పార్టీలు, స్వయం ప్రకటిత మేధావులు ఉన్నారు. ముంబయిలో 150 మంది మృతికి కారణమైన దోషి యాకుబ్ మెమెన్. సుదీర్ఘకాలం విచారణ చేసాక అతనికి మనమంతా గౌరవించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విరచిత రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన సుప్రీంకోర్టు అతనికి శిక్ష విధించింది. కానీ అతడిని హీరోగా మన విశ్వవిద్యాలయ పిల్లస్కాలర్లు వర్ణిస్తూ ఊరేగింపులు జరిపారు. అది తప్పు అన్న వాళ్లంతా మతతత్వవాదులు, యాకూబ్ వైపునిలబడే వాళ్లంతా లౌకిక వాదులు. ఇలాంటి అభిప్రాయాలను నరనరాన మనకు జీర్ణింపచేసారు. అందుకే- వారు మన రాజ్యాంగాన్ని గౌరవించకున్నా ప్రశ్నించలేని నిస్సహాయతలో మనమున్నాం!
18వ శతాబ్దంలో నిర్మించిన, దేశంలోని ప్రసిద్ధ దేవాలయం తారకేశ్వర్ మందిర్. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాకు సమీపంలో హుగ్లీ జిల్లాలో ఉంది. బెంగాల్‌లో ఈ దేవాలయానికి చాలా ప్రశస్తి ఉంది. మహా శివరాత్రి, చైత్ర సంక్రాంతి లాంటి పర్వదినాల్లో వేలల్లో ఈ దేవాలయానికి జనం వస్తారు. అలాంటి ప్రసిద్ధ దేవాలయానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్హాద్ హకీం అనే వ్యక్తిని ‘తారకేశ్వర్ మందిర్ అభివృద్ధి సంస్థ’కు చైర్మన్‌గా నియమించింది. 2011లో శాసనసభ్యుడిగా ఎన్నికైన పర్హద్ హకీమ్ తన నియోజకవర్గాన్ని ‘మినీ పాకిస్తాన్’గా వర్ణించుకుంటాడు. ఇటీవల బెంగాల్‌లో జరిగిన ‘నారద స్టింగ్ ఆపరేషన్’ కుంభకోణంలో ఇతను ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒక హిందూ దేవాలయానికి ఇతర మతస్తుడిని చైర్మన్‌గా చేయడం మమతా బెనర్జీ దుస్సాహసం కాకపోతే మరేమిటి?
ఇన్నాళ్లు బెంగాల్‌లో మత ఓట్ల వేటలో ముందున్న కమ్యూనిస్టులను తోసిరాజని మమత అధికారంలోకి వచ్చింది. మురాదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాల్లో ముస్లింల సంఖ్య అధికం. బెంగాల్ జనాభాలో 27.01 శాతం ఉన్న ఆ మతస్తుల మన్ననలు పొందడానికి మమత ఇలాంటి ప్రయోగం చేస్తున్నది. అంతేకాదు, పెద్దనోట్ల రద్దు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీని బండబూతులు తిట్టిన బర్కతీ అనే మత గురువును ప్రోత్సహించింది. తస్లిమా నస్రీన్ జీవితాన్ని తెలిపే ఓ టీవీ సీరియల్‌పై నిషేధం విధించింది. కొన్ని ప్రాంతాల్లో ప్రసిద్ధంగా జరిగే దుర్గాపూజలపై ఆంక్షలు విధించింది. బెంగాల్‌లో ఉర్దూను ద్వితీయ భాషగా ప్రకటించింది. ఇమాంలకు, మొహజ్జమ్‌లకు పించన్లు పెంచింది. సాల్మన్ రష్డీని బెంగాల్ రావద్దని శాసించింది. తన బడ్జెట్‌లో మైనార్టీలకు కేటాయింపులను విపరీతంగా పెంచింది. ఇదంతా ఓట్ల వేట కాకపోతే ఇంకేమిటి? అయితే ఫర్హాద్ హకీం తారకేశ్వర్ మందిర్ అభివృద్ధి బోర్డు బాధ్యతలు స్వీకరించి పనిలో మునిగిపోయాడు. సహజంగానే అక్కడి ప్రతిపక్ష నాయకులు- హిందూ మతస్థులను ఇతర మతాల ప్రార్ధనా స్థలాలకు చైర్మన్‌గా చేయగలరా? అని ప్రశ్నిస్తూ రాజకీయం చేస్తున్నారు. ఒకవేళ సెక్యులరిజాన్ని కాపాడడానికే ఇలా చేస్తున్నానని బెంగాల్ సిఎం చెబితే ఈ రూలు అందరికీ వర్తించాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ విషయాన్ని ఉమర్ అహమద్ ఇలియాసీ లాంటి ముస్లిం మత గురువులు వ్యతిరేకించారు. అయినా ‘వీర సెక్యులర్’ కంకణం కట్టుకున్న మమతా బెనర్జీ వెనక్కు తగ్గడం లేదు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి ఇతర మతస్థులను వైస్ చాన్సలర్లుగా నియమించగలరా? అంటూ బెంగాల్ భాజపా నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అలాగే, ఇటీవల వివాదాస్పదంగా మారిన అంశం- కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ శృంగేరీ పీఠాధిపతి కుర్చీని లాగెయ్యడం. ఆది శంకరుడు దేశమంతా పాదయాత్ర చేసి హైందవ మత పునరుద్ధరణ నిరంతరం జరగడానికి శృంగేరీలో భోగలింగ స్థాపన చేసాడు. దేశానికి మరో మూడు వైపులా మూడు మఠాలను స్థాపించాడు. దక్షిణామ్నాయ పీఠంగా పిలిచే కర్నాటకలోని శృంగేరి మఠం చాలా ప్రసిద్ధం. ఈ పీఠదేవత వరాహుడు. క్షేత్రం రామేశ్వరం, తీర్థం తుంగభద్ర, పీఠదేవత శారదాదేవి. ఇక్కడి బ్రహ్మచారులను చైతన్యులని పిలుస్తారు. ఈ మఠ సన్యాసులు పదియోగ పట్టాలలో దేనినైనా స్వీకరించవచ్చు. వీరిని భూరివార సాంప్రదాయానికి చెందినవారని చెప్తారు. భూరి అనగా బంగారం. ధన వ్యామోహం తగ్గించేపనిని ఈ పీఠాధిపతులు చేస్తారు. ఇన్ని పద్ధతులున్న ఈ పీఠం పరిధిలోకి ఆంధ్ర, కర్నాటక, ద్రవిడ, కేరళ ప్రాంతాలు వస్తాయి. అందులో భాగంగానే తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోని పుష్కరిణి పునరుద్ధరణకు శృంగేరీ ఉత్తరాధిపతి శ్రీ విధుశేఖర భారతీస్వామి వెళ్లారు. వేదికపై వేసిన ఉచితాసనాన్ని కేరళ దేవాదాయ మంత్రి సురేంద్రన్ లాగేయడం ఎంతవరకు సబబు?
ఇదంతా లౌకికవాద ముసుగేసుకున్న నాయకులు వేస్తున్న వెర్రి వీరంగం. తమ అధికారాన్ని కాపాడుకోవడానికి ఓ మతం వాళ్లను అవమానిస్తూ చేస్తున్న ఈ తతంగాలు ఆగేదెప్పుడు? ఓ బ్యుటీషియన్ హత్యను వినోదాత్మకంగా చూపిస్తూ ప్రజల్లో తెలియకుండానే నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాకు ఇదంతా పట్టదు. అన్ని మతాలు కలిసుండాలని కోరుకునే పార్టీలైనా ఇలాంటి వెర్రితలల వేషాలను ఖండిస్తున్నారా? మనుషుల్లో ఉన్మాదాలను తగ్గించి సర్వజనామోదంగా మార్చాల్సిన మన నాయకులే- ఓట్ల కోసం ఇలాంటి కుతర్కాలకు, దుశ్చర్యలకు పాల్పడితే భారతదేశం ఆధునికతను ఎప్పుడు అందుకుంటుంది. ఒకరు కంట్లో వేలుపెడితే, మరొకరు నోట్లో వేలుపెట్టుకోవడం ఎలా సమానత్వం అవుతుంది? ప్రజల్మో మతోన్మాదం తగ్గించాల్సిన నాయకులే ఇలా మతోన్మాద చర్యలకు పరోక్షంగా పురిగొల్పడం నిజం కాదా? ఇవన్నీ ప్రాయశ్చిత్తం లేని అపరాధాలు కాక ఇంకేమిటి? ఈ వైరుధ్యాలు గమనిస్తున్నందునే దేశ రాజకీయ చిత్రపటం మారిపోతుందన్నది ఒప్పుకోలేని నిజం.

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi Friday, 30 June 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి