మత ప్రచారానికి, ధర్మ ప్రసారానికి వేదయుగంలోనూ, ఆ తర్వాత సంస్కృతభాష ప్రధాన వాహిక అయ్యింది. వేదయుగం తర్వాత వైదిక సంస్కృతం చాలా కష్టం అయ్యింది. అందువల్ల వైదిక సంస్కృతం సరళీకృతం చేసి లౌకిక సంస్కృతం సృష్టించుకొన్నారు. తదనంతరం జైన,బౌద్ధాలు ప్రబలిపోయి వారు సంస్కృతాన్ని వదలిపెట్టి పాళీని, ప్రాకృతాన్ని ముందుపెట్టి మత ప్రబోధం చేశారు.
మత ప్రచారానికి కథా సాహిత్యాన్ని మొదట ఆశ్రయించిన ఈ రెండు మతాలు ఆనాటి ప్రజా భాషతోపాటు ప్రభాఛందస్సును కూడా స్వీకరించి గాథల రూపంలో జైనులు త్రిషష్టి శలాకపురుషుల వృత్తాంతాలు, బౌద్ధుల జాతక కథలు సృష్టించుకున్నారు. అదే మార్గంలో తమిళంలో పెరియ పురాం, కన్నడలో అరువత్తు మూవురు శివభక్తుల కథలు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలోనే ప్రజలకు దేశిభాషలపై మక్కువ ఏర్పడింది. 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతంలో బసవేశ్వరుడు ప్రజల భాషకు ప్రాధాన్యత ఇచ్చి వచన రచనకు ఆద్యుడయ్యాడు. అయితే తెలుగునాట కూడా చాళుక్యుల కాలం వరకు మార్గ ఛందస్సుదే ప్రధాన భూమిక ఉండేది. చాళుక్యులు ఓ అడుగుముందుకేసి దేశి ఛందస్సుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ దేశి ఛందస్సులోనే నన్నయ భారత రచనకు పూనుకొన్నాడు.
ఈ దేశి ఛందస్సులోనే రెండు పాదాలున్న ద్విపద తెరపైకి వచ్చింది. అది విషయానికి చాలదని ఆనాటి కవులు నిరాదరించగా పాల్కురికి సోమనాథుడు పునరుద్ధరించి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర రచించగా అదో సంచలనం అయ్యింది. దానితో దేశి ప్రక్రియలకు పునరుత్తేజం కలిగింది. ఇలాంటి సాహిత్య భాషా విప్లవాలు ఈ గడ్డనుండే రావడం విశేషంగా చెప్పవచ్చు.
పరమశివుని ఢమరుక నాదంనుండి వర్ణ సమామ్నాయం పుట్టింది కాబట్టి శైవులు మత ప్రచారానికి దేశి సాహిత్యాన్ని ప్రధానంగా తీసుకొన్నారు. శ్రీకృష్ణుని వేణువు నుండి రాగ ప్రపంచం పుట్టింది కాబట్టి వైష్ణవులు సంగీతాన్ని ప్రధాన ఆలంబనం చేసుకొన్నారు. దక్షిణ భారతదేశంలో ఈ రెండూ సంస్కరింప బడి మార్గ పద్ధతిని ఒక వర్గం అందుకోగా, దేశిపద్ధతిని మరో వర్గం పట్టుకొంది. సరిగ్గా సంకీర్తనా ప్రపంచంలో కూడా ఇలాగే జరిగింది. మార్గ పద్ధతిలో శాస్త్రీయ సంగీతం ఉరకలెత్తగా, దేశి పద్ధతిలో సంకీర్తన, భజన, తత్త్వం… రూపంలో సామాన్యుల వరకు చేరింది.
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతభాషకు ప్రాచీన స్వరూపం యొక్క సౌష్ఠవం ఎక్కువ. దేశితనం, నిండుతనం ఈ భాషకు ప్రాణం.
మానవజీవితంలోని ఆధ్యాత్మికతను, తాత్వికతను వైయక్తికంగా, సామాజికంగా గానం చేయడానికే సంకీర్తన కవులు కృషి చేశారు. సంకీర్తనలు భగవన్నుతితో ప్రారంభమై సామాజిక, తాత్విక, ఆధ్యాత్మికరంగాన్ని తనలో నింపుకొన్నాయి. సంకీర్తన లక్షణాలు తెలుగు సాహిత్యంలో పాల్కురికి పేర్కొన్న ‘వాలేశు పదాలు, గొబ్బి పదములు, తుమ్మెద పదములు.. మొదలైన వాటిలో ఉన్నప్పటికీ 13 శతాబ్దానికి చెందిన కృష్ణమాచార్యుల సింహగిరి వచనాలతో వచన కీర్తనారూపంగా ప్రారంభమయ్యింది. అన్నమయ్య, క్షేత్రయ్య వంటి సంకీర్తనాచార్యుల ఒడిలో ‘పదం’గా రూపుదిద్దుకొని త్యాగరాజువంటి వాగ్గేయకారుల హృదయంలో ‘నామసంకీర్తన’గా నవీనత్వం సంతరింపజేసుకొని, భక్త రామదాసు, పోతులూరి వీరబ్రహ్మం, సిద్ధప్పలాంటివారి తాత్విక భావనలవల్ల ‘తత్వం’గా రూపొందింది. ఈ తత్వం, భజన జానపద కవుల చేతిలోపడి భజనగా రూపాంతరం చెందింది. ఇది ప్రక్రియాపరమైన రూపాంతరమేగాని మౌలిక రూపాంతరం కాదు.
తెలంగాణ ప్రాంతానికి ‘భజన’పేరుతో వచ్చిన సంకీర్తన సాహిత్యం పెద్ద రాశిగా ఉంది. బహుశా! శతక కవుల తర్వాత సంఖ్యాపరంగా ఇంత ఎక్కువమంది కవులకు స్థానం దొరికింది ఈ సంకీర్తన సాహిత్యంలోనే కావచ్చు. భావం, భాష విషయంలో తెలంగాణ ప్రాంతానికి ఓ ప్రాచీనత ఉందనే నిర్దుష్టంగా చెప్పవచ్చు. వసంతం వస్తే కోకిల కూసినట్లు, వర్షఋతువులో కప్పలు బెకబెక అరిచినట్లు కవులు సహజంగా కవిత్వం రాయడం తెలంగాణ ప్రాంత సంకీర్తనలో మనం చూడవచ్చు. సాహిత్యాన్ని సామాన్యుడు సంగీతంతో జతపరచి పాడడంవల్ల అతని అలౌకికానందం వర్ణించలేము. ఎంత కఠిన తపస్సు చేసినా స్థిరంగాని మనస్సు సంగీతంతో కూడిన సాహిత్యం దగ్గర నిలిచిపోతుంది. ఇలాంటి తాత్విక భావన తెలంగాణలో ఎందరో వాగ్గేయకారులను సృష్టించింది.
తెలంగాణలో 1. హరిభజన 2. ఊరిభజన 3. కులుకు భజన 4. పండరి భజన 5. కోలాట భజన 6. సప్త తాళ భజన 7. వేదాంత భజన ప్రసిద్ధంగా ఉన్నప్పటికీ సప్తతాళభజన, అడుగుల భజన, పండరి భజన, హరిభజన, చెక్క భజన, కులుకు భజన ఎక్కువగా నడుస్తాయి. మార్గ సంగీతంలో రాగం ఎక్కువ ప్రాధాన్యత వహించగా, తెలంగాణ భజనలో తాళ ప్రాధాన్యం ఉంటుంది. తాళం అంటే సంగీతంలో ఒక కాలమానం. తెలంగాణ లాక్షణికుడు అప్పకవి ఈ తాళాలు ఎట్లా ఏర్పడుతాయో ఉపజాతుల తర్వాత చెప్పడం జరిగింది. ఆటతాళం, ఆదితాళం, ఏకతాళం, రూపకతాళం, జుల్వతాళం, త్రిపుట తాళం, జంపెతాళం అని 7 విధాల తాళాలు భజనలో ఉపయోగిస్తారు. వీటిలో ఒక్కో తాళంలో మంద్ర-మధ్య-తార అనే మూడు గతుల్లో భజన సాగుతుంది. అందువల్ల 7 తాళాలు మూడు స్థాయిల్లో 21 విభాగాలవుతాయి. ఇదే సప్తతాళ భజన తెలంగాణ ప్రాంతానికి వచ్చే ఇంకా సరళస్థాయిలో సామాన్యులను సైతం సంకీర్తన కవులను చేసింది.
బసవన్న వచనాల తర్వాత ఆ ప్రభావంతో తెలంగాణలో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని సంతూరు (సంతాపూర్) గ్రామానికి చెందిన సింహగిరి కృష్ణమాచార్యులు ‘సింహగిరి వచనాలు’ రచించారు. చాలామంది దుర్మార్గంగా ఇతడి పేరులోని సింహగిరి (సింహాచలం)చూసి ఆంధ్రా ప్రాంతం కవిగా ప్రచారం చేశారు.
డా|| యం. కులశేఖర్‌రావు వంటి పరిశోధకులు ఇతని జన్మస్థానం తెలంగాణగా నిర్ధారించారు. ఇతని వచనాల్లో సంస్కృత శబ్ధగాంభీర్యం, దేవతాస్తుతికి అనుకూలమైన లయ, దేశి రూపాన్ని సంతరించుకుని వచనాలుగా కన్పిస్తున్నాయి. ఇవి ఇక్కడి భజన కవులకు మార్గదర్శకం అయ్యాయి. ‘భక్తిగలవారే బ్రాహ్మణులు’ అన్న సంస్కరణ దృక్పథం13వ శతాబ్దిలోనే ఈ కవి ప్రకటించడం తెలంగాణ కీర్తి కిరీటం కాగా, ఆ తర్వాత వచ్చిన అన్నమయ్య ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొకటే’ కీర్తన కు మార్గదర్శనం కూడా కావచ్చు. ”దేవా విష్ణుభక్తిలేని విద్వాంసునికంటె హరి కీర్తనము సేయునతడే కులజుండు, శ్వపతుండైన నేమి? ఏ వర్ణంబైననేమి? ద్విజునికంటె నతడె కులజుండు”-అన్న కృష్ణమాచార్యుల వాక్యాలు తెలంగాణ వాగ్గేయకారులు తలపై దాల్చారు. ఆ పరంపర అలాగే కొనసాగింది. 1959లో ‘సుజ్ఞాన కల్పవల్లి’పేరుతో ప్రొద్దుటూరు వీరయ్యగుప్త, రుద్రస్వామి కలిసి అచ్చువేసిన తత్వాల్లో జ్ఞానికి, భగవంతునికి కులం లేదు అనే సంవాదం గొప్పగా ఉంటుంది. ఇది శివ-పార్వతుల మధ్య జరిగిన సంవాదం.
డా|| యం. కులశేఖర్‌రావు వంటి పరిశోధకులు ఇతని జన్మస్థానం తెలంగాణగా నిర్ధారించారు. ఇతని వచనాల్లో సంస్కృత శబ్ధగాంభీర్యం, దేవతాస్తుతికి అనుకూలమైన లయ, దేశి రూపాన్ని సంతరించుకుని వచనాలుగా కన్పిస్తున్నాయి. ఇవి ఇక్కడి భజన కవులకు మార్గదర్శకం అయ్యాయి. ‘భక్తిగలవారే బ్రాహ్మణులు’ అన్న సంస్కరణ దృక్పథం13వ శతాబ్దిలోనే ఈ కవి ప్రకటించడం తెలంగాణ కీర్తి కిరీటం కాగా, ఆ తర్వాత వచ్చిన అన్నమయ్య ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొకటే’ కీర్తన కు మార్గదర్శనం కూడా కావచ్చు. ”దేవా విష్ణుభక్తిలేని విద్వాంసునికంటె హరి కీర్తనము సేయునతడే కులజుండు, శ్వపతుండైన నేమి? ఏ వర్ణంబైననేమి? ద్విజునికంటె నతడె కులజుండు”-అన్న కృష్ణమాచార్యుల వాక్యాలు తెలంగాణ వాగ్గేయకారులు తలపై దాల్చారు. ఆ పరంపర అలాగే కొనసాగింది. 1959లో ‘సుజ్ఞాన కల్పవల్లి’పేరుతో ప్రొద్దుటూరు వీరయ్యగుప్త, రుద్రస్వామి కలిసి అచ్చువేసిన తత్వాల్లో జ్ఞానికి, భగవంతునికి కులం లేదు అనే సంవాదం గొప్పగా ఉంటుంది. ఇది శివ-పార్వతుల మధ్య జరిగిన సంవాదం.
పా. కులమున తక్కువ వనితను దేగను
తలుపు నేనెటుదెరుతూ నీ తప్పులు నేనెటుమరుతూ
శి: కులములేల ననుగొలుచువారి నా
కులమున గలుపుక నుందూ. ఇది
దెతిలయద పార్వతి ముందూ”
తలుపు నేనెటుదెరుతూ నీ తప్పులు నేనెటుమరుతూ
శి: కులములేల ననుగొలుచువారి నా
కులమున గలుపుక నుందూ. ఇది
దెతిలయద పార్వతి ముందూ”
తెలంగాణ సంకీర్తన కవులను జయదేవుడు, లీలాశుకుడు, నారాయణతీర్థులు, అన్నమయ్య, రామదాసు, భక్త కవి పోతన, క్షేత్రయ్య, త్యాగయ్య, తూము నృసింహదాసు వంటి వాళ్ళు భజనమార్గంలో రచనలు చేయడానికి స్ఫూర్తిని ఇచ్చారు. అలాగే ఈ ప్రాంత తత్వ కవులను పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శివరామ దీక్షితులు, భాగవతుల కృష్ణదాసు, సిద్ధప్ప, ఈశ్వరాంబ, వేమన., వంటివారు ప్రభావితం చేశారు.
వీరితోపాటు పురందరదాసు, సదాశివ బ్రహ్మేంద్రులు, ముత్తుస్వామి, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, వ్యాసారాయలు, సారంగపాణి కూడా సంకీర్తన సాహిత్యంపై తమ ప్రభావం చూపించారు.
తెలంగాణ ప్రాంతంలో మరో గొప్ప వాగ్గేయకారుడు భద్రాచల రామదాసు (1620-1684). ఇతడు తానీషా సమకాలికుడు. మార్గపద్ధతిలోని సంకీర్తనను భజన కూటాల్లోపాడే విధంగా క్రిందకు దింపిన రామదాసు సంకీర్తనలు అసలు సిసలైన జానపదగేయాలు. త్యాగయ్య, క్షేత్రయ్య, సారంగపాణివంటి కవులు సంకీర్తనను సంగీతంతో పరాంకోటికెక్కిస్తే, రామయ్యను ఆధారంగా పెట్టుకొన్న రామదాసు సంకీర్తనను సామాన్యుల దరిజేర్చాడు. కాఫీ, కమాను, దర్బారువంటి
ఉత్తరాది రాగాలను తెలుగు ప్రజలకు పరిచయంచేసి, ఆనందభైరవి రాగంతో తొలి కీర్తన రచించాడు రామదాసు. తెలంగాణ ప్రాంతంలో వాగ్గేయకార వైభవంలో మొదటి పుటను అలంకరించిన రామదాసును చాలామంది సంకీర్తన కవులు అనుకరించారు. అలాగే రాముణ్ణి దర్శించాలని భద్రాచలం వచ్చిన తూము నృసింహదాసు (1790-1833) కూడా తెలంగాణ మట్టి పరిమళం ఆస్వాదించినవాడే. మేలుకొలుపులు, అభ్యంజనం, దిష్టి, ఉయ్యాల, జాలి, లాలి, విరిచెండ్లాట, చూర్ణికలను కూడా సంకీర్తనలతోపాటు రచించి క్రొత్త ఒరవడికి శ్రీకారంచుట్టిన నృసింహదాసు సదా స్మరణీయుడు.
తెలంగాణ గర్వించదగ్గ వాగ్గేయకారుల్లో రాకమచర్ల వేంకటదాసు ప్రముఖులు. ప్రస్తుత వికారాబాద్ జిల్లా ఉమ్మెంతాలలో వారు జీవించారు. 500కుపైగా సలక్షణమైన కీర్తనలు రచించి భజనకూటాలను నిరంతరం చైతన్యంగా ఉంచిన మహనీయుడు వేంకటదాసు. సంకీర్తనల్లో వేంకటదాసు అనేక వైవిధ్యాలు చూపించాడు. బహుశా! రామదాసు తర్వాత అంత సలక్షణమైన కీర్తనలు వేంకటదాసువే అని చెప్పవచ్చు. ప్రౌఢమైన సంస్కృత సమాసాలను సామాన్యుల నోళ్లలో నానేటట్లు చేసిన రాకమచర్ల వేంకటదాసు ప్రతిభకు క్రింది పాదాలు ఒక ఉదాహరణ మాత్రమే
”దండము లివిగో రామ! భవఖండన తారకనామ
చండకిరణ సమకుండలధర వేదండ రక్షకాఖండ విజైభవ
శ్రీకరపరమోల్లాసా కరుణాకర వరదరహాసా
లోకనాధ బుధ! లోక వశీకర ప్రాకట గుణ సామ్రాజ్య విజైభవ”
చండకిరణ సమకుండలధర వేదండ రక్షకాఖండ విజైభవ
శ్రీకరపరమోల్లాసా కరుణాకర వరదరహాసా
లోకనాధ బుధ! లోక వశీకర ప్రాకట గుణ సామ్రాజ్య విజైభవ”
ఒకప్పటి నల్లగొండ జిల్లా నారాయణపురం సంస్థానం నివాసి శివరామ దీక్షితులు (1690-1791) స్థాపించిన అచల మార్గంలో అనేకమంది తత్వ కవులు ఉదయించారు. కులం గోడలు బద్దలుకొట్టి ఆత్మ స్వరూపాన్ని బట్టబయలుగా చూపించిన అచల మార్గ తత్వ కవులు తెలంగాణ సంకీర్తన సాహిత్య మణికిరీటంలోని మేలిరత్నాలు. భాష విషయంలో వీరిది దేశీయమైన శైలి అయినా భావం విషయంలో శుద్ధ మైన వేదాంతాన్ని, నిర్గుణతత్వాన్ని, తాత్వ దృష్టిని అందించారు. శివరామ దీక్షితుల తర్వాత కంచావారి అప్పదాసు, భాగవతుల కృష్ణదాసు ఎందరో శిష్య, ప్రశిష్యులను తయారు చేశారు. వాడపల్లి ఆగదాసు, వెలివర్తి రామదాసు, గౌహాళ్ళ రాజయోగి, జూపూడి హనుమద్దాసువంటి సంకీర్తనకవులు ఈ పరంపర నుండి వచ్చినవాళ్ళే.
తెలంగాణలో బ్రహ్మానంద భజనమాల, తారకామృతసారము, తిక్కయ తత్వాలు, సుజ్ఞానచంద్రిక, యడ్ల రామదాసు తత్వాలు, మానసానంద భజనమాల, జ్ఞానబోధ లింగాత్మ కీర్తనలు, కలి ప్రమాణ తత్వ కీర్తనలు, వేపూరు రామకీర్తనలు ఎంతో ప్రసిద్ధి పొందాయి.
వేపూరు హనుమద్దాసు దేశీయమైన శైలితో పాలమూరు పలుకుబడులను ఉపయోగించి రామభక్తిని రసరమ్యం చేస్తే, ఖ్వాజా అహమదుద్దీన్ గొప్ప ఆత్మ దృష్టిని తన తత్వాల్లో ప్రదర్శించాడు. అన్నకదాసుల పురుషోత్తం, తిమ్మసానిపల్లి రంగదాసు, చిలుక కృష్ణదాసు, ఉప్పరిపల్లి కృష్ణదాసు, భక్తిని, తత్వాన్ని రెండు కళ్లలా నడిపించారు. తెలంగాణలో కృతులు రచించిన ఏకైక కవి పల్లా నారాయణాధ్వరి. ఇవి రాశిలో తక్కువైనా వాసిలో బహు గొప్పగా ఉన్నాయి.
17వ శతాబ్దంలో రాజోలును పాలించిన వాదె గౌడ ముష్టిపల్లి వేంకట భూపాలుని 3476 కీర్తనలు ఈనాటికి తాళపత్రాల్లో మూలుగుతున్నాయి. అవి పుస్తకరూపంలో వస్తే మన వాగ్గేయకారుల వైభవం మరో మెట్టు ఎక్కినట్లే.
తత్వాలు కొన్ని మాత్రమే రచించినా ఆధ్యాత్మిక ఉన్నతిని సమాజానికి అందించిన తెలంగాణ తొలి దళితకవి దున్న ఇద్దాసు ప్రభావం ఆ కాలంలో నాటి రెండు పెద్ద జిల్లాలపై (నల్లగొండ, మహబూబ్‌నగర్)ఉండడం విశేషం.
మనసాని లక్ష్మమ్మవంటి స్త్రీ సంకీర్తనకవులు కూడా తెలంగాణ జిల్లాల్లో ఉండడం ఈ భక్తి చైతన్యానికి, తత్వ దృష్టికి నిదర్శనంగా చెప్పవచ్చు. తెలంగాణ సంకీర్తన తత్వకవులు దేశీయమైన జీవభాషను బ్రతికించారు. సాహిత్యంలోని భాషను ప్రజల్లోకి, ప్రజల్లోని భాషను సాహిత్యంలోకి ఎక్కించిన పుణ్యమూర్తులు.
తెలంగాణ కీర్తనల్లోని వస్తు వైవిధ్యం పరమాద్భుతం. వైయక్తిక, సామాజిక, ప్రాకృతిక, ఆధ్యాత్మిక, తాత్విక భావనలను కీర్తనల్లో పలికించారు. ఇక్కడి సంకీర్తనల్లో ఎంతో భావ వైవిధ్యంతో, భక్తిమార్గం, నాయికా-నాయకభావం, హఠయోగంవంటి యోగమార్గం, చాటు సంకీర్తనలు చెప్పుకోదగినవి. తెలంగాణ ప్రాంతాన్ని సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వాసనల్లో ముంచెత్తిన వాగ్గేయకారుల వైభవం ఇక్కడ రేఖామాత్రమే ప్రస్తావించాం. ఇక్కడి వాగ్గేయకారుల వైభవం ఈ ప్రాంత, భాషా, సాంస్కృతికధారను అనధికారికంగా నిలబెట్టిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. తెలంగాణలోని పాటకు ప్రాణం, మూలం ఇక్కడి వాగ్గేయకారుల పూర్వ రచనలే. ఆ మార్గం సరళతరమై ఈనాడు జానపద సంగీతమై మనల్ని కదిలిస్తున్నది నిజం. అలాంటి సంకీర్తనలు తెలంగాణలో ఈ రోజుకు కూడా సజీవంగా ప్రజల నోళ్ళలో నాట్యమాడటం నిజమైన భాషా పరిరక్షణగా చెప్పవచ్చు.
డా|| పి. భాస్కరయోగి
December 17, 2017 తెలంగాణ మాసపత్రిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి