అమెరికాలో ఓ బ్రోకర్ పెద్ద ఘనకార్యం తలపెట్టాడు. భారత్‌లో చాలారోజులు దళారీగా పనిచేసి ప్రమోషన్‌పై అతడు అమెరికా వెళ్లాడు. అక్కడ ఓ అమాయకుడైన, అందగాడైన భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పట్టుకున్నాడు. ‘నిన్ను ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షుడిగా, డొనాల్డ్‌ట్రంప్ అల్లుడిగా చేస్తే నాకు ఏమి ఇస్తావ’ని అతడ్ని దళారీ అడిగాడు. ‘నాకంత సీన్ లేదులే’ అన్నాడు సాఫ్ట్‌వేర్ కుర్రాడు. ‘నేను బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌నే కిందామీదా చేసినవాడ్ని. ఏమిస్తావో చెప్పు?’ అన్నాడు బ్రోకర్. ‘ముందు పని కానివ్వు! చూద్దాం!’ అన్నాడు ఇంజనీర్. ఆ కుర్రాడి వివరాలు తీసుకుని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు బ్రోకర్. అతడ్ని మాటల్లో పెట్టి, ‘త్వరలోనే మీ బ్యాంక్ ఉపాధ్యక్ష పదవి ఖాళీ అవుతుందని విన్నాను. అది ఇతగాడికి ఇవ్వండి’ అన్నాడు. అధ్యక్షుడికి కోపం వచ్చి, ‘ఈ పోస్ట్ ఎంత విలువైందో తెలుసా?’ అన్నాడు. ‘తెలుసు! డొనాల్డ్ ట్రంప్‌కి కాబోయే అల్లుడు ఈ పోస్టుకు సరిపోడా? అంతకన్నా అర్హత ఏం కావాలి?’ అన్నాడు దళారీ. ‘అలాగా! అయితే ఓకే’ అన్నాడు అధ్యక్షుడు. వెంటనే ఆ ఇంజనీర్‌కు నియామకపత్రం ఇచ్చేశారు! ఆ తర్వాత వైట్‌హౌస్‌కి వెళ్లి డొనాల్డ్ ట్రంప్ అపాయింట్‌మెంట్ కోరాడు దళారీ. ‘మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారట! ప్రపంచ బ్యాంక్ ఉపాధ్యక్షుడు ఉన్నాడు, అతను భారతీయుడు.. చాలా గొప్పవాడు. ఇంద్రుడు, చంద్రుడు.. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి పదవీ కాలం ముగియగానే కాబోయే అధ్యక్షుడు ఇతడే!’ అన్నాడు. దాంతో ‘సరే’నని ఒప్పకుని ఎగిరి గంతేశాడు ట్రంప్. ఈ విషయం విని పెళ్లికుమారుడు, బ్రోకర్ తెగ సంతోపడ్డారు. కొన్నాళ్లకు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇదీ బ్రోకర్ల మహిమ! బ్రోకర్ల వ్యవస్థపై సరదాగా చెప్పిన కథ ఇది. బ్రోకర్‌ను కొందరు ‘మధ్యవర్తి’ అని ముద్దుగా, ఇంకొందరు ‘దళారీ’ అని అంటారు. నేడు భారత్ నిండా.. ప్రపంచమంతా అతి డిమాండ్ వున్న సబ్జెక్ట్ ఇది.
పూర్వం మన దేశంలో పెళ్ళిళ్లు కుదుర్చడానికి మాత్రమే దళారీ వ్యవస్థ వుండేది. వారిని పెళ్లిళ్లపేరయ్యలని పిలిచేవారు. కొందరు పెళ్లిళ్లు కుదిర్చి సంబరపడేవారు. నూరు అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలన్న సామెతలా పెళ్లి కుదరడమే వాళ్లకు ముఖ్యం. రానురాను అదో వ్యాపారమైంది. నా జ్ఞానాన్ని ఇలా సామాజిక సేవకు ఎందుకు ఉపయోగించాలి? నా తెలివిని, మాటకారితనాన్ని ఉపయోగించి నాలుగురాళ్లు వెనకేసుకోవద్దూ అని ఆలోచించారు ఈ పేరయ్యలు. ఇ దంతా మ్యారేజ్ బ్యూరోలుగా, మ్యారేజ్ కన్సల్టెన్సీలుగా మారాయి. ఆ తర్వాత కులానికో మ్యారేజ్ బ్యూరో, సాఫ్ట్‌వేర్ మ్యారేజ్ బ్యూరో, ధనవంతుల మ్యారేజ్ బ్యూరో, అవివాహితుల మ్యారేజ్ బ్యూరో, డైవర్సీల మ్యారేజి బ్యూరో.. ఇలా అనేక ఉప విభాగాలుగా విభజించబడింది. కొంత డబ్బు చెల్లిస్తే చాలు.. వాళ్లే అన్నీ వెతికి పెడతారు. మెసేజీలు, ఫొటోలతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంబంధాలను అప్‌డేట్ చేస్తారు. ఆఖరికి వధువుకో, వరునికో పెళ్లి కుదిరి ఇద్దరు పిల్లలయ్యాక కూడా పాత సంబంధాలు చూపిస్తునే వుంటారు. ఇదంతా బ్రోకర్‌గిరీకి ఉదాహరణ.
ఇది ఇపుడు దేశంలోని అన్ని వ్యవస్థలకూ పాకింది. స్టాక్ మార్కెట్‌లో, రియల్ ఎస్టేట్‌లో, వీసాలు ఇప్పించడానికి, రాజకీయ పార్టీలకు ఫండ్ తేవడానికి, కార్పొరేట్ వ్యవస్థను నడిపించడానికి బ్రోకర్లు.. కూరగాయల్ని అమ్మడానికి రైతులు మార్కెట్‌కు వెడితే అక్కడా బ్రోకర్లదే రాజ్యం! వీళ్లంతా తమను బ్రోకర్లు అంటే ఒప్పుకోరు. వీళ్ల ఆఫీసులకు ‘కన్సల్టెన్సీల’ని పేరు పెడతారు. అందమైన అమ్మాయిని రిసెప్షనిస్టుగా పెడతారు. లోపలికి వెళ్లగానే ఆక్వాఫినానో, బిస్లరీనో వీలైతే సాఫ్ట్ డ్రింకో అందిస్తారు. ఆ తర్వాత బ్రోకరు దర్శనమిచ్చి అందమైన భాషలో మన ప్రాబ్లం వింటాడు. బ్రోకర్లకు ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లు కూడా వున్నాయి సుమండీ!
ఇదంతా శిక్షణ-్భక్షణ. పాశ్చాత్యుల ప్రభావంతో మన దేశంలోకి ప్రవేశించిన అవలక్షణం. దీనిని మనవాళ్లు బాగా అందిపుచ్చుకున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి అమెరికా అన్ని దేశాల్లోకి తమ ఏజెంట్లను ప్రవేశపెట్టింది. జాన్‌పెర్కిన్స్ అనే ఓ ఏజెంట్ చేయాల్సిన విధ్వంసమంతా చేసి చివరకు పశ్చాత్తాపపడ్డాడు. ఈ ఏజెంట్లు వివిధ దేశాల నుండి వేల కోట్ల ధనాన్ని అక్రమంగా అమెరికాకు మళ్లిస్తారు. వాళ్లను ‘ఎకనమిక్ హిట్‌మెన్’ అంటారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ అభివృద్ధి సంస్థల నుండి డబ్బును బహుళజాతి కంపెనీలకు మళ్లించడమే వీరి పని. జాన్‌పెర్కిన్స్ 1991 జూలై 12న మొదట రాయడం మొదలుపెట్టాడు. దాని ఫలితంగా 1994 తర్వాత ప్రపంచీకరణ మొదలైంది. ఆర్థిక సంస్కరణల పేరుతో మన దేశం కూడా కొంత మొరటుగానే ముందుకు వెడుతోంది. చివరకు ఈ హిట్‌మాన్ లాంటి వాళ్లు ఎందరో పనిచేసి ప్రపంచాన్ని ఆర్థిక న్యాయ సూత్రాలపై పరుగెత్తిస్తున్నారు. ఈ హిట్‌మాన్ వివిధ దేశాల్లో అమెరికా తరఫున చేసిన కుయుక్తుల్ని ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పేరుతో పుస్తకమే రాశాడు.
ఈ దళారులు దేశాలను కిందామీదా చేస్తారు. ఆయా దేశాల బలహీనతలను వాడుకుంటారు. మన దేశం లాంటి విభిన్న పార్శ్వాల సముదాయం అంటే వీళ్లకు మరీ ఇష్టం. ఈ విధానంలో కులం, ప్రాంతం, భాష, వర్గం, లింగం, మతం అన్నీ వాళ్లకు బాగా ఉపయోగపడతాయి. గత యాభై ఏళ్లుగా మత మార్పిడులు చేసేవాళ్లు, అల్లర్లు చేసేవాళ్లు, మానవహక్కుల పేరుతో రాజకీయాలు చేసేవాళ్లు ,జాత్యాభిమానం పేరుతో ఉద్యమాలు నడిపేవాళ్లు.. ఈ దళారీల చేతిలో ఆయుధాలే. రాజకీయ నాయకులు కూడా ఇందులో పాత్రలే. మొన్నటివరకు ఎన్‌జివోల పేరుతో సంస్థలు పెట్టి ఇక్కడి మైనార్టీల్లో భయభ్రాంతుల్ని కలిగించి తమ పబ్బం గడిపేవారు. 2014లో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్‌జివోల డబ్బుల ఖర్చులకు లెక్కలు చూపించాలనగానే స్వచ్ఛంద సంస్థల పనితనం ఆగిపోయింది. ఇవి పరోక్షంగా మత మార్పిడులకు సహకరించే దళారీలు. వీళ్లకు కోపం వస్తే కూడంకుళం ప్రాజెక్టును అడ్డుకోగలరు. ఛాందస వాదాన్ని సవాల్ చేస్తామని, ఐన్‌స్టీన్ నోట్లోంచి ఊడిపడ్డామని, తాము ‘సైన్స్ గర్భం దాలిస్తే’ పుట్టామని చెప్పుకుంటారు. పర్యావరణం పేరుతో ప్రాజెక్టులను అడ్డుకుంటారు.
మరోవైపు మెజార్టీ ప్రజల సంప్రదాయాలను, ఆచారాలను, ప్రాచీన గ్రంథాలను బండ బూతులు తిట్టి ఆంగ్లంలో పుస్తకాలు అచ్చేస్తారు. అంతర్జాతీయ పత్రికల్లో వ్యాసాలు రాస్తారు. ఇంటర్నేషనల్ అవార్డులు కొట్టేస్తారు. అజ్ఞానంతో కొందరు నమ్మే అంధ విశ్వాసాలు దేశం నిండా అమలు అవుతున్నట్టు తమ రచనల్లో చెప్తారు. వీటిని బిబిసి, సిఎన్‌ఎన్, న్యూయార్క్ టైమ్స్ వరకు తీసుకువెళ్లి తమ ప్రాబల్యాన్ని పెంచుకుని మేధావులుగా, ఆర్థిక వేత్తలుగా, సామాజిక కార్యకర్తలుగా ముద్ర వేయించుకుంటారు. ఇదంతా మత దళారీ వ్యవస్థ. అంతర్జాతీయ మత మార్పిడి కుట్రలో వీళ్లంతా బ్రోకర్లు. లేకపోతే కాశ్మీర్ తీవ్రవాదులపై వీళ్లకెందుకు ప్రేమ? ఇవాళ స్విస్ బ్యాంకుల్లోకి నల్లడబ్బుని తరలించాలంటే కాశ్మీర్ బంగ్లాదేశ్-దుబాయ్-సౌదీ నుండి వెళ్లాలి. అక్కడి డాన్‌లు, మాఫియాలు, తీవ్రవాద నాయకుల అనుమతి లేకుండా వెళ్లగలరా? అందుకే వాళ్లకు వేర్పాటు వాదులంటే వల్లమాలిన ప్రేమ. పాకిస్తాన్ నుండి వచ్చే దళారీలు ధనాన్ని కాశ్మీర్‌లో రాళ్లు విసరడానికి ఉపయోగిస్తున్నారు. ఇటీవల హురియత్ కాన్ఫరెన్స్ నేతల ఇళ్లను సోదా చేసిన ఎన్‌ఐఏ ఏన్నో విషయాలను బయటపెట్టింది. ఇదంతా దళారీ వ్యవస్థ వల్లనే సాధ్యం.
ఈ దళారీలు పైకి సిద్ధాంతాలున్న వ్యక్తుల్లా కన్పిస్తారు. అదంతా ఓ ముసుగు. వాళ్లు ఏం చేసినా అందరి దగ్గరున్న డబ్బంతా తమ దగ్గరకు వచ్చేట్టు చేస్తారు. ఆర్థిక సరళీకరణ తర్వాత పల్లెలు పట్టణాలు ఒక్కటైనాయి. పల్లెల్లో లేని ప్రతి వస్తువు, వినోద వ్యవహారం అంతా పట్టణంలో వుంటుంది. దానికోసం పల్లెటూరి వాళ్లు పొద్దున్న లేచింది మొదలు పట్టణాల వైపు పరిగెడతారు. డీజిల్, పెట్రోల్, సినిమా, తినుబండారాలు, రాజకీయం, వ్యాపారం, ఎరువులు, వస్తువుల అమ్మకం కొనడం.. ఇలా అన్నింటికీ పట్టణంపై ఆధారపడే ఆర్థిక కేంద్రీకృత వ్యవస్థ సిద్ధంగా వుంటుంది. పల్లెనుండి డబ్బంతా పట్టణానికి తరలిపోతుంది. పల్లె ఎప్పుడూ గొల్లుమంటునే వుంటుంది. పట్టణం ఎప్పడూ కళకళలాడుతునే వుంటుంది. అదంతా దళారీమయం. ఏ పనికైనా దళారీలే శరణ్యం. వాళ్లకు ఇచ్చే కమీషన్ వల్లనే ఏ పనైనా సులభంగా, శ్రమ లేకుండా అవుతుంది. ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్లి మనం నేరుగా లంచం ఇస్తామంటే తీసుకోరు. దానికీ దళారులుంటారు. వాళ్లు అవినీతిపరులకు నమ్మకస్తులు, ఓ ప్రముఖ రాజకీయ నాయకుణ్ణో, అధికారం వున్న వ్యక్తినో కలవాలంటే ఓటేసి గెలిపించిన పౌరుడు నేరుగా కలుసుకోలేడు. సదరు నాయకుని పార్టీకి చెందిన ‘దళారీ చెంచా’ను తీసుకువెళ్లాలి. మన గురించి ఆ పెద్దాయనకు వివరించాలి. అప్పుడే మనం వెళ్లిన పని పూర్తి చేసుకోగలం! ఇంత గొప్పది దళారీ వ్యవస్థ. ఇక వ్యాపారులు, జూదగాళ్లు, బెట్టింగులు పెట్టేవాళ్లు, గోడౌన్లు-కోల్డ్ స్టోరేజీలు కొనుగోలు చేసి అందులో సరకులను దాచేవారు అందరూ ఈ దళారీ వ్యవస్థపై ఆధారపడ్డవారే. ఒకప్పుడు సోహన్‌లాల్ దుగార్ అనే వెండి వ్యాపారస్థుడు జైపూర్‌లో వుండేవాడు. ఇతను జైసింగ్ మహారాజాకన్నా ధనవంతుడు. ఇతను దేశంలోని వెండినంతా కొనేసి దాచేసి, ధర పెరిగాక కొంచెం కొంచెం మెల్ల మెల్లగా అమ్ముకునేవాడు. అతను దేన్నైనా టోకుగా కొని చాలా వ్యూహాత్మకంగా దేశంలో ఎక్కడా ఆ వస్తువు దొరక్కుండా చేసి తర్వాత అమ్మేవాడు. ధరను ఇరవై రెట్లు పెరిగేట్టు చేసి అమ్మేవాడు. ఇతను పెద్ద జూదగాడు. అంటే ఇతడు ఆడకుండానే అందరినీ ఆడిస్తాడు. ఇతగాడిని సిల్వర్‌కింగ్ ఆఫ్ ఇండియా ముద్దుగా పిలిచేవారు. ఇలాంటి వ్యాపాలస్తులంతా ఇవాళ దేశంనిండా దళారుల రూపంలో కొత్త కొత్త అవతారాల్లో వున్నారు. ఇలా దళారీ అవినీతికి మరిగిన మనం నోట్ల రద్దును జీర్ణించుకోలేకపోయాం. ‘బాహుబలి’ టిక్కెట్లకోసం ‘క్యూ’లో గంటల తరబడి నిలబడి చావడానికైనా సిద్ధపడతాం కానీ సినిమాను మాత్రం వదలం. వరసలో నిలబడి బ్యాంక్ నుండి డబ్బులు తీసుకోవాలంటే అదేదో పెద్దనేరంగా దళారీ టీవీలు, పత్రికలు విస్తృత ప్రచారం చేస్తాయి. పన్ను పరిధిలోకి జిఎస్‌టి పరిధిలోకి రావాలంటే మన దళారీ వ్యాపారానికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఆలోచిస్తాం.
ఇదంతా రాజకీయ వ్యవస్థలో మరో కొత్త రూపం. ఎవరు వ్యక్తులను బాగా మానేజ్ చేయగలుగుతారో, ఎవరు వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో వుంచుకుంటారో వారు ఆయా పార్టీల్లో గొప్ప వ్యక్తి. దీన్ని కూడా ఓ దళారీవ్యవస్థలా ఈ డెభ్భై ఏళ్లలో మార్చుకున్నాం. అధికారం నిర్వహించే పాయింట్ ఓ దగ్గర వుంటుంది. దాని పవర్‌పాయింట్ ఇంకోచోట వుంటుంది. తప్పులేమైనా వుంటే నిర్వాహకులవిగా, గొప్పలు ఏమైనా వుంటే పవర్‌పాయింట్ వ్యూహాత్మక శక్తి ప్రచారం చేస్తారు. ఈ వ్యవస్థనంతా నడిపే దళారీలకు ముద్దుపేరు కోటరీ, కోర్ కమిటీ అని పెట్టుకుంటారు. వాళ్లు అధికారాన్ని అడ్డదారిలో అనుభవిస్తారు. ఆస్తుల్ని పెంచుకుంటారు. ఈ దళారీ అధికారమే కదా ఒక్క తమిళ నాయకులకు కోట్లు సంపాదించింది. రాజా 60వేల కోట్లు, 15వేల కోట్లు కరుణానిధి, చిదంబరం 5 వేల కోట్లు, సోనియా 36వేల కోట్లు, 2జి,3జి కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ‘క్విడ్‌ప్రోకో’ కింద వైఎస్ లక్షకోట్లు సంపాదించాడని ఆరోపణలు వచ్చింది ఈ దళారీ వ్యవస్థ ద్వారానే కదా! బోఫోర్స్ శతఘు్నల కుంభకోణమైనా, బొగ్గు కుంభకోణమైనా, పశుదాణా కుంభకోణమైనా, ఆదర్శ్ కుంభకోణమైనా, హవాలా కుంభకోణమైనా అన్నింటిలో దళారీ వ్యవస్థే ప్రధాన పాత్ర వహించింది. ఉల్లి పండించిన రైతుకు, దాన్ని కొనే వినియోగదారుడికి సుఖం లేదు. మధ్యలో మార్చి మార్చి అమ్మిన దళారీ మాత్రం కోటీశ్వరుడు.ఎందువల్ల? దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నిస్వార్ధులైన నాయకులు లేకపోవడం ఒక కారణం. కులం, భాష, ప్రాంతం, మతం లాంటి సున్నిత అంశాల్లో మనం పీకల్లోతు దిగి వున్నాం. వీటిలో దేన్నయినా వాడుకుని మనం అల్లరి చేయవచ్చు, సెంటిమెంట్లు రగిలించవచ్చు. జాతికోసం ప్రాణాలను పణంగా పెట్టిన దశనుండి ధనం కోసం జాతినే తాకట్టు పెట్టే వ్యవస్థకు అలవాటుపడి వున్నాం. మారుతున్న దేశంతోపాటు మనం మారినపుడే దళారీ వ్యవస్థకు సమాధి కట్టగలం.

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi,  Friday, 8 September 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి