ఈనాడు, హైదరాబాద్‌: శతకం.. సంకీర్తన..గేయం..జానపదం..లలిత గీతం.. తత్వం.. ఇలా అన్ని భాషా ప్రక్రియల్లోనూ తెలంగాణ కవులు అనాదిగా అద్భుత ప్రతిభ కనబరిచారని ఆయా రంగాల్లోని నిష్ణాతులు వెల్లడించారు. ముఖ్యంగా శతకం..సంకీర్తన పురుడుపోసుకున్నది తెలంగాణ గడ్డమీదేనన్నారు. వివిధ తెలుగు ప్రక్రియలపై తెలుగు విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి  కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డా.ఆశావాది ప్రకాశరావు, జె.బాపురెడ్డి, ఎస్‌వీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ‘ఒక్కడు విశ్వనాథ’ వంటి పుస్తకాలను, తెలుగు అక్షరాలతో తీర్చిదిద్దిన తెలుగు తల్లి ఛాయాచిత్రాన్ని వేదికపై ఆవిష్కరించారు.
కేశవదాసు మొదలు..కేసీఆర్‌ వరకు: తేలికైన పదాలతో ఎనెన్నో సినిమా పాటలు తెలంగాణ కవుల కలాల నుంచి జాలువారాయని ప్రముఖ కవి సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. 1931లోనే భక్త ప్రహ్లాద సినిమాకు కేశవదాసు పాట రాయగా ‘జై బోలో తెలంగాణ’ చిత్రంలోని ‘గారడి చేస్తుండ్రు’ పాటను కేసీఆర్‌ రాసినట్టు చెప్పారు. తెలంగాణలో కావ్య సాహిత్య స్థాయికి చేరిన పాటలు చాలానే ఉన్నాయన్నారు. సినారే రాసిన ‘చరణ కంకణములు గలగలలాడగ’, ‘ఈ నల్లని రాళ్లలో..ఏ కన్నులు దాగెనో’ అనే పాటలను ఉదహరించారు.  తెలంగాణ జానపద సాహిత్యంలో ప్రణయం ఎక్కువగా కనిపిస్తుందని జానపద గేయాలపై విశేష కృషి చేస్తున్న పొద్దుటూరి ఎల్లారెడ్డి అన్నారు.
శతకానికి ఆదికవి సోమనాథుడే... తిరునగరి: శతక సాహిత్యానికి ఆది కవి పాల్కురికి సోమనాథుడు. ఆయన తన ప్రాంతంలోని పాత్రలే ఆధారంగా శతకాలు రుశారు. అందుకే సామ్యవాదాన్ని తెలుసుకోవాలంటే ఆయన రాసిన వృషాధిప శతకం చదవాలంటారు పెద్దలు. పోతన రాసిన నారాయణ శకం చాలా గొప్ప శతకం.

తొలుత లలిత గీతం ఇక్కణ్నుంచే... వడ్డేపల్లి కృష్ణ: ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ అనే పాట తొలుత లలిత గీతం. దాన్ని రాసింది తెలంగాణ కవి దాశరథి. ‘తలనిండ పూదండ దాల్చిన రాణి’ అన్న లలిత గీతమూ ఈ ప్రాంతం కవి కలం నుంచి జాలువారిందే.
సంకీర్తనల్లోని భాషను నిఘంటువుగా తేవాలి... పి.భాస్కర యోగి: సామాన్యుల కోసం సామాన్యులు రాసినవే సంకీర్తనలు, తత్వాలు.  తెలంగాణకు చెందిన సింహగిరి కృష్ణమాచార్యులు 12వ శతాబ్దంలో మొదటి వచన సంకీర్తన రాశారు. అలాంటి కవుల భాషను నిఘంటువుగా తేవాలి. తెలుగు విశ్వవిద్యాలయంలో గేయ, సంకీర్తన సాహిత్యానికి ఒక విభాగాన్ని నెలకొల్పాలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి