భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ రచయిత డామినిక్ ల్యాబ్రరె ‘ఫ్రీడం ఎట్ మిడ్‌నైట్’ అనే పుస్తకం రాశాడు. ఈ ప్రసిద్ధ రచయిత ‘డివిజన్ ఆఫ్ ఇండియా అండ్ లార్డ్‌వౌంట్ బాటన్’ పేరుతో రాసిన మరో పుస్తకంలో వౌంట్ బాటన్‌తో తాను జరిపిన ఇంటర్వ్యూను ప్రచురించాడు. ‘మీరు ఇండియాకు అర్ధరాత్రి వేళ ఎందుకు స్వాతంత్య్రం ఇవ్వాలనుకొన్నారు?’ అని వౌంట్ బాటన్‌ను ప్రశ్నిస్తే - ఎందరో జ్యోతిషులను సంప్రదించగా ‘1947 ఆగస్టు 15’ ఎంతో దురదృష్టకరమైన రోజు.. ఆ అర్ధరాత్రి స్వాతంత్య్రం ఇస్తే ఈ దేశం ఒక్కటిగా ఉండే అవకాశమే లేదు, ఇది చీలిపోతుందనే అలా చేశాం’ అన్నాడట! నిజమే..! స్వాతంత్య్రానికి పూర్వమే భారత్ రెండు ముక్కలైంది. గత డెబ్బై ఏళ్లలో భౌతికంగా ఒకటిగా కనిపిస్తున్నా కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో ఎన్నో ముక్కలైంది. వౌంట్ బాటన్ చెప్పిన దాంట్లో జ్యోతిషాన్ని అలా ఉంచితే, మిగతాదంతా అక్షరాలా మనముందు జరుగుతున్న సత్యమే!
ఆంగ్లేయులు వెళ్లిపోయినా, వారి పాలనలో నడిచిన వ్యాపారాల అవశేషాలు మనల్ని ఆక్రమించే ఉన్నాయి. 1947 నాటికి దేశంలో 127 ఆంగ్లేయ కంపెనీలు పనిచేసేవి. స్వాతంత్య్రం ఇస్తే అవన్నీ ఇక్కడి నుండి వెళ్లిపోవడం వల్ల ఆంగ్లేయులకు భారీ నష్టం వస్తుందని వౌంట్ బాటన్ నెహ్రూతో అన్నాడు. దానికి నెహ్రూ- ‘ప్రజల్లో ఈస్టిండియా కంపెనీపై మాత్రమే వ్యతిరేకత ఉంది, మిగతా 126 కంపెనీలు ఇక్కడ వ్యాపారం కొనసాగించవచ్చు’ అన్నాడు. అలా మిగిలిపోయిన బ్రూక్‌బాండ్ ఇండియా, లిఫ్టన్ ఇండియా లాంటి సంస్థలు ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పవర్’ అగ్రిమెంట్ ద్వారా దేశంలో కొనసాగుతున్నాయి. ఈ సంస్థల నుండి పుట్టుకొచ్చిన ఎన్నో పిల్ల కంపెనీలు నెహ్రూ, తదనంతర కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మరింత పటిష్టమయ్యాయి.
దేశాన్ని దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీని వెళ్ళగొట్టడానికి అలనాడు భారతీయులంతా పోరాటం చేశారు. ఎంతోమంది వీరుల ప్రాణత్యాగాలతో స్వాతంత్య్రం సిద్ధించింది. మరి ఈ రోజు? గోవిందాచార్య లాంటి స్వదేశీ ఉద్యమకారులు 1980- 90ల్లో గొప్ప ఆందోళనలు చేశారు. కానీ ఇవాళ ప్రధాని సహా పలువురు ముఖ్యమంత్రులు నెలకోసారి విదేశీ పర్యటనలు చేసి విదేశీ పెట్టుబడుల కోసం సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ విదేశీ సంస్థలు భారత్‌లో తమ వ్యాపారం ఢోకా లేకుండా చేసుకుని వేలకోట్ల నిధులను మన దేశం నుండి తరలిస్తున్నాయి. మనుషులకు తాగడానికి నీళ్లు లేకున్నా ‘కోకోకోలా’ కంపెనీ పుష్కలంగా ఉత్పత్తులు అమ్ముకొంటోంది. ‘కోకోకోలా’కు వ్యతిరేకంగా ఉద్యమించిన జార్జి ఫెర్నాండెజ్ లాంటి నేతలు ఈ రోజు ఉన్నారా? ‘పతంజలి’ ఉత్పత్తుల ద్వారా ‘కోకోకోలా’కు మార్కెట్ కాస్త తగ్గినా ఈ రోజుకూ గ్రామీణులు సైతం విపరీతంగా ఈ కంపెనీ శీతల పానీయాలను కొంటున్నారు. విదేశీ మద్యం ఈ రోజు ఏరులై పారుతోంది. గత ఏడాది పెద్దనోట్ల రద్దు తర్వాత అన్ని రంగాలూ ఆర్థికంగా కుదేలైనా ‘మద్యపానం’ మాత్రం చెక్కుచెదరలేదని వాళ్ల లెక్కలే చెబుతున్నాయి. ప్రపంచ దేశాల నుండి వేలకోట్ల డాలర్లను దొడ్డిదారిన మళ్లించే వాళ్లను ‘ఎకనమిక్ హిట్‌మెన్’(ఇహెచ్‌ఎం) అని పిలుస్తారు. ప్రపంచ బ్యాంక్, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ (యుఎస్‌ఎఐడి) ఇతర విదేశీ ఋణ సంస్థల నుండి ధనాన్ని- కొన్ని బహుళ జాతి సంస్థలకు, కొద్దిమంది పేరు మోసిన ధనవంతుల ఖాతాల్లోకి చేర్చడమే ఈ ‘హిట్‌మెన్’ బాధ్యత. ఇలా పోగైన ధనమంతా ‘హవాలా’ మార్గంలో దుబాయ్ ద్వారా పాశ్చాత్య దేశాలకు వెళ్తుంది. అక్కడి నుండి వెళ్లాలంటే అల్‌ఖైదా, ఐఎస్‌ఐ ద్వారా వెళ్లాల్సిందే. అంటే వాళ్ల అనుమతి తప్పనిసరి అన్నమాట! అందుకే ఐఎస్‌ఐ, ఇతర తీవ్రవాదుల విషయంలో ‘మల్టీనేషన్’ ప్రపంచానికి సానుభూతే ఉంటుంది తప్ప ద్వేషం ఉండదు.
మన దేశం నుండి పాశ్చాత్య దేశాలకు వెళ్లిన డబ్బు ఇక్కడి ‘ప్రభుత్వేతర సంస్థలు’ (ఎన్‌జిఓలు) వివిధ రూపాల్లో తెచ్చుకొంటున్నాయి. మోదీ ప్రధాని పదవి చేపట్టాక ఈ ఎన్‌జీవోలను ‘లెక్క చెప్పి ఖర్చుపెట్టాల’ని అన్నందుకే ఆయనపై రకరకాలుగా ద్వేషం వెళ్లగక్కుతున్నారు. పాకిస్తాన్, చైనా మార్గం గుండా, టిబెట్, బంగ్లాదేశ్ ద్వారా పశ్చిమ బెంగాల్, నాగాలాండ్ లాంటి రాష్ట్రాలకు ఆయుధాలు, ధనం చేరుతున్నాయి. అక్కడి నాగా తీవ్రవాదులకు, నేపాల్ నుండి దండకారుణ్యం వరకు విస్తరించిన మావోయిస్టులకు ఈ సహకారం అందుతూనే ఉంది. ‘ఆంగ్లం మా అధికార భాష’ అని నాగాలాండ్ పాలకులు- ఈ దేశంలో ఎక్కడలేని విధంగా ప్రకటించుకొన్నారు. అక్కడి క్రైస్తవ మిషనరీలకు కూడా ఇదేరకమైన వెన్నుదన్ను లభిస్తోంది. నాగాలాండ్‌లో భారీగా డబ్బు వెదజల్లి మత మార్పిడులను అత్యంత వేగంగా నడిపిస్తున్నారు. క్రైస్తవ మిషనరీల కుట్ర ఇప్పుడు ఒడిశా వరకు పాకింది. అక్కడి గిరిజనుల్లో మంచి పేరుండి, జాతీయ వాద భావజాలంతో పనిచేసే స్వామి లక్ష్మణానందను హతమార్చారు. తమ వ్యాపారాన్ని భారత్‌లో యథేచ్ఛగా కొనసాగించడానికి ఇలా మత మార్పిడులు జరుగుతున్నాయని విశే్లషకుల అంచనా. ఇందుకోసం వారు ఓ రాజకీయ వ్యవస్థను దేశంలో తయారు చేసుకొన్నారు. అది మతం పేరుతో, సంతుష్టీకరణ పేరుతో చేసే ఓటు బ్యాంక్ రాజకీయం. మత మనోభావాల పేరుతో ఓట్ల పోలరైజేషన్ చేసి, గత డెబ్బై ఏళ్ళ నుండి కుల, కుటుంబ పార్టీలు దేశాన్ని శాసిస్తున్నాయి. ఈ కుట్రను కొనసాగించడానికి వాళ్లు పెట్టుకున్న అందమైన పేరు ‘సెక్యులరిజం’. ఆ ముసుగులో జాతీయతను ప్రశ్నించి మైనార్టీలకు చేయూతనిస్తున్నట్లు నటించడం చూస్తున్నాం. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ‘మా ప్రభుత్వంలో మొదటి కబళం (ముద్ద) ఫలానా మతం వాళ్లే అనుభవించాలి’ అని తెంపరితనంతో ప్రకటించలేదా? ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ఠ ఇది. ఓటు బ్యాంకు రాజకీయం వెర్రితలలు వేసినందువల్లనే కాశ్మీర్ విషయంలో అన్ని పార్టీలు దోబూచులాడుతున్నాయి. ఓ వైపు పాకిస్తాన్ బీభత్సకారులు దాడులు చేస్తుంటే, మరోవైపు కాశ్మీర్ విద్యార్థులు రాళ్లు రువ్వుతూ దాడి జరిగే ప్రదేశానికి మన సైనికులు వెళ్లకుండా చేస్తున్నారు. ‘రాళ్లు రువ్వే వాళ్ల’ను గురించి చర్చిస్తే- దేశంలోని ఒక మతం గురించి - ఆ మత సిద్ధాంతాలను గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఆ మతం వాళ్లకు కోపం వస్తుందని దాని గురించి మాట్లాడటానికి సెక్యులర్ నాయకులు, సెక్యులర్ మీడియా వెనుకంజ వేస్తున్నారు. ఇదంతా ‘ఆక్రమణ మనస్తత్వం’ ఉన్నవాళ్లు చేస్తున్న యుద్ధం కాక ఇంకేమిటి?
ఈ ‘కశ్మీరీ ఆజాదీ’నే విశ్వవిద్యాలయాల్లో కొన్ని సెక్యులర్ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు గానం చేస్తున్నాయి. ‘నియంత్రణ రేఖ’ వద్ద ప్రాణాలు పోగొట్టుకొంటున్న మన సైనికులు ఒక చేతిలో ఆయుధం, మరో చేతిలో కెమెరా పట్టుకొని యుద్ధం చేస్తున్నారు. ఆయుధం- పాక్ ముష్కర మూకలకు సమాధానం ఇవ్వడానికైతే, కెమెరా మన దేశంలోని దేశద్రోహులకు సాక్ష్యం ఇవ్వడానికని సైనికులు వ్యాఖ్యానిస్తున్నారంటే ఈ ‘దేశద్రోహపు గుంపు’ తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. క్రీ.శ. 427లో స్థాపించబడ్డ నలంద విశ్వవిద్యాలయం క్రీ.శ. 1197 దాకా అప్రతిహతంగా కొనసాగింది. టర్కీ నుండి వచ్చిన మతోన్మాది బక్తియార్ ఖిల్జీ ‘నలంద’ను ధ్వంసం చేశాడు. అక్కడి అతిపెద్ద గ్రంథాలయాన్ని ధ్వంసం చేయవద్దని అతడి వెంబడి ఉన్నవాళ్లే వారిస్తే, తన మతగ్రంథంలో లేనిది ఈ గ్రంథాలయంలో ఉంటే తనకేమటి ప్రయోజనం అంటూ గ్రంథాలయాన్ని నామరూపాల్లేకుండా చేసాడు. ఇలాంటి మతోన్మాదాన్ని ఈ రోజు జెఎన్‌టియు, ఢిల్లీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొన్ని విద్యార్థి సంఘాలు ప్రోత్సహిస్తున్నాయి. 150 మందిని పొట్టనబెట్టుకొన్న వ్యక్తిని ఏళ్ల పర్యంతం విచారించి భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన సుప్రీంకోర్టు శిక్షవేస్తే, అతని పేరుతో ర్యాలీలు జరపడం భారత్‌పై యుద్ధం కాదా? ఈశాన్య భారతంలో ఉగ్రవాదానికి బంగ్లాదేశ్ నుండి చొచ్చుకు వస్తున్న తీవ్రవాదులు మద్దతు ఇస్తున్నారు. ఓట్లకోసం బెంగాల్‌ను ‘ఏళ్ల తరబడి పాలించిన పార్టీ’ పరోక్షంగా సహకరించింది. ప్రస్తుతం అక్కడి ముఖ్యమంత్రి కూడా అదే విధానం కొనసాగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మొన్నమొన్నటి వరకు పెళ్లి లేదా దేవుళ్ల ఊరేగింపు చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. అక్కడ విదేశీ మతమాఫియా మతమార్పిడులు జరుపుతుంటే, పాకిస్తాన్ ఉగ్రవాదం ‘స్లీపర్ సెల్స్’గా పనిచేస్తోంది. యాభై ఏళ్ళ క్రితం పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన ‘నక్సల్బరీ’ ఉద్యమం నేపాల్ నుండి దండకారణ్యం వరకు ‘రెడ్ కారిడార్’ పేరుతో దేశ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నది. వేలమంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు, పోలీసులు, సాధారణ పౌరులు, మావోయిస్టులు ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. బుద్ధుడూ చాలడూ! అంబేద్కర్ చాలడూ!.. మార్క్స్ కావాలి! అంటున్న మేధావులు ఈ దేశ అస్తిత్వాన్ని అపఖ్యాతిపాలు జేస్తూ ఇలాంటి హింసాత్మక పోరాటాలకు మద్దతు ఇస్తున్నారు. రష్యా, చైనాలే మార్క్సిజాన్ని, మావోయిజాన్ని వదలివేసి పెట్టుబడుల రంగంలో కొత్తపుంతలు తొక్కుతూ ప్రగతి సాధిస్తుంటే ఇక్కడి కమ్యూనిస్టు, మావోయిస్టు మేధావులు మాత్రం అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ తర్వాత మల్టీ నేషనల్ కంపెనీలు మన దేశాన్ని ఒకవైపు పిప్పి పిల్చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు సవాల్ విసురుతున్నాయి. కోల్గేట్, క్లోజప్, సిబాకా, ఫోర్‌హాన్స్ వంటి టూత్‌పేస్ట్‌లు మొదలుకొని ఆటోమొబైల్ రంగం వరకు అన్నింటిలో మన దేశాన్ని ‘నిండా ముంచే’ ఉపాయాలున్నాయి. మన ముడిసరుకులతోనే వస్తూత్పత్తి చేసి, మన సినిమా తారలు, క్రికెటర్లతో ప్రచారం చేయించి మన రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఈ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థలే తమ వ్యాపారాల కొనసాగింపునకు భారత్‌ను విచ్ఛిన్నం చేసే అనేక ధోరణులకు పరోక్షంగా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. బోడో తీవ్రవాదం కావచ్చు, మావోయిస్టు, తమిళ ఈళం, మానవ హక్కుల ఉద్యమం వంటి సంస్థలు ఈ దేశంలో కోకొల్లలు. వీటితోపాటు ఇటీవల ప్రచార ప్రసార మాథ్యమాలు చేరాయి. అందులో కొన్ని సంస్థలు ఈ వేర్పాటువాద మనస్తత్వం గల సంఘాలకు, వ్యక్తులకు వెన్నుదన్నుగా నిలిచి వాళ్లను హీరోలను చేస్తాయి. ‘తిరగబడడం’ గొప్ప సంఘ సంస్కరణ, విప్లవం, ఉద్యమం అంటూ బాకాలు ఊదుతాయి. ఈ మీడియాలో కొందరు సంస్కర్తలుగా, తిరుగుబాట్లను సిద్ధాంతీకరించే కుహనా మేధావులుగా కనిపిస్తుంటారు. వారి ప్రతిభను అతిశయోక్తులతో ప్రజల్లోకి తీసుకెళ్లే ఏర్పాటు ఉంటుంది. ఇలా భారత్‌పై సిద్ధాంతాల, అస్తిత్వాల ముసుగులో దాడిచేసే వ్యవస్థ నడుస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ వేగాన్ని అడ్డుకోవడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తే, మత తీవ్రవాదం, మతమార్పిడి, మేధో ఉగ్రవాదంతో ఇంకోవర్గం మనపై కాలు దువ్వుతూనే ఉంది. మేడిపండులా కనిపిస్తున్న మన ప్రజాస్వామ్యం ‘రాచపుండు’లా ఈ ఆక్రమిత శక్తులతో బాధను అనుభవిస్తూనే ఉంది! తస్మాత్ జాగ్రత్త..! *

-డా. పి. భాస్కరయోగి సెల్ : 99120 70125
Published Andhrabhoomi Friday, 26 May 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి