ముల్లా నసీరుద్దీన్ అనే సూఫీ ఫకీరు కొన్నాళ్లు ఓ నవాబు దగ్గర వజీరుగా పనిచేశాడు. నవాబు ‘నంది’ అంటే ఇతడు ‘నంది’ అని, కాదు ‘పంది’ అంటే ‘పంది’ అనేవాడు. ఓ రోజు నవాబుతో కలిసి అతను భోజనం చేస్తున్నాడు. ఆ రోజు భోజనంలో వంటవాడు వంకాయ కూర వడ్డించాడు. ‘ఆహా..! ఎంత రుచిగా ఉంది ఈ వంకాయ’ అన్నాడు నవాబు. వెంటనే పక్కనున్న ముల్లా అందుకుని- ‘మహాప్రభూ..! ఈ ప్రపంచంలో వంకాయను మించిన కూర లేదు.. అందుకే దానికి తలపై గొడుగుపెట్టాడు దేవుడు. ఇంకే కూరకైనా ఇలా ఉందా చెప్పండి!’ అంటూ వంకాయను తెగపొగిడాడు. ఇదంతా పక్కనుండి విన్న వంటవాడు ఆ రోజునుండి రోజూ వంకాయ కూరే వండుతున్నాడు. ఓ పదిరోజులకు నవాబుకు చిర్రెత్తి ‘నాకు అస్సలు ఈ వంకాయ నచ్చలేదు’ అని పళ్లెం విసిరేశాడు. పక్కనే వున్న ముల్లా తన పళ్లాన్ని రాజుగారి కన్నా ఎక్కువ దూరం విసిరి వంటవాడ్ని పిలచి రెండు తగిలించి, ‘వంకాయ కూర ఎందుకు చేశావ్? ఇది అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే దానికి దేవుడు ముళ్లను సృష్టించాడు’ అన్నాడు. నవాబుకు ఆశ్చర్యం వేసి ‘ముల్లా.. వంకాయని పదిరోజుల క్రితం తెగ పొగిడావు మరి ఇప్పుడు ఇలా..’ అన్నాడు. అప్పుడు ముల్లా ‘హుజూర్! నేను నవాబుకు బానిసను.. వంకాయకు కాదు కదా! నా రాజుకు ఏది నచ్చితే అదే నా అభిప్రాయం’ అన్నాడు.
- ఇది పూర్వకాలం కథ. రాజులకు, నవాబులకు ఏది నచ్చితే అదే చట్టం. మనకు మారుతున్న విలువల ప్రకారం ప్రజాస్వామ్యం కావాలి. రవి అస్తమించని రాజ్యం పాలించిన బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు చేసింది ఈ ప్రజాస్వామ్యం కోసమే. ఆంగ్లేయులకు ఎదురు తిరిగినపుడు ప్రభుత్వం ఎక్కడికక్కడ అణచివేస్తే ‘ఎదిరించడం సాధ్యం కానప్పుడు ఆత్మహత్య నా నిరసన’ అన్నాడో స్వాతంత్య్ర వీరుడు. నిజమే! నిరసన తెలపడానికి ఓ స్థలం ఉండాలి. లేకపోతే ఆ నిరసన ప్రతి ఇంట్లో, ప్రతివాడి మనసులో పెల్లుబుకుతుంది. అందుకే దిల్లీలో జంతర్ మంతర్, హైదరాబాద్‌లో ధర్నాచౌక్ (ఇందిరాపార్కు) ఏర్పాటు చేశారు. గత నెలలో టి.జెఎసి చైర్మన్ కోదండరాం నిరుద్యోగ ర్యాలీ తీస్తే అది జయప్రదం కాలేదు. కానీ ధర్నాచౌక్ మాయమైంది, టి.జెఎసి ముక్కలైంది..!
ఏ తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తు నిలపడానికి కారణం అయ్యిందో, ఏ ప్రత్యేక రాష్ట్ర సాధనలో తెలంగాణ సమాజం మొత్తం గొంతెత్తి అరవడానికి అవకాశం ఇచ్చిందో అలాంటి ధర్నాచౌక్‌ను తెరాస ప్రభుత్వం తొలగిస్తామని చెప్పడం దారుణం. తెలంగాణ ఉద్యమంలో సబ్బండవర్గాలను అక్కున చేర్చుకున్న ధర్నాచౌక్‌ను- ప్రతిపక్షాల మీద రాజకీయ కక్షతో, శాంతి భద్రతలు, ట్రాఫిక్ ఇబ్బందుల కారణంతో ఎత్తివేయాలనుకోవడం దారుణం. ఏ రాజకీయ నాయకుడూ ఎల్లకాలం అధికారంలో ఉంటాడనుకోరాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారే రేపు ప్రతిపక్షంలోకి వస్తే..? అప్పుడు నిరసన తెలపడానికి, నిలబడడానికి స్థలం ఏది..? ‘్ధర్నాచౌక్’ ప్రభుత్వంపై గల వ్యతిరేకతనో, గుడ్డిగా దూషించడానికో ప్రతిపక్షాల కోసం కాదు. పాలన పట్ల ప్రజలకున్న సదభిప్రాయాలను, దురభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోవడానికి ఓ వేదిక ధర్నాచౌక్. ఏ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయో రాజ ప్రాసాదాల్లో కూర్చునే పాలకులకు ఎలా తెలుస్తాయి? ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా, ఇంటిలిజెన్స్ నివేదికల ద్వారా పాలకులకు తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ప్రభుత్వాలు తాము చేసే తప్పొప్పులను తడిమి చూసుకునే అవకాశం లభిస్తుంది. అయినా ‘నిరసన తెలపడం’ ప్రజాస్వామ్యంలో పాలన మెరుగుపడడానికి ఓ అవకాశం. ఓ రకంగా ఉత్తమ పాలకులకు- నిరసనను గమనించి పని చేయడం ఓ గీటురాయి. నిరసన ప్రజల హక్కు. నిరసన లేకపోతే పాలకుల కళ్లు ఎలా తెరుచుకుంటాయి?
ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా ‘1857 తిరుగుబాటు’ ఓ నిరసన. ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియా తోపే, మంగళ్‌పాండే ప్రారంభించిన నిరసన విఫలం కావచ్చు, బ్రిటిష్ రాజ్య కూసాలు కదిలించిన ఓ ముందడుగు అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. స్వాతంత్య్రపోరాటంలో జైలుకెళ్లడం ఓ నిరసన. సావర్కర్, తిలక్ వంటి వారు జైళ్లలో దారుణంగా కష్టాలు పడుతునే ‘నిరసన’ తెలపగా ప్రజలు ప్రభావితులయ్యారు. గాంధీ, నెహ్రూ, పటేల్, శాస్ర్తీ వంటి యోధానుయోధులు తాము జైళ్లో బంధింపబబడడం ఓ నిరసనగా, ఉద్యమంగా నడిపించారు. భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్ లాంటి యువకులు దేశం కోసం ఉరితాడును ముద్దాడి తమ నిరసనను తెలిపారు. ఇలా ఎందరో అతివాద, మితవాద నాయకులు తమ నిరసనకు ఇలాంటి పద్ధతులను ఎంచుకుని ప్రజలను చైతన్యపరిచారు. మన దేశంలోనే కాదు, పాశ్చాత్య దేశాల్లో సైతం ఇంతగా ప్రసార మాధ్యమాలు లేనప్పుడు ప్రజలు నిరసన తెలిపారు. హిట్లర్, ముస్సోలిని లాంటి నియంతలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రాణాలు వదిలిపెట్టి నిరసన ప్రకటించారు.
ఇక, తెలంగాణలో అయితే ఈ నిరసన వందల ఏళ్లనుండి కొనసాగుతూ వస్తునే ఉంది. తుర్రేబాజ్ ఖాన్ ఈ ప్రాంతంలో మొదటి స్వాతంత్య్ర వీరుడు. కొమురం భీం జల్-జమీన్-జంగల్ మాకే సొంతం అంటూ నవాబులనే ఎదిరించాడు. రాంజీ గోండు అదే స్ఫూర్తితో తన ఉద్యమం కొనసాగించాడు. రజాకార్ల దాష్టీకాలకు వ్యతిరేకంగా తన కలం ద్వారా పోరాటం చేసిన షోయబుల్లాఖాన్ తన ప్రాణాలనే బలిపెట్టి నిరసన తెలిపాడు. ప్రముఖ కవి దాశరథి నిజాంకు వ్యతిరేకంగా జైలుకెళ్లి గోడలపై ‘ఓరీ నిజాము పిశాచమా’ అంటూ ‘అగ్నిధార’నే కురిపించాడు. కాళోజీ ‘నా గొడవ’ మొత్తం నిరసన కాకపోతే ఇంకేమిటి?
1969లో వచ్చిన తెలంగాణ పోరాటం ఈరోజు పేరుమోసిన నాయకులనందర్నీ తయారుచేసింది నిజం కాదా? ఆనాటి ప్రభుత్వంపై అది కూడా ఓ నిరసనే. అంతెందుకు? మలి దశ ఉద్యమం నిరసన కాకపోతే ఇంకేమిటి? కేసిఆర్ చేసిన ఆమరణ దీక్ష ఉద్యమాన్ని మలుపుతిప్పిన గొప్ప నిరసన. రైలురోకోలు, రోడ్ల దిగ్బంధం, వంటావార్పు, సకల జనుల సమ్మె, సాగర హారం ఇవన్నీ ఆనాటి తెలంగాణ ప్రజల నిరసన అన్న విషయాన్ని కేసిఆర్ మరిచిపోతే ఎలా? ఆనాడు ఉద్యమాన్ని నడిపించిన కేసిఆర్ తెలంగాణ సాధించాక ఇందిరా పార్కు వద్ద ధర్నాలే వుండవని చెబితే -మొత్తంగా ధర్నాచౌక్‌నే ఎత్తివేయడమా? శాంతి భద్రతలు, ట్రాఫిక్ దృష్ట్యా ధర్నాచౌక్‌ను నాగోల్‌కో, శంషాబాద్‌కో, ఇసిఐఎల్‌కో మార్చుకోండని ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదం. సచివాలయానికి,ప్రగతి భవన్‌కూ కూతవేటు దూరంలో ఉండి నిరసన ప్రకటిస్తేనే అర్థం చేసుకోని వారు అన్ని కిలోమీటర్ల దూరంలో గొంతెత్తితే ఆలకిస్తారా? ధర్నా చేసుకోవడానికి, నిరసన తెలపడానికి ప్రభుత్వాలు అవకాశం ఇవ్వకపోతే జనంలో ఆగ్రహావేశాలు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లో ఆనంద్‌మార్గ్ స్థాపకుడైన ప్రభాత్ రంజన్ సర్కార్‌ను, ఆ సంస్థను అక్కడి కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా అణచివేసింది. పురూలియా ఆయుధాల జారివేత కేసులోను, అంతకు ముందూ కేంద్రంలోని కాంగ్రెస్‌తో కలిసి కమ్యూనిస్టు ప్రభుత్వం తీవ్రంగా వాళ్ల గొంతు నొక్కింది. దాంతో నిబద్ధులైన ఆనందమార్గీయులు ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడానికి పెట్రోలు పట్టుకుని వెళ్లారు. మొన్నటికి మొన్న తమిళనాడుకు చెందిన రైతులు డిల్లీ జంతర్‌మంతర్ వద్ద బలంగా నిరసన తెలిపారు. పుర్రెల్ని మెడలో వేసుకోవడం, చచ్చిన ఎలుకలను నోట్లో పెట్టుకోవడం, స్వమూత్ర సేవనం, నగ్న ప్రదర్శన.. ఇలాంటివి ఎన్నో తమిళ రైతులు ప్రదర్శించి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. పాశ్చాత్య దేశాల్లో అర్ధనగ్న ప్రదర్శనలను మనం మాధ్యమాల్లో చూస్తుంటాం. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన మరుసటి రోజే ఆయన వ్యతిరేకులు రోడ్లపైకి చేరి నానా హంగామా చేసారు. జల్లికట్టు కోసం చెన్నై మేరీనా బీచ్ మొత్తం యువతతో నిండిపోయింది. ఇదంతా నిరసనకు తీవ్ర పరాకాష్ఠ. తెలంగాణ సిఎం కేసిఆర్ భేషజాలకు పోయి ధర్నాచౌక్‌ను రద్దు చేస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈమధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం శత వసంతోత్సవ కార్యక్రమంలో విద్యార్థుల నిరసనకు భయపడే కేసిఆర్ లాంటి మహావక్త వౌనంగా ఉండాల్సి రావడం ఆలోచించదగిన విషయం కాదా? ఇప్పటికే ఓయులో కొందరు విద్యార్థులు ఎక్కడకు వెళ్లారో తెలియడం లేదని కొందరు ప్రైవేటు సంభాషణల్లో చెవులు కొరుక్కుంటున్నారు. చత్తీస్‌గఢ్‌లోని సుకుమాలో జవాన్లపై జరిగిన దాడిలో తెలంగాణ మావోయిస్టులు- అదీ యువకులు ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగంలోని 19(1)(బి) ఆర్టికల్ ప్రకారం పౌరులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశాన్ని ప్రభుత్వాలు కలిగించాలి. అప్పుడే ప్రజాస్వామ్యాం పరఢవిల్లుతుంది.
ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు, ప్రసార మాధ్యమాలు ‘అంకుశం’ లాగా తమ నిరసన ప్రకటిస్తుంటాయి. దాన్ని ప్రభుత్వం సహృదయతతో స్వీకరించాలి. నిరుపేదలు, ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీలు, బలహీనులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ‘నిరసన కేంద్రం’ ధర్నాచౌక్. ఉమ్మడి రాష్ట్రంలో లేని నిర్బంధం ఇప్పుడెందుకని లోకం కోడై కూస్తున్న వేళ ప్రభుత్వం ఇలాంటి మతిమాలిన పనులు చేస్తే అది భవిష్యత్తులో కంటకమార్గమే తప్ప ఇంకోటి కాదు. పాలకుల్లో పైకి కనిపించే అమాయకత్వం, ధార్మికత, సేవా దృష్టిలోని ‘అంతర్గత తత్వాన్ని’ ప్రజలు పసిగడితే ప్రభుత్వానికి గడ్డుకాలమే! ‘మీరు వినయశీలురా? అని ఎవరైనా నన్నడిగితే ‘అవును’ అని నేను చెప్పలేను. ఎందుకంటే వినయం తలక్రిందులుగా నిలబడ్డ అహంకారమే అని నాకు తెలుసు. నేను అహంకారిని కాను! మరి నేనెలా వినయశీలినవుతాను?’ అన్నాడు ఓ మహాత్ముడు. అహంకారంపై అధికారం ఉండాలి కానీ, అధికారంలో అహంకారం ఉండకూడదు. ఒకవేళ ఈ అహంకారం, అధికారం కలగలిపి ఎదుటివారిని ఆలోచనలు అణిచివేస్తే- చదువుకోవడానికి గత చరిత్ర ఎంతో ఉంది! కెసిఆర్ లాంటి విజ్ఞుడు, రాజకీయవేత్త ధర్నాచౌక్‌ను కొనసాగించాలని ఆశిద్దాం. *

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published AndhrabhoomiFriday, 12 May 2017కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి