‘కాంతులు విరజిమ్మే భారతదేశం.. అంధకార బంధురమై అల్లల్లాడే భారతదేశం, ఎడ్లబళ్లలో ప్రయాణించే ప్రాచీన భారతదేశం.. అంతరిక్షంలోకి రాకెట్లను పంపే అధునాతన భారతదేశం. భారత్ అంటే ఏమిటి? అది ఓ దృగ్విషయమా? ఒకనాటి విహంగ మా? ఈ దేశాన్ని ఎలా విశదీకరించాలి? వేలకొద్ది వాగులూ, వం కలూ ప్రవహించే ఈ భూమి. అనేకమంది మార్మికులకూ, చక్రవర్తులకూ, అసాధారణ నైపుణ్యం గలవారికీ, తారలనే కిందకు దించగల సంగీత సామ్రాట్టులకు ఆలవాలం ఇది. భారత్‌ను చిత్రించడానికి నా ఊహను నేను ఎంతవరకు విస్తరించగలను’- అంటాడు ఓ ఆధునిక భారతీయ తత్త్వవేత్త. నిజమే.. భారతదేశం అంటే భౌగోళిక ప్రదేశం, దానే్న చరిత్ర అనుకుంటే పప్పులో కాలేసినట్లే. భారత్ అంటే ఓ రూపకం.. ఓ కవిత్వం.. వేల ఏళ్ళ సాంస్కృతిక స్పర్శ ఇందులో ఉంది. ప్లేటో, అరిస్టాటిల్, కాంట్, హెగెల్, బ్రాడ్లీ, బెర్ర్టాండ్ రస్సెల్ ఇక్కడ పుట్టలేదు. కానీ, భారతీయులంతా సత్యానే్వషణలో ఈ తాత్వికులకు సమఉజ్జీలే. మరి అలాంటి భారతీయులు క్రమంగా ఎందుకు అస్తిత్వాన్ని వదిలిపెడుతున్నారు? దీనికి వెయ్యేళ్ల బానిసత్వం కారణం! ఆ బానిసత్వాన్ని ప్రోత్సహిస్తున్న విద్య కారణం!
లక్షల మంది ప్రాణాల బలిదానం తర్వాత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది, మత ప్రాతిపదికన రెండుగా విడిపోయింది. 1757 నుండి 1947 వరకు సుమారు 6 లక్షలమంది ప్రాణాలు అర్పించారు. సుభాస్ చంద్రబోస్ లాంటి ఐసియస్ టాపర్ ఈ ఉద్యమంలోకి దూకాడు. ఎంతో ధనవంతుడైన ఉద్యమ్‌సింగ్ స్వాతంత్య్రం కోసం తన ప్రాణానే్న బలిపెట్టాడు. 1757లో జరిగిన ఫ్లాసీ యుద్ధంలో 18వేల మంది భారత సైన్యం 300 మంది ఆంగ్లేయ సైన్యం చేతిలో ఓటమి పాలు కావడం ఇందులో కొసమెరుపు. రాబర్ట్ క్లైవ్‌కు పదవి కోసం అమ్ముడుపోయిన మీర్ జాఫర్ అనే సేనాని స్వాతంత్య్రానంతరం ఈ దేశ రాజకీయాలకు ఆదర్శం అయ్యాడు.
ఇటీవల భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్‌ను కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ‘వీధిరౌడీ’గా అభివర్ణించాడు. పాక్ సైన్యం, ఆ దేశం ప్రేరేపిస్తున్న ఉగ్రవాదులు మన సైన్యంపై అప్రకటిత యుద్ధం చేస్తుంటే మన వాళ్లు దీటుగానే జవాబిస్తున్నారు. కానీ, పాకిస్తాన్ ఇచ్చే డబ్బుకు ఆశపడి కాశ్మీర్‌లో మన సైనికులపై రాళ్లు రువ్వే అల్లరి మూకలకు ‘హురియత్ కాన్ఫరెన్స్’ మద్దతునిస్తోంది. ఆ సంస్థ నేతల ఇళ్లలో సోదాలు జరిగితే కుహనా లౌకికవాద గుంపు మతం ,ప్రాంతం వంటి రంగులను పులుముతోంది. తీవ్రవాదులను ఎదుర్కోవడానికి వెళ్తున్న మన సైన్యానికి మారీచ, సుబాహుల్లా ‘రాళ్ళ రువ్వే గ్యాంగు’ అడ్డుపడుతున్నది. ఇటీవల సైనికాధికారులు ఎన్నికల విధులు పూర్తిచేసుకొని తిరిగి వెళ్తుంటే ఈ కిరాయిగూండాలు- ‘నిద్రిస్తున్న సింహం జూలుతో ఎలుక ఆడుకొన్న’ట్లు పలు విధాలుగా పరిహాసం చేశారు. దాంతో ‘రాళ్లు రువ్వే గ్యాంగు’లోని ఫారుఖ్ అహ్మద్ దార్ అనే యువకుణ్ణి మేజర్ లీతుల్ గొగోయ్ ఆర్మీ వాహనానికి కట్టేసి తీసుకువెళ్లారు. ఈ ఘటనను సైనికదళ అధిపతి జనరల్ రావత్ సమర్థించారు. స్కూలు పిల్లలచేత సైన్యాన్ని రాళ్లతో కొట్టిస్తుంటే కిమ్మనని ‘సెక్యులర్ గ్యాంగ్’ రావత్‌పై మాత్రం విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌కు తోడుగా కమ్యూనిస్టు పార్టీకి చెందిన బృందాకారత్ కూడా వ్యాఖ్యానాలు మొదలుపెట్టింది. వీళ్లంతా మీర్ జాఫర్‌కు వారసులు కాక ఇంకెవరు?
18వ శతాబ్ది ప్రారంభంలో అమెరికాలో స్వదేశీ ఉద్యమం వచ్చింది. అప్పటి ఆ ఉద్యమాన్ని గురించి ప్రఖ్యాత చరిత్రకారుడు ఫార్క్‌నర్ విస్తృతంగా రాసాడు. ఆంగ్లేయులతో యుద్దం జరుగకముందు అమెరికన్లు ఆంగ్లేయ ఉత్పత్తులు బహిష్కరించారు. ఇంగ్లాండులో ఉత్పత్తి అయ్యే ఉన్ని, నూలు వస్త్రాలు అమెరికాలో ఎక్కువగా అమ్ముడుపోయేవి. ఆ అలవాటును అమెరికన్లతో మాన్పించడం కోసం వారు గొఱ్ఱెలను పెంచడం, వాటి మాంసం తినడం మానేశారు. ఏ దేశమైనా ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా సంక్షోభంలో ఉంటే ఆ దేశ ప్రజలంతా జాతీయతను ఆరాధించాలి. కానీ, పశువధపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తే దానికి వ్యతిరేకంగా కేరళ యువజన కాంగ్రెస్ నేతలు నడిరోడ్డుపై గోవులను చంపి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. గోవులను బహిరంగంగా చంపడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇక, గోమాంసం పుష్టికరమని ఒకరు వ్యాఖ్యానిస్తే, సిపిఐ నేత నారాయణ ‘గోపురాణా’లే వల్లిస్తున్నాడు! ‘గోవులమయం’గా ఉన్న భారతదేశంలో ‘గోవుల మాయం’ చేసి ఈ దేశ ప్రజల మనసులను గాయపరిచినపుడు ఎక్కడుంది- ప్రజల మనోభావాలకు విలువ?
ధనాన్ని తృణప్రాయంగా భావించిన భారతీయ సంస్కృతిని పాశ్చాత్య సంస్కృతితో నిండా ముంచేశారు. కోరికలే గుర్రాలై పరుగులు తీస్తున్న భౌతిక వ్యవస్థ మనకు అనేక నష్టాలను కలుగజేసింది. భౌతిక ప్రగతిని ఆధ్యాత్మిక విలువలతో సమన్వయం చేయాల్సిన రాజకీయం ఈ డెబ్భై ఏళ్ళలో ఎంతో అరాచకీయం చేసింది. భారతీయ వేదాంతసారం నుండి పురుడు పోసుకొన్న ‘నైతిక జీ వనం’ మాత్రమే ఈ విశృంఖల భోగ లాలసతకు చరమగీతం పాడగలదు. కానీ, 15-25 మధ్య వయసున్న యువకులు దేశ సాంస్కృతిక దృక్పథాన్ని వదిలేసి పాశ్చాత్య పోకడలకు దాసోహమైన మన నటులు, సెలబ్రిటీలను గుడ్డిగా అనుకరిస్తున్నారు. వివేకానందుడు, భగత్‌సింగ్, ఆజాద్, ఉద్యమసింగ్, శ్యాంజీ కృష్ణవర్మలను కులాల చట్రంలో పరికిస్తున్నారు. యాకూబ్ మెనన్, భత్కల్, అఫ్జల్‌గురు, అజ్మల్ కసబ్‌లను స్వాతంత్య్ర వీరులుగా అభివర్ణిస్తున్నారు. దీనికి ‘్భవస్వేచ్ఛ’ అనే ముసుగును తొడిగేస్తున్నారు. ఎంత ఆశ్చర్యం..? ఇదంతా ఏ మారుమూల పల్లెలో జరగడం లేదు. పేరుమోసిన విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న ఈ ప్రహసనం ఇంకెన్నాళ్లు..?
ఈ దేశంలో అవినీతిని చట్టబద్ధం చేశారు. అవినీతి సామ్రాజ్యానికి అధినేతలైన వాళ్లంతా వివిధ పార్టీల్లో గొప్ప గొప్ప నేతలు. వీళ్లకు అధికారం కావాలి. తండ్రి మాట కోసం రాజ్యాన్ని గడ్డిపరకలా వదిలివేసిన రామరాజ్యం వీళ్లకు నచ్చదు. భూమ్యాకాశాలను మింగే కుంభకోణాలను అవలీలగా చేసేస్తారు. ఐపిఎల్, కామనె్వల్త్ క్రీడలు, ఆదర్శ్, 2జి, 3జి స్పెక్ట్రమ్, సత్యం కంప్యూటర్స్, హవాలా.. ఇలా చేంతాడంతలిస్టుతో చెప్పవచ్చు. గడ్డి కుంభకోణంలో గంపెడు తిన్న లాలూ, అనేక కుంభకోణాల్లో చేయి వేసిన చిదంబరం, 2జి, 3జిల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న రాజా, కనిమొళిల పార్టీ అధినేత కరుణానిధి, వీళ్లను స్వేచ్ఛగా వదిలేసిన సోనియా, మన్మోహన్.. శారద, నారద కుంభకోణాల్లో నిండా మునిగిన మమతా బెనర్జీ, ప్రజాధనం లూటీ చేస్తున్న కేజ్రీవాల్ వంటి నేతలంతా- ఈ దేశ సెక్యులర్ పాఠశాలలో అధ్యాపకులు. వీళ్ల పాఠశాలకు ట్రస్టీ మెంబర్లు, పాఠ్యప్రణాళిక సభ్యులు సీతారాం ఏచూరి, ప్రణయ్‌రాయ్, అరుంధతీ రాయ్, రాజ్‌దీప్ సర్దేశాయ్. ఎంత బాగుంది వీరి కాంబినేషన్..!?
దేశంలోని ప్రసిద్ధ వ్యక్తులకు చెందిన 1.50 ట్రిలియన్ డాలర్ల నల్లధనం డబ్బు స్విస్ బ్యాంకుల్లో ఉంది. ఇంకా లైచెన్‌స్టీన్, వెల్ ఆఫ్ మాస్, కౌమాన్ ద్వీపాలు, మకావు వంటి దేశాల్లోని బ్యాంకుల్లో ఎంత ఉందో చెప్పలేం. స్విస్ బ్యాంకు ఖాతాదారుల్లో భారతీయులే ఎక్కువ అని ప్రముఖ ఆర్థిక రాజకీయవేత్త డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి వెల్లడించారు. ఈ ధనాన్ని ఇనే్నళ్లుగా కాపాడుకోవడానికి పై రాజకీయ వేత్తలకు, వారి పార్టీల నాయకులకు అధికారం అక్కరకు వచ్చింది. ఆ అధికారం కోసం కులం, మతం, వర్గం, ప్రాంతం, భాష దేన్నైనా అడ్డుపెట్టి దేశాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారు! దీన్ని తమ సిద్ధాంతంగా తయారుచేసి బుకాయిస్తున్నారు!
1994 తర్వాత ఆర్థిక సంస్కరణలు భారతదేశ ఆర్థిక మూలాలను కదిలించి వేశాయి. పారిశ్రామికీకరణ వేగవంతం అయ్యింది. విదేశాల నుండి నిధులు, పెట్టుబడులు తెస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మంత్రులూ, ముఖ్యమంత్రులూ తరచూ ఏదో ఒక దేశంలో పెట్టుబడుల కోసం ప్రసంగాలు చేస్తున్నారు. పారిశ్రామికీకరణ జరిగినంత మాత్రాన అవినీతి, పాలనాపరమైన జాఢ్యం తొలగిపోదు. మరింత తెలివిగా, ఆధునికంగా అవినీతి తాండవం చేస్తుంది. కాబట్టి వ్యక్తి ఆధారిత నైతిక చట్రంపై బాధ్యతాయుత పాలకుల అజమాయిషీ, అధికారం ఉండాలి. అంతేకాని అధికారం భోగం అనుభవించే సౌకర్యం అనుకున్నన్ని రోజులు ఈ పరిస్థితి ఎవరూ మార్చలేరు. ప్రజలు ప్రతి విషయాన్ని కుల, మతాల చట్రంలో చూడడం కూడా ఇదొక అలవాటుగా మార్చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల ఆధారంగా కొన్ని మతాలను రెచ్చగొట్టి అధికారం పొందాలనుకొనే వాళ్లు రోజుకో కొత్త వివాదం రాజేస్తున్నారు. భావోద్వేగాలతో జరిగే ఈ నాటకాలను భారతీయ యువకులు గమనించి సామాజిక మాధ్యమాల్లో ఉతికేస్తుంటే విదేశీ మానసపుత్రుల ‘్ఫ్యజులు’ ఎగిరిపోతున్నాయి. ఇన్నాళ్లు ప్రచార, ప్రసార మాధ్యమాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొని వీరవిహారం చేసిన ఈ వర్గవాదులకు సోషల్ మీడియా ఓ చెంపదెబ్బగా మారింది. అందుకే భారతదేశ ప్రసిద్ధ పాత్రికేయ వర్గవాదులంతా సోషల్ మీడియాను నిందిస్తున్నారు. వాళ్లంతా భారతీయ ఆత్మను గుర్తించకుండా నిద్రపోయినట్లు నటిస్తున్నారు!
పాకిస్తాన్ నుండి వెళ్లగొట్టబడి కెనడా పౌరసత్వం స్వీకరించిన తారేఖ్ ఫతే గొప్ప పరిశోధకుడు. భారత్‌లో ‘మతం ముసుగు’ వ్యవహారాలన్నీ అతను ఇటీవల బహిర్గతం చేశాడు. ఢిల్లీలో ఔరంగజేబు మార్గాన్ని పేరు మార్పించి వార్తల్లోకెక్కాడు. తనపై ఎన్నో ఫత్వాలు జారీ అయినా, నిర్భయంగా ఆయన రచనలను, చర్చలను, ప్రసంగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. మన నేతల మతపరమైన బ్లాక్‌మెయిలింగ్‌ను ఎండగట్టాడు. ‘్భరత ప్రజలు ఔరంగజేబుకన్నా దారాషికోను గౌరవించాలన్నాడు. నాదిర్షా, గజనీ, ఘోరీ, తైమూర్‌లను వీరులుగా చిత్రించే వ్యవస్థను సృష్టించిన సెక్యులర్ వాదులను నిరసించాడు. ‘యోగా డే’ను సమర్థిస్తూ ‘ఈ దేశంలో ఎన్నో త్యాగాలు చేసిన ప్రాచీన హిందూ ధర్మాన్ని గౌరవించడానికి ఇతర మతాల వాళ్లకు యోగా డే ఓ వేదిక’’ అన్నాడు. మరి ‘యోగా డే’ను ఏటా ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారు?
అంటే- భారతీయమైన ఏ అంశం ప్రజల మెదళ్లలో ఉండడం ఈ వర్గాలకు ఇష్టం ఉండదన్నమాట. అందుకే గత డబ్భై ఏళ్లుగా అనేక విధాలుగా ఈ దేశ సంస్కృతి విధ్వంసం అయ్యింది. దాన్నొక ఛాందసవాదంగా ప్రచారం చేస్తూ నైతిక విలువలకు ఆలవాలమైన భారతీయతను దూరం పెట్టడం వల్లనే దేశం ఇన్ని విషమ పరిణామాలను ఎదుర్కొంటుంది. రెండువేల యేళ్ల క్రితం పైథాగరస్, జీసస్ లాంటి వారు భారత్‌కు సత్యానే్వషణ నిమిత్తం వచ్చారు. అనేక శతాబ్దాలుగా ప్రపంచం నలుమూలల నుండి సత్యానే్వషులు వస్తూనే ఉన్నారు. గణిత శాస్త్రం ఇక్కడే పుట్టింది. ఐన్‌స్టీన్ లాంటి సైంటిస్ట్‌ను ఇక్కడ పుట్టించలేకపోయింది. కానీ, ఐన్‌స్టీన్‌ను మన దేశం గురించి ఆలోచించేటట్లు చేయగలిగింది. అదీ భారతీయత. అలాంటి భారతీయతను రాజకీయ వర్గ వాదులు మాయం చేయాలనుకొంటున్నారు. అది సాధ్యం కాదని చరిత్ర చెప్పిన సత్యం. రాజదండం ఎవరి చేతిలో ఉన్నా ప్రజల కశేరు దండం పైభాగంలోని నరనరాల్లో దేశభక్తి నిండితే చాలు, మన ఆత్మగౌరవాన్ని మనమే నిలబెట్టుకోగలుగుతాం. రాజకీయ, సామాజిక సంక్షోభాలను తట్టుకోవడం మనకు కొత్తేం కాదు. అలాంటి భారతీయత వైపు పరుగుపెడదాం!

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published AndhrabhoomiFriday, 16 June 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి